రామాయణం లో చిన్న పాత్రలు - సుమిత్ర - ఊర్మిళ
సీతాదేవి చేతిని అందుకుని పుష్పక విమానం నుంచి దిగుతూ రామయ్య కళ్ళు, వెతుకుతున్న ఆకారం కనబడగానే జలజలా వర్షించాయి. చెయ్యి సీతమ్మను వీడలేదు. కాళ్ళు మాత్రం వేగంగా ఆ దీనుడివైపు దాదాపు పరుగెడుతున్నట్లే కదిలాయి. సీతమ్మ కూడా అంత వేగంగానూ కదిలింది. దగ్గరకొచ్చే కొద్దీ ఆ దీనుడు మోకాళ్ళ మీద కూలి చేతులు రెండూ జోడించి రామయ్య పాదాలు చుట్టేశాడు. "అన్నయ్యా ! కుశలమా ?......." అని మాత్రమే అన్నాడు. ఆ తరువాత మాటలు ఏడుపు మ్రింగేసింది. రెండు భుజాలు పట్టుకుని లేవదీసి గాఢంగా కౌగిలించుకుని నుదుట ముద్దాడి, కంట నీరు కారుస్తూ "తమ్ముడూ ! ఇంతగా శల్యమైనావేమి నాయనా ? సరిగా ఆహారం తీసుకోవడం లేదా ?" అడిగాడు రామయ్య. "ఆహారం మాత్రమే కాదు రామా ! నిద్ర కూడా పోయేవాడు కాదు. సింహాసనం దగ్గర క్రింద నేల మీద కూర్చుని రాచవిధులు నిర్వహించేటపుడు మాత్రమే మిగిలిన విషయాలు. అంతకు ముందు, ఆ తరువాత నీ స్మరణయే నాయనా ! ఆరోగ్యభంగమై ఏమైనా జరగరానిది జరిగితే నీ అన్న ఏమవుతాడు అని మందలిస్తే కొద్దిగా ఏమైనా తినేవాడు" అని అన్న తల్లి మాటలు విని సంభ్రమంతో నెమ్మదిగా భరతుడిని విడిచి తల్లి కౌసల్యా దేవి పాదాలకు భక్తితో ప్రణమిల్...