పసి మనస్తత్వం @
పసి మనస్తత్వం "మామయ్య గారూ ! " అని నెమ్మదిగా పిలిచినా వెంటనే లేచాడు శంకరనారాయణ గారు. అలవాటుకొద్దీ చేతి వాచీ కేసి చూసుకున్నాడు. తెల్లవారి నాలుగుంబావయింది. "ఏమైందమ్మా?" అని అడిగాడు కోడలిని. " "బాబుకి కడుపులో నొప్పి అంటున్నాడు . రెండుసార్లు వాంతి కూడా అయింది " అన్నది వాసంతి కొంచెం ఆందోళనగా. "జ్వరం ఏమైనా ఉన్నదా?" ఆదుర్దాను కనబడనీయకుండా అడిగాడాయన. "నుదురు కొంచెం వెచ్చగా ఉన్నది" అంది వాసంతి. "పదమ్మా చూస్తాను.", అని తన మెడికల్ కిట్ తీసుకుని కొడుకు గదిలోకి కోడలి వెంట వెళ్లాడాయన. కొడుకు లేటుగా పడుకుని ఉంటాడని తెలుసాయనకు. వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చాక కొడుకు పడుకునే సరికి తారీకు మారుతుందని అనుభవమే ! మనవడు నీరసంగా పడుకుని ఉన్నాడు మూడంకె వేసి, పొట్ట పట్టుకుని. సరిగా పడుకోపెట్టి పొట్ట నొక్కి చూసాడు. "మెత్తగానే ఉన్నది. కంగారేమీ లేదమ్మా రాత్రేమి తిన్నాడు ?" "మామూలుగా కూర, మజ్జిగ అన్నం, కొద్దిగా పుచ్చకాయ ముక్కలు. అవి అరగలేదేమో ఎర్రగా ముక్కలుగా వచ్చింది వాంతి లో" అన్నది. "పుచ్చకాయ అరగక పోవడమేమీ ఉండదు. ఇంక వేరే ఏమీ ...