పసి మనస్తత్వం @

పసి మనస్తత్వం

"మామయ్య గారూ ! " అని నెమ్మదిగా పిలిచినా వెంటనే లేచాడు శంకరనారాయణ గారు. అలవాటుకొద్దీ చేతి వాచీ కేసి చూసుకున్నాడు. తెల్లవారి నాలుగుంబావయింది.
"ఏమైందమ్మా?" అని అడిగాడు కోడలిని.
" "బాబుకి కడుపులో నొప్పి అంటున్నాడు . రెండుసార్లు వాంతి కూడా అయింది " అన్నది వాసంతి కొంచెం ఆందోళనగా.
"జ్వరం ఏమైనా ఉన్నదా?" ఆదుర్దాను కనబడనీయకుండా అడిగాడాయన.
"నుదురు కొంచెం వెచ్చగా ఉన్నది" అంది వాసంతి.
"పదమ్మా చూస్తాను.", అని తన మెడికల్ కిట్ తీసుకుని కొడుకు గదిలోకి కోడలి వెంట వెళ్లాడాయన.
కొడుకు లేటుగా పడుకుని ఉంటాడని తెలుసాయనకు. వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చాక కొడుకు పడుకునే సరికి తారీకు మారుతుందని అనుభవమే !
మనవడు నీరసంగా పడుకుని ఉన్నాడు మూడంకె వేసి, పొట్ట పట్టుకుని.
సరిగా పడుకోపెట్టి పొట్ట నొక్కి చూసాడు. "మెత్తగానే ఉన్నది. కంగారేమీ లేదమ్మా రాత్రేమి తిన్నాడు ?"
"మామూలుగా కూర, మజ్జిగ అన్నం, కొద్దిగా పుచ్చకాయ ముక్కలు. అవి అరగలేదేమో ఎర్రగా ముక్కలుగా వచ్చింది వాంతి లో" అన్నది.
"పుచ్చకాయ అరగక పోవడమేమీ ఉండదు. ఇంక వేరే ఏమీ తినలేదా ?" అనుభవం మీద వచ్చిన శంకతో అడిగాడాయన.
వాసంతి కూడా కొంచెం అనుమానంగానే "నాకు తెలిసి ఏమీ తినలేదు మామయ్యా అయినా చూస్తాను" అని వంట గదిలోకి వెళ్ళింది.
"తాతా ! పుచ్చకాయే ! ఆరగలేదు. వేరే ఏమీ తినలేదు. ఇంజీ చెయ్యవుగా ?"
"నొప్పి తగ్గితే చెయ్యనులే " అన్నాడాయన.
వాసంతి వంటింట్లోనుంచి "మామయ్య గారూ !" అని పిలిచింది
వంటింట్లోకి వెళ్లిన ఆయన మొహంలో చిన్న నవ్వు కనిపించింది. "అనుకున్నా ! వీడేదో కోతి పని చేసే ఉంటాడని !' అన్నాడు సగం ఖాళీగా ఉన్న మూత సరిగా పెట్టని టొమాటో సాస్ సీసా చూసి.

ఇంజెక్షన్ చేసిన పావుగంటకి నొప్పి తగ్గి, వెక్కుతూనే నిద్రలోకి జారిన మనవణ్ణి చూసి నిట్టూర్చాడాయన. తాతా అంటూ వెంట తిరిగే మనవడు ఇలాంటి పరిష్టితి వస్తే రెండు మూడు రోజులు మూతి ముడుచుకుని దూరంగా వెళ్ళిపోతాడు. రహస్యంగా 'పచ్చి' అని సైగలు చేస్తాడు.
*****.         *********.         *******
పది గంటలకి క్లినిక్ కి వెళ్లిన శంకర నారాయణ గారికి ముగ్గురు పేషేంట్లని చూసిన తర్వాత లోపలకి భాస్కర్, లక్ష్మి వచ్చారు. భాస్కర్ శంకరనారాయణ గారి పెదనాన్న మనుమడు. ఆడిటర్ . ఆ మాటా ఈ మాటా అయినా తర్వాత మెల్లగా తన ప్రాబ్లమ్ చెప్పాడు భాస్కర్. "కడుపులో నొప్పి, విరేచనాలు అవుతున్నాయి బాబాయ్ ! కొద్దిగా వొళ్ళు వెచ్చబడింది, నిన్న రాత్రి నుంచి, ఒకసారి వాంతి కూడా అయింది."

అలవాటు కొద్దీ పెద్దగా ఆలోచించకుండానే "నిన్న మధ్యాహ్నం కానీ రాత్రి కానీ ఫుడ్ ఏమైనా తేడా వచ్చిందా ?" అని అడిగాడు.
"లేదు బాబాయ్ ! రోజూ లాగానే, అయినా ఎందుకొచ్చిందో" అన్నాడు అవసరమైన దాని కన్నా త్వరగానే.

వెంటనే ఆయనకీ మనుమడు జ్ఞాపకం వచ్చాడు.

"ఒరేయ్ భాస్కర్ ! నీ అలవాట్లు నాకు తెలుసునులే కానీ, దాచకుండా చెప్పు !" అన్నాడు కొద్దిగా చిరుకోపంతో .

" నిన్న క్లయింటు దగ్గరకి పనుండి వెళ్తే మిరపకాయ బజ్జీలు, నిమ్మ షర్బత్ తెప్పించాడు బాబాయ్ ! ఒక్కటే తిన్నాను, షర్బత్ కూడా సగమే తాగాను" అన్నాడు భాస్కర్ గిల్టీగా.

ఏమీ మాట్లాడకుండా తీక్షణంగా చూస్తున్న శంకరనారాయణ కేసి సూటిగా చూడలేక కొంచెం తడబడుతూ "రాత్రి మా పార్ట్నర్ బర్త్ డే అని పార్టీ ఇస్తే కొద్దిగా చికెన్ తిన్నాను" అని తల వంచుకున్నాడు.

అంతదాకా మాట్లాడకుండా కూర్చున్న లక్ష్మి "కొంచెం కన్నా ఎక్కువే లిక్కర్ కూడా పడింది మామయ్య గారూ. ! అది చెప్పరేం ?" అంది గుడ్లురుముతూ.

గుటకలు మింగాడే కానీ తల ఎత్తలేదు భాస్కర్.
అతని వైపే దీర్ఘంగా చూసి నిట్టూర్చాడు శంకరనారాయణ గారు. మందులు వ్రాసి పంపించేసాక ఒక్క నిముషం కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడాయన.

భాస్కర్ తండ్రి తనకు సొంత అన్నగారి లాగానే ఉండేవాడు. పూజ, అనుష్టానాలు బాగా చేసే వాడు. "సరే ఎం చేస్తాం ? కాలమహిమ" అనుకుని కాలింగ్ బెల్ నొక్కాడు తర్వాతి పేషేంట్ కోసం.

తమాషాగా ఇద్దరు పేషెంట్ల తర్వాత అలాంటి సీనే !
ఈ సారి రాధమ్మగారు వాళ్ళాయనతోటి వచ్చింది. "ఒరేయ్ శంకరా ! ఈయనతో పడలేకపోతున్నా ! నువ్వేంచేస్తావో నీ ఇష్టం ! ఆయన్ని అడుగు. నేనడిగితే ఏం చెప్పరు. చచ్చిపోతున్నా ఈయనతో." దాదాపు ఏడుపు వచ్చేస్తోంది ఆవిడకి.

ఆవిడ చుట్టాలేమీ కాదు. ఆవిడ పెద్ద కొడుకు వేణు, శంకర నారాయణ గారు వీధి బడి నుంచి కాలేజి వరకు క్లాస్ మేట్లు. చిక్కటి మిత్రులు. శంకరనారాయణ గారి కుటుంబం బయట ఒరేయ్ అని పిలిచే చనువు ఆవిడకి మాత్రమే ఉంది.

"ఏంటి అత్తా ! ఏం చేశారివాళ ?" అడిగాడు. ఆల్రెడీ వాళ్ళని చూడగానే సగం రిలాక్స్ అయిపోయాడు. వాళ్ళని మిధునం జంట అంటూ ఉంటాడు సరదాగా. ఇద్దరూ కొట్టుకుంటున్నట్లే ఉంటారు. కాని ఒకరికేదైనా నలతగా వస్తే రెండో వారు విలవిల్లాడిపోతారు.

"నిన్న రాత్రి నుంచి విరేచనాలురా ! కడుపు నెప్పి అంటారు. రెండు సార్లు వాంతులు. నోరు కట్టుకోరురా బాబూ !" అన్నదావిడ.

"నేనేం తినలేదంటే వినిపించుకోవేం? నేను తిన్నది ఏం ఉందీ ? అరిటికాయ ఉల్లిపాయ పులుసుకూర! నువ్వే చేశావుగా! మధ్యాహ్నం మామిడికాయ పప్పు, గోంగూర పచ్చడి ! అంతే !"

"ఇంకా చెప్పండి ! గోంగూరలో ఉల్లిపాయ నంజలేదూ ? మళ్ళీ పెరుగు అన్నంలో రెండోసారి గోంగూర మట్టగించ లేదూ ?"

"నువ్వు నోరు మూసెయ్యి! అధికంగా పేలకు !" గొంతు పెంచాడాయన.

"అమ్మో అమ్మో! నేను పేలుతున్నానా ? శంకరా ! నువ్వే చెప్పరా ! ఈ వయసులో అవన్నీ అరుగుతాయంటావా ? మళ్ళీ భోజనం తర్వాత అరగడానికని భావన అల్లం పావుకిలో స్వాహా ! వాంతిలో ఆ ముక్కలన్నీ గోడక్కొట్టిన బంతుల్లా బయట పడిపోయాయి !"

"పావు కిలోనా అర కిలోనా ! గోల్కొండ మిరియాల కబుర్లు చెప్పకు నిజమే అనుకుంటారు డాక్టరు గారు." అని గుడ్లురిమాడు.

అన్నీ నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్న శంకరనారాయణ గారు పరిస్థితి చేయి దాటిపోతోందేమో అని కంగారు పడి అవీ ఇవీ మాట్లాడి మందులు వ్రాసి పంపించేసి కుర్చీలో మాళ్ళీ వెనక్కి వాలాడు.

వీళ్ళందర్లోకి చిన్న పిల్లలు ఎవరూ? అని ఆలోచించాడు. మనవడి మీద జాలి కలిగింది. 'నీ కన్నా చిన్న పిల్లలు చాలా మందే ఉన్నారు రా కన్నా !' అనుకుంటూనే ఒక్కసారి తుళ్ళి పడ్డాడు.

తను మాత్రం ? బయటకి వెళ్ళినపుడు తను నోరు కట్టుకోగలుగుతున్నాడా ? జిలేబి అంటే చాలా ఇష్టం తనకి. రోడ్ పక్క బండి మీద జిలేబి కనబడితే కారు ఆపి నాలుగైదు విడతలు తిని కానీ బయల్దేరడు. మామిడికాయ బద్దలు ఉప్పు, కారం అద్ది అమ్మే చోటైనా అంతే ! భార్యకి తెలియకూడదని విరేచనాలు కాకుండా మాత్రలు వేసేసుకుంటూ ఉంటాడు. ఆవిడ ఏదో విధంగా కనిపెట్టేస్తూనే ఉంటుంది.

'నేనూ చిన్న పిల్లాడి కంటే కనాకష్టమే !' అనుకుంటూ ఇకనైనా ఇటువంటి అలవాట్లు మానేయాలని యాభై నాలుగోసారి గట్టి నిర్ణయం తీసుకున్నారు శంకరనారాయణ గారు !!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఒక పౌర్ణమి కథ

అక్కరకొచ్చిన_అనుభవం

నేనున్నా నీకు రక్షణ @