భద్రకాళి - భారత నారి
"లోపలికి పదా ! నీ జిమ్మడ ! గొంతు పిసికేసినప్పుడున్న ధయిర్నం ఏ సిమ్హాచలం కొండెక్కిందీ ? డాక్టరు బావుకి దణ్ణఁవెట్టు ! బుర్రకెక్కుతోందా ? ఇంకా మత్తు దిగనేదా ?"
తల మీద ఓ గుడ్డ గట్టిగా అదిమిపెట్టి పెనిమిటిని లోపలకి తోసుకుంటూ ఒచ్చింది పైడిపల్లి. పాత పేషెంట్లే ! హాస్పిటల్ రోడ్ చివర్లోనే అపార్ట్మెంట్ లో వాచ్ మాన్ గా చేస్తాడు అప్పలకొండ. భార్య ఇస్త్రీ బండి నడుపుతూంటుంది.
"బావూ ! ఈడి బుర్ర పగిల్నాది. రగతం ఆగట్నేదు. కుట్లేయాలంటారా ? కుసింత సూడు బావూ "
గబగబా డ్రెస్సింగ్ రూమ్ లోకి తీసుకెళ్లి టేబుల్ మీద పడుకోబెట్టి జుట్టుకంటిన రక్తం తుడిచి చూద్దును కదా ! ఓ నాలుగంగుళాల గాయం. నర్సుతో కుట్లు వేసే సరంజామా సిద్ధం చెయ్యమని చెప్పి చేతులు సబ్బు తో శుభ్రం చేసుకుంటూ పైడితల్లి దగ్గర వివరాలు సేకరించాను.
రోజూలాగనే సాయంత్రం ఏడు గంటల వేళ డ్యూటీ నుంచి జారుకుని పక్క వీధిలో బెల్ట్ షాప్ కి వెళ్లి గబగబా రెండు పెగ్గుల మందు తాగేసే సరికి పాత నేస్తం ఒహడు కనబడి ఇంకో రెండు పెగ్గులు పోయించాడట. ఇంకేం ! డోసెక్కువై ఇంటికొచ్చి చేపల పులుసు చెయ్యలేదని పైడితల్లి పీక పిసకబోయాడుట.
ఉక్కిరిబిక్కిరై చేతులో ఉన్న మూకుడుతో తల మీద ఒక్కటిచ్చుకుంది. దెబ్బతో మత్తు దిగిపోయి లబోదిబోమంటుంటే నా దగ్గరకు లాక్కుని వచ్చింది.
*** ***** ***
కుట్లు వేసేశాక మందులు రాసిస్తూ కొంచెం హితబోధ చేశాను అప్పలకొండకి. "మందు మానెయ్యి ! నీకిద్దరు పిల్లలా ? వాళ్ళని పైకి తీసుకురావాలా లేదా ? ఈ అలవాటు వలన జేబూ, ఒళ్లు గుల్లౌతుంది కదా ! ....". బుద్ధిగా వంచిన తలని ఊపాడు అప్పలకొండ.
"బావు సెప్పింది సక్కంగ ఇనుకో ! మల్లీ మందేసి నా జోలికొస్తే నేనే నీ పీక పిసికేస్తా ! ఎరికైనదా ?" భద్రకాళిలా మళ్ళీ మీదకి రాబోయిన పెళ్ళాన్ని చూసి రెండడుగులు వెనక్కి వేశాడు పాపం మానవుడు.
*** **** ***
మర్నాడు సాయంత్రం వచ్చి కట్టు కట్టించుకున్నాడు అప్పలకొండ. పైడితల్లి కొంచెం మొహమాట పడుతూ వచ్చింది. "కుట్లు బాగానే ఉన్నాయి. చీమేమీ లేదు. ఏడో రోజున కుట్లు తీసేద్దాం " అన్నాను.
బయటికెళ్ళిన పైడితల్లి మళ్ళీ లోపలకి వచ్చింది. కళ్ళలో నీటిపొర ! "బావూ ! ఏమీ పర్నేదు గందా ? బుర్రకి పెద్దఫోటో తీయించమంటవా? ఆడికేమైనా అయితే నేను తట్టుకోలేను బావూ ".
"ఆహా ! భారత నారి !!" అని మనసులోనే అనుకున్నా.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి