మదర్స్ డే @
మదర్స్ డే
శనివారం షాపింగ్ మాల్ లో రెడీమేడ్ సెక్షన్లో ఎదురుపడ్డ సంజనని సంభ్రమంగా పలకరించింది సుభాషిణి. "హాయ్ ! సంజనా ! ఏమిటి తీరికగా షాపింగ్ కి వచ్చావ్ ! ఏమిటి విశేషం ?" అంది.
చిరునవ్వుతో "రేపు ఆదివారం మదర్స్ డే కదా అమ్మకి గిఫ్టు కొందామని వచ్చాను" అన్నది సంజన.
సంజన, సుభాషిణి ఒకే సాఫ్ట్ వేర్ కంపెనీ లో సహ ఉద్యోగినులు. సరిగ్గా వారం రోజుల క్రితమే ఆ కంపెనీలో చేరినా ఆజన్మస్నేహితురాళ్ళలాగా కలిసిపోయారు.
"కొనడం అయిపోయిందా ? కొనాలా ?" అన్న సుభాషిణితో "అయిపోయింది సుభా! ఇంకా ఇంటికి వెళ్లిపోదామనుకుంటుండగా నువ్వు కనిపించావు. పద ఫుడ్ కోర్ట్ కి వెళ్లి కాస్త కాఫీ తాగుదాం" అంది సంజన.
కాఫీ ఆర్డర్ ఇచ్చాక కుతూహలంగా అడిగింది సుభాషిణి "ఇంతకీ ఏం కొన్నావు మీ అమ్మగారికి గిఫ్టు ?"
మెరిసే కళ్ళతో చెప్పింది సంజన "లేటెస్ట్ ఫ్యాషన్ సూట్ , పార్కర్ పెన్ సెట్టూనూ"
"అమ్మగారికి సూట్ ఏమిటి సంజనా ?" ఆశ్చర్యంగా అడిగింది సుభాషిణి.
"నీకు చెప్పలేదు కదూ ? నేను అమ్మ అనేది అమ్మ కాదు. నాకు ఏడేళ్ళ వయసులో తెలిసీ తెలియని వయసులో అమ్మ పోయింది. ఆ తర్వాత అమ్మ అన్న లోటు లేకుండా పెరిగానంటే ఈ అమ్మ వలనే" అంది సంజన.
"నిజమా ? చాలా సారీ సంజూ ! నీ మనసేమైనా కష్ట పెట్టానా ?" అంది సుభాషిణి
"ఛీ ఛీ! లేదే ! ఆ విషయం గురించి బాధ లేకుండా పెంచింది ఈ అమ్మ అని చెప్పానుగా !" అంది సంజన.
"అయినా నా ప్రశ్న అలాగే ఉండిపోయింది. ఆడవారికి సూట్ ఏమిటీ ? పట్టు చీరల సెక్షన్ వేరే ఉందిగా ?" అంది సుభాషిణి.
పకపకా నవ్వుతూ "ఇంతకీ అమ్మ అంటే ఆడది అనుకున్నావు కదూ ? కాదే! నేను మా నాన్నని అమ్మా అని పిలుస్తాను, నన్ను మా అమ్మ నాన్నా అని పిలుస్తాడు!" అంది సంజన.
పల్చని కన్నీటి పొర అడ్డు రాగా స్నేహితురాలి వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది సుభాషిణి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి