బన్నీ@


బన్నీ

"బన్నీ ! నీ రూమ్ ఒక పెద్ద మెస్ ! అడుగు పెట్టడానికి టెరర్ వచ్చేస్తోంది. ఎక్కడ మొదలెట్టి ఏ రూట్లో వెళ్ళాలో ఐ యామ్ అబ్సొల్యూట్లీ ఇన్ డార్క్. సర్దుదామంటే నా వల్ల కాలేదు. నువ్వు ఆడుకునేటప్పుడు తీసిన బొమ్మలు, పుస్తకాలు పనైపోగానే అక్కడే పెట్టెయ్యమని ఐ టోల్డ్ యూ ధౌజండ్స్ ఆఫ్ టైమ్స్ !"
పదేళ్ళ కొడుకు మీద ఫైరైపోతోంది వత్సల.

కోరగా తల్లి వైపు చూసి తను చేస్తున్న పని కంటిన్యూ చేశాడు బన్నీ అనబడే బంగారుబాబు.

"ఏం చేస్తున్నావు? ఇంకో కోతి పనేమీ కాదు కదా ?" అంటూనే "కెవ్వు" న కేక పెట్టింది వత్సల.

"ఓ మై గాడ్ ! అది డాడీ పాస్ పోర్టురా ! భగవంతుడా ! ఏమిటీ పరీక్ష నాకు ?" కళ్ళ నీళ్ళ పర్యంతమై గభాలున బన్నీ చేతిలో నుంచి భర్త గిరిధర్ పాస్ పోర్ట్, దానితో పాటు మార్కర్ పెన్ లాగేసుకుంది. ఒక్క క్షణం ఆలస్యమైతే గిరిధర్ ఫోటోకి మీసాలు వచ్చేసేవి.

"యూ మొరోన్ ! ఇంబెసిల్ ! ఆ ఫోటో పాడైతే డాడీ కంపెనీ వాళ్ళు పింక్ స్లిప్ కూడా ఇవ్వకుండా ఊస్ట్ చేసేస్తారు. ఇప్పటికే ఒకసారి నీళ్ళలో తడిస్తే చచ్చీచెడి ఆఫీస్ వాళ్ళు కొత్తది తెప్పించారు. డాడీకి ఫైన్ కింద ఐదొందల డాలర్లు ఒదిలిపోయాయి తెలుసా ? నీ కోతి పనులు, టాంట్రమ్స్ భరించడం నా వల్ల కాదు." కీచుగొంతు వచ్చేసిన తల్లిని చూసి బన్నీ కేర్ లెస్ గా. "నా పనులు నీకు నచ్చకపోతే మనిద్దరం ఒకచోట ఉండకూడదు" అన్నాడు.

"ఐతే పోరా ! ఎక్కడికి పోతావో! నిన్ను భరించడం నాకే కాదు. ట్రంపుకి కూడా చేతకాదు " అంది రోషంగా వత్సల.

ధనధన చప్పుడు చేసుకుంటూ చెక్క మెట్లు ఎక్కి తన రూమ్ కి వెళ్ళాడు బన్నీ.

గిరిధర్, వత్సల కాలిఫోర్నియా, సాన్ యోసె లో ఉంటారు. బన్నీ ఒక్కడే. బాగా ముద్దు చేయబట్టి అల్లరి ఎక్కువ చేస్తాడు.

తెలివైన పిల్లాడే కాని ఒక్కోసారి అనూహ్యమైన తిక్క పనులు చేస్తాడు. వత్సల చాలా ఓపికగా భరిస్తూ ఉంటుంది కాని ఆరోజు పనికి అరికాలి మంట నెత్తికెక్కింది.

పైన గదిలో గట్టిగా చప్పుళ్లు వినిపిస్తున్నాయి. కొంచెం ఉత్సుకతతో ఎదురు చూస్తూ అక్కడే పది నిమిషాలు నిలబడింది.

ఓ సూట్ కేసు లాక్కుంటూ మెట్లు దడదడలాడించుకుంటూ వచ్చాడు బన్నీ.

"ఏమిటా సూట్ కేసు ? ఎక్కడకి వెళ్దామని ?" అసహనంగా అరిచింది వత్సల.

"ఈ అమెరికాలో నా వయసు వాడిని ఒక్కణ్ణే రోడ్ కూడా దాటనివ్వరని నాకు తెలుసు."

"ఐతే ? ఆ సూట్ కేసు ఏంటట?" కొద్దిగా అయోమయంగా అడిగింది వత్సల.

"అది నీ సూట్ కేసు. నీ బట్టలు సర్దాను. నువ్వే ఫో ఇంట్లో నుంచి" బుంగమూతి పెట్టి తర్జని చూపించాడు బన్నీ.

ఒక్క నిముషం మాట రాక ఉండిపోయిన వత్సల ఫక్కున నవ్వేసి చుట్టేసి ముద్దులు పెట్టేస్తోంటే తల్లిని బల్లిలాగ కరుచుకుపోయాడు బన్నీ !

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఒక పౌర్ణమి కథ

అక్కరకొచ్చిన_అనుభవం

నేనున్నా నీకు రక్షణ @