అనాలోచితం@

అనాలోచితం 
"సునీతా ! సాయంత్రం ఆఫీస్ తర్వాత అవుటాఫ్ స్టేట్ ఆడిటర్స్ తో బాసు మీటింగ్ పెట్టాడు. ఒక గంట లేటవుతుంది. ఒక్క దానివీ ఉండగలవా ? పోనీ సుజాత ఉంటుందా ? గంట అన్నాడు కానీ ఇంకా లేట్ అవచ్చు. ఎం సుజాతా ? నీకేమైనా ప్రాబ్లమా ? మామూలుగా అయితే ఒక్కర్తీ ఉండగలదు కానీ తన పరిస్థితి తెలుసు కదా ? ప్లీజ్ !"

"అదేమిటి బావా ! అంతగా ప్రాధేయ పడక్కర లేదు . ఇంటికి ఫోన్ చేసి చెప్తానులే. ఇవాళ రాత్రికి ఇక్కడ ఉండిపోతాను. లేట్ అయితే ఇక్కడనుంచి ఎల్ బీ నగర్ కి వెళ్లడం కూడా మంచిది కాదు. రాత్రి పూట అంత దూరం డ్రైవ్ చెయ్యడం డేంజర్." అన్నది మరదలు సుజాత 

మామగారు ఉండేది ఎల్ బీ నగర్. తాను ఉండేది అత్తాపూర్. సునీత కి యుటిరస్ ప్రాబ్లమ్ కి స్కానింగులు, టెస్టులు చేయించుకోవడంతో నీరసంగా ఉండడం వలన ఆ రోజు అక్కతో గడుపుదామని వచ్చింది సుజాత. ఎం టెక్ ప్రీవియస్ చదువుతున్నది. పెళ్లి ఇప్పుడప్పుడే ఒద్దని ఇంట్లో కరాఖండీగా చెప్పేసరికి మామగారు అల్లుడిని ఎలాగైనా ఒప్పించమని బతిమాలాడు. ఆ రోజు ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేసి సునీతతో కలిసి ఆమెని కన్విన్స్ చేద్దామని అనుకున్నమాధవ్ అనుకోని మీటింగ్ వలన కొద్దిగా నిరాశ పడ్డాడు. 

కాఫీ తాగేసి బై చెప్పి కారెక్కి బయల్దేరి వెళ్ళిపోయాడు మాధవ్. 

సుజాత "అక్కా ! ఇవాళ ఇంట సేపూ బావకి చేసింది చాలు. నువ్వు రెస్ట్ తీసుకో. వంట నేను చేసేస్తాను." అంటున్న చెల్లెలిని ఆప్యాయంగా చూస్తూ "అలాగే" అన్నది సునీత  

12 గంటలకల్లా వంట పూర్తి చేసేసి అక్క దగ్గరకి చేరిన సుజాత అక్క కన్నుల్లో నీరు చూసి కదిలిపోయింది. "అక్కా ! ఏమైంది ? బావగారితో ప్రాబ్లమా ? టెస్టుల రిపోర్టులు ఎప్పుడొస్తాయి ? బాగా నీరసంగా ఉన్నావు. కళ్ళ నీరు పెట్టుకోకు. ఇంకా నీరస పడతావు." అంటున్న చెల్లెల్ని చూసి చిరునవ్వుతో " బావగారితో ప్రాబ్లమేమిటే . ఆయన సంగతి తెలియదా ? కన్నుల్లో పెట్టి చూసుకుంటారు. పెళ్ళై ఎనిమిదేళ్ళయినా పిల్లలు పుట్టలేదని బాధ పడుతుంటే ఎంత ఊరడించే వారో నీకు తెలియదు. టైము రావాలి సునీ ! అని ధైర్యం చెప్పేవారు. ఇంకా నేను పోరి సాధిస్తే ఈ టెస్టులన్నీ చేయించారు. వీటికి ముందు ఆయన టెస్టులు చేయించుకున్నారు తెలుసా ? మగవాడికి టెస్టులు తేలిక. ఆడవారికి శ్రమతో కూడిన పని. నాలో లోపం ఉంటే నేనే ట్రీట్మెంటు తీసుకోవచ్చు కదా అన్నారు. అంత ప్రేమ ఆయనకి." అన్నది సునీత.

