నేనున్నా నీకు రక్షణ @
నేనున్నా నీకు రక్షణ
హమ్మయ్య ! అనుకుని కంప్యూటర్ లాగ్ ఆఫ్ చేసి పవర్ ఆఫ్ చేసి అలసటగా కుర్చీలో వెనక్కి జారగిలబడ్డాడు లక్ష్మీనారాయణ.
మూడు రోజులుగా ఓవర్సీస్ క్లయింటు తో హోరా హోరీ గా వీడియో కాల్స్ లో పోరాడి తమ కంపెనీ ఇచ్చిన ప్రోగ్రామ్ లో తప్పు లేదనీ, వాళ్ళవైపే ఎక్జిక్యూషన్ పొరపాటు జరిగిందనీ ఒప్పించేసరికి తాతలు దిగిచ్చినంత పనైంది. మూడు రోజులూ ఆఫీజులోనే ఫుడ్డూ బెడ్డూ. రోజుకి ఏ మధ్యాహ్నం పూటనో ఒక నాలుగు గంటలు కోడి కునుకు అంతే !
ఏమి చేస్తారు ? కంపెనీకి అతి ముఖ్యమైన క్లయింటు. కోట్ల రూపాయిల డీల్ ! పైగా తప్పు ఇటువైపు ఉన్నదని తేలితే పరువు పోవడం అటుంచి కంపెనీ పేరు పోవడం ఖాయం.
అందుకనే బాస్ స్వయంగా వచ్చి లక్ష్మీనారాయణని కౌగలించుకుని అభినందించాడు.
"సర్ ! రేపు ఆఫ్ తీసుకుంటాను సర్ ! మూడు రోజులైంది ఇంటి ముఖం చూసి " అన్నాడు బాస్ మూడ్ కనిపెట్టి.
"నో ప్రాబ్లమ్ మై బోయ్ ! రేపు, ఎల్లుండి కూడా ఆఫ్ తీసుకో ! యూ డిజర్వ్ రెస్ట్ !" అన్నాడు బాసు .
********
"లక్ష్మీ ! బాగా అలిసిపోయి ఉన్నావు. ముందుగా బరిస్తా లో మంచి కాఫీ తాగుదాము. ఆ తర్వాత నన్ను ఇంట్లో దింపి వెళ్దువు గాని" అన్నది పూర్ణిమ.
"అల్లాగే !" అని కారుని వేరే రోడ్ లోకి తిప్పాడు లక్ష్మి .
పూర్ణిమ లక్ష్మి టీమ్ లో జూనియర్ మెంబర్, ప్రోగ్రామర్. ఇద్దరి అభిరుచులు బాగా కలిసిపోయేసరికి ఇద్దరి మధ్య సాన్నిహిత్యం త్వరలోనే పెరిగిపోయింది. ఇంకా లక్ష్మి ఆమెకి తన నిర్ణయాన్ని వెల్లడించడమే తరువాయి.
*********
లోపల కాఫీని ఆస్వాదిస్తూ పెద్ద గ్లాస్ విండో లోనుంచి జనాలని చూస్తూ పూర్ణిమ చెప్పే కబుర్లు వింటూ రిలాక్స్ అవుతున్న లక్ష్మి హఠాత్తుగా "పూర్ణా ! చాలా రష్ గా వున్నది కదూ బయట. ఇవాళ ఆదివారం కాదు కదా కొంపదీసి ? నాకు ఈ గొడవలో వారాలు కూడా మర్చిపోయాను" అన్నాడు.
'ఇవాళ శ్రావణ పౌర్ణమి లక్ష్మీ ! రాఖీ పౌర్ణమి !" అన్నది పూర్ణిమ ఉల్లాసంగా.
"మై గాడ్ ! రాఖీ పౌర్ణమా ? మర్చేపోయాను. పూర్ణిమా ! నేను అర్జంటుగా ఇంటికి వెళ్ళాలి. నిన్ను ఇంటిదగ్గర దింపే టైం కూడా లేదు. నువ్వు కాబ్ లో వెళ్లిపోగలవా ? లేకపోతే నా తోటి వస్తే ఆ తర్వాత నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. ఆన్ సెకండ్ థాట్, మా ఇంటికి వస్తేనే మంచిది. నీకు డ్రైవింగ్ వచ్చు కదా ? నువ్వు డ్రైవ్ చెయ్యవా ? నాకు కొంచెం గిల్టీగా వున్నది. అలసటగా ఉండేసరికి సరిగ్గా డ్రైవ్ చెయ్యలేనేమో అనిపిస్తోంది. నిన్ను మా ఇంట్లో పరిచయం చేసినట్లూ ఉంటుంది" అన్నాడు కలగా పులగంగా
అతని ముఖంలో ఆందోళన చూసి చెయ్యి పట్టుకుని మెత్తగా నొక్కి "నేను డ్రైవ్ చేస్తాను. డోంట్ వర్రీ ! జస్ట్ రిలాక్స్. ఎవెరీ థింగ్ విల్ బీ ఒకే !" అన్నదామె.
