ఇల్లాలు@
ఇల్లాలు
భార్య మణి మంచం పక్కనే కుర్చీ వేసుకుని కూర్చున్న చంద్రమోహన్ ఆమె రెండు చేతులూ తన చేతుల్లోకి తీసుకొని మృదువుగా నిమురుతున్నాడు.
గుండెలో దావాగ్ని మండుతున్నా, పెదాలమీద చిరునవ్వు చెరగలేదు.
మణి కూడా శరీరం శుష్కించి పోయినా కళ తప్పని మొహంలో మందహాసం తగ్గనివ్వలేదు.
"ఇంకా ఎన్ని రోజులన్నారు డాక్టర్ గారు ?"
"రెండు లేకపోతే మూడు రోజులు అన్నాడు" నిర్వేదంతో బదులిచ్చాడు చంద్రమోహన్.
"మీరూ త్వరగా వచ్చెయ్యండి, లేకపోతే నాకు తోచదు. మనం చేసుకున్న ఒప్పందం గుర్తుందిగా?"
"మర్చిపోతే కదా మణీ ?"
"త్వరగా ఎందుకు రమ్మన్నానో తెలుసా ? మీరు కూడా వచ్చేసి ముందు మీరు పుట్టెయ్యాలి ! ఆ తర్వాత నేను ! లేకపోతే లెక్క తేడా వస్తుంది !"
ప్రశ్నార్ధకంగా చూసిన భర్త మొహంలో అయోమయాన్ని చూసి పరిహాసంగా"నేను ఎప్పుడూ పాడుకునే, నాకెంతో ఇష్టం ఐన పాట ఏమిటి ?" అనడిగింది.
వెంటనే గుర్తుకొచ్చింది చంద్రమోహన్ కి.
చిన్నగా నవ్వుతూ"గుర్తొచ్చింది, ఇల్లాలు లో పాటేగా ?"
"ఒక్కసారి చిన్నగా పాడరూ ?"
జీరపోయిన గొంతు ఒకసారి సవరించుకుని
"నీవు నా ఊహలందే నిలిచావూ,
నేను నీ కళ్ళలోనే వెలిశానూ!
వేయి జన్మాలకైనా విడలేనూ ఊఊఊ,
నీ ఇల్లాలుగా నేనుంటాను,
నీకు ఇల్లాలుగానే ఉంటాను !"
మణి పాడే రెండు రకాలుగానూ మంద్రంగా పాడాడు చంద్రమోహన్.
శుష్కించిన చేతులతో అతని చేతులని మృదువుగా నిమురుతూ, "మీరు నా కన్నా ముందు పుట్టకపోతే మీ భార్యని అవడం ఎలాగు ?" అన్నది మణి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి