కాకతాళీయం @



కాకతాళీయం

అర్జెంట్ పనిమీద మిత్రుడు మురళి ని తీసుకుని ఏలూరు రోడ్డు మీద గవర్నర్ పేట నుంచి గుణదల పడవల రేవు సెంటర్ కి జోరుగా యాక్టివా మీద పోతున్న రామారావుకి చుట్టుగుంట సెంటర్ దగ్గర సడన్ బ్రేక్ వేశాడు బాబాయి(అదే పోలీసు బాబాయి).
"ఏంటి సార్ ! రెడ్ లైటు చూస్కోరా ? లేకపోతే ఫాష్ట్ గా వెళ్లి పోతే నేనాపలేనని ధీమానా ?" కొంచం మర్యాద, బోలెడు వెటకారం రంగరించి హుంకరించాడు ఎంకట సామి.
"సారీ సార్ ! అర్జెంట్ పని ఉండి ఆ ఆలోచనలో సిగ్నల్ చూళ్ళేదు సాఆఆర్ !" ఏడుపు తక్కువ బతిమాలే స్వరంలో వేడుకున్నాడు రామారావు.
"అర్జెంట్ ఐతే ఇంకా ఎగష్ట్రా జాగర్త లో పోవాలి గదా సార్ ! ఫోటో తీసుకునుంటే తర్వాత వెళ్లి మీ సేవ లో ఫైను కట్టుకునే పని. నాకు సమయానికి సెల్ హాంగ్ అయింది, మీరు నాకు హాండోవర్ అయారు ! ఇప్పుడు చలానా చించాలంటే ఓ పావుగంటైనా పడుతుందే ! పాపం !" అని కొంచెం హాస్యం కూడా మిళాయించాడు ఎంకట సామి.
"మరి నా ముందు వెళ్ళిపోయిన హీరో పాషన్ ప్లస్ బండీని ఆపలేదేం సార్ ?" ఉక్రోషంగా అడిగాడు రామారావు.
"ఆడికి టైం బాగుంది సార్ ! నేనాపేలోపే జంప్ !" అని "ఐనా వాడి నంబర్ కూడా నోట్ చేసుకోలేనంత రాష్ గా పొయ్యాడు." అన్నాడు బాబాయి.
"నేను చెప్పనా ? " ఆవేశంగా రామారావు.
"ఏం ! మీకు దివ్య దృష్టి ఉందా ?" వెటకరించాడు వెంకట సామి.
"దివ్య దృష్టి కాదు, తీవ్ర దృష్టి ఉంది. రాసుకోండి" అని నుదుటి మీద అరచెయ్యి ఆనించి, కళ్ళు చికిలించి ఓ రెండు సెకండ్లు చూసి "ఏపీ బీజెడ్ 0966 " అని కావాలిస్తే మాచవరం డౌన్ దగ్గర కానిస్టేబుల్ ని ఆపమని చెప్పండి"అన్నాడు దృఢంగా చెప్పాడు రామారావు.
బాబాయి, మురళీ నోరు తెరిచేశారు. బాబాయి ముందుగా తేరుకుని ఫోను తీసి టకటక నంబర్ నొక్కి ఆ సమాచారం చిన్న బాబాయికి చెప్పాడు.
"సార్ ! ఇది కనక కరెక్ట్ ఐతే చలానా రాయను. మీ అవసరం ఏమైనా ఉంటే నాకు చెప్పండి చేస్తాను" సెమీ గౌరవం తో పెద్ద బాబాయి.
నిముషం లోపలే చిన్న బాబాయి గొంతు ఉత్సాహంగా సెల్ లో వినబడే సరికి రామారావు మురళి కేసి చూసి కన్ను మలిపాడు.
బాబాయి సగౌరవంగా వీడుకోలు పలికాక హుషారుగా వెళ్లి పోతుంటే మారుతీనగర్ ఆంధ్రా బ్యాంకు దగ్గరకొచ్చాక తేరుకున్న మురళి "ఈ తీవ్ర దృష్టి గురించి నాకింతకు ముందు చెప్పలేదేంరా ?" అన్నాడు నిష్టూరంగా.
"తీవ్రదృష్టీ లేదు, తొక్కదృష్టీ లేదు. ఆ పాషన్ ప్లస్ బండీ నాదే ! నెల రోజుల క్రితమే అమ్మేసి ఈ బండీ కొన్నాను. ఇందాక ఆ సిగ్నల్ కి అవతలే మనలని రాష్ గా ఓవర్ టేక్ చేసి పోయాడు. అప్పుడు గమనించాను. ఆ బండి నంబర్ గుర్తు ఉండడం మంచిదైంది.!" పకపకా నవ్వాడు రామ్రావ్ !!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఒక పౌర్ణమి కథ

అక్కరకొచ్చిన_అనుభవం

నేనున్నా నీకు రక్షణ @