***********
డ్రైవ్ చేసూ కంటి కొసలనుంచి అతన్ని చూసిన పూర్ణిమ తుళ్ళి పడింది. కళ్ళు మూసుకుని వెనక్కి వాలిన లక్ష్మి కంటికొలకుల నుంచి నీటి బిందువు చెవిదాకా జారింది. అస్పష్టంగా "గౌరీ ! ఐ ఆమ్ ఆన్ ఇడియట్ ! వెరీ సారీ !" అంటున్నాడతను.
ఆమెలో కుతూహలం రేగింది. గౌరీ ఎవరు ?
లక్ష్మీ ఆక్కో చెల్లెలో కాదు కదా ? వేరే ఎవరైనా వరసైన పిల్ల ఉన్నదా ఇంట్లో ? తాను లక్ష్మి ని ఇష్టపడుతున్నదని నేరుగా చెప్పకపోయినా అన్ని విధాలుగా చేతలలో వ్యక్తపరుస్తూనే ఉన్నది. అతను కూడా తనను ఇష్టపడుతున్నాడనే భావిస్తున్నది. ముందుగా ఎవరు బయటపడాలన్నా ఇద్దరికీ బెరుకుగానే ఉన్నది.
పూర్ణిమ మనసులో ఎన్నో ఆలోచనలు. ఇంకా నయం తను బయటపడింది కాదు. ఎంత ఎంబరాసింగ్ గా ఉండేది ?
కొంచెం సేపైన తర్వాత తనని తానే తిట్టుకుంది. తను కానీ, లక్ష్మి గానీ ఎప్పుడూ మాటలలో, చేతలలో హద్దు దాటలేదు. వారి మధ్య సాన్నిహిత్యం త్వరగా పెరిగిపోవడానికి అదికూడా ముఖ్య కారణం. వారి మధ్య దాపరికాలు దాదాపు లేవనే చెప్పాలి.
ఇంకొద్ది సేపటి తరువాత అన్నీ తెలుస్తాయి అని సమాధాన పడింది పూర్ణిమ.
*********
అతని ఇంటి ముందు కారు ఆపగానే త్వరగా దిగిపోయి "పూర్ణా ! కొద్దిగా ముందుకెళ్ళి పార్క్ చేసేస్తావా ? ప్లీజ్ !" అని సమాధానం కోసం ఎదురు చూడకుండా గేటు తీసుకుని పరిగెడుతున్నట్లే ఇంట్లోకి వెళ్ళిపోయాడు లక్ష్మీనారాయణ.
పూర్ణిమ ఖాళీ చూసి కారు పార్క్ చేసి కొంచెం బెరుకుగా ఇంట్లోకి వెళ్ళింది. బయటినుంచి లక్ష్మి చూపించితే చూడడమే కాని ఇంటిలోకి వెళ్ళడం మొదటిసారి ఆమెకి.
లోపలికి వెళ్ళగానే అక్కడ పెద్ద హాల్ లో కనిపించిన దృశ్యానికి మంత్రముగ్ధ లాగా ఆగిపోయింది.
లక్ష్మీనారాయణ రెండు చేతులలోనూ పద్ధెనిమిది ఏళ్ళ కుర్రాడిని ఎత్తుకుని, పొదువుకుని కంట నీరు కారుస్తూ ముద్దులు పెడుతున్నాడు. ఆ కుర్రాడు కూడా లక్ష్మీ మెడ చుట్టూ చేతులు వేసి పెద్దగా నవ్వుతున్నాడు. ఆ పక్కనే అతని తల్లి లాగా ఉన్న ఆమె నవ్వు, కన్నీరు కలగలిపి వారిద్దరినీ పరవశంగా చూస్తున్నది.
రెండు నిమిషాల తర్వాత ఆమె పూర్ణిమను గమనించి గబగబా కళ్ళు తుడిచేసుకుని సంభ్రమం గా "రా అమ్మా ! పూర్ణిమవే కదా ?" అని దగ్గరికి వచ్చింది.
పూర్ణిమ స్థాణువైపోయింది. ఆమెని చూసి నవ్వుతూ "లక్ష్మి నీ గురించి చెప్తూ ఉంటాడమ్మా ! వాడికి వాడి పని, గౌరి తప్ప బయటి విషయాలు పట్టించుకోడు, అడుగో వాడి తమ్ముడు గౌరి. గౌరీ శంకర్ ! వాడంటే వీడికి పంచప్రాణాలు. పని. గౌరి కాక వాడి నోటి వెంట వచ్చిన పేరు నీదే తెలుసా ?"
సమాధానం ఇవ్వకుండా కొద్దిగా నోరు తెరుచుకుని చూస్తున్న పూర్ణిమను గమనించి ఆవిడ ఆమె చూస్తున్న వైపు దృష్టి సారించింది.
జాగ్రత్తగా తమ్ముడిని వీల్ చైర్ లో కూర్చోపెట్టి అతని చేత రాఖీ కట్టించుకుంటున్నాడు లక్ష్మీ.
"గౌరి, లక్ష్మి కి నాలుగే పండుగలు, గౌరి పుట్టిన రోజు, వినాయక చవితి, దీపావళి ఇదిగో రాఖీ పండుగ. చాలా రోజులుగా గౌరి చేతే రాఖీ కట్టించుకంంటాడు లక్ష్మి. నాకు చెల్లెలైనా, తమ్ముడైనా గౌరియే, వాడికి ఆజన్మాంతం రక్షణగా ఉంటాను అంటాడు లక్ష్మి " అన్నదావిడ గొంతు జీర పోగా !
పూర్ణిమ మనసులోని సందేహాలు కనిపెట్టినట్లు ఆవిడ కొనసాగించింది. "మాకు చాలా కాలం తర్వాత లక్ష్మి కలిగాడు. మా మామగారి పేరు పెట్టుకున్నాము. ఆ తర్వాత దాదాపు ఆరేళ్ళ తర్వాత కలిగాడు గౌరి. మా నాన్నగారి పేరు పెట్టారు వాళ్ళ నాన్న గారు. వీడు పుట్టిన ఐదేళ్ళకి ఆయన యాక్సిడెంట్ లో పోయారు. అప్పటికి లక్ష్మి ఏడవ క్లాసు. గౌరి అంటే తగని ముద్దు. నీకు చెప్పనే లేదు. లేటుగా కడుపున పడేసరికి గౌరి కి సెరిబ్రల్ పాల్సీ అని వాడికి పదవ నెలలో ఇంకా కూర్చోకపోవడం వంటి లక్షణాల వలన తెలిసి కుప్పకూలి పోయాము. ఆ టైమ్ లో లక్ష్మియే ఈడుకి మించిన పరిణితి తో వాడి పెంపకంలో పాలు పంచుకున్నాడు. పాలు పంచుకోవడమేమిటి ? వాడే పెంచాడు. డాక్టర్ని అనేక సార్లు విసిగించి ఏ జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన చేసుకున్నాడు బంగారు తండ్రి !
అందుకే వాళ్ళిద్దరి మధ్య అంత గాఢమైన బంధం. గౌరికి మెదడు బాగానే ఉన్నది, కానీ అది పంపే ఆజ్ఞలు శరీరం సరిగ్గా అమలుపరచలేదు. అందుకనే మాటలు సరిగా రావు. లక్ష్మికే వాడి భాష చక్కగా అర్ధమౌతుంది. చేతులు, కాళ్ళు కదలికలు కూడా ఒక పద్ధతిలో ఉండవు. అందుకనే వీల్ చెయిర్ లో తిప్పుతుంటాము. అన్నం ఒంటిమీద పడిపోతుంది, అందుకే మెడ కింద నుంచీ టవల్ వేసేసి జాగ్రత్తగా అన్నం పెడతాము. ఇంట్లో ఉంటే లక్ష్మిదే వాడి డ్యూటీ. లక్ష్మి ఏనాడూ విసుక్కోగా చూడలేదమ్మా !" గొంతు రుద్ధమైపోయి ఆపిందావిడ.
పూర్ణిమ కళ్ళ నిండా సుడులుగా కన్నీరు.
********
తమ్ముడితో కబుర్లు చెప్పిన లక్ష్మి మొహం వెలిగిపోతుండగా వీరిదగ్గరకి వచ్చాడు. తల్లి కళ్ళలో, పూర్ణిమ కళ్ళలో నీరు చూసేసరికి విచలితుడై పోయాడు. "అమ్మా ! పూర్ణా ! ఏమైంది ? ఎనీ థింగ్ రాంగ్ ?" అన్నాడు ఆదుర్దాగా.
"ఏమీ లేదు సర్ ! అమ్మగారు మీ ఇద్దరి గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యే సరికి నాకూ కన్నీరు ఆగలేదండీ." అన్నది పూర్ణిమ.
లక్ష్మి ఆమె తనను బహువచనంలో సంబోధించేసరికి కొంచెం వింతగా చూశాడు. అర్ధం చేసుకుని చిరునవ్వుతో "గౌరి రక్షాబంధన్ కట్టాక వాడి గిఫ్ట్ అడిగాడు. నేను నా పని హడావుడిలో రాఖీ సంగతే గుర్తు లేదు. ఇంక గిఫ్టు సంగతి చెప్పాలా ! కానీ మెరుపులాంటి ఆలోచన వచ్చి ఇక్కడికి వచ్చేశా. పూర్ణిమా ! అమ్మా ! ఇద్దరూ తమ్ముడి దగ్గరికి రండి" అని రెండు చేతులతో ఇద్దరినీ వెంట తీసుకుని గౌరి దగ్గరకు తీసుకెళ్ళాడు.
"గౌరీ ! ఇదిగో నీ గిఫ్టు ! నీకు వదినని తీసుకుని వచ్చాను. నీకు నచ్చిందా !" అన్నాడు.
పూర్ణిమ, లక్ష్మి అమ్మగారు ఇద్దరూ స్థాణువులా ఉండిపోయారు. గౌరి కూడా ముందర అర్ధం చేసుకోలేక తెల్లమొహం వేసుకుని ఉండిపోయాడు. కానీ త్వరగానే తేరుకుని మొఖమంతా నవ్వు చేసుకుని పూర్ణిమ కేసి చేతులు జాపాడు.
పూర్ణిమ తేరుకుని నెమ్మదిగా గౌరి ఛెయిర్ కేసి నడిచింది. నెమ్మదిగా అతని కుడిపక్కన మోకాళ్ళ మీద కూర్చుని అతని రెండు చేతులూ తన చేతుల్లోకి తీసుకున్నది.
"వ్వొదీనా !" కొద్దిగా ఒత్తి పలికిన ఆ పిలుపుకి ఆమెలో స్త్త్రీత్వం, మాతృత్వం కలగలిసిపోయి, ఏడుపు రూపంలో "గౌరీ !" అన్న పిలుపులో బయట పడింది. గౌరి నుదుటిని చుంబిస్తూ రోదిస్తున్న ఆమెని వింతగా చూశారు లక్ష్మి, అతని తల్లి.
*********
కొంత సేపటి తరువాత ముగ్గురూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని పళ్ళరసం తాగుతుండగా ఇంకా వెక్కుతూనే పూర్ణిమ తన గురించి చెప్పింది.
పూర్ణిమ కి కూడా ఒక తమ్ముడు ఉండేవాడు. పిల్లలకు వచ్చే డయాబెటిస్ వచ్చి చాలా రోజులు ఇన్స్యులిన్ మీద ఉండి రెండేళ్ళ క్రితం మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వలన చనిపోయాడు.
చిత్రంగా పూర్ణిమ యే తమ్ముడికి ఇంజెక్షన్లు చెయ్యడం మందులు ఇవ్వడం చేసేది. రక్షాబంధన్ కట్టినపుడు తమ్ముడు "అక్కా ! నీకేం గిఫ్టు కావాలి ? నేను ఉద్యోగం చేసి సంపాదించి ఇస్తాను సరేనా ?" అనేవాడు. అతను పోయాక ఏడాదిపాటు పూర్ణిమ కోలుకోలేక పోయింది. ఉద్యోగంలో చేరాక నెమ్మదిగా సంబాళించుకున్నది.
"పూర్ణిమా ! అకస్మాత్తుగా ఈ విధంగా ప్రపోజ్ చెయ్యడం తొందరపాటే. ఏమనుకోవు కదా ? అమ్మా ! నీకు కూడా షాక్ కదా ? మన్నించమ్మా !" అన్న లక్ష్మి తో తల్లి "నువ్వు షాక్ ఇవ్వడమేమిటి లక్ష్మీ ! నాకూ పూర్ణిమ లాంటి కోడలు రావాలని చూడగానే అనిపించింది" అన్నది.
నెమ్మదిగా పూర్ణిమ "నేను ఏమీ అనుకోను లక్ష్మీ ! నా తమ్ముడిని మళ్ళీ నా ముందు నిలిపావు. ఏ విధంగా నీ ఋణం తీర్చుకోగలను ? గౌరి కి ఏలోటు రాకుండా చూసుకుంటానని మాట ఇస్తున్నాను" అన్నది కంట మళ్ళీ తిరుగుతున్న కన్నీటిని ఆపుకునే ప్రయత్నం చేయకుండా.
తల్లి "లక్ష్మీ ! అమ్మాయిని ఇంటి దగ్గర దిగవిడచి పూర్ణిమ తండ్రికి ఈ విషయం చెప్పి ఆయన అనుమతి తీసుకో ! శుభస్య శీఘ్రం !" అన్నది.
సర్వే జనా సుఖినోభవంతు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి