అబ్బాయే పుడతాడా @
అబ్బాయే పుడతాడా ? నిస్త్రాణగా పడుకుని ఉన్న హేమ నుదుటి మీద వెచ్చని స్పర్శ తగిలేసరికి కళ్ళు తెరిచి చూసింది. తెల్లని డ్రెస్ మీద ఆకుపచ్చ థియేటర్ గౌన్ లో నవ్వుతూ నర్సు "ఏమ్మా ! నొప్పిగా ఉన్నదా ? పూర్తిగా అన్నీ తెలుస్తున్నాయా ? బాగా చెమటలు పట్టేసి డెలివరి అయిపోగానే మైకంలోకి వెళ్లి పోయారు" అన్నది. నీరసంగా తల ఊపి ఏదో అడగబోయింది కానీ పీలగా వచ్చింది గొంతు. "అర్ధమైంది ! చక్కగా ముద్దులొలుకుతోంది పాప ! గురువారం ! లక్ష్మీ దేవి" అని బుగ్గ పుణుకుతూ తెల్లటి బట్టలలో చుట్టిన పాపని పక్కన పడుకోబెట్టింది. గుండె ఝల్లుమంది హేమకి. బాబు అంటుందేమో ఆని ఆశ పడింది. ఆమెకి పాపైనా ఇష్టమే. భర్త బాబు కావాలని అనుకుంటున్నాడు. ఎలా స్పందిస్తాడో అని ఒక క్షణం భయపడింది. కానీ జువాలజీ ఎమ్మెల్సీ చేసింది కాబట్టి ఆడపిల్లైనా మగపిల్లాడైనా మగవాడిదే కదా బాధ్యత అని బింకంగా అనుకుంది. ఐనా మనసులో ఏ మూలో బెరుకు పీకుతూనే ఉంది. ******* ********* అక్కడ ఇంట్లో హేమ తండ్రి సుందర రావు వియ్యంకుడికి ఫోన్ చెయ్యడానికి ప్రయత్నం చేస్తున్నాడు కానీ స్విచ్ ఆఫ్ అనే వస్తోంది. అల్లుడు రత్నాకర్ నంబరూ అంతే. రెండు మూడు స...