తీరిన పగ@

తీరిన పగ

కళ్ళు మసకలు కమ్ముతుండగా పీలగా ఆ గొంతు నుంచి వచ్చిన మాట : "ఇంత ద్రోహం చేస్తావని కలలో కూడా ఊహించలేదు ". ఆ వెంటనే స్పృహ తప్పిపోయింది !

******

ఆనంద్ చెన్నై టీ సీ యస్ లో సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా రెండు నెలల క్రితమే చేరాడు. సులోచనారాణి హీరో రాజశేఖరం అంత కాకపోయినా నదరుగానే ఉంటాడు. తల్లిదండ్రులు చాలా కాలం క్రితమే గతించడంవలన ఒక్కడే ఉంటూ కుదిరినప్పుడు వంట చేసుకుంటూ, కుదరనపుడు ఆఫీస్ క్యాంటీన్లోనో, ప్యారీస్ కార్నర్ లో తనకి ఇష్టమైన ఆంధ్రా భోజన హోటల్ కి వెళ్ళో కడుపు నింపుకుంటూ ఉంటాడు.

ఆనంద్ చేరిన రెండు నెలల తర్వాత అతని టీమ్ లోకి వచ్చిన వల్లిని మొదటి చూపులోనే గాఢంగా ఇష్టపడ్డాడు. ఆమె అతని కన్నా ఆరేళ్ళు చిన్నదైనా బీ టెక్ కంప్యూటర్ సైన్స్ లో గోల్డ్ మెడలిస్ట్ అవడం వలన టీ సీ యస్ వారి క్యాంపస్ ఇంటర్వ్యూలో టాపర్ గా ఉద్యోగం సంపాదించుకుంది. మల్టీ నేషనల్ కంపెనీలు కాదనుకుని ఇండియా కంపెనీలోనే చేరతానని పట్టుబట్టి చేరిందని తెలిసి ఆశ్చర్యపడ్డాడు ఆనంద్. తన ఊరికి దగ్గరలోనే వాళ్ళ ఊరు కూడా అని తెలిసి అబ్బురపడ్డాడు. తన కులమే అని తెలిసి ఆనందపడ్డాడు.

********

వారి మధ్య పరిచయం కాస్తా సాన్నిహిత్యం అక్కడ నుంచి ప్రేమలోకి దారితీయడానికి అట్టే రోజులు పట్టలేదు. పార్కులు, షికార్లు, సినిమాలూ, స్వీట్ నథింగ్స్ ఇవన్నీ సినిమా వేగంతో గడిచి ఒక రోజున ఆనంద్ ఆమెకు తన ఇష్టాన్ని వెల్లడించి పెళ్ళి చేసుకుంటానని ప్రపోజ్ చేశాడు. వల్లి కూడా వెంటనే ఊఁ అన్నది.

తన తల్లి దండ్రులు కూడా చిన్నప్పుడే పోయారనీ, తన బామ్మ దగ్గర పెరిగాననీ ఆవిడ కూడా గత ఏడాదే గతించడం వలన ఒక్కదానినే పేయింగ్ గెస్ట్ గా ఇంకొక స్నేహితురాలితో ఉంటున్నాననీ చెప్పింది.

రిజిస్టర్ పెళ్ళా, గుడిలో పెళ్ళా అని తర్జనభర్జనలు పడి ఆనంద్ సింపుల్ గా దివ్య జ్ఞాన సమాజంలో ఒకటౌదామని అన్నాడు. సరేనన్నది వల్లి.

*******

బీచ్ ఒడ్డున కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుతూ పెళ్ళి ఏర్పాట్ల గురించి ఆనంద్ చెప్తూంటే వల్లి కన్నార్పకుండా అతనినే చూస్తూ ఉండిపోయింది. ఆనంద్ కొంచెం సేపు తరువాత అది గమనించి చిరునవ్వుతో "ఏమిటి వల్లీ ! అంత తదేకంగా చూస్తున్నావు ?" అన్నాడు.
"ఏమీ లేదు, ఇంత ఉత్సాహంతో ఏర్పాట్లు చేస్తున్నారు, నేనేమీ చేయలేక పోతున్నాను. నా వలన ఏమైనా కావాలంటే చెప్పండి చేస్తాను" అన్నది వల్లి.
"ఒక్క ముద్దు ఇవ్వు చాలు !" అన్నాడు ఆనంద్ చిలిపిగా.
చుట్టూ చూసింది వల్లి. ఆదివారం కాకపోవడం వల్ల, జనాలు పల్చగా ఉన్నారు.
"అయితే కళ్ళు మూసుకోవాలి ! నేను చెప్పేదాకా తెరవకూడదు. చేతులు వెనక్కి పెట్టుకోవాలి" అన్నది వల్లి.
"ఊఁహూ ! ఈ కండిషన్ నాకు వల్లకాదు అన్నాడు ఆనంద్ అల్లరిగా.
"అయితే ముద్దు కూడా నా వల్ల కాదు" అన్నది వల్లి బుంగమూతి పెడుతూ.
"సరే అయితే !" అని చేతులు వెనక్కి మడిచి పెట్టుకుని కళ్ళు మూసుకున్నాడు ఆనంద్.
"తెరిస్తే పెళ్లి పోస్ట్ పోన్ ! సరేనా ?" అన్నది వల్లి కవ్విస్తూ.
"తప్పుతుందా !" అన్నాడు ఆనంద్ కొంచెం నీరసంగా.
ఒక నిమిషం అయింది రెండు నిముషాలు అయింది. పెదవుల మీద ఆమె ముద్ర కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న అతనికి గొంతు చర్రుమని మండిపోవడంతో అప్రయత్నంగా కళ్ళు తెరిచి గొంతు తడముకున్నాడు ఆనంద్.
బుస్సని పొంగుతున్న రక్తం అతని చేతుల్ని, షర్ట్ ని కూడా తడిపే‌స్తూ ఉండగా భద్రకాళి లాగా చేతిలో పదునైన చాకుతో కనిపించింది వల్లి.

