క్రమశిక్షణ @

క్రమశిక్షణ 

"భారతీ ! తొమ్మిదింబావు అయింది. కోర్టుకి వెళ్తున్నా !"


"ఒక్క నిముషం ! కిరణ్ మిమ్మల్ని ఏదో అడగాలని అంటున్నాడు."


"ఏం కిరణ్ ? ఎక్కువ టైమ్ తీసుకోకుండా చెప్పు !"


"నాన్నగారూ ! ఇవాళ సాయంత్రం మా స్కూల్ ఆనివర్సరీ ! నాకు స్టడీస్ లోనూ, క్విజ్ లోనూ మూడు ప్రైజులు వచ్చాయి, ఆ ఫంక్షన్ కి మీరు, అమ్మా ఇద్దరూ వస్తారా ?" కొంచెం బిడియంగా, కొంచెం అనుమానంగా అడిగాడు కిరణ్.


అలవాటు కొద్దీ చేతి గడియారం చూసుకుని "నేను ఫంక్షన్ లకి రానన్న సంగతి తెలుసు కదా ? అమ్మని తీసుకుని వెళ్ళు." అనేసి మరో మాట లేకుండా వెళ్ళిపోయాడు జస్టిస్ చంద్రశేఖర్.

ని‌స్సహాయంగా, నిట్టూరుస్తూ తల్లికేసి సజలనయనాలతో చూశాడు కిరణ్.

తల్లి కూడా భారంగా నిట్టూర్చి లోపలికి వెళ్ళిపోయింది.


******         ****         *******


చంద్రశేఖర్ చదువులో చాలా చురుకు. తండ్రి షార్ట్ సర్వీస్ కమిషన్ లో నేవీలో పనిచేసి కమీషన్ అయిపోయిన తర్వాత ప్రైవేటుగా లా చదివి లాయర్ గా ప్రాక్టీస్ చేసి జడ్జ్ అవుదామని ప్రయత్నించి సఫలుడు కాలేకపోయాడు. అందుకని చంద్రశేఖర్ ని చిన్నప్పటి నుంచి నువ్వు మిలిటరీలోకైనా వెళ్ళాలి, లేక జుడిషియరీ లోకైనా వెళ్ళాలి అని నూరిపోసేవాడు. 


కానీ భార్య బలవంతం మీద ఎల్ ఎల్ బీ చదివించాడు. తండ్రికి ఆనందం కలిగించేలాగ ఎల్ ఎల్ బీ ఆనర్స్ ఫ‌స్ట్ క్లాస్ లో పాస్ అయి ‌సీనియర్ లాయర్ దగ్గర జూనియర్ గా చేరి జూరిస్ప్రుడెస్స్, క్రిమినల్ లా స్పెషలైజేషన్ చెయ్యడం వలన సీనియర్ అభిమానానికి పాత్రుడై, ఏడేళ్ళ ప్రాక్టీస్ అనంతరం జుడిషియల్ పరీక్ష లో మంచి మార్కులు సంపాదించి ‌జుడిషియల్ మేజిస్ట్రేట్ గా నియమించబడ్డాడు. 


సీనియర్ కుమార్తె భారతిని ఇష్టపడి, అందరూ ఆనందంతో ఒప్పుకోగా వివాహం కూడా చేసుకున్నాడు.  


అతని క్రమశిక్షణ, ప్రతిభావంతమైన తీర్పులు అతను వృత్తిలో ఇట్టే పైపైకి సాగిపోయేలా చేశాయి.


ముందు మగ పిల్లాడు, తర్వాత అమ్మాయి కలిగి కూతురికి నాలుగు సంవత్సరాల వయస్సు వచ్చేసరికి మూడవ అదనపు జిల్లా సివిల్ జడ్జి గా పదోన్నతి పొందాడు. 


అంతా బాగానే ఉన్నా ఒకటే చంద్రశేఖర్ కి, భారతికి అభిప్రాయ భేదం. చంద్రశేఖర్ చాలా స్ట్రిక్ట్. భారతి పిల్లలకి కొంత స్వాతంత్ర్యం ఇవ్వాలంటుంది.


చంద్రశేఖర్ జడ్జ్ అయ్యేసరికి కొన్ని హద్దులు ఏర్పరుచుకున్నాడు. తీర్పులలో ఎక్కడా వేలెత్తి చూపే అవకాశం రాకూడదని ఏ శుభకార్యాలకు హాజరు అయ్యేవాడు కాదు. భారతి, పిల్లలను కూడా మరీ దగ్గర వారి పెళ్ళిళ్ళకి మాత్రమే పంపేవాడు. తను కేవలం గ్రీటింగ్ టెలిగ్రాం పంపడమో, ఫోన్ చేసి పొడిగా శుభాకాంక్షలు చెప్పడం చేసేవాడు. 


ఇది అంత ఖచ్చితంగా పాటించవలసిన నిబంధనలు కాకపోయినా అతను తభన కెరీర్ కు మచ్చ రాకూడదని భావించేవాడు.


********         ****.          ********


ఆరోజు కోర్టుకి వెళ్ళేసరికి కిరణ్ స్కూల్ ఫంక్షన్ గురించి పూర్తిగా మరచిపోయాడతను. ఠంచన్ గా తొమ్మిదిన్నర అయ్యేసరికి తన సీట్ దగ్గరికి వచ్చి కోర్టుకు నమస్కారం చేసి ఆసీనుడయ్యాడు. కోర్టు హాల్లో అందరూ కూడా నమస్కారం చేసి ఆయన కూర్చున్న తర్వాత కూర్చున్నారు.  కాల్ వర్క్ అయి వాయిదా అడిగిన కేసులకి వాయిదాలు వేసి, రెడీ అని చెప్పిన కేసుల దస్త్రాలు విడిగా పెట్టించేసరికి లంచ్ టైమ్ అయ్యింది. 


లంచ్ పూర్తి చేసుకున్న తర్వాత మొదటి కేసు విడాకులు, ఆత్మహత్య యత్నం కేసు.


అందులో ఒక పార్టీ పోలీసు డిపార్ట్మెంట్ లో సబ్ ఇన్స్పెక్టర్, అవతల అతని భార్య, ఏడేళ్ళ కొడుకు. అతను భార్యను కొడుకు ను పట్టించుకోకుండా డ్యూటీ, డ్యూటీ అంటూ తిరుగుతుంటే భార్య అనేక సార్లు నయానా, కొండొకచో ఏడ్పలతో, కొన్ని సార్లు తల్లిదండ్రులు, అత్తమామలతో చెప్పించి చూసింది. 


చివరకు విసుగెత్తి విడాకుల నోటీసు పంపింది. అది చూసి చిర్రెత్తుకొచ్చి ఆమె తల్లిదండ్రుల దగ్గర గట్టిగా పోట్లాడి కొట్టినంత పని చేశాడు.


ఆ మరునాడే ఆ అమ్మాయి కొడుకుతో సహా ఊరు పక్కన నదిలో దూకి ఆత్మహత్య ప్రయత్నం చేసింది. 

అది గమనించినది అటుగా వాకింగ్ కి వెళ్ళిన డిప్యూటీ పోలీస్ కమీషనర్ అయ్యేసరికి కేస్ అయ్యింది. 

 

ఆ రోజు ఆ ఏడేళ్ళ కొడుకు విచారణ. అందువలన రహస్య విచారణ కి అభ్యర్థించడం వలన కోర్టు హాల్ అంతా ఖాళీ చేయించి విచారణ మొదలు పెట్టాడు చంద్రశేఖర్. 


ఆ భార్య తరపు న్యాయవాది చిన్న చిన్న ప్రశ్నలతో చాకచక్యంగా ఆ అబ్బాయి చేత అన్ని విషయాలు వివరంగా చెప్పించాడు. తండ్రి ఏ నాడూ తన చదువు గురించి పట్టించుకోలేదనీ, మార్కులు బాగా వచ్చినా మెచ్చుకునేవాడు కాదనీ, తన స్కూలు పేరెంట్స్ మీటింగ్ కి వచ్చేవాడు కాదనీ, ఆ విషయంలో తన క్లాస్ పిల్లలు తన తల్లిని గేలి చేసేవారనీ వెక్కుతూ చెప్పాడు. 


అన్నీ చెప్పాక ఆ అబ్బాయి చంద్రశేఖర్ ని నేరుగా అడిగాడు "సార్ ! పోలీసులు కానీ, జడ్జీలు కాని ఎవరితోనూ కలవకూడదా సార్ ? సినిమాకీ, పెళ్ళిళ్ళకి, వేసవికాలం శెలవులకీ ఎక్కడికైనా నాన్నగారితో కూడా వెళ్ళాలని ఉంటుందండీ ! మా అమ్మ ఏడుస్తూ ఉంటే నాకూ ఏడుపొచ్చేస్తుంది సార్ ! మా అమ్మ చాలా మంచిది సార్ ! మా అమ్మే లేకపోతే ఆ ఇంట్లో నుంచి పారిపోయే వాడిని సార్ ! అందుకే అమ్మ నదిలో దూకేద్దాం అంటే సరే అనేశాను సార్ !" అని ఏడుస్తూ చెప్తూ ఉంటే అక్కడ ఉన్న కొద్దిమంది గుండెలు బరువెక్కాయి. దేనికీ చలించని చంద్రశేఖర్ కళ్ళు కూడా తడిశాయి.


ఆ మరునాటికి విచారణ వాయిదా వేసి, మిగిలిన కేసులు కూడా తర్వాత రోజు విచారిస్తానని చెప్పి చంద్రశేఖర్ ఛాంబర్ కు వెళ్ళి భారతికి ఫోన్ చేశాడు "కిరణ్ స్కూల్ ఫంక్షన్ ఎన్ని గంటలకి ? నేను వస్తున్నాను. అయిదు గంటలకి ఇంట్లో ఉంటాను." అని డిస్కనెక్ట్ చేశాడు కళ్ళు చేతి రుమాలు తో ఒత్తుకుంటూ !

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఒక పౌర్ణమి కథ

అక్కరకొచ్చిన_అనుభవం

నేనున్నా నీకు రక్షణ @