నేస్తం@

నేస్తం

కిటికీ దగ్గర మంచం మీద కూర్చుని బయటికి నిస్తేజంగా చూస్తున్న హరీష్ ని చూసి శారద మనసు విలవిలలాడింది. 

"హరీ ! ఇంకా అంగదుడు కనిపించలేదా  ?"

"లేదమ్మా  ! ఇవాళ నాలుగో రోజు  ! ఆ కొండముచ్చులు రాకపోతే అంగదుడూ నేను హాపీగా కబుర్లు చెప్పుకునేవారం ! " విచారంగా బదులిచ్చాడు ఆరేళ్ల హరీష్. 

థలసిమియాతో బాధ పడుతున్న హరీష్ ఇంట్లోనే ఉండి చదువుకుంటున్నాడు. చురుకైన వాడు.  చదువుకున్న తర్వాత హరీష్ టైమ్ అంతా అంగదుడితో గడిచి పోతుంది.  అంగదుడంటే హరీష్ కి బాగా చనువైన ఉడత. చిన్న పిల్లగా ఉన్నపుడు కిటికీ దగ్గర ఆడుతుండగా హరీష్ వేరుశెనగ పప్పు, ఆక్రూట్ పప్పులు పెట్టి మచ్చిక చేసుకున్నాడు. ఆ తర్వాతే హరీష్ ఆరోగ్యం లో మంచి మార్పు కనబడింది

 అటువంటిది ఓ రోజు కొండముచ్చుల గుంపు వెంటబడితే  భయపడి పరిగెత్తాడు అంగదుడు. దానివెంట ఓ నాల్గు కొండముచ్చులు పడ్డాయి. ఆ తర్వాత మళ్ళీ దాని ఆచూకీ తెలియలేదు. శారద ఎంతో బాధపడింది.  హరీష్ ఆరోగ్యం దిగజారుతుందేమోనని బెంగ కూడా పెట్టుకుంది.

దానికి తగ్గట్లే  సాయంత్రం అయ్యేసరికి కొంచెం ఒళ్లు  వెచ్చబడడం మొదలయ్యింది.  దానితో ఇంకా బేజారెత్తి పోయింది.  భర్త రాజు కూడా కంగారు పడ్డాడు.  పెట్ హౌస్ లో ఏదైనా ఉడత దొరుకుతుందేమోనని ప్రయత్నం కూడా చేశాడు. ఉడత తప్ప మిగతా జంతువులు చాలా ఉన్నాయి.

చెక్ అప్ కి వెళ్తే టెస్టులు చూసి డాక్టర్ కూడా కంగారు పడ్డాడు.  రెడ్ బ్లడ్ సెల్స్ తగ్గిపోయాయి, ఒక్క రెండు రోజుల తర్వాత చూసి అవసరం అయితే బ్లడ్ ఎక్కించాలి అన్నాడు.

శారద దుఃఖానికి అంతే లేదు. ఆ రాత్రి ఎలాగో అలాగు హరీష్ ని నిద్ర పుచ్చి అర్ధరాత్రి తర్వాత నిద్రపోయిన శారద సూర్యోదయం అయ్యాక తుళ్ళి పడి లేచి హరీష్ మంచం వైపు చూసి మంత్రముగ్ధురాలై పోయింది.  

అంగదుడు ఉన్నపుడు కన్నా ఎక్కువ హడావిడిగా ఉంది. హరీష్ పకపకా నవ్వుతున్నాడు. 

అంగదుడితో పాటు ఇంకొక ఉడత కూడా హరీష్ మంచం మీద పరుగులు పెడుతోంది.  "అమ్మోయ్ ! అంగదుడి వెంట వాడి గర్ల్ ఫ్రెండ్ కూడా వచ్చింది చూశావా ?" అంటూ మంచం మీద పొర్లిగింతలు పెడుతున్నాడు హరీష్ !!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఒక పౌర్ణమి కథ

అక్కరకొచ్చిన_అనుభవం

నేనున్నా నీకు రక్షణ @