అక్కరకొచ్చిన_అనుభవం



గ్రేస్ స్కూటీ పార్క్ చేసి చురుకుగా నడుస్తూ ఆ మల్టీ స్పెషాలిటీ హాస్పటల్ లో కోవిడ్ వార్డ్ ఏ‌ కి చేరుకుంది. నర్సెస్ రూమ్ లో తన లాకర్ తెరిచి చక చక తన వాచీ, మొబైల్, పర్స్ వంటివి పెట్టేసి తాళం వేసి ఆ పక్కనే సీల్ చేసి ఉన్న ప్యాక్ నుంచి డిస్పోజబుల్ ఫేస్ షీల్డ్ ధరించి వేరే నడవా లో ఉన్న వాష్ బేసిన్ దగ్గర పద్ధతి ప్రకారం చేతులు మోచేతులవరకూ సబ్బుతో ఐదు నిమిషాల పాటు కడుక్కుని ఆ పక్కనే ఉన్న హాట్ ఎయిర్ బ్లోయర్ లో తడి ఆరే దాకా ఉంచి అవతల వైపు ఉన్న స్టెరైల్ జోన్ అని ఉన్న గ్లాస్ డోర్ తీసుకుని వేరే రూమ్ లోకి వెళ్ళింది.

అక్కడ సానిటైజర్ తో చేతులు రెండూ ఇంకొకసారి శుభ్రం చేసుకుని తను ధరించిన ఫేస్ షీల్డ్ వేరే బిన్ లో పడేసింది. అక్కడ ఉన్న పెద్ద స్టెయిన్ లెస్ స్టీల్ కంటెయినర్ మూతని తీసి పి పి ఈ కిట్ తీసి అంతే చురుకుతో వరుస ప్రకారం ముందు చేతులకి గ్లౌస్, పాదాల తొడుగులు వేసుకుని, మాస్క్ ధరించింది, ఆ తర్వాత కళ్ళకు గాగుల్స్ వేసుకుని ఆ పైన ఫుల్ గౌన్ ధరించింది. చివరగా వేరే జత గ్లౌస్ అంతకు ముందు వేసుకున్న గ్లౌస్ మీద తొడుగుకుని వార్డ్ లో ప్రవేశించింది.

హాస్పిటల్ కి వచ్చాక యూనిట్ లో ప్రవేశించడానికి ఇరవై నిముషాలు పట్టింది. ఆ మాత్రం సమయం తీసుకోకపోతే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విషయం నర్సులు, ఇతర వైద్యేతర సిబ్బందికి క్షుణ్ణంగా తెలుసు.

ఆ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో పద్నాలుగు బెడ్స్ ఉన్నాయి. ప్రతి బెడ్ దూరం దూరంగా ఉన్నాయి. ఏ బెడ్ కా బెడ్ చుట్టూ మందమైన ప్లాస్టిక్ షీట్లతో చేసిన తెరలు ఉన్నాయి. ఆ యూనిట్ లో ఏడుగురు స్పెషల్ నర్సులు, వారి పైన ఇద్దరు సీనియర్ నర్సులు ఉంటారు. ఒక్కొక్క నర్సుకి రెండే బెడ్లు. ఏడుగురు నర్సులకి ఒక సీనియర్ నర్సు. ఎక్కువ బెడ్లు ఇస్తే క్రాస్ ఇన్ఫెక్షన్లు, నర్సులకి కూడా అపాయం అని ఈ ఏర్పాటు.

అంతకు ముందు కార్డియాలజీ, పల్మొనాలజీ, సర్జికల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లలో పని చేసి మంచి పేరు తెచ్చుకున్నందువలన కోవిడ్ కేర్ యూనిట్లు పెట్టినప్పుడు మొట్టమొదటగా ఎంపికైన నర్సులలో గ్రేస్ కూడా ఉంది.

అంతే కాక ఆపరేషన్ థియేటర్లలో కూడా మంచి అనుభవం సంపాదించింది. అది కూడా ఆమె మీద హాస్పిటల్ అధికారుల నమ్మకానికి కారణమైంది.

అంతకు ముందు డ్యూటీ చేసిన తోటి నర్సు దగ్గర తన బెడ్స్ మీద ఉన్న పేషెంట్ల వైటల్స్, అంటే టెంపరేచర్, బీ పీ, ఆక్సిజన్, ఇంకా ఇచ్చిన మందులు, సెలైన్ల వివరాలు, ఇవ్వవలసిన మందుల వివరాలు చకచకా కనుక్కుని, ఆ రోజు డ్యూటీ లో ఉండే డాక్టర్లు, స్పెషలిస్ట్లు, కాల్ డ్యూటీ డాక్టర్ల వివరాలు కూడా తెలుసుకుని ఆ నర్స్ కి వీడ్కోలు చెప్పి తనకి కేటాయించిన పేషెంట్స్ ని మరొక్కసారి తనిఖీ చేసింది.

ఇవ్వవలసిన ఇంజెక్షన్లు ఇచ్చేసి, వివరాలన్నీ కేస్ షీట్ లో వ్రాసేసి, సీనియర్ దగ్గరికి వెళ్ళి దూరంగానే నుంచుని "గుడ్ మార్నింగ్ సిస్టర్ !" అని విష్ చేసింది. సీనియర్ బాగా అలవాటు పడి ఉండడం వలన మాస్క్, గాగుల్స్ ఉన్నా గుర్తుపట్టి "గుడ్ మార్నింగ్ గ్రేస్ ! నిన్న రాత్రి ముగ్గురు ఎక్స్పైర్ అయ్యారు. ఈ వేవ్ లో మన హాస్పిటల్ లో 78 వ డెత్" అన్నది విచారంగా.

జనాంతికంగా "అయ్యో!" అన్నదే కానీ గ్రేస్ కి ఇంటి దగ్గర భర్త గుర్తొచ్చాడు. ఉదయం లేస్తూనే జలుబు, తుమ్ములు ! జ్వరం లేదు కానీ ఒళ్ళు నెప్పులు అన్నాడు. వాక్సిన్లు రెండు డోస్ లు ఇద్దరూ వేయించుకున్నారు. అందువలన ధైర్యంగానే ఉన్నారు.

భర్త ఆ హాస్పిటల్లోనే రేడియాలజీ డిపార్ట్మెంట్ లో సి టి స్కాన్ సెక్షన్ లో డేటా ఎంట్రీ టెక్నీషియన్ గా చేస్తున్నాడు. తను కూడా వరుసగా రెండు రోజులు డ్యూటీ చేసి రెండు రోజుల ఆఫ్ తో గత రాత్రే వచ్చాడు. ఫోన్ చేద్దామన్నా కుదరదు. బయటనే విడిచి పెట్టి రావాలి. టైమ్ కూడా వార్డు లోని పెద్ద డిజిటల్ గడియారం లో చూసుకోవాలి. ఒకసారి నిట్టూర్చి డ్యూటీలో నిమగ్నమైపోయింది.

******** ****** *******

మధ్యాహ్నం రెండు గంటలకు జరిగిందా సంఘటన.

గ్రేస్ చూసుకునే బెడ్స్ పక్క బెడ్ లో అంతకు ముందు రోజు అడ్మిట్ అయిన అనెస్థటిస్ట్ డాక్టర్ మూర్తికి ఆక్సిజన్ శాతం బాగా పడిపోయి ఎగ ఊపిరి రావడం మొదలుపెట్టింది. హడావుడిగా అనెస్థటిస్ట్ వచ్చి గొంతులో గొట్టం వేసి వెంటిలేటర్ కి తగిలించాడు. ఒక పదిహేను నిమిషాలలో అతని పరిస్థితి మెరుగై ఆక్సిజన్ 97% కి వచ్చింది.

కండిషన్ బాగా అదుపులోకి వచ్చిందని రూఢి చేసుకుని అనెస్థటిస్ట్, సీనియర్ నర్సుకి సూచనలు ఇచ్చి వెళ్ళిపోయాడు. తన డ్యూటీ పూర్తి అయిందనీ, వేరే అనెస్థటిస్ట్ అవసరమైతే కాల్ చేసి పిలువవలిసి వస్తుందని చెప్పి వెళ్ళాడు.

సీనియర్ నర్సు గ్రేస్ తో "ఇంకొక ఎమర్జెన్సీ రాకూడదని ప్రార్థిద్దాం. ఈయన వెళ్ళిపోయేసరికి ఎమర్జెన్సీ గా వచ్చే స్టాఫ్ అనెస్థటిస్ట్లు ఎవరూ లేరు. డాక్టర్ మూర్తి గారు కాక ఐదుగురు ఉన్నారు. ఈయన డ్యూటీ దిగిపోయాడా ? ఇద్దరేమో నిన్న డ్యూటీలు పూర్తి చేసుకున్నారు, 72 గంటల కంపల్సరీ క్వారెంటైన్ లో ఉండాలి. ఇంకొక డాక్టర్ కోవిడ్ పాజిటివే కానీ కోలుకుంటున్నారు. హోమ్ ఐసొలేషన్ లో ఉన్నారు." అని చేతులు రెండూ పైకెత్తి దేముడికి దణ్ణం పెట్టింది.

గ్రేస్ కి అటువంటి పరిస్థితి తలుచుకుంటే ఒళ్ళు జలదరించింది.

ఇంకొక అరగంట తర్వాత సీనియర్ నర్స్ ఇంటర్ కామ్ లో మాట్లాడుతూ హఠాత్తుగా సైలెంట్ అయిపోయింది. కోవిడ్ డ్రెస్ లేకపోతే తెరుచుకున్న నోరు, పాలిపోయిన ముఖం కనిపించేవి.

ఫోన్ పెట్టేసి గ్రేస్ దగ్గరకు వచ్చి "నీ హజ్బెండ్ వర్గీస్ కి సీరియస్ గా ఉందిట. కాజువాలిటీ నుంచి ఫోన్, కోవిడ్ పాజిటివ్ ట. ఆక్సిజన్ 82 % ఉన్నదట. శ్వాస కష్టంగా ఉందిట. మన యూనిట్ కే తీసుకొస్తున్నారు. మొత్తం మనిషిని మూడు లేయర్లు రాప్ చేసి తెస్తున్నారు. డాక్టర్ మూర్తి గారి పక్క బెడ్ ఖాళీ అయింది ఇవాళ తెల్లారే ! మాట్రెస్, బెడ్ షీట్ మొత్తం అన్నీ ఇన్సినరేషన్ కి పంపించేశాము. కొత్త మాట్రెస్ కూడా వేసేశారు. నువ్వేం కంగారు పడకు. చిన్న వయస్సే కదా ! బయట పడిపోతారులే !" అన్నది గబగబా.

గ్రేస్ మెదడు ఖాళీ అయిపోయినట్లనిపించి ఓ కుర్చీలో కూలబడింది. వయసు చిన్నదే అయినా వర్గీస్ కి ఆస్థమా ఉన్నది. మందులతో బాగానే ఉంటున్నది. కోవిడ్ ఇటువంటి సహచర వ్యాధులు ఉంటే ప్రాణాలు త్వరగా తీసేస్తుందని తెలుసు. క్రితం ఏడాది కూడా అత్తమామలు ఇద్దరూ ఒకళ్ళ తరవాత ఒకరు మొదటి కోవిడ్ వేవ్ లో పోయారు. ఇద్దరికీ షుగరు, బీ పీ ఉండడంతో త్వరగా ఆ మహమ్మారి పొట్టన పెట్టుకుంది.

తమకి రెండున్నర సంవత్సరాల క్రితమే పెళ్ళైంది. ఇంకా పిల్లలు లేరు. ఎంతో అన్యోన్యంగా ఉండే వారు. భర్తకి కూడా ఏమైనా అయితే ?

మరొక్కసారి ఒళ్ళంతా జలదరించింది. ఇంకొక ఐదు నిమిషాలు గడిచాక ఇద్దరు వార్డు బాయ్ లు స్టెరైల్ స్ట్రెచర్ తీసుకుని మధ్యలో ట్రాన్స్ఫర్ జోన్లో కి వెళ్లి అప్పుడే వచ్చిన వర్గీస్ ని తీసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టారు.

తనకి అలాట్ చేసిన బెడ్ కాకపోయినా పరుగున వెళ్ళి చూసింది. బాగా ఆయాస పడుతున్నాడు. ఆక్సిజన్ మాస్క్ పెట్టడం వలన 88% కి వచ్చింది కానీ సరిపోతున్నట్లు లేదు. క్యాజువాలిటీ ఫిజిషియన్ ఫోన్ లోనే సూచనలు ఇచ్చి వెంటిలేటర్ అవసరం అవచ్చు అన్నాడు.

గ్రేస్ గుండె గుభేలు మంది. అనెస్థటిస్ట్లు ఎవరూ అందుబాటులో లేరు. కాల్ డ్యూటీ అనెస్థటిస్ట్ ఒక పావుగంటలో హాస్పిటల్ చేరుకుంటానని అన్నాడు. కానీ ఆ టైమ్ కి రాగలిగినా కోవిడ్ డ్రెస్ వేసుకుని రావడానికి కనీసం అరగంట పట్టవచ్చు.

గ్రేస్ కి చేతులు కాళ్ళు ఆడలేదు. ఏడుపొచ్చేస్తోంది. కానీ గుండె దిటవు చేసుకుని సీనియర్ నర్సు దగ్గరికి వెళ్ళి "అనుమతి ఇస్తే నేను ఇంట్యుబేట్ చేస్తాను సిస్టర్ !" అన్నది.

మామూలు పరిస్థితుల్లో అయితే క్లాసు తీసేసుకునే పని. కానీ అప్పటి ఎమర్జెన్సీని దృష్టిలో ఉంచుకుని, గ్రేస్ అనుభవాన్ని పరిగణించి "సరే ! గో అహెడ్ !" అన్నది.

భగవంతుడికి మనసారా నమస్కరించుకుని, తనకి ఆపరేషన్ థియేటర్లలో, పల్మొనాలజీ యూనిట్ లో అనుభవం గుర్తుతెచ్చుకుని చకచకా ఇంట్యుబేషన్ సెట్ తీసుకుని భర్త తలవైపు వెళ్ళింది. ఆ బెడ్ ఇన్ చార్జి నర్సు కోమలి సహాయం చేస్తుండగా భర్త భుజాల క్రింద ఎత్తు పెట్టి నోరు తెరిచి నాలుక క్రింది దవడ వైపు నొక్కిపెట్టి లారింగోస్కోప్ జాగ్రత్తగా గొంతులోకి ప్రవేశపెట్టి ఎపిగ్లాటిస్, స్వరతంత్రులు జాగ్రత్తగా అడ్డం రాకుండా చూసుకుంటూ ట్యూబ్ వేసేసి, ట్యూబ్ కి ఉన్న బెలూన్ లో గాలి పంప్ చేసి స్కోప్ బయటకు తీసేసి బెడ్ పక్కనే ఉన్న వెంటిలేటర్ కి కనెక్ట్ చేసి ట్యూబ్ కి ప్లాస్టర్ వేసేసి అలవాటు కొద్దీ మానిటర్ కేసి చూసింది.

ఆక్సిజన్ లెవెల్ 93% దాటేసరికి బీప్ ఆగింది. ఈ సీ జీ ట్రేసింగ్ కూడా దాదాపు మామూలుకి వచ్చింది. పక్కనే చిన్నగా అలికిడి అవడం విని అటు చూసింది గ్రేస్. ఎప్పుడు స్పృహలోకి వచ్చాడో తెలియదు, తన గొంతులో ట్యూబ్ ఉండడం వలన మాట్లాడలేక ఎడమ చెయ్యి ఎత్తి థంబ్సప్ చూపిస్తున్నాడు డాక్టర్ మూర్తి.

ఏడుపు, సంతోషం కలగలిసి రాగా వెక్కుతూ వెళ్ళి కుర్చీలో కూలబడింది గ్రేస్.

**** ******* ********

వారం రోజుల తర్వాత భర్తను వీల్ చైర్ లో కూర్చోపెట్టి ఉప్పొంగే మనసుతో హాస్పిటల్ వీడి వెళ్తున్న గ్రేస్ కు అటూ ఇటూ వరుసలలో నిలబడి చప్పట్లతో, ఆనందాశృవులతో వీడ్కోలు పలికారు హాస్పిటల్ సిబ్బంది అందరూ !

******** ******** ********

లాకప్ లో ఉన్న గ్రేస్ కళ్ళ వెంట నీళ్ళు కారుతున్నాయి. ఆ రోజుల్లో తను పడిన కష్టాలు, సమయస్ఫూర్తితో తన భర్తని మృత్యువు ద్వారాల దగ్గర నుంచి వెనక్కి లాగుకుని రావడం, అందరూ తనని సతీ సావిత్రితో పోల్చడం, కోవిడ్ లాక్ డౌన్ ఎత్తెయ్యంగానే అసిస్టెంట్ హెడ్ నర్స్ గా ప్రమోషన్ రావడం, కలలోలాగ అనిపించింది. ఒక చంటి పాప కూడా.

వర్గీస్ కూడా సీనియర్ టెక్నిషియన్ గా ప్రమోట్ అయ్యాడు. అంతా పూలబాట లాగా జరిగిపోతున్నది అనుకుంటే రెండు రోజుల క్రితం జరిగిన సంఘటన వారి జీవితాల్ని మళ్ళీ కుదిపేసింది.

గ్రేస్ రోటీన్ గా రౌండ్స్ వేస్తుండగా ఐసిసియూ లో ఉన్నపుడు జరిగిందా సంఘటన.

ఒక ఎనభై ఏళ్ళ పేషెంట్, అంతకు ముందు స్టెంట్లు కూడా వేసినా అక్యూట్ ఇన్ఫార్క్షన్ తో అంతకు ముందు రోజే ఐంటెన్సివ్ కేర్ యూనిట్ లో చేర్చారు. ఆయనకి ఆస్థమా, డయాబెటిస్ కూడా ఉన్నాయి. గ్రేస్ ఐసీసీయూ లో వుండగానే మానిటర్ దగ్గర్నుంచి కంటిన్యుయస్ బీప్ శబ్దం రాగానే సెకండ్లలో గ్రేస్, ఐసీయూ నర్స్ చేరుకుని ముందు మానిటర్ చెక్ చేసారు. ఈసీజీ బాగా ఇర్రెగ్యులర్ గా, టాకీకార్డియా చూపిస్తోంది. ఆక్సిజన్ లెవెల్ 80% చూపిస్తోంది. "రూపా ! డ్యూటీ డాక్టర్ కి, కార్డియాలజిస్ట్ కి కాల్ చెయ్యి" అంటూనే, అక్కడ ఉన్న స్టెత్ తో చెస్ట్ పరీక్ష చేసింది. బాగా కంజెషన్ అని గ్రహించింది. గబ గబా కేస్ షీట్ చూసి ఇంకొక నర్స్ కి డై యూరిటిక్, హైడ్రో కార్టిసోన్ ఇంజెక్షన్లు చెయ్యమని చెప్పి అక్కడనే అందుబాటులో ఉన్న ఇంట్యుబేషన్ సెట్ తీసి ట్యూబ్ వేసేసి ఆక్సిజన్ కనెక్షన్ ఇచ్చే సమయానికి ఇసిజీ పూర్తిగా ఫ్లాట్ అయిపోయి, ఆక్సిజన్ బాగా పడిపోయి ఆయన కొలాప్స్ అయిపోయాడు. వెంటనే ఆక్సిజన్ ఫ్లో 10 లీటర్స్ పెట్టి చెస్ట్ మసాజ్ మొదలుపెట్టింది. ఈ లోపు మిగిలిన నర్స్ లు కుడా వచ్చేసి చకచకా ఒక్కొక్క రీసస్కిటేషన్ స్టెప్స్ లో పాలు పంచుకొంటున్నారు.

సరిగ్గా అదే సమయానికి ఆ పేషెంట్ అటెండెంట్ వచ్చి డోర్ దగ్గరే ఆగిపోయి "మా తాతయ్యకేమయింది ? పొద్దున్న బాగానే ఉన్నాడన్నారు ?" అని ఏడుపు గొంతుతో అరుస్తూ బయటకు పరిగెత్తుతూ మధ్యలో హడావుడిగా వస్తున్న కార్డియాలజిస్టుని దాదాపుగా తోసేసుకుంటూ వెళ్ళిపోయాడు. కార్డియాలజిస్ట్ నిర్ఘాంతపోయినా గబగబా ఆ పెద్దాయన దగ్గరికి వెళ్ళి సాధ్యమైనంత ప్రయత్నాలు చేసినా రివైవ్ కాకపోయే సరికి బయట పేషెంట్ అటెండెంట్ ను లోపలికి రమ్మని చెప్పి కేస్ షీట్ లో ఇచ్చిన ట్రీట్మెంట్ వివరాలు వ్రాస్తూ ఉండగా ఆ పెద్దాయన కొడుకు వచ్చాడు.

కార్డియాలజిస్ట్ జానకీ పతి జరిగినవన్నీ వివరించి ఇంక ఆయన రివైవ్ అయ్యే ఛాన్స్ లేదని చెప్పి "మీకు చెప్పి ఆక్సిజన్ ట్యూబ్ తీసేస్తామని ఆగాము" చెప్పగానే ఆ కొడుకు ఏడుపు గొంతుతో "ప్రొద్దుట బాగానే ఉన్నారని అన్నారు, గంటల వ్యవధిలో మనిషి ఎలా చచ్చిపోతాడు ?" అని అరిచాడు.

కార్డియాలజిస్ట్ అతనిని ఊరడిస్తూ ఏదో చెప్పబోతే వినకుండా బయటికి వెళ్లిపోయాడు. ఒక్క ఐదు నిమిషాలలో ఒక పది పదిహేను మంది చెప్పులతో మాస్క్ లు వేసుకోకుండా దౌర్జన్యంగా వచ్చి ఖాళీగా ఉన్న బెడ్ ల దగ్గర ఉన్న మానిటర్లు, ఇన్స్ట్రుమెంట్లు ధ్వంసం చేస్తూ ఉండగా ఒకళ్ళిద్దరు మిగిలిన పేషెంట్ల దగ్గరకు వెళ్ళి బ్లాంకెట్లు లాగేసి, మీరు ఇక్కడే ఉంటే మీరూ మా అయ్యగారి లాగా చచ్చిపోతారొరేయ్, ఈ హాస్పిటల్ ప్రాణాలు తియ్యడంలో స్పెషలిస్ట్ లు అని అంటూ హడలగొట్టడం మొదలెట్టారు. మళ్ళీ ఆ ముసలాయన కొడుకు, మనవడు వచ్చి కార్డియాలజిస్ట్ ను, గ్రేస్ ని విచక్షణా రహితంగా కొట్టడం మొదలెట్టారు. "నువ్వేగా మా తాతని ఛాతీ నొక్కి చంపేశావు" అని గ్రేస్ ని, "డాక్టర్ అంటే యూనిట్ లో ఉండాలి, టైమ్ కి ఎక్కడికి పోయావురా ? నా కొడకా!" అని కార్డియాలజిస్ట్ ని కొడుతూ ఉంటే మిగిలిన నర్సులు, వార్డ్ బాయ్ లు అడ్డం పడ్డారు. ఈ వార్త తెలియగానే హాస్పిటల్లో మిగిలిన డాక్టర్లు, నర్సింగ్ స్టాఫ్ అంతా వచ్చేసారు. ఈ లోపు ఆ యూనిట్ అంతా ధ్వంసం చేసి బయటికి వెళ్లిపోయారు ఆ తండ్రీకొడుకులు.

ఆ తర్వాత తెలిసింది ఆ పోయిన ముసలాయన లోకల్ కార్పొరేటర్ తండ్రి అని. పోలీసులు కూడా కబురు తెలిసి వచ్చేసరికి ఆ కార్పొరేటర్ అనుచరులు దాదాపు యాభై అరవై మంది చేరి హాస్పిటల్ బయట స్లోగన్లు కొడుతూ ధర్నా చేస్తున్నారు.

గాయపడిన గ్రేస్, కార్డియాలజిస్ట్ జానకీపతిని వెంటనే ట్రీట్ చేసి ఐసొలేషన్ రూమ్ లోకి మార్చారు, వారి సేఫ్టీ కోసం.

రెండవ రోజున పోలీసులు వచ్చి వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. "వియ్ ఆర్ హెల్ప్ లెస్. ఆ కార్పొరేటర్ అధికార పార్టీ లో బాగా పరపతి ఉన్నవాడు. ఎమ్ ఎల్ ఏ లు కొంత మంది ఆయన కులం వారే ఉన్నారు. మాకు హోమ్ మంత్రి దగ్గర నుంచి ఫోన్ మీద ఫోన్లు. మేము ఏదో యాక్షన్ తీసుకున్నట్లు కనిపించాలి కదా ?" అని అక్కడ చుట్టుముట్టిన డాక్టర్లను బతిమాలి వారిద్దరినీ బేడీలు వేసి తీసుకుని వెళ్ళారు. అభ్యంతరం చెప్పిన డాక్టర్లతో "అది కూడా హోమ్ మినిస్టర్ కు ఫోటోలు పంపడం కోసమ"ని చెప్పి పోలీస్ వ్యాన్ ఎక్కించారు. ఆ లోపు టీవీ ఛానెల్స్ వాళ్ళంతా చుట్టుముట్టి ప్రశ్నలతో కుళ్ళబొడిచినట్లు మాట్లాడితే వారిద్దరూ తలవంచుకుని వెళ్ళి వ్యాన్ ఎక్కారు.

ఈ తతంగం అంతా చూసిన డాక్టర్లకు రక్తం మరిగిపోయి సమ్మెకు పిలుపు ఇచ్చారు. జూనియర్ డాక్టర్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్, సర్జన్లు, నర్సింగ్ స్టాఫ్ అసోసియేషన్ ఇలా అందరూ మెరుపు సమ్మెకు దిగేసరికి ఇదే మంచి తరుణం అని అపోజిషన్ వారూ వీరితో చేరిపోయి ధర్నాలు, రాస్తారోకోలు, నిరాహారదీక్షలు చేసేసరికి ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని నిర్ణయించి ప్రజలు, ప్రజా ప్రతినిధులకు కంటి తుడుపు చర్య క్రింద వీరిద్దరికీ రివర్షన్ ఇచ్చి, నిశ్శబ్దంగా విడుదల చేసేసి గుప్ చుప్ గా ఇంట్లో దింపేశారు.

***************

వారి తప్పు లేకపోయినా ప్రజల చేత, ప్రభుత్వం చేత శారీరకంగా మానసికంగా గాయపడిన కార్డియాలజిస్ట్ జానకీ పతి రాజీనామా చేసి ప్రైవేట్ మెడికల్ కాలేజీలో హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ గా వెళ్ళిపోయాడు. గ్రేస్, తన భర్త వర్గీస్, బిడ్డను తీసుకుని కేరళ వెళ్ళిపోయింది.

కార్పొరేటర్ ఎమ్ ఎల్ ఏ గా ఎన్నికై మంత్రి పదవి కూడా పొంది దర్జాగా తిరుగుతున్నాడు.

కానీ డాక్టర్ జానకీ పతి, గ్రేస్ లకు వృత్తి పరంగా జరిగిన హాని చక్కదిద్దే పని ఎవరూ చెయ్యలేదు.




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఒక పౌర్ణమి కథ

నేనున్నా నీకు రక్షణ @