రామాయణం లో చిన్న పాత్రలు - సుమిత్ర - ఊర్మిళ



సీతాదేవి చేతిని అందుకుని పుష్పక విమానం నుంచి దిగుతూ రామయ్య కళ్ళు, వెతుకుతున్న ఆకారం కనబడగానే జలజలా వర్షించాయి. చెయ్యి సీతమ్మను వీడలేదు. కాళ్ళు మాత్రం వేగంగా ఆ దీనుడివైపు దాదాపు పరుగెడుతున్నట్లే కదిలాయి. సీతమ్మ కూడా అంత వేగంగానూ కదిలింది. దగ్గరకొచ్చే కొద్దీ ఆ దీనుడు మోకాళ్ళ మీద కూలి చేతులు రెండూ జోడించి రామయ్య పాదాలు చుట్టేశాడు. 

"అన్నయ్యా ! కుశలమా ?......." అని మాత్రమే అన్నాడు. ఆ తరువాత మాటలు ఏడుపు మ్రింగేసింది. 

రెండు భుజాలు పట్టుకుని లేవదీసి గాఢంగా కౌగిలించుకుని నుదుట ముద్దాడి, కంట నీరు కారుస్తూ "తమ్ముడూ ! ఇంతగా శల్యమైనావేమి నాయనా ? సరిగా ఆహారం తీసుకోవడం లేదా ?" అడిగాడు రామయ్య. 

"ఆహారం మాత్రమే కాదు రామా ! నిద్ర కూడా పోయేవాడు కాదు. సింహాసనం దగ్గర క్రింద నేల మీద కూర్చుని రాచవిధులు నిర్వహించేటపుడు మాత్రమే మిగిలిన విషయాలు. అంతకు ముందు, ఆ తరువాత నీ స్మరణయే నాయనా ! ఆరోగ్యభంగమై ఏమైనా జరగరానిది జరిగితే నీ అన్న ఏమవుతాడు అని మందలిస్తే కొద్దిగా ఏమైనా తినేవాడు" అని అన్న తల్లి మాటలు విని సంభ్రమంతో నెమ్మదిగా భరతుడిని విడిచి తల్లి కౌసల్యా దేవి పాదాలకు భక్తితో ప్రణమిల్లి ఆమె కౌగిట వాలాడు రామయ్య.

భరతుడు సీతమ్మకు ప్రవర చెప్పుకుని పాదాలకు నమస్కరించి లక్ష్మణుడిని గాటమైన కౌగిలిలో బంధించాడు.

తరువాత కైకేయి కి, వశిష్ట మహర్షికి, పెద్దలకి పాదాభివందనం చేసి "తమ్ముడూ ! మా తల్లి సుమిత్రా మాత కనబడలేదు !" అన్నాడు రామయ్య ఇంచుక ఆదుర్దాగా. 

"అన్నా ! ఆమె మీరు వనవాసం వెళ్ళినప్పటినుంచి కౌసల్యా మాత నివాసంలోనే ఉన్నది. మరదలు ఊర్మిళా దేవికి తోడుగా." అన్నాడు కానీ భరతుడు అంతకన్నా మాట్లాడలేక ఊరుకున్నాడు. 

రామయ్య లక్ష్మణుడిని సైగ చేసి పిలిచి రాజభవనం వైపు కదిలాడు. 

*********

తన వెనుక వస్తున్న అశేష జనులను అక్కడే ఆగమని, రామయ్య సీతమ్మ, లక్ష్మణుడు, భరత, శతృఘ్నులతో మాతృమందిరంలోకి వడివడిగా నడిచాడు.

సుమిత్రా దేవికి సజల నయనాలతో పాదాభివందనం చేశారు సీతారామ లక్ష్మణులు. ఆమె కూర్చున్న ఆసనం చెంత చిన్నపిల్లల లాగా ఆమె పాదాల దగ్గర కూర్చున్నారు. 

ఆ పక్కనే ఇంకొక ఆసనం మీద కూర్చుని ఉన్న ఊర్మిళ వీరు రాగానే సంభ్రమంతో లేచి నిలబడింది. వీరు కూర్చున్న తర్వాత నెమ్మదిగా ఆమె కూడా నేల మీదే ఆసీనురాలైంది, కానీ ఆమె కళ్ళు లక్ష్మణుడి పైనే ఉన్నాయి. కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. ఆమె మోము అప్పుడే నిద్ర లేచినట్లుగా ఉంది.

లక్ష్మణుడు కూడా ఆమె వైపు ప్రశాంతంగా చూసి, తల్లి వైపు ఆశ్చర్యంగా చూశాడు. 

"నాయనా ! లక్ష్మణా ! రామచంద్రా ! మిమ్మల్ని చూడడానికి రాలేదని చింత వద్దు. ఈ నా పుత్ర వధువు ఊర్మిళ ఇంతకు ముందే సుషుప్తి నుంచి తేరుకున్నది. ఆమె క్షేమం చాలా ముఖ్యం మనకు" అన్నది సుమిత్రా మాత.

ప్రశ్నార్థకంగా చూసిన కుమారుల చూపులకి సమాధానంగా ఇలా మొదలుపెట్టింది ఆవిడ.

"మీరు సుమంత్రుడు రధసారధిగా వనవాసం బయలుదేరిన మరుక్షణమే ఊర్మిళ నిలువునా కుప్పకూలిపోయింది. వెంటనే ఆమెను తల్పం మీద పరుండి బెట్టి రాజవైద్యుని పిలిపించాము. ఆయన దీర్ఘంగా పరీక్షించి అది అపస్మారక స్థితి కాదని, వేరే రుగ్మత కూడా కాదని, కేవలం నిద్రాస్థితిలో ఉన్నదని, భయం లేదని చెప్పారు. అప్పటి నుంచి పరిచారికలతో పాటు నేను కూడా ఆమె వద్దనే ఉండి చూసుకున్నాము. 

"మీ తండ్రి దశరథ మహారాజు, ఈ భవనంలోనే అక్క కౌసల్యా దేవి వద్దనే అహోరాత్రులు విలపిస్తూ ఉండిపోయారు. ఐదవ రోజున సంధ్యా సమయానికి సుమంత్రుడు విషణ్ణ వదనుడై ఒంటరిగా తిరిగి వచ్చి మీరు శృంగిబేర పురం వద్ద గుహునితో నదీతరణం చేశారని చెప్పిన తర్వాత ఆయన దుఃఖం మరింత తీవ్రమైపోయింది. ఆ రాత్రి అంతా విలపించి ఏ రెండు, మూడు జాముల తర్వాతనో అలసి సొమ్మసిల్లి నిద్రించారని అనుకున్నాము కానీ అది శాశ్వత నిష్క్రమణం అని ఊహించలేదు....."

అని అప్పటి పరిస్థితులు గుర్తు రాగా కన్నుల నీరు నింపుకుని రెండు నిమిషాలు ఆగిందామె.

"ఆ సమయంలోనూ ఊర్మిళకు మెలుకువ రాలేదు. మేమంతా నిద్ర లేపుదామని ప్రయత్నించబోతే గురు వశిష్టులు వారించారు. వారే నన్ను ప్రక్కకు పిలిచి ఆమె ఒక రకమైన యోగనిద్రలో ఉన్నదని, ఆమె నిద్రకు భంగం కలగకుండా ఉండాలని చెప్పారు. 

"ఆ తర్వాత మీరు ఏ దారిలో వెళ్తున్నారో ఆమె కలవరింతలలో తెలిసేది. అప్పుడు నాకు అవగతమైంది. ఆమె లక్ష్మణుడిని మానసికంగా అనుసరిస్తున్నదని ! నా హృదయం ద్రవించిపోయింది. ఈ సీతమ్మ తోబుట్టువు అనిపించుకున్నది అనుకున్నాను" అన్నది సీతమ్మ వైపు అనురాగం కురిపించే దృక్కులతో. 

"భరతుడు కేకయ రాజ్యం నుంచి హుటాహుటిన వచ్చే సమయానికి మీ తండ్రి విదేహులైనారని తెలిసి హతాశుడైనాడు. మీరు వనవాసం వెళ్ళారని తెలిసి కుప్పకూలిపోయాడు. అంత్యక్రియలు పూర్తి చేసిన తర్వాత వశిష్టుల వారు పట్టాభిషిక్తుడవమని చెప్తే నిర్ద్వంద్వంగా నిరాకరించాడు. శ్రీ రాముడు జ్యేష్టుడని, తను ధర్మానికి విరుద్ధంగా నడవనని, రాముడిని ఎక్కడ ఉన్నా బ్రతిమాలి, మళ్ళీ వెనుకకు తీసుకుని వచ్చి రాజును చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు.

"అక్కడ నుంచి మిమ్మల్ని కలవడానికి ఏర్పాట్లు చేసుకుని కదిలివెళ్ళే సరికి మూడు నెలలు గడిచిపోయాయి. నేను కోడలి వద్దనే ఉండిపోయాను వశిష్టుల సలహా మేరకు. కానీ అక్కడ జరిగేవన్నీ ఊర్మిళ మాటలతో తెలిసేవి. శృంగిబేర పురం దాటి, భరద్వాజ మహర్షి ఆశ్రమం తరువాత చిత్రకూటంలో మిమ్మల్ని భరతుడు కలిసి అన్ని విషయాలు చెప్పినదంతా ఆమె ద్వారానే తెలిసింది. లక్ష్మణుడు భరతుడిని అనుమానించాడని, ఆమె కన్నీటితో 'స్వామీ ! బావగారి మీద శంక ఒద్దు ఒద్దని' వేడుకోవడం విని ఇంచుక లక్ష్మణుని మీద కోపం వచ్చిన మాట నిజం. కానీ నా బిడ్డ మనసునెరిగిన దానిని కాబట్టి ఆ ఆవేశం తాత్కాలికం అని ఊరట చెందాను"

"నేననుకున్నదే నిజమైంది. లక్ష్మణుడు సిగ్గిల్లి రాముని పక్కను చేరాడు. ఆ తర్వాత మీరెరిగినదే. నేను కనబడక నా లక్ష్మణుడు ఆతృతగా ఎదురు చూసి ఉంటాడు. కానీ ఆ పరిస్థితిలో నేను నా పుత్ర వధువు దగ్గర ఉండడం అవసరం. ఆ విధంగా ఆమె మాటలలో మీ విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది కదా ?

"ఆ విధంగానే భరత రామ సంవాదము, జాబాలి మహర్షి భౌతిక వాదము, అంతకు ముందు ఎరుగని ఈ రామయ్య కోపము తెలిసింది. వశిష్టుల వారు అనునయ వాక్యాల అనంతరం భరతుడి ప్రాయోపవేశ ప్రయత్నం, రాముని ఊరడింపు, పాదుకలను భరతుడికి ఒసగి ఆశీర్వదించడం ఇవి ఊర్మిళ ద్వారా తెలిసి భరతుడు మరల తిరిగి ఎప్పుడు వస్తాడా ? ఎప్పుడు తన నుదురు చుంబిస్తానా అన్నంత అనురాగం కలిగింది నాకు.

"ఆ తరువాత చిత్రకూటం నుంచి సీతారామ లక్ష్మణులు బయలుదేరి ఇంకా దక్షిణ దిశగా కదలడం, అత్రి, అనసూయాదేవి గారల ఆతిధ్యం, వివిధ మునుల ఆశ్రమాలలో నివాసం, విరాధ వధ, అనంతరం అగస్త్య మహర్షి దర్శనం, ఆయన సలహా మేరకు గోదావరి నది తీరంలో పంచవటిలో నివాసం అన్నీ తెలుస్తూ వచ్చాయి. అంతకాలమూ ఊర్మిళ మోమున ప్రశాంతత, ప్రసన్నమే తాండవించాయి. 

"ఇంకా ఏడాది పైన కొద్ది మాసాలు గడువు మిగులగా జరిగిందా సంఘటన ......." మరల సుమిత్రా మాత ఇంచుక ఆగింది.

"ఒకనాడు ఒక రాక్షసి, శూర్పణఖ ఆమె పేరట ! వచ్చి రామయ్య మీద మరులుకొన్నాననీ, తనను భార్యగా చేసుకోమని అడిగితే తనకు భార్య ఉన్నదని, తన తమ్ముడు భార్యకి దూరంగా ఉన్నాడని, అతనిని వరించమని పరిహారంగా అన్నాడు. ఆ సమయంలో ఊర్మిళ మొగం లో చిరునవ్వు చూశాను. 'నా నాధుడు నిన్ను చేపట్టే అవకాశం నీకు లేదు. ఆయన నన్ను తప్ప వేరే ఎవరినీ తాకరు శూర్పణఖా !' అన్నది ఇంచుక గర్వంగా. ఆమె అనుకున్నట్లే నా కుమారుడు ఆమెను తాకనైనా లేదు. 'నేను రాముడి సేవకుడిని, నన్ను చేపడితే నువ్వు కూడా సేవకురాలివే అవవలసి ఉంటుంది' అని అన్నాడు. వీరి పరిహాసాలు గ్రహించి ఆ రాక్షసి సీతాదేవిని చంపడానికి బయల్దేరింది. లక్ష్మణుడికి ఆగ్రహం వచ్చి ఆమె ముక్కు, చెవులు కోసి వేశాడు.

"ఆమె ఏడ్చుకుంటూ ఆమె సోదరుణ్ణి ఖరుడు అనే రాక్షసుడికి మొర పెట్టుకుంటే అతడు తన సేనాధిపతి, ఇంకా అశేష సైన్యంతో వచ్చి చుట్టుముడితే రాముడు ఒక్కడే మూడు గడియల కాలంలో యమలోకానికి పంపించి వేశాడు.

ఆ తర్వాత ఏమయ్యిందో సీతాదేవి ఒక బంగారు లేడి మీద మనసు పడి రాముడిని తెచ్చిపెట్టమని అడిగితే రాముడు వెళ్ళాడు. ఆ కొంత సేపటికి సీతా ! లక్ష్మణా ! అని రామయ్య గొంతులో కేకలు వినబడితే సీత లక్ష్మణుడిని వెళ్ళమంది. లక్ష్మణుడు అది రాక్షస మాయ అంటే ఒట్లు పెట్టుకుని వెళ్ళమని ఆదేశించింది"

సీతాదేవి సిగ్గుతో తల వంచుకుంది.

సుమిత్రా దేవి ఎక్కువ విస్తరించకుండా లక్ష్మణుడు రాముడు వెళ్ళిన దారిలో వెళ్ళడం, ఊర్మిళ కూడా అతనిని అనుసరించడం, రాముడిని కలిసి అదంతా మాయ లేడి అని తెలిసి వెనక్కి రావడం, పర్ణశాలలో సీత కనిపించక అంతా వెతకడం, ఆ తర్వాత జటాయువును కొన ఊపిరితో కనుగొనడం, ఆయన చెప్పిన దారిలో వెళ్ళడం, రాముని ఆగ్రహం అనంతరం ఆయన శోకం క్లుప్తంగా చెప్పి, కబంధుడి వధ, అనంతరం శబరి దర్శనం, హనుమంతుడితో సమాగమం, సుగ్రీవుడి స్నేహహస్తం, వాలి సుగ్రీవ యుద్ధం కూడా స్పృశిస్తూ వాలి వధ అనంతరం రామ, లక్ష్మణుల ప్రస్రవణ గిరి నందు నివశించడం, వర్షా కాలం తర్వాత రాముడి ఆజ్ఞతో సుగ్రీవుడిని హెచ్చరించడం కోసం లక్ష్మణుడు కిష్కింధ వెళ్ళడం చెబుతూ ఊర్మిళ ఇక్కడ కూడా తారతో సంభాషిస్తూ తన భర్త అత్యంత గౌరవంతో మాట్లాడడం తెలిసి ఎంతో ఉప్పొంగిపోయింది.

" ఆ తర్వాత సుగ్రీవుడు రామునితో వానర సేనలన్నీ వస్తున్నాయనీ, సీతాన్వేషణ ప్రారంభం అవుతుంది అని చెప్పాడు. రాముడు స్వయంగా హనుమంతుడికి తన అంగుళీయకం ఇచ్చి దక్షిణ దిశలో సీతాదేవి కనిపిస్తే తన ఆనవాలుగా ఇచ్చాడు."

మరల నెల మీద రెండు రోజుల తరువాత రామయ్య, లక్ష్మణుడు ప్రస్రవణ గిరి నందు గుహలో ఉండగా హనుమంతుడు సీతాదేవిని లంకలో కనుగొంటినన్న మాటను తెలిపినపుడు ఊర్మిళ నిద్రలోనే అత్యంత సంతోషంతో ఏడ్చేసింది. ముందు నేను ఏమైనదో అని భయపడ్డాను, కానీ ఆ తర్వాత నిద్రలో ఆమె మాట్లాడిన పలుకులను బట్టి శుభవార్తను గ్రహించాను.

అనంతరం వీరంతా కలిసి వానరవీరులు కోట్ల సంఖ్యలో అనుసరించగా దక్షిణ సముద్రతీరం చేరుకొన్నారు. అక్కడ రావణుని తమ్ముడైన విభీషణుడు రాముడి శరణు కోరడం, ఆ తర్వాత విభీషణుడి సలహా మేరకు సముద్రుని సహాయం చెయ్యాలని కోరి రాముడు ఉపాసించడం, సముద్రుడి మౌనంతో ఉగ్రుడైన రాముడి కోపం వీక్షించిన లక్ష్మణాది వీరులందరితో పాటు ఊర్మిళ కూడా భయభ్రాంతులకు గురయ్యింది. చిగురాకు వలే ఒక అర గడియ పాటు వణికిపోయింది. సముద్రుడు స్వయంగా ఏతెంచి పాహి పాహి అన్న కొద్ది సేపటికి కానీ తేరుకోలేదు. 

"తరువాత విశ్వకర్మ కుమారుడు నలుడి పర్యవేక్షణలో సేతు నిర్మాణం, సముద్ర తరణం ఐదురోజులలో పూర్తి అయి లంకలో ప్రవేశించిన సమయంలో ఊర్మిళ మొగం లో అంతులేని ఆనందం కనిపించింది. 

"అంగద రాయబారం తర్వాత యుద్ధం మొదలైంది. ఏరోజుకారోజు మరణించిన రాక్షస వీరుల గురించి ఊర్మిళ కలవరింతలలో తెలుస్తూ ఉండేది. మొదటి రోజుననే రావణుడు మాయా సీత తల ఉత్తరించి తెచ్చి రామలక్ష్మణులకు చూపించినపుడు కూడా ఊర్మిళ వణికిపోయింది కానీ వెంటనే తేరుకుంది. మా అక్కయ్యను ఈ విధంగా చంపడం ఎవరికీ సాధ్యం కాదు అని అరిచింది. ఆ సమయంలో నేను, ఆమె తప్ప వేరే ఎవరూ లేరు. 

"విభీషణుడు రామయ్యతో అది రాక్షస మాయ అని, అటువంటి దుష్ట కార్యాలు వారికి తేలికైన పని అని ఊరడించిన తర్వాత ఊర్మిళ కూడా ఊరడిల్లింది. 

"ఆ తర్వాత రోజున మొదలైన భీకర సంగ్రామంలో రాక్షస వీరుల మరణం తర్వాత ఇంద్రజిత్తు విజృంభించి నాగాస్త్ర ప్రయోగం చేసి రామలక్ష్మణులను వివశులను చేసినప్పుడూ, ఊర్మిళ వివశురాలైపోయింది. ఆమె మళ్లీ తేరుకుని అంటే కలవరింతలు మొదలుపెట్టేసరికి నాకు తెలిసింది ఏమిటంటే దివ్య స్వరూపుడైన గరుత్మంతుడు స్వయంగా వచ్చి నాగులందరినీ పారద్రోలి రామలక్ష్మణులను పూర్వ వైభవంతో, పూర్తి ఆరోగ్యంతో నిలిపాడనీ, కానీ తాను ఎవరో యుద్ధం పూర్తైన తర్వాత తెలుస్తుంది అని తెలిపాడు. 

"ఆ తర్వాత రోజు విజృంభించి ధూమ్రాక్షుడు, వజ్రదంష్ట్రుడు, ప్రహస్తాది అసురులను వధించేశారు. ఆ తర్వాత రోజున రావణాసురుడు స్వయంగా వచ్చి భీకరమైన పోరు సలిపి లక్ష్మణుడిని మూర్ఛిల్లజేసి లంకలోకి తీసుకునిపోదలచినపుడు ఊర్మిళ నిద్రలోనే చేతులు జోడించి జగన్మాత ను ప్రార్థించింది. రావణుడు లక్ష్మణుడిని ఎత్తలేకపోయాడు. ఆ తర్వాత ఆంజనేయుడు సులువుగా లక్ష్మణుడిని ఎత్తి దూరంగా తీసుకెళ్ళి మూర్ఛ నుంచి తెప్పరిల్ల జేశాడు. ఆ తర్వాత రామరావణ యుద్ధం భీకరంగా జరిగి రావణుడు విరధుడై, ఆయుధాలు అన్నీ నాశనమవగా రాముడు అతనిని లంకలోకి పోయి సేదతీరి మర్నాడు రమ్మని చెప్పినపుడు ఊర్మిళ వదనంలో గర్వం తొణికిసలాడింది.

"తర్వాతి రోజున రావణాసురుడు పంపగా అతని తమ్ముడు భీకరాకారుడు కుంభకర్ణుడు అతిభయంకరంగా యుద్ధం చేసినపుడు కూడా ఊర్మిళ చాలా భయపడిపోయింది.

"రామలక్ష్మణులు వీరోచిత యుద్ధంలో కుంభకర్ణుడిని నిలువరించినా రాముడి దివ్యాస్త్రాలతో మాత్రమే అతడు ప్రాణాలు వదిలాడు.

"ఆ తర్వాత ఎందరో మహా వీరులు రాక్షసులు హతమైపోయారు. కుంభకర్ణ పుత్రుడు అతికాయుడు భయంకర యుద్ధం చేస్తే లక్ష్మణుడు బ్రహ్మాస్త్రం విడిచి అతడిని వధించినపుడు ఊర్మిళ ఎంతో పొంగిపోయింది.

"అతికాయుడు పరలోకం చేరిన తర్వాత ఇంద్రజిత్ చేసిన మాయా యుద్ధం లో రామ లక్ష్మణులు మూర్ఛితులై పడిపోయినపుడు ఊర్మిళ పెద్దగా భీతిల్ల లేదు. 'నా సౌభాగ్యం చెదరదు'/ అని మౌనంగా ఉండిపోయింది. 
అప్పుడు హనుమంతుడు ఓషధీ పర్వతం పెకలించుకుని వచ్చి సంజీవకరణితో రామ లక్ష్మణులను తెప్పరిల్ల చేసినపుడు ఊర్మిళ హనుమకు చేసిన సజల నయన బాష్పాంజలి చూసి ఉండాలి నువ్వు రామా ! 

"ఆ తర్వాత కంపన, ప్రజంఘన, యూపాక్ష, కుంభ నికుంభాది రాక్షసులు వానర వీరుల చేతిలో హతులైన తరువాత ఇంద్రజిత్తు మాయా సీత మెడను ఉత్తరించినపుడు కూడా ఊర్మిళ భయపడలేదు. అక్కకు సంతానయోగం ఉంది. ఇదంతా రాక్షస మాయ అన్నది. 

"విభీషణుడు కూడా రామలక్ష్మణులతో అది మాయ అని తేటతెల్లం చేసిన తర్వాత లక్ష్మణుడు విభీషణుడి సలహా పైన నికుంభిలా చైత్యంలో ఇంద్రజిత్ పైన దాడి చేసి భీకర యుద్ధంలో లక్ష్మణుని ప్రతాపం, శౌర్యం చూసి తన కలవరింతలలో వివరిస్తూ గర్వంతో ఉప్పొంగిపోయింది ఊర్మిళ" అని ఆ ఘట్టం గుర్తు రాగా ఒక రెండు నిమిషాలు సుమిత్ర ఆగింది.

"ఆ ఘోర యుద్ధంలో ఇంద్రజిత్ లక్ష్మణుని రామాంకితమైన శరమునకు ఆహుతి అయిపోయినపుడు ఊర్మిళ పట్టలేని సంతోషంతో కంటి నుంచి బాష్పాలు రాల్చింది. ఆ తర్వాత రామ రావణ యుద్ధం భీకరంగా జరిగి శక్తి ప్రహారంతో లక్ష్మణుడు మూర్ఛిల్లడము, మరల హనుమంతుడు సంజీవని పర్వతం తీసుకుని వచ్చాక మరల స్వస్థుడవడము ఆమె నిశ్శబ్దంగా గమనించింది. 

"ఆ తరువాత అగస్త్య మహర్షి రావడము, ఆదిత్య హృదయం రామునికి ఉపదేశం చెయ్యడము, అనంతరం స్వర్గం నుండి ఇంద్రుని పనుపున దివ్య రధము రావడము, పిదప రామ రావణ సంగ్రామం విపులంగా వివరిస్తూ ఉప్పొంగిపోయింది ఊర్మిళ.

"ఆకాశానికీ, సాగరానికీ ఉపమానాలు లేనట్లే వారి మధ్య జరిగిన యుద్ధం నభూతో నభవిష్యతి అన్నదామె. అహోరాత్రులు జరిగిన యుద్ధంలో రావణుని తలలు తెగిపడడము, మరల ఉద్భవించడం చెప్తూ ఊర్మిళ ఎంతో ఆశ్చర్యం పొందింది. 

"చివరికి మాతలి సలహా మేరకు దివ్య శరాన్ని సాటి లేని బ్రహ్మాస్త్రం తో అభిమంత్రించి రాముడు విడువగా రావణుడు హతమారిపోయాడని చెప్తూ సంతోషం పట్టలేక పోయింది.

"తదనంతరం విభీషణుడు రావణుని అంత్యక్రియలు పూర్తి చేసిన తర్వాత రాముడి ఆజ్ఞ మేరకు సర్వాభరణ భూషిత అయిన మా కోడలు సీత వచ్చి ఎదుట నిల్చినపుడు రాముడు పలికిన కంటక సదృశమైన మాటలు వింటూ ఊర్మిళ చిగురుటాకులా వణికిపోయింది. లక్ష్మణుడు చితి పేరుస్తుండగా 'వద్దు స్వామీ ! వద్దు వద్ద'ని వేడుకుంది. 

"ఈ సీతా సాధ్వి అగ్ని ప్రవేశం చేసినపుడు ఊర్మిళ అంతకుముందు ఎప్పుడూ లేని విధంగా రోదించింది. కానీ ఏమైందో వెంటనే సంబాళించుకున్నది. ఆకసాన బ్రహ్మ, మహేశ్వరులు, ఇంద్రాది దేవతలు వచ్చి రాముని స్తుతించడము, ఆ వెంటనే చితి నుంచి అంతకు ముందు కన్నా కాంతులీనే సీతమ్మను తన కుడి తొడమీద కూర్చోబెట్టుకుని పరమ పవిత్రుడైన అగ్నిభట్టారకుడు రామునితో సీతమ్మ పరమ సాధ్వి అనీ ఆమెను స్వీకరీంచమని ఆదేశిస్తే పరమ సంతోషముతో రాముడు అంగీకరించాడని చెప్పింది. 

"అప్పుడు దివ్య విమానం లో దశరధ మహారాజుని దర్శించి సీతా రామ లక్ష్మణులతో పాటు ఊర్మిళ కూడా పరవశించి పోయింది. 

"ఇంద్రుడు రాముని అభీష్టం మేరకు మృత వానర, కోలాంగూల, భల్లూక వీరులని పునర్జీవితులను చేసి, వారు ఉండే ప్రదేశాల్లో మధుర ఫలాలు, స్వాదు జలాలు సంవత్సరం పొడవునా లభించేలా వరమిస్తే రాముడితో పాటు ఊర్మిళ కూడా మహదానంద పడింది. 

"విభీషణుడి పట్టాభిషేకం అనంతరం సీతా రామ లక్ష్మణులతో విభీషణాది రాక్షసులు, సుగ్రీవ, జాంబవంత, అంగద, హనుమదాది వానర వీరులు, కిష్కింధ లోని వానర కాంతలు పుష్పక విమానంలో పయనమై రాగా మధ్యలో మహర్షి భరద్వాజుడి ఆశ్రమంలో ఆగి హనుమంతుడిని పంపాడు రాముడు - ఏ మాత్రమైనా భరతుని మనసులో రాజ్య కాంక్ష ఉంటే అక్కడే ఆగిపోదామని. కానీ భరతుడు బంగారు తండ్రి రామా ! మీ నాన్నగారిది, నీది ధర్మ నిరతి పుణికి పుచ్చుకున్నాడు".

అందరూ ఏదో స్వప్నంలో ఉన్న అనుభూతి దాటుకుని మరల కౌసల్యా మందిరం లోకి వచ్చేశారు. అందరూ ఊర్మిళ వైపు ప్రశంశగా చూస్తూ ఉండగా సీతాదేవి చెల్లెలి దగ్గరకు వెళ్ళి ఆమెను బిగియారా కౌగిలించుకుని ఆమె కపోలం పైన చుంబించింది. ఊర్మిళ కూడా ఆమె కౌగిలిలో అశ్రునయనాలతో ఒదిగిపోయింది. 

అందరూ తెప్పరిల్లాక ఊర్మిళ మంద్ర స్వరంతో ఇలా అన్నది : నేను, అక్క సీత ఏక గర్భ సంజాతలము కాకపోయినా మా మధ్య అది ఎప్పుడూ అంతరం కాలేదు. చిన్ననాటి నుంచి అక్క నన్నెంతో ముద్దు చేసేది, నాతో ఎన్నో ఆటలు, పాటలు ! అక్క వీర్య శుల్క అని తండ్రిగారు ప్రకటించి శివ ధనుస్సు ను ఎక్కు పెట్టిన వీరుడికి ఇచ్చి వివాహం చేస్తానని ప్రకటించిన తర్వాత ఎవరూ కనీసం తాకడానికి కూడా సంశయించిన తరుణంలో మా బావగారు ఈశ్వర చాపాన్ని భంగం చేసినపుడు, నేను అక్క నన్ను విడిచి వెళ్ళిపోతుందని కుమిలి పోయాను. కానీ మామగారు అయోధ్య నుంచి వచ్చి నన్ను, మా పిన తండ్రి గారి పుత్రులను రామానుజులకు ఇచ్చి వివాహం చేస్తానని అన్నపుడు అక్క దగ్గరే ఉంటామని పరమ సంతోషము కలిగింది. 

"అప్పుడే అక్క నాతో ఒక రహస్యం చెప్పింది, 'చెల్లీ ! ఇదివరలో నేను సప్తర్షుల సతీమణులను అర్చించినపుడు వారు చూచాయగా నీకు, లక్ష్మణుడికి భౌతికంగా ఎడబాటు కలుగుతుంద'ని అన్నారట. అక్క వారి పాదాల మీద వ్రాలి కన్నీటితో వేడుకుంటే వారు అన్యాపదేశంగా భౌతికంగా దూరమైనా మానసికంగా కలిసి ఉంటారనీ నన్ను యుగయుగాలుగా గుర్తు పెట్టుకుంటారని చెప్పారట. నాకు ఇటువంటి అక్క ఉంటే నాకు విచారం దరి చేరదు ! అంటూ కంట నీరు కారుస్తూ మరల మరల సీతమ్మను హత్తుకుంది.

చూస్తున్న అందరూ పులకిత శరీరాలతో సీతమ్మను, ఊర్మిళను ఆయురారోగ్యాలతో వర్ధిల్లమని దీవించారు.

నా వేడుకోలు :
మహర్షి బాలకాండ లో సీతారామ కళ్యాణం సమయంలో చేసిన ప్రస్తావన తరువాత ఊర్మిళ గురించి మరొకమారు చెప్పనే లేదు. సుమిత్రా దేవి వనవాసానికి బయలుదేరే సమయంలో లక్ష్మణుడితో సీతా రాములను తల్లిదండ్రులుగా భావించి కొలవమని చెప్తుంది. ఊర్మిళ గురించి అదికూడా చెప్పలేదు. కేవలం నాకు ఆ పాత్ర మీద ఉన్న అపారమైన గౌరవంతో పూర్తిగా స్వకపోల కల్పితమైన ఈ కథను మీ ముందు ఉంచుతున్నాను. ఇందులో గుణదోషాలన్నీ పూర్తిగా నావి మాత్రమే ! 🙏🙏🙏

నాకు పరమ ఇష్టమైన ఈ కథను నా అర్థాంగి వెంకట రమణకు చెమ్మగిల్లిన కళ్ళతో అంకితమిస్తున్నాను. 






కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఒక పౌర్ణమి కథ

అక్కరకొచ్చిన_అనుభవం

నేనున్నా నీకు రక్షణ @