" మరి ?" అన్న సుజాత తో "టెస్టులు చేయించుకున్నాక డాక్టర్ ఛాయతో మాట్లాడాను. నీకు ఛాయ తెలుసు కదా ? నేనంటే బహు శ్రద్ధ. ట్యూబులలో ప్రాబ్లమ్ లాగ అనిపిస్తోంది. హార్మోన్లు కూడా ఎగుడు దిగుళ్ళు గా ఉన్నది. పూర్తి రిపోర్టులు రానియ్యి అన్నది. నాకు అనుమానంగానే ఉన్నది పిల్లలు కలిగే యోగం లేదేమోనని." అని కావలించుకుని ఏడ్చేస్తున్న అక్కని స్థాణువై చూస్తూ ఉంది పోయింది సుజాత. 

"బావగారు తెలుసు కదా ఒక్కరే. మా అత్త,మామగారు పోయాక ఆయనని చంటి పాపలాగా కాపాడుకుంటే మూడు నెలలకి మనుష్యులలో పడ్డారు. ఆయనకీ పిల్లలంటే ముద్దు. ఆయనకి ఆ లోటు తీర్చలేకపోతానేమోనన్న ఆలోచన నన్ను పీల్చేస్తోంది ' అన్నది వెక్కుతూ సునీత. 

ఎలా ఓదార్చాలో తెలియక అక్క వెన్ను నిమురుతూ తాను కూడా కన్నీరు కార్చింది సుజాత. 

********* **********

రాత్రిభోజనం చేసాక ఆ కబురూ ఈ కబురూ చెప్తూ అలసట వలన త్వరగా నిద్రపోయింది సునీత. సుజాత ముందు వరండా లో కూర్చుని దీర్ఘాలోచనలో పడింది.

సునీత తనకన్నా ఐదేళ్లు పెద్ద. కానీ చిన్నప్పటినుంచి ప్రాణానికి ప్రాణం గా పెరిగారు. అన్నదమ్ములు లేరు. లేటుగా పుట్టిన సుజాతని చూస్తే సునీతకి లోకంలో ఇంకేమీ అక్కరలేదన్నట్లుగా ఉండేది. వాళ్ళిద్దరికీ చిన్నపిల్లల తగాదాలు కూడా ఏమీ లేవు. అలా పెరిగారు. 

సునీత ఎం ఏ స్పెషల్ తెలుగు పాస్ అయ్యీ అవంగానే కోరి మరీ ఆమెను చేసుకున్నారు ఆమె అత్తవారు. భర్త మాధవ్ ఒక్కడే అవడం వలన ఆమెని అత్తగారు అపురూపంగా చూసుకునేవారు. సునీత కూడా ఎక్కడా పల్లెత్తు మాట అనకుండా, పడకుండా సంతోషంగా కాపురం చేసింది. 

అత్తగారు, మామగారు కొద్ది రోజుల తేడాతో కోవిడ్ వచ్చి పోవడం మాధవ్ కీ సునీతకి కూడా ఆశనిపాతమే అయ్యింది. సునీతయే మాధవ్ బెంగతో ఎక్కడ ఆరోగ్యం చెడగొట్టుకుంటాడో అని ధైర్యం తెచ్చుకుని కార్యక్రమాలు జరిపించింది. వారు పోయాక పిల్లలు లేని లోటు ఆమెకు ఇంకా ఒంటరితనం పెంచింది. 

మాధవ్ ఎంత ప్రయత్నించినా, ఆతను ఆఫీస్ కి వెళ్ళాక ఆ ఒంటరితనం ఇంకా పిచ్చిదాన్ని చేసేది. చెల్లెలితో అప్పుడప్పుడూ ప్రస్తావించినా నవ్వేసి "పోనీ లేవే ! నీకెంత వయసు మీద పడిపోయిందీ ? ఎంజాయ్ చెయ్యి " అనేది. 

ఎం ఏ చదివాను కదా అని స్కూల్ టీచర్ గా చేరి అక్కడి ఏడాది పని చేసాక మానేసింది. అక్కడ చిన్న పిల్లల్ని చూస్తే తన లోటు ఇంకా పెద్దదిగా అనిపించేది. 

మాధవే ఆమె పరిస్థితి చూసి హఠం చేసి ఉద్యోగం మానిపించేసాడు. "నువ్వు ఉద్యోగం చెయ్యకపోతే మనకి జగదన్న మాట లేదుగా !" అని కూకలేశాడు. 
ఇవాళ ఈ పరిస్థితి చూసేసరికి సుజాతకి ఏమీ పాలుపోలేదు. ఎదో ఆలోచన అస్పష్టంగా రూపు దిద్దుకుంటుండగా పదిన్నరకు మాధవ్ వచ్చేసాడు. 

"సునీత భోజనం చేసేసిందా ? నా కోసం కూర్చోవద్దని చెప్పాను". అని ఆదుర్దాగా అడుగుతుంటే ముచ్చట వేసింది సుజాతకి. 

"నేనే దగ్గరుండి కబుర్లు చెప్తూ భోజనం తినిపించాను బావా ! రా ! నీకూ వడ్డించేస్తాను" అంటున్న సుజాతతో ఆప్యాయంగా "థాంక్స్ సుజా ! నువ్వున్నావు కాబట్టి ! లేకపోతె ఎంత రాత్రయినా నా కోసం కూర్చుంటుంది. టాక్స్ ఎండింగ్ టైం లో నాకు లేటవుతుంది అని చెప్పినా వినేది కాదు. తనని కేకలెయ్యడం నాకు చేతకాదు." అని సంజాయిషీ ఇస్తున్న మాధవ్ ని చూసి పక్కున నవ్వింది సుజాత.

" నాకు ఎక్కువ వడ్డించద్దు సుజా ! మీటింగ్ లో దండిగా ఫుడ్ పెట్టారు" అన్నాడు మాధవ్.

******** *********

భోజనం అయ్యాక ఇద్దరూ వరండా లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటుండగా మాధవ్ "సుజాతా ! మామ గారు నీ పెళ్లి గురించి ఆదుర్దా పడుతున్నారు. నువ్వు ఇప్పుడిప్పుడే పెళ్లి వద్దని ఖండితంగా చెప్పేసావుట. ఆయనని ఇద్దరు ముగ్గురు స్నేహితులు కోరి మరీ కోడలుగా చేసుకుంటామని అన్నారుట. ఆయనకి అటువంటి సంబంధాలు మళ్ళీ వస్తాయో లేదో అని కంగారు పడుతున్నారు నువ్వు పెళ్లి ఇప్పుడే వద్దనేసరికి " అన్నాడు.

"నాకు ఇంజనీరింగ్ పూర్తై ఉద్యోగంలో చేరిన తర్వాత కానీ పెళ్లి తలపెట్టకూడదని అనుకునేదాన్ని బావా !"

"అనుకునేదానిని అంటే ఇప్పుడు మనసు మార్చుకున్నావన్నమాట ! వండర్ ఫుల్ ! మామగారు చాలా సంతోషిస్తారు !" అని ఆనందంగా అంటున్న మాధవ్ ని చూస్తూ అప్రయత్నంగా అనేసింది సుజాత "నిన్నే పెళ్లి చేసుకుంటాను బావా ! "
మాధవ్ నిర్విణ్ణుడయ్యాడు. 

"ఏమిటి నువ్వంటున్నది సుజా ? మతి ఉండే మాట్లాడుతున్నావా ? నాకు పెళ్లయ్యింది, అదికూడా నీ అక్కతోనే అన్నది గుర్తుందా ?" అన్నాడు ముఖం కోపంతో ఎర్రబడగా. 

"ఇవాళ అక్క దుఃఖం చూసాను బావా ! అదీ నేనూ ఒకే ప్రాణం, రెండు శరీరాలుగా పెరిగాము. పిల్లలు లేరని అక్క బాధ పడితే ఇదివరలో కొట్టిపారేసేదాన్ని. ఇవాళ టెస్టులలో పిల్లలు కలిగే అవకాశం లేదని తెలిసి అక్క పడిన బాధ చూసి తనకి ప్రాణం లో ప్రాణమైన నీకు తనకి నాకు తోచిన విధంగా ఏమైనా చేద్దామని అనిపించింది. ఇంకా పూర్తిగా ఆలోచన రూపు దిద్దుకోలేదు. ఈ లోపు నువ్వే ఈ ప్రస్తావన తీసుకొచ్చేసరికి అనుకోకుండా అనేశాను బావా ! నువ్వు బాధ పడితే సారీ ! " అంటున్న సుజాతను చూస్తూ "పిల్లలు కలిగే అవకాశం లేదని ఎవరు చెప్పారు సునీతకి ?" అన్నాడు మాధవ్ ఎరుపు తగ్గని ముఖం తో. 

"డాక్టర్ ఛాయ గారు చెప్పారుట కదా బావా !" అన్నది. 

"అది ఆవిడ పిల్లలు కలిగే అవకాశం తక్కువ అన్నారు కానీ లేదని అనలేదు ! సునీతే ఎక్కువ ఊహించేసుకుంటున్నది. సాయంత్రం ఛాయ గారే ఫోన్ చేసి పాండిచేరీ లో స్పెషలిస్ట్ డాక్టర్ని రిపోర్ట్ లు పంపించి కన్సల్ట్ చేశాననీ యుటెరస్ లో ప్రాబ్లమ్ చిన్న సర్జరీ తో సరి చెయ్యవచ్చని ఇటువంటివి దాదాపు పది పన్నెండు కేసులు సక్సెస్ అయినాయని ఆయన చెప్పారని చెప్పారావిడ. సునీతకి చెప్పండి ఖంగారు పడవద్దని కూడా మరీ మరీ చెప్పారు. ఈ లోపల తను ఇంత బాధ పడుతుందని అనుకోలేదు. తాను నిద్రపోతున్నది కదా ! రేపు ఉదయం చెప్పి సర్ప్రైజ్ చేద్దామని అనుకుంటే అక్కా చెల్లెలు ఎంత ఎక్స్ట్రీమ్ గా ఆలోచించేశారూ ? సుజా ! నిన్ను ఎప్పుడైనా అటువంటి దృష్టితో చూసానా ? నాకు తమ్ముళ్లు, చెల్లెళ్లు లేరు, నిన్ను ఒక చిన్నారి చెల్లెలి లాగానే చూసేవాడిని ఎప్పుడూ గమనించలేదా ?" అంటున్న మాధవ్ రెండు చేతులూ తన చేతుల్లోకి తీసుకుని "సారీ బావా ! అనాలోచితంగా, ఇమ్మెచూర్ గా వచ్చిన మాట అది. నన్ను క్షమించు, అక్కకి ఈ మాట చెప్పద్దూ ! ప్లీస్ ! తను వేరేగా నా గురించి తలిస్తే నేను తట్టుకోలేను" అని వెక్కి వెక్కి ఏడుస్తున్న సుజాత తల నిమురుతూ "పిచ్చి పిల్లా ! అలా చెప్తానని ఎలా అనుకున్నావు ? ఈ విషయం మర్చిపో ! రేపు ఉదయం నీ నోటితోనే ఈ శుభవార్త సునీ కి చెప్పు. సిల్లీ గర్ల్ !" అంటున్న బావగారి వైపు కన్నీళ్లతో చూస్తూ ఉండిపోయింది సుజాత.  

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఒక పౌర్ణమి కథ

అక్కరకొచ్చిన_అనుభవం

నేనున్నా నీకు రక్షణ @