*******

పోలీస్ స్టేషన్ లో నిబ్బరంగా కత్తిని చేత పట్టుకుని ఉన్న వల్లిని సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆశ్చర్యంగా, సాలోచనగా పరికించాడు.

బీచ్ లో ఆనంద్ శరీరం నిర్జీవం అయిన పది నిమిషాల దాకా అక్కడ పల్చగా ఉన్న జనం ఎవ్వరూ పట్టించుకోలేదు. పల్లీ మిక్స్చర్ అమ్ముకునే అతనొకడు గమనించి గావుకేకలు పెట్టేసరికి కొంచెం సేపట్లోనే చాలా మంది జనం పోగయ్యారు. ఆమె వద్దకు వెళ్లే సాహసం చేయలేకపోయారు. పావుగంట తర్వాత సైరన్ మోగించుకుంటూ పోలీసు వాహనం, అంబులెన్స్ వచ్చాయి. ఫోటోలు తీసుకున్న తర్వాత ఆమె పోలీసులతో "నేను లొంగిపోతున్నాను, పారిపోయే ఆలోచన లేదు" అన్న తర్వాత ఇన్స్పెక్టర్ బేడీలు వెయ్యకుండానే ఆమెను జీప్ ఎక్కించాడు.

"మీరు బ్రిలియంట్ కంప్యూటర్ ఇంజనీర్ ! పెళ్ళి జరగవలసిన కొద్ది రోజుల ముందు కాబోయే భర్త మీద ఈ దురాగతం ఎందుకు చేశారు ?" అని అడిగాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంగ్లీష్ లో.

"అతను నా భర్త అవుదామని ఆశ పడుతున్నాడు. కానీ నాకు ఆ మృగానికి భార్యని అవుదామన్న ఆలోచన ఏ మాత్రం లేదు." అన్నదామె.

"కొంచెం వివరంగా చెప్పండి ! నా సర్వీస్ లో ఇటువంటి సంఘటన మొదటి సారి" అన్నాడు ఇన్స్పెక్టర్.

మూడు సంవత్సరాల క్రితం మేమంతా వైజాగ్ లో ఉండే వాళ్ళం నేను, అమ్మ, నాన్న, నా అక్క మంజుల ! తను కూడా బ్రిలియంట్. ఇంజనీరింగ్ లో ఈ సీ ఈ టాపర్. అప్పుడు ఈ ఆనంద్ తన క్లాస్ మేట్. ప్రేమించాను అని చెప్పి పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతి చేశాడు.

ఆ తర్వాత పెళ్ళి గురించి అడిగితే మొహం చాటేశాడు. మా అక్క చాలా ధైర్యస్తురాలు. బెదిరించి నలుగురిలో బయటపెట్టి పరువు తీస్తానని బెదిరిస్తే, నా అంతస్తు కి మీ కుటుంబం తూగదని కుండ బద్దలు కొట్టి చెప్పాడు.

ఇంటికి వచ్చేసిన అక్క ఈ విషయం నాకు చెప్పి ఏడ్చేసింది.
ఆ తర్వాత రోజున నిర్మానుష్యంగా ఉన్న పాత భవనం పెరట్లో అక్క శవం కనబడింది. చున్నీ తో గొంతు బిగించి చంపారని అటాప్సీ లో తేలింది. మూడు నెలల గర్భవతి అని కూడా తెలిసింది.

అమ్మా నాన్నలు ఇది తట్టుకోలేక మూడు నెలల వ్యవధిలో ఒకళ్ళ తరవాత ఒకరు పోయారు. ఉన్న ఒక్క ముసలి బామ్మ తోడుగా ఉండగా పట్టుదలగా చదివి ఇంజనీరింగ్ టాపర్ గా పాస్ అయ్యాను. ఈ లోపు ఆనుద్ గురించి వాకబు చేస్తూనే ఉన్నాను.

అతను చెన్నై టీ సీ యస్ లో ఉద్యోగం చేస్తున్నాడని తెలిసి పట్టుదలతో ప్రయత్నించి అక్కడే ఉద్యోగం సంపాదించుకున్నాను. నేను అనుకున్న దానికన్నా తేలికగానే అతనిని నమ్మించి పెళ్ళి వరకూ తీసుకొచ్చాను. నాకు ఉన్న ఒక్క బామ్మ ఆరు నెలల క్రితం చనిపోయింది. వాడిని నమ్మించి గొంతు కోసినందుకు గర్వపడుతున్నాను. ఇంక నాకు ఏమైనా ఫర్వాలేదు. ఉరిశిక్ష కి కూడా సిద్ధం !"
అంటున్న వల్లిని చూసి అవాక్కైపోయాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ !!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఒక పౌర్ణమి కథ

అక్కరకొచ్చిన_అనుభవం

నేనున్నా నీకు రక్షణ @