రాధిక
కీర్తన డాక్టర్ చెప్పిన మాటలకు తెల్లబోయి చూసింది.
"మీరు చెప్తోంది నిజమేనా డాక్టర్! తను ఇద్దరు టీనేజ్ ఆడ పిల్లల తల్లి. నాకు తెలిసినంత వరకూ ఆమె భర్త అర్జున్ చాలా మంచివాడు. పెద్ద కంపెనీలో మంచి పొజిషన్లో ఉన్నాడు. ఆర్థిక ఇబ్బందులు లేవు. తన లైఫ్లో ఎలాంటి ఒత్తిళ్ళు, ఆరళ్ళు లేవు. అలాంటప్పుడు దానికి ఇలా చేయవలసిన అవసరమేం ఉంటుంది...??"
"చూడండి కీర్తనా! నువ్వు మా శ్రీరామ్ భార్యవి, ఈమె ప్రాణ స్నేహితురాలివి కనుక నీకు పేషెంట్ పరిస్థితిని గురించిన వివరంగా చెప్పాను.
ఆమె కుటుంబ పరిస్థితులు ఏంటో కానీ... ఆమె ఖచ్చితంగా డ్రగ్స్ కి అలవాటు పడుతోందని మాత్రం చెప్పగలను. ఈ విషయం ఆమె భర్తకు ఇన్ఫామ్ చేసారా!?" అడిగాడు డాక్టర్ విక్రమ్.
"ఫోన్ కలవట్లేదు, మెసేజ్ పెట్టాను. అతను ఆఫీస్ పని మీద హాంగ్ కాంగ్ వెళ్లాడని చెప్పారు పిల్లలు. వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు అతని కోసం." చెప్పింది కీర్తన.
"సరే! ఆమెకు మెలకువ వచ్చేప్పటికీ అటెండెంట్ ఎవరో ఒకరు ఆమెతో ఉండేలా చూసుకోండి. అసలే తీవ్రమైన డిప్రెషన్ లో ఉందామె. నేను మధ్యాహ్నం మళ్లీ వస్తాను." చెప్పి వెళ్లిపోయాడు విక్రమ్.
"నేనే ఉంటాను తన దగ్గర." అంది కీర్తన ఆందోళనను అణుచుకోవడానికి ప్రయత్నిస్తూ .
రాధిక, కీర్తన చదువుకునే రోజుల్నించీ మంచి స్నేహితురాళ్లు. కీర్తనకు డిగ్రీ అవుతుండగానే పెళ్ళయిపోవటంతో ఆమె పిల్లలు రాధిక పిల్లల కంటే పెద్దవాళ్లు. ఆమె భర్త శ్రీరామ్ డాక్టర్. కీర్తన పెద్ద కూతురికి పెళ్ళయింది. నాలుగు నెలల క్రితం కూతురి డెలివరీ కోసం ఆస్ట్రేలియా వెళ్లి వారం క్రితమే వచ్చింది కీర్తన.
మధ్యాహ్నం కీర్తన భోజనం చేస్తుండగా, సడన్గా రాధిక వాళ్ల మెయిడ్, రాధిక ఫోన్ నుండి కాల్ చేసి, "కీర్తనమ్మా! రాధికమ్మ బాత్రూమ్ లో స్పృహ తప్పి పడిపోయిందమ్మా, సారు వేరే దేశం వెళ్ళున్నారు, పిల్లలు కూడా కాలేజీకి వెళ్ళుండటంతో ఎవరికి చెప్పాలో అర్థం కాక మీకు చెబుతున్నాను." అని కంగారుగా చెప్పేసరికి, కీర్తన గబగబా వెళ్ళి ఆమెను హుటాహుటిన హాస్పిటల్ లో ఎడ్మిట్ చేసింది.
తరచూ స్నేహితురాళ్ళిద్దరూ ఫోన్ లో సంభాషిస్తూ, ఒకరితో ఒకరు తమ వ్యక్తిగత విషయాలు పంచుకుంటూనే ఉంటారు. ఇద్దరి మధ్య రహస్యాలేం ఉండవు.
'తను ఆస్ట్రేలియా లో ఉన్న ఆ నాలుగు నెలల్లో రాధిక ఇంట్లో ఏమైనా జరిగిందా!? అయినా తనక్కడుధ్నా కూడా, అప్పుడప్పుడు తనూ, రాధిక ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉన్నారు కదా!?
ఒకవేళ నేను కూతురినీ, పాపాయినీ చూసుకునే హడావుడిలో ఉంటానని నాతో ఫ్రీగా ఏదైనా పంచుకోలేక పోయిందా రాధీ!? అయినా ఓ పద్ధతైన సాధారణ ఇల్లాలు అసలిలా డ్రగ్స్ కు ఎలా అలవాటు పడింది!?" ఆలోచిస్తుంటే బుర్ర వేడెక్కి కీర్తనకు. మనసు మనసులో లేదాదామెకు.
*******
ఇంటికి వచ్చాక కీర్తన రాధికకి నీరసంగా ఉండటంతో బ్రతిమాలి వేడిగా అన్నం దగ్గర కూర్చుని తినిపించాక ఏసీ వేసి నిద్రపోయే దాకా అవీ ఇవీ కబుర్లు చెప్తూ కూర్చుంది. ఆమె డాక్టర్ ఏమన్నాడు అని అడిగితే ఎండాకాలం లో వచ్చే లో బ్లడ్ ప్రెషర్ అన్నాడని చెప్పి సంభాషణ మార్చింది. గాఢ నిద్రలోకి వెళ్ళాక పిల్లలతో మాట్లాడింది. వాళ్ళు కూడా ఏమీ తేడా అనిపించలేదు అని చెప్పారు. పెద్దది పల్లవి ! సంగీతం మీద మక్కువతో పల్లవి అన్న పేరు పెట్టుకుంది, రెండవ పాప ఝాన్సీ. ఝాన్సీ మీద వర్షిప్ తో ఆ పేరు పెట్టుకుంది. పల్లవి ఇంటర్ చదువుతున్నది. సంగీతం మీద పెద్దగా ఇష్టత లేదు. ఝాన్సీ మాత్రం చదివేది పదవ తరగతి ఐనా చదరంగంలో చాలా స్పీడ్. ఆ ఊళ్ళో జూనియర్, సీనియర్ ఆటగాళ్లు కూడా ఝాన్సీతో బ్లిట్జ్ గేమ్ ఆడాలంటే భయపడతారు.
ఝాన్సీ మాత్రం పల్లవి లోపలకు ఏదో పని మీద వెళ్ళినపుడు "ఆంటీ ! అమ్మ ఈ మధ్య ఎందుకో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. ఏమిటని అడిగితే ఓ ముద్దు పెట్టేసి నీ మొహం అనేసింది ఒకటి రెండు సార్లు" అన్నది.
ఆ మాట విన్నాక మళ్ళీ రాధిక గదిలోకి వెళ్ళి ఆమె సెల్ఫోన్ చూసింది. లాక్ అయి ఉండేసరికి వదిలేసింది. డెయిరీ ఏమన్నా కనపడుతుందేమో అని వెతికింది. డెయిరీ ఉన్నది కానీ అందులో ఏమీ వ్రాసి లేదు. కానీ డెయిరీ కింద ఒక కవర్ కనిపించింది. కేవలం ఉత్సుకతతో అందులో ఏమన్నా క్లూ దొరుకుతుందేమో అని చూసిన కీర్తనకి అందులో ఉన్న కాగితాలు చూసేసరికి మనసు దిమ్మెర పోయింది.
******* ******* ******
దాదాపు రెండున్నర సంవత్సరాల నుంచీ అప్పుడప్పుడు వివిధ దేశాలకి రాధిక భర్త అర్జున్ వెళ్ళిన ఫ్లైట్ టికెట్ల జిరాక్స్ కాపీలు. అందులో అర్జున్ తో పాటు రాధిక పేరు కూడా ఉంది. కీర్తనకి గత మూడేళ్ళుగా రాధిక విదేశాలు కాదు కదా, బయట ఊరుకి వెళ్ళినది కూడా లేదని తెలుసు. ఆమె పుట్టిల్లు ఆ ఊరే. ఆమె తల్లి మరణించి ఐదేళ్ళవుతుంది. ఆమె అన్న, వదిన ఆమె తండ్రితో ఊరుకి వేరే వైపున సొంత ఇంట్లో ఉంటారు.
****** ******* *******
మరునాడు ప్రొద్దుటే ఫోన్ చేసింది ఝాన్సీ కి. "అమ్మ ఇంకా నిద్రపోతోంది అత్తా ! చాలా ప్రశాంతంగా నిద్ర పోతోంది, అందుకనే లేపలేదు. నేను, అక్క అన్ని పనులు చేసేశాము. మా ఇద్దరికీ బిజీ అత్తా ! నువ్వు రాగలవా? అమ్మకి తోడుగా ? ప్లీజ్ !"
