అబ్బాయే పుడతాడా @
అబ్బాయే పుడతాడా ?
నిస్త్రాణగా పడుకుని ఉన్న హేమ నుదుటి మీద వెచ్చని స్పర్శ తగిలేసరికి కళ్ళు తెరిచి చూసింది. తెల్లని డ్రెస్ మీద ఆకుపచ్చ థియేటర్ గౌన్ లో నవ్వుతూ నర్సు "ఏమ్మా ! నొప్పిగా ఉన్నదా ? పూర్తిగా అన్నీ తెలుస్తున్నాయా ? బాగా చెమటలు పట్టేసి డెలివరి అయిపోగానే మైకంలోకి వెళ్లి పోయారు" అన్నది. నీరసంగా తల ఊపి ఏదో అడగబోయింది కానీ పీలగా వచ్చింది గొంతు. "అర్ధమైంది ! చక్కగా ముద్దులొలుకుతోంది పాప ! గురువారం ! లక్ష్మీ దేవి" అని బుగ్గ పుణుకుతూ తెల్లటి బట్టలలో చుట్టిన పాపని పక్కన పడుకోబెట్టింది. గుండె ఝల్లుమంది హేమకి. బాబు అంటుందేమో ఆని ఆశ పడింది.
ఆమెకి పాపైనా ఇష్టమే. భర్త బాబు కావాలని అనుకుంటున్నాడు. ఎలా స్పందిస్తాడో అని ఒక క్షణం భయపడింది. కానీ జువాలజీ ఎమ్మెల్సీ చేసింది కాబట్టి ఆడపిల్లైనా మగపిల్లాడైనా మగవాడిదే కదా బాధ్యత అని బింకంగా అనుకుంది. ఐనా మనసులో ఏ మూలో బెరుకు పీకుతూనే ఉంది.******* *********
అక్కడ ఇంట్లో హేమ తండ్రి సుందర రావు వియ్యంకుడికి ఫోన్ చెయ్యడానికి ప్రయత్నం చేస్తున్నాడు కానీ స్విచ్ ఆఫ్ అనే వస్తోంది. అల్లుడు రత్నాకర్ నంబరూ అంతే. రెండు మూడు సార్లు ప్రయత్నం చేసి ఊరుకున్నాడు వారిద్దరి తత్త్వం తెలిసిన వాడు కాబట్టి ! డ్రైవింగ్ చేస్తున్నపుడు ఇద్దరూ ఫోన్లు ఆఫ్ చేస్తారు. అది వారికి అలవాటు. హేమకి నొప్పులు వస్తున్నాయని చెప్పినప్పుడు వియ్యంకుడు క్లుప్తంగా ఒక గంటా గంటన్నరలో బయల్దేరుతామని చెప్పాడు. అల్లుడు మాత్రం క్లయింట్ల పనిలో ఉన్నాననీ సాధ్యమైనంత త్వరగా బయల్దేరుతాననీ, తాను నేరుగా హాస్పిటల్ కి వెళ్లిపోతానని, తల్లీ తండ్రి మాత్రం మీ ఇంటికి వస్తారని చెప్పాడు. అల్లుడు అంత వివరంగా మాట్లాడినందుకు సంబరపడ్డాడాయన.
అల్లుడి ఇంట్లో వారందరూ చాలా రిజర్వుడుగా ఉంటారు. మాట్లాడడం చాలా కొద్ధి. మర్యాదకు మాత్రం ఏమీ లోటు చెయ్యరు. సరిగ్గా ఏడాది క్రితమే పెళ్లయింది కాబట్టి నెమ్మది మీద కలిసిపోతారన్న నమ్మకంతో ఉన్నాడాయన.
ఆయనకు ముగ్గురు ఆడపిల్లలు. హేమ పెద్దది. ముగ్గురు పిల్లలని చక్కగా చదివించాడాయన. హేమ ఎమ్మెస్సీ చదివి ఎం ఫిల్ కి అప్ప్లై చేసింది కానీ ఈ లోపలే ఒక పెళ్ళిలో రత్నాకర్ తల్లిదండ్రులు హేమాను చూసి వాకబు చేసి వారంతట వారే సుందరరావు గారిని హేమని రత్నాకర్ కి చేసుకుంటామని తెలిసిన వారి ద్వారా కబురు చేశారు. ఆయన హేమని అడిగి అంగీకారం తెలిపాడు.
ఆ మధ్యవర్తి కొన్ని విషయాలు ఆయనకు చెప్పాడు. రత్నాకర్ తండ్రి విశ్వనాధ రావు గారు చాలా మర్యాదస్తుడనీ, కానీ అమిత మితభాషి అనీ ఆయనకు నలుగురూ మగ సంతానమేననీ, అందులో రత్నాకర్ ఆఖరి అబ్బాయనీ, పై ముగ్గురికీ పెళ్లిళ్లు అయిపోయాయని, ముగ్గురికీ కూడా ఇద్దరేసి మగ సంతానమనీ , ఆ నలుగురు మగ పిల్లలూ తల్లిదండ్రులతోనే ఉండి తండ్రి ఆడిట్ ఫరం లో పార్ట్నర్లుగా ఉంటారనీ ఏతా వాతా వారు ఉమ్మడి కుటుంబమనీ !
******** **********
ఆసుపత్రిలో హేమ నిద్ర పట్టక ఆలోచిస్తోంది నెల తప్పిన తరువాత చెక్ అప్ కి తీసుకువెళ్ళినపుడు రత్నాకర్ డాక్టర్ ని అడిగాడు "ఇప్పుడు స్కానింగ్ అవసరం ఉంటుందా? "అని డాక్టర్ గర్భిణీ కన్ఫర్మ్ చేసుకోవడానికి స్కానింగ్ తీస్తామనీ, తర్వాత 20 వ వారం లో రెండో సారి తీస్తామనీ మూడవది ఎనిమిదవ నెల దాటిన తర్వాత తీస్తామనీ చెప్పింది. మగా , ఆడా అన్నది ఎప్పుడు తెలుస్తుంది ? అని అడిగాడు ఇరవైయ్యో వారానికి తెలుస్తుందని, అయినా ఎవరన్నదన్నది చెప్పకూడదని డాక్టరు చిరునవ్వుతో చెప్పింది. రత్నాకర్ ఇంకా పొడిగించలేదు.
ఇంటికొచ్చాక శుభవార్తను చెపితే అందరూ వారి సంతోషాన్ని క్లుప్తంగానే వెల్లడించారు.
ఇంటి పురోహితుడు వచ్చినప్పుడు విశ్వనాధం గారు కోడలి చేత పళ్ళు బట్టలు, తాంబూలం ఇప్పించారు. ఆయన "సుపుత్రా ప్రాప్తిరస్తు " అని దీవించినపుడు మామగారి మోహంలో చిరునవ్వు మెరిసింది అనిపించింది హేమకి.
మామగారి తమ్ముడు రామనాధం గారికీ ముగ్గురు మగ పిల్లలు . వారిలో ఇద్దరికీ ముగ్గురేసి మగ పిల్లలు. ఆఖరి వాడికి మాత్రం ఒక్కడే మగ పిల్లాడు. కొంచెం హాస్యం మూడ్ లో ఉన్నపుడు మామ గారు మాకు ఒక క్రికెట్ టీమ్ ఉందండీ ! అనడం విన్నది హేమ .
హేమ కు అన్ని వేడుకలు ఘనంగా చేశారు విశ్వనాధం గారు. వచ్చిన అందరూ ఇంకో వంశోద్ధారకుడు అంటూ ఉంటె హేమకి కొద్దిగా విసుగే వచ్చింది. ఇంకా వీళ్ళకి మగ పిల్లాడు తప్ప ఆనరా ? అనుకుంది.
రెండోసారి స్కానింగ్ కి వెళ్ళినపుడు రత్నాకర్ సిగ్గు విడిచి అడిగేశాడు "పాపా ? బాబా ?" అని. ఆ డాక్టర్ మళ్ళీ అదే చిరునవ్వుతో "చెప్పకూడదు, అది నేరం !" అన్నది. ఆ తర్వాత రత్నాకర్ మళ్ళీ ఏమీ మాట్లాడలేదు. తిరిగి ఇంటికొస్తూంటే హేమ భయపడుతూనే అడిగింది "మీకు బాబు కావాలని ఉన్నదా ?" రత్నాకర్ మొహం ఎర్రబడింది కానీ ఏమీ సమాధానం చెప్పలేదు. హేమ కూడా రెట్టించలేదు.
ఎనిమిదవ నెలలో చెక్ అప్ కి వెళ్ళినపుడు అడిగాడు. "సిజేరియన్ చేసేయవచ్చా ?" అని. డాక్టర్ కొంచెం సీరియస్ గా "ఏమన్నా మంచి ముహూర్తం చూసారా ఏమిటి ? ఆమె పెల్విస్, బిడ్డ తల , దాని పోసిషన్ అన్నీ బాగున్నాయి. నార్మల్ డెలివరీ అయిపోతుంది" అని భరోసా ఇచ్చింది. ఏదో మాట్లాడబోయి ఊరుకున్నాడు రత్నాకర్
******** ************
నిట్టూర్చింది హేమ. భర్త చాలా ప్రేమగానే ఉంటాడు. కానీ పెద్దగా తన ప్రేమను చేతలలో చూపించడు. ఏది అడిగితె అది తెప్పించి ఇచ్చేస్తాడు. ఎలా మలచుకోవాలో అని మధనపడేది .
ముందు ఈ గండం గడవనీ అనుకుంది. తన ఆలోచనకి తనకే నవ్వొచ్చింది. ఇది గండమేమిటి ? పురుడే పెద్ద గండం అనుకుంది.
నర్స్ వచ్చి "డాక్టర్ గారు వస్తున్నారు". అని చక్కగానే ఉన్న పక్కా అవీ సర్దింది. పాపని పక్కనే పడుకోబెట్టి "పాలు ఎలా పట్టాలో డాక్టర్ గారు చెప్తారు, తర్వాత నేను సాయం చేస్తాను" అని మీ వారు అనుకుంటా వచ్చారు. లాబీలో కూర్చోమన్నాను. డాక్టర్ గారు చూసాక వస్తారు. అన్నది. మళ్ళీ కొంచెం బెంగగా అనిపించింది. డాక్టర్ రానే వచ్చింది.
"ఎలా ఉన్నడమ్మా. మొదటి కాన్పు కదా ? కొంచెం కష్టపడాలి మరి. కుట్లు నొప్పిగా ఉన్నాయా అని పరీక్ష చేసి పాపకి పాలు పట్టే విధానం చెప్పి, "సిస్టర్ మీకు చూపిస్తుందిలే !" అని వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళగానే రత్నాకర్ లోపలకి వచ్చాడు. "హేమా ! ఎలా ఉన్నది ? నీరసంగా ఉందా? నొప్పులు ఉన్నాయా ?" అని ప్రేమగా అడిగే సరికి అసంకల్పితంగా కళ్ళ నీళ్లు తిరిగాయి. "నాకు బాగానే ఉన్నది. మీరు ఎలా ఉన్నారు ?' అన్నది
పాప మీద బట్ట కొద్దిగా తీసి "అమ్మాయి" అన్నది.
రత్నాకర్ స్పందన ఆమె ఊహించలేకపోయింది.
*********** ***********
ఇంటి ముందర కారు ఆగిన చప్పుడయ్యేసరికి సుందరరావు గారు "ఏమోయ్ ! వియ్యాలవారొచ్చారు. కాళ్ళకి నీళ్లు పెట్టావు కదా ? రండి అక్క గారూ, బావగారూ ! మీకు ఫోన్ చేస్తే లైను కలవలేదు !" సంజాయిషీ ఇచ్చాడు. "బావ గారూ ! సంజాయిషీలెందుకూ ? నేను డ్రైవింగ్ లో ఉండగా ఫోన్ ఆఫ్ చేస్తాను కదా ! వర్రీ వద్దు. అని "మాకేం తీపి కబురు చెప్తారు బావ గారూ ?" అని విశాలంగా నవ్వాడాయన.
"మనకి మనుమరాలు బావగారూ !" కొద్దిగా గొంతెండిపోతుండగా అన్నాడు సుందర రావు గారు.
బిగియారా కౌగలించుకున్నాడు విశ్వనాధం గారు. "ధన్యుడిని చేశారు బావ గారూ ! మా రత్నాకర్ కి కన్యా దానం చేసే భాగ్యం కలిగింది. మా వంశం అంతా తరించిందండీ !" అని రెండు చేతులూ పట్టుకుని ఊపేశాడాయన.
నిర్ఘాంత పోయాడు సుందరరావు గారు.
********* ***********
"ఏమిటండీ ఇది ? ఈ కన్నీరెందుకు ? ఎప్పుడూ లేనిది ఏమైంది ?" కంగారుగా తన చేతులలో మొహం పెట్టేసి వెక్కుతున్న భర్తని జీరబోయిన గొంతుతో అడిగింది.
"తాంక్యూ హేమా ! అమ్మాయి కోసం తపించిపోయాము మేమంతా !" అని ఆమె చేతులని ముద్దు పెట్టేసుకున్నాడు రత్నాకర్.
పొత్తిళ్ళలో అమాయకంగా నిద్రపోతున్న కూతురిని అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవిస్తూ బుగ్గలు పుణికాడు రత్నాకర్.
అయోమయంగా అడిగింది హేమ "మీకు అబ్బాయి కావాలని అనుకున్నారు కదా ?"
"లేదు హేమా ! మాకందరికీ ఆమ్మాయే కావాలని ఉన్నది. అందరూ మగ పిల్లలైపోయేసరికి పరికిణీ జాకెట్ వేసుకుని, పూలజడ వేసుకుని నగలు పెట్టుకుని గజ్జెలు ఘల్లుమంటూ తిరిగే ఆడపిల్ల కావాలని తపించిపోయాము అంతా ! మా యువరాణీ మన పాప " అని ఇంకొక సారి పాప బుగ్గ నిమిరాడు.
"అబ్బా ఇంత కాలం ఎక్కడ దాచారండీ ఈ ఎమోషన్స్ ?" అంది సగం నవ్వుతో సగం కన్నీటితో.
"సారీ హేమా ! ఎందుకో మాకు వంశ పారంపర్యంగా వచ్చిందేమో ఇది !" అన్నాడు సంజాయిషీ ఇస్తున్నట్లు.
"ఇవాళ గురువారం కదా ? లక్ష్మీ వారం ! మహాలక్ష్మి పేరు పెడదాం !"
"మీ ఇష్టం ! నా పేరూ ఆమెదే కదా " అన్నది హేమ ఉల్లాసంగా
"అదేమిటి ? నీ పేరు హేమ అంటే బంగారం, లక్ష్మి ఆనా ?"
" కాదు నా పూర్తి పేరు హేమ మాలిని "
"హేమమాలిని అంటే సినిమా ఆవిడే కదా ?"
"బుద్ధూ ! హేమ మాలిని అంటే లక్ష్మీ దేవి. నేను మాఘ మాసం లక్ష్మీ వారం పుట్టానని ఆ పేరు పెట్టారు"
"నీ పూర్తి పేరు ఎప్పుడూ చెప్పలేదే ?"
"మీరడగలేదే ?" ముక్కు పట్టుకు అల్లరిగా ఊపుతూ అన్నది హేమ.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి