ఒక పౌర్ణమి కథ

ఒక పౌర్ణమి కథ

ప్రసన్న ప్రవీణ్ రామ్ కి సాక్షాత్తు మేనత్త కూతురే, వరసైనదే. చిన్నతనం నుంచి సెలవులకి మేనత్త పుట్టింటికి వచ్చినపుడు కలిసి ఆడుకునే వారు. 

యుక్తవయసు దగ్గర పడుతున్న కొద్దీ ఆకర్షణ కూడా ఎక్కువైంది. ఇంట్లో కూడా అన్యాపదేశంగా అనుకునే మాటలు చాటుగా విన్నవాళ్ళవడం వలన పెళ్ళి ఆలోచనలు ఇద్దరికీ కలుగుతూనే ఉన్నాయి. ప్రవీణ్ ని చూసినపుడు ప్రసన్న బుగ్గలు ఎర్రబడడము, పమిట సర్దుకోవడము, ప్రవీణ్ మనసుకి ఎంతో హాయిగా ఉండేది.

ప్రవీణ్ తండ్రికి ఆమె అంటే ప్రత్యేకమైన ముద్దు తన తల్లి ప్రసన్న లక్ష్మి పేరు పెట్టారని. 

తన కొడుకుకి తండ్రి పేరు రామారావు గారి పేరు చేర్చి ప్రవీణ్ రామ్ అని పేరు పెట్టుకున్నాడు. 

ప్రసన్న తల్లి భారతికి కూడా మేనల్లుడంటే ప్రత్యేకమైన అభిమానం. అన్నగారు భాస్కర్ కి ముద్దుల చెల్లెలు. 'అన్నా ! నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం' అని సినిమా పాటలేం పాడలేదు కానీ అంత ప్రేమ భారతికి.

ప్రసన్న తండ్రి పరమేశ్వర్ కి కూడా వారికి పెళ్ళి చేయడం గురించి అభ్యంతరం లేదు కానీ బయటపడే వాడు కాదు. అతని తత్వం అంతే ! మితభాషే కానీ కొంచెం కోపధారి.

చివరికి రెండు వైపులా సరే అనుకుని తాంబూలాలు పుచ్చుకుందామని అనుకునే సమయానికి జాతకాలు కలవలేదని సిద్ధాంతి తేల్చేసరికి అందరూ హతాశులైపోయారు. ప్రవీణ్ రామ్ కి కుజదోషం ఉన్నదని, పైగా ఇద్దరూ పౌర్ణమి నాడే పుట్టారని, ఇంకా ఏవేవో చెప్పాడాయన. భాస్కర్ కి ఈ జాతకాలు కలవడం మీద పెద్ద నమ్మకం లేదు. 'మనసులు, వరసలు కలిస్తే అంతకన్నా కావాల్సింది ఏముంది' అని తీసిపారేసాడు బావగారు పరమేశ్వర్ ముందు. 

పరమేశ్వర్ కి ఇటువంటివి చాలా నమ్మకం. కరాఖండిగా చెప్పేశాడు కుదరదని ! మాటామాటా వచ్చి బావ, బావమరుదుల మధ్య ఎప్పుడూ లేని పొరపొచ్చాలు వచ్చాయి. 

పిల్లలిద్దరూ హతాశులైపోయారు. వారిద్దరు కట్టుకున్న కలల మేడలు బీటలువారాయి. కానీ ఇద్దరికీ ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఉన్న అనురాగంతో ఇద్దరూ భవిష్యత్తు గురించి మాట్లాడుకున్నారు. 

ఫలితం ఇద్దరూ ఇంట్లోనుంచి పారిపోయి అన్నవరం గుడిలో గుట్టు చప్పుడు కాకుండా పెళ్ళి చేసేసుకున్నారు. 

పరమేశ్వర్ ఆగ్రహంతో ఊగిపోయాడు. పైగా వాళ్ళు పెళ్ళి చేసుకున్న రోజు పౌర్ణమి అయింది. 

అన్నవరంలో పూజారి, రిజిస్టర్ చేసే ఆఫీస్ గుమాస్తా కూడా "పౌర్ణమి నాడు వివాహం చేయరు సాధారణంగా !" అన్నారు. వీళ్ళిద్దరూ కొంచెం ఆలోచించుకుని పెళ్ళి చేసేసుకోవడానికే నిర్ణయించుకున్నారు. వెనక్కి తగ్గే సందర్భం కాదు మరి.

పౌర్ణమి నాడు పెళ్లి చేసుకోవడం పరమేశ్వర్ కి అగ్నిలో ఆజ్యం పోసినట్లయింది. తన గడప తొక్కద్దని నిక్కచ్చిగా చెప్పేసాడు. భారతి గుడ్లలో నీరు నింపుకుని బాధపడింది కానీ భర్తకి ఎదురాడలేక పోయింది. 

భాస్కర్ వారిద్దరి తోటి చెప్పాడు "మీరు ఇక్కడ ఉంటే నా ఒక్కగానొక్క చెల్లెలు మన ఇంటికి రాలేదు. మీరిద్దరూ వైజాగ్ వెళ్ళి కాపురం పెట్టండి. ప్రవీణ్ అక్కడ ఉద్యోగం ఎలాగూ చేస్తున్నాడు కాబట్టి మీకు ఏ ఇబ్బందీ ఉండదు. మేము వచ్చి చూసి వెళ్తూ ఉంటాము. భారతి, పరమేశ్వర్ ల మీద ద్వేషం పెట్టుకోవద్దు. నింపాదిగా భాస్కర్ మారతాడని నాకు నమ్మకం ఉంది."

ఆ దంపతులకు పాదాలకు నమస్కరించి కన్నీటితో ఇల్లు వదిలారు నూతన దంపతులు. 

వైజాగ్ లో కాలం ఇట్టే గడిచిపోయి వారికి ఇద్దరు ముద్దులు మూట కట్టే పిల్లలు కలిగారు. 

చిన్నవాడు పుట్టిన తర్వాత బారసాలకు పరమేశ్వర్ ముసిముసిగా నవ్వుతూ భార్యతో వచ్చాడు. అందరికీ బ్రహ్మానందం కలిగింది. 

బారసాల ముందు శాంతులు చేయించినపుడు పిల్లాడి పుట్టిన తిథి పౌర్ణమి అని తెలిసి ఆశ్చర్యపోయాడు పరమేశ్వర్. మనవడికి పరమేశ్వర భాస్కర రామ్ అని పేరు పెట్టేసరికి కళ్ళ నీళ్ళు కార్చాడు. 

బావమరిది చేతులు తన చేతుల్లోకి తీసుకుని "నేను మూర్ఖంగా ఆలోచించాను బావగారూ ! పిల్లల మనసు తెలిసి కూడా అందరినీ బాధపెట్టాను!" అన్నాడు.

భారతి మూడేళ్ల మనవరాలిని ఎత్తుకుని వచ్చి పరమేశ్వర్ ఒళ్ళో కూర్చోబెట్టింది. "మనవరాలి పేరడగండి!" అన్నది మురిపెంగా.

తాతగారి ప్రశ్నకి "శ్లావన బాలతి" అంది ముద్దుగా. పరమేశ్వర్ అర్ధం కాక కూతురి వైపు చూస్తే "శ్రావణ భారతి నాన్నా ! అమ్మ పేరు పెట్టుకున్నాము. ఇంకొకటి చెప్పనా ? అది శ్రావణ పౌర్ణమి నాడు పుట్టింది !" అన్నది ప్రసన్న. 

ఒక క్షణం నిరుత్తరుడైన పరమేశ్వర్ పకపకా నవ్వేసి మనవరాలిని హత్తుకుని ముద్దుల్లో ముంచెత్తాడు. 

సమాప్తం






కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అక్కరకొచ్చిన_అనుభవం

నేనున్నా నీకు రక్షణ @