ఊహాతీతం@

ఊహాతీతం

సుందరి పడుతూనే అందరిలా ఏడవలేదు
నవ్వుతున్నట్టే ఉంది కళ్లు మూసుకుని డాక్టర్లకి నర్సులకు 
తీసుకువచ్చి తల్లి రాణి దగ్గర పడుకోపెట్టిన నర్స్ మీరు చాలా అదృష్టవంతులు ఏడవకుండా నవ్వే పాప పుట్టింది అని చెప్పింది 
పెద్దవుతున్నకొద్ది సుందరి ఏడ్చింది వేళ్లమీద లెక్క పెట్టవచ్చు
టివిలో వచ్చే హాస్యప్రోగ్రాములు చూస్తు విరగబడి నవ్వేది 
తల్లి సుందరి మొదట్లో సంతోషించినా తరువాత బెంగ పెట్టుకుంది-ఆడపిల్ల ఇలా నవ్వుతే రేపు కాలేజి పెళ్లయ్యాక అత్తవారు ఏమనుకుంటారు అని
సుందరిని మందలించినా పోమ్మా నవ్వు వస్తే నవ్వక ఏమి చెయ్యమంటావు అని అనేది
తండ్రి ఆమెని సమర్ధించేవాడు అలా హాయిగా నవ్వడానికి పెట్టి పుట్టాలి అని——

స్కూలు లో  గర్ల్స్ ఓన్లీ అవడం వలన పెద్దగా సమస్య కాలేదు. టీచర్లు కూడా పేరెంట్స్ మీట్ లో కంప్లైంట్ లు చేసేవారు కాదు. 
సుందరి చదువులో టాప్ అవడం వలన అందరికీ ముద్దుగానే ఉండేది. టెన్త్ లో స్కూలుకే కాక జిల్లా ఫష్టు, స్టేట్ మూడో ర్యాంకులో పాసయే సరికి ఆమె నవ్వు పెద్ద ఎస్సెట్ అయిపోయింది.  ఇంటర్ మీడియేట్ పేరు మోసిన కాలేజ్ వారు కోరి ఫీజు పూర్తి రాయితీ ఇచ్చి చేర్చుకున్నారు. అందరితో స్నేహంగా నవ్వుతూ మాట్లాడే సుందరికి రెండు సంవత్సరాలలోనూ ఏ సమస్యా ఎదురు కాలేదు. అందరూ ఊహించినట్లే ఇంటర్ లో స్టేట్ ర్యాంకు తెచ్చుకుని ఎంట్రన్స్ లో సులువుగా ఎమ్ బీ బీ ఎస్ లో సీటు తెచ్చుకుంది. 

మెడికల్ కాలేజ్ లో క్లినికల్ సైడ్ కి వచ్చాక వార్డులలో పేషెంట్లు వింతగా చూసేవారు. ప్రొఫెసర్లు కూడా కొంతమంది ముఖం చిట్లించే వారు.  కానీ తోటి స్టూడెంట్స్ అలవాటు అవడం వలన ఆమె నవ్వుని పట్టించుకునేవారు కాదు. పెథాలజీ ఎగ్జామ్స్ అయిపోయిన తరువాత రోజు అకస్మాత్తుగా ఫిట్ వచ్చి పడిపోయింది సుందరి. 
బ్రైట్ స్టూడెంట్ అవడంవలన ప్రొఫెసర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అన్ని టెస్టులు చేశారు. మెదడులో డీప్ గా కణితి ఉన్నదని టెస్టులలో తేలేసరికి స్నేహితులంతా నిర్ఘాంతపోయారు, ప్రొఫెసర్లు కంగారు పడ్డారు, తల్లి దండ్రులు కుప్పకూలిపోయారు .

కాలేజ్ వారు స్పెషల్ కేస్ గా బెంగళూరు  NIMHANS కి పంపించారు.  అక్కడ అన్ని స్కాన్లు తీసి స్టడీ చేసిన స్పెషలిస్ట్ లు విస్తుపోయారు. మనిషి మెదడులో ప్రతి పనికి ఒక సెంటర్ ఉంటుంది.  సుందరికి నవ్వు సెంటర్ దగ్గరలో ఆ కణితి ఉన్నదని టెస్టులు కన్ఫర్మ్ చేశాయి.  ఎలా ట్రీట్ చెయ్యాలా అని స్టేట్స్ లో మేయో క్లినిక్ తోనూ, లండన్ ఇంపీరియల్ కాలేజ్ తోనూ సంప్రదించారు. చివరికి స్టీరియో టాక్టిక్ రేడియో సర్జరీ సరైనదని అందరూ ఏకగ్రీవంగా నిర్ణయించారు.  లండన్ లో పెద్ద న్యూరో ఆంకాలజిస్ట్ సుందరి కోసం ప్రత్యేకంగా వచ్చి సర్జరీ చేశాడు. 
సర్జరీ ముందు సుందరి తల్లి దండ్రులతో విపులంగా మాట్లాడాడు.  ఆ ఆపరేషన్ అనంతరం ఫిట్స్ తగ్గే అవకాశం ఉన్నా మళ్ళీ రావచ్చుననీ, మందులు జీవితాంతం వాడాలనీ చెప్పాడు. అంతే కాక నవ్వు సెంటర్ దగ్గర ఉండడం వలన కండిషన్ ఆపరేషన్ వలన తగ్గచ్చు, లేక వేరే రకంగా మారచ్చు అని కూడా హెచ్చరించారు.  తల్లి దండ్రులు బరువైన హృదయాలతో అంగీకారం తెలిపారు.

ఆపరేషన్ అనంతరం సుందరి చక్కగా కోలుకుంది. ఇదివరకు లాగ తరచుగా నవ్వే అలవాటు పోయింది.  కానీ ఫిట్స్ కోసం వాడే మందుల వలన జ్ఞాపక శక్తి తగ్గి మెడికల్ కాలేజ్ డిస్కంటిన్యూ చేసింది. 

టీ సీ తీసుకున్న రోజున భోరుమని ఏడుస్తుందనుకుంటే ఇంటికొచ్చి విరగబడి నవ్వింది.  ఆ తరువాత కొన్ని సంఘటనల వలన వారికి సందర్భానికి తగని టైమ్ లో ఆమె నవ్వుతుందని అర్ధం అయ్యింది.  ఇంక ఆమె జీవితం ఎలాగ?  అని ఆలోచిస్తూ ఉండగా ఆమెకు సరైన ఉద్యోగం వచ్చి ఆంధ్ర దేశంలో పేరు మారుమోగి పోయింది.  ఆ ఉద్యోగం ఈ టీ వీ లో "జబర్దస్త్ " ప్రోగ్రాం లో జడ్జి  ! ఆమె పేరు రోజా సుందరి !!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఒక పౌర్ణమి కథ

అక్కరకొచ్చిన_అనుభవం

నేనున్నా నీకు రక్షణ @