జీవిత భాగస్వామి @
జీవిత భాగస్వామి సుందర రావు గారు ఉదయం ఏడు గంటల అయ్యేసరికి చక్కగా స్నానం చేసి కొత్త పంచె, లాల్చీ జరీ కండువా వేసుకుని చేతి కర్రతో హుందాగా వీధి వెంబడి నడుస్తూ ఉంటే అటూ ఇటూ ఇళ్లలో జనం చూసి ఆశ్చర్యపోతున్నారు. ఆయన చాలా రోజులుగా అంత పొద్దున్నే ఇల్లు కదలడం ఎవరూ చూసిన గుర్తు లేదు. అలా వెళ్లడం, వెళ్లడం ఆ పల్లెటూరు కి ఈశాన్యం మూలన ఉన్న చెరువు పక్కనే ఉన్న రామాలయం లోకి వెళ్ళారు . వెళ్లే ముందు బయట పూల దుకాణం లో చెప్పులు పెట్టేసి, కొబ్బరికాయ, పూలు, పళ్ళు తీసుకుని "డబ్బులు వెళ్ళేటప్పుడు ఇస్తాలే సూరప్పా” అని లోపలికెళ్ళాడు. సూరప్ప బుగ్గన చెయ్యేసుకుంది. ప్రదక్షిణ పూర్తి చేసుకుని వచ్చి, పూజారికి పళ్ళూ వగైరాలు ఇచ్చి, "సుదర్శనా ! ఇవాళ తెలుసుగా ? మా పెళ్లి రోజు, ఆవిడ పుట్టిన రోజు కూడా , తన పేరున సహస్రం చేసి, దీర్ఘ సుమంగళిగా దేవుణ్ణి వేడుకుంటూ పూజ చెయ్యి నాయనా !" నోరు తెరుచుకుని చూస్తున్న సుదర్శనాచార్యులు తడబడుతూ “సరే సరే స్వామీ !" అని హడావుడిగా గర్భగుడిలోకి వెళ్లి అర్చన మొదలెట్టాడు. సంకల్పం, ఆవాహనాది తతంగం పూర్తి చేసేసి సహస్ర నామాలు యాంత్రికంగా చదువుతూనే ఉన్నాడు కానీ తండ్రి మాధవాచార్యులు...