"అదేంటి ఝాన్సీ ! నువ్వే బేలవైపోయావు ! నేను ఇవాళ క్యాజువల్ లీవ్ పెట్టేసి వస్తాను. శ్రీరామ్ కూడా మెడికల్ కాన్ఫరెన్స్ అని గుంటూర్ వెళ్ళారు. రాత్రి లేట్ అవుతుంది. అందుకని ఇవాళ అంతా మీ అమ్మ దగ్గరే ఉంటాను. నాన్నగారు ఫోన్ చేశారా?"
"లేదత్తా ! వాట్సాప్ ఫోన్లో బిజీ అని వస్తోంది !"
"సరే ! నేను ఎనిమిదిన్నర కల్లా అక్కడ ఉంటాను" అని డిస్కనెక్ట్ చేసింది.
రాత్రి శ్రీరామ్ తో మాట్లాడదాము అనుకుంటే వచ్చేసరికే నిద్రపోయాడు. తెల్లారే బయల్దేరి గుంటూరు వెళ్ళాలని తెలుసు కాబట్టి నిద్ర లేపలేదు. తను తెల్లారి లేచేసరికి బయల్దేరి వెళ్ళిపోయాడు. 'పొనీలే ! విజయవాడ ఫ్లైట్ ఉదయమే ! అక్కణ్ణుంచీ కార్లో గుంటూరు వెళ్ళాలి కదా !' అనుకుంది.
గబుక్కున ఏదో ఆలోచన వచ్చి శ్రీరామ్ కాగితాలు వెతికితే ఫ్లైటు జిరాక్స్ కనబడింది. అందులో పాసెంజర్ శ్రీరామ్ పేరు ఒక్కటే ఉండేసరికి అమ్మయ్య అనుకుంది. మరుక్షణంలోనే తనను తాను తిట్టుకుంది భర్తని అనుమానించినందుకు.
ఎనిమిదింటికి క్యాబ్ లో బయల్దేరిన రాధికకి అనేక ఆలోచనలు. ఎట్లా ఈ సమస్యను పరిష్కరించాలా అని.
కీర్తన ఇంటికి చేరేటప్పటికి ఒక ఆలోచన వచ్చింది. రాధిక రూమ్ లోకి వెళ్ళేసరికి తను పళ్ళు తోముకుని మంచం మీద కూర్చుని కాఫీ తాగుతోంది. పల్లవి, ఝాన్సీ ఒకరి తర్వాత ఒకరు వచ్చి 'అమ్మా ! ఎలా ఉన్నావు ?' అని కౌగలించుకొని బుగ్గమీద ముద్దు పెట్టి బై చెప్పి వెళ్ళిపోయారు.
******* ******* *******
"రాధికా ! నీ ప్రాబ్లం ఏమిటి ? డిప్రెషన్ ఎందుకు ? డ్రగ్స్ కి ఎందుకు అలవాటు పడ్డావు?" అన్న ఉపోద్ఘాతం లేని కీర్తన ప్రశ్నలకి నిరుత్తరురాలైంది రాధిక !
నీ అదృష్టం ! అర్జున్ లాంటి భర్త, పల్లవి, ఝాన్సీ లాంటి దీపాలలాంటి పిల్లలు ! డిప్రెషన్ కి లోనవాల్సిన పరిస్థితులు ఏమున్నాయే ? స్కూల్ రోజుల నుంచి కాలేజీ వరకూ ప్రాణానికి ప్రాణంగా ఉన్నామే ! నాకు కూడా చెప్పలేని పరిస్థితులు ఏమి ఉన్నాయి ? మీ అన్న పవనన్నయ్య, బాబాయి నిన్ను ప్రాణంగా చూసుకుంటారే ? అపర్ణ వదిన నిన్ను స్వంత చెల్లెలు లాగా చూసుకుంటుందే ? ఎక్కడ నీ ప్రాబ్లం ?"
"ఇవేమీ కాదే కీర్తీ! సారీయే ! నీతోనైనా చెప్పి ఉండాల్సింది." అని స్నేహితురాలిని కావులించేసుకుని వలవలా ఏడుస్తున్న రాధిక వీపు నిమురుతూ ఉండిపోయింది కీర్తన.
"అసలు నీకు డ్రగ్స్ ఎలా అలవాటయ్యాయే ? నువ్వు నీ అంతట ఎప్పుడూ షాపింగ్ కి కూడా వెళ్ళక్కరలేదే. ఏం కావాలంటే నిమిషాలలో తెప్పించేస్తాడు అర్జున్. పిల్లలు కూడా నీకేం కావాలో మరీమరీ అడిగి తీసుకొస్తారు కదా ?"
అర్జున్ బిజినెస్ టెన్షన్ లో ