మరుగైపోయిన వ్యక్తులు - మరపురాని జ్జాపకాలు 2
నా చిన్నప్పుడు నేను రోజూ చూసి, ఇప్పటికీ మదిలో గాఢమైన ముద్ర వేసిన, మరీ గాఢంగా ముద్ర వెయ్యకపోయినా చప్పున గుర్తు వచ్చే వ్యక్తుల గురించి నా జ్జాపకాలు ఇవి. అందరికీ ఇటువంటి వారు ఉండే ఉంటారు. మొట్టమొదటి గా గుర్తొచ్చేది సోమయ్య. మా గవర్నర్ పేటకి పోస్ట్ మాన్ ! ఉదయం 10:30- 11:00 గంటలకి "పోస్ట్!" అనే కేక మా ఇంట్లో వారందరికీ చెవుల్లో మోగుతునే ఉంటుంది. ఖాకీ డ్రెస్, టోపీ పెట్టుకుని ఎడమ చేతిలో బొత్తిగా ఉన్న ఉత్తరాలతో, భుజానికి తగిలించిన సంచీలో ప్యాకెట్లు, రిజిస్టర్ పోస్టులు వేసుకుని వచ్చేవాడు. ఎండాకాలంలో లేట్ గా వస్తే కాస్సేపు ముందు వసారాలో బల్లమీద కూర్చుని మేమిచ్చిన కుండలో నీళ్లు త్రాగి సేదతీరి మళ్ళీ బయల్దేరేవాడు. మా అందరితోటీ సరదాగా కబుర్లు చెప్పేవాడు. నాకు కొద్దిగా జ్ఞానం వచ్చే సరికి మా ఇద్దరు అక్కల పెళ్ళిళ్ళు అయ్యాయి. వాళ్ళు ఉన్నపుడు, స్పెషల్ గా వాళ్ళని పక్కకి పిలిచి ఉత్తరాలు వాళ్ళ చేతిలో పెట్టేవాడు. లేదా వస్తూనే " ఇవాళేం లేవు చిన్నమ్మా ! " అని పెదవి విరిచేవాడు. మా ఇంటి వ్యక్తిలాగే ఉండే వాడు. మా ఇంట్లో పెళ్ళిళ్ళ వంటి కార్యాలకి తప్పకుండా పిలుపు అందుకునేవాడు, పాల్గొనే వాడు కూ...