వాసంత సమీరం@
వాసంత సమీరం
డాక్టర్ శంకరనారాయణ ఆ రోజు మొదటి పేషెంట్ నుంచి అతని బాధను గురీంచిన వివరాలు అడిగి ఓపికగా పరీక్ష చేసి మందులు వ్రాసి పంపించేశారు.
వరుసగా ఐదుగురిని చూసి పంపేశాక కొద్దిగా పరిచయం ఉన్న రామచంద్రరావు ఒక యువకుడిని తీసుకుని వచ్చాడు. అతను చాలా సంతోషంగా "గుడ్ మార్నింగ్ సార్ ! గుర్తు పట్టారా ?" అన్న తర్వాత అతని ముఖాన్ని తేరిపార చూసి "మీ పేరు విక్రమ్ కదా ? మూడేళ్ళ క్రితం చూసాను! బాగా మారిపోయారు !" అన్నాడాయన.
"మీరు నన్ను మీరు అని అనవద్దు డాక్టర్ గారూ ! మీకన్న చాలా చిన్నవాడిని !" అన్నాడు
అంతకు మూడేళ్ళ ముందు దీనస్థితిలో చికిత్స కోసం వచ్చిన ఆ విక్రమ్ కీ ఇప్పటి విక్రమ్ కీ చాలా మార్పు వచ్చింది. అప్పుడు ఒళ్ళంతా ఎందుకొచ్చిందో తెలియని దురదతో ఆకలి పూర్తిగా పోయి కళ్ళు లోతుకి పోయిన విక్రమ్ కళ్ళముందు కదలాడాడు. అంతకు ముందు ఆరు నెలలుగా దురదలతో బాధపడుతూ ఆకలి తగ్గిపోయి బరువు తగ్గిపోయి స్పెషలిస్ట్ లకి చూపించుకుని, ఫలితం లేక మేనమామ తో వచ్చి కళ్ళనీళ్ళు తో వేడుకున్న సంఘటన గుర్తుకు వచ్చింది. బీటెక్ పూర్తి చేసి ఎమ్ బి ఏ కోసం క్యాట్ పరీక్షకు తయారవుతున్నాడు. ఐ ఐ ఎమ్ బెంగుళూరు కానీ, అహ్మదాబాద్ కానీ తన లక్ష్యం అని, ఈ దురదల వలన సరిగ్గా తయారవలేకపోతున్నాననీ వాపోయాడు. శంకరనారాయణ గారికి అతనిని పరీక్ష చేశాక ఆశ్చర్యం వేసింది. అంతమంది స్పెషలిస్ట్ లు పట్టుకోలేక పోయారని కొంచెం విచారం కూడా కలిగింది. అతని ఆకలి తగ్గడానికి, చిక్కిపోవడానికీ, ఆ దురదల వలన మానసిక వేదనే కారణం అని గ్రహించాడు.
ముందు అతని చదువు వివరాలు సేకరించి ముచ్చట పడ్డాడాయన. అంత తెలివైన కుర్రాడు ఆ చిన్న బాధవలన చక్కటి భవిష్యత్ ను కోల్పోనున్నాడని గ్రహించాడు. ముందుగా పావుగంట సేపు కౌన్సెలింగ్ ఇచ్చి అతని మీద అతనికి నమ్మకం కలిగేలా చేసి మందులు వ్రాసి ఇస్తూ చెప్పాడు. "ఇది స్కేబీస్ విక్రమ్ ! నువ్వు చూపించుకున్న స్పెషలిస్ట్ లు పట్టుకోలేదంటే ఆశ్చర్యంగా ఉంది. రెండు వారాల పాటు ఈ మందులు వాడితే పూర్తిగా తగ్గిపోతుంది.అస్సలు నిస్పృహ వద్దు" అని ధైర్యం చెప్పి పంపించాడు.
అప్పటి నుంచి ఈ రోజే కనిపించడం.
"మీ మందులు వాడిన తరువాత పదిరోజుల్లో నాకు పూర్తిగా బాధ తగ్గిపోయింది డాక్టర్ గారూ ! అసలు క్యాట్ పరీక్ష కూడా మానేద్దామన్నంత విరక్తి కలిగింది. మందులు కొంత పని చేస్తే, మీరు ఇచ్చిన ధైర్యం వల్లనే క్యాట్ పరీక్ష చక్కగా వ్రాయగలిగాను. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకు వచ్చింది ! ఐ ఐ ఎమ్ అహ్మదాబాద్ లో సీట్ వచ్చింది. రెండేళ్ళు అయిపోయిన తర్వాత క్యాంపస్ ఇంటర్వ్యూలో గూగుల్ కంపెనీ కి సెలెక్ట్ అయ్యాను. అంతేకాదు, ఆ ఏడాది కాలేజ్ టాపర్ ని కూడా నేనే సర్!" అన్నాడు.
"ఇప్పుడు ఎక్కడ?" అని అడిగిన శంకరనారాయణ గారికి "కాలిఫోర్నియా, మౌంటెన్ వ్యూ హెడ్ క్వార్టర్స్ లోకి సెలెక్ట్ అయ్యాను. ఏడాది తర్వాత శెలవుల మీద ఇంటికి వచ్చి లాక్ డౌన్ లో ఇక్కడ చిక్కుకు పోయాను. కాకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ ఉండబట్టి నా పనికి అంతరాయం ఏమీ లేదు " అన్నాడు విక్రమ్.
"చాలా సంతోషం విక్రమ్ ! ఆల్ ది బెస్ట్ ! ఇప్పుడేమైనా ప్రాబ్లమా ? అని అడిగాడు.
"ప్రాబ్లమ్ ఏమీ లేదు సర్ ! ఈ నెల 25 వ తారీఖున నా వివాహం. మా మేనమామ కూతురితో ! తాను కూడా ఎమ్ ఎస్ చేసి అమెరికాలోనే జాబ్ చేస్తోంది. చిన్నప్పటి నుంచి ఒకరినొకరు ఇష్ట పడ్డాం. నాకు ఐ ఐ ఎంలో సీటు సంపాదించడం, రేఖని పెళ్ళాడడం ఎండమావిలాగా అనిపించింది మూడేళ్ళ క్రితం. మీ చలవ వలన అవి రెండూ సాధించాను. మీ పరిచయం రోహిణీకార్తెలో చల్లటి గాలి లాగ సేద తీర్చింది సర్ !" జీర పోయిన గొంతుకతో అని చటుక్కున వంగి కాళ్ళకి నమస్కారం చేశాడు.
"మా వివాహానికి మీకు నా కృతజ్ఞతతో కూడిన గిఫ్ట్ ఇది. కాదనవద్దు " అని అందంగా పాక్ చేసిన రోలెక్స్ వాచ్ ఆయన చేతిలో పెట్టి చేతులెత్తి మరొక్క సారి నమస్కారం చేసి వెళ్ళాడు విక్రమ్.
అయిదు నిముషాల తర్వాత ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. కొడుకు శివరాం "నాన్నగారూ ! అమ్మకి ఇప్పుడే ఆక్సిజన్ 97 % కి వచ్చింది దాదాపు మూడు వారాల తర్వాత ! ఒక గంట సేపు ప్రశాంతంగా ఆయాసం లేకుండా నిద్ర పోయింది కూడా !" అన్నాడు ఎక్సయిటింగ్ గా .
నమ్మలేకపోయాడు శంకరనారాయణ గారు. భార్య గౌరి కరోనా బారి పడి కష్టం మీద మృత్యువు వాకిట నుంచి బయట పడింది. కానీ ఊపిరితిత్తులు దెబ్బ తినడం వలన ఆయాసం మాత్రం తగ్గలేదు . క్లోస్ ఫ్రెండు ఫిజిషియన్ డాక్టర్ నారాయణ రావు సలహా మీద కొత్త మందులు మొదలు పెట్టాడు. మూడో రోజుకల్లా ఈ తేడా ! కంట నీరు తిరిగిందాయనకి.
"ఇంకో సర్ప్రైస్ నాన్న గారూ ! అక్క, బావ గారు, పిల్లలు డెహరాడూన్ నుంచి ఇందాకే దిగారు. బావగారికి అనుకోకుండా సెలవు దొరికిందట. రెండేళ్ల తర్వాత " అన్నాడు. శివరాం.
ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు శంకరనారాయణ. కూతురు సునంద ఆయనకి ప్రాణానికి ప్రాణం. లాక్ డౌన్ వలన ఫోన్ కాల్స్ తప్పితే ఊరు కదిలి రావడం ఇప్పుడే !
ఇంటికి మధ్యాహ్నం భోజనానికి వెళ్ళినపుడు కారు ఏసీ వేసుకో డం కూడా మర్చిపోయాడాయన. వేడి గాలి తగులుతున్నా తెలియలేదు.
ఇంటికి వెళ్ళి కూతురిని, అల్లుడినీ బిగియార కౌగలించుకొని కానీ భార్య దగ్గరకు వెళ్ళలేదు. మనవడినీ, మనవరాలినీ చెరొక పక్క కూర్చోపెట్టుకుని దిండునానుకుని కూర్చుని అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవిస్తున్న గౌరిని చూసి కడుపు నిండిపోయిందాయనకి.
"ఇవాళ ఎండవేడి తెలియడంలేదండీ. మండు వేసవిలో మంచుగాలి వీస్తోందండీ !" అన్నది గౌరి మొఖమంతా నవ్వు నిండగా.
"కదా గౌరీ ! ఇదివరలో ఋతురాగాలు సీరియల్ పాట గుర్తుందా ? పసంత సమీరం అనిపించడం లేదూ ? హాస్పిటల్ లో ఒక పేషంట్ కూడా ఇటువంటి మాటే వాడాడు తమాషాగా లేదూ ?" అన్నాడాయన ఉప్పొంగిపోతూ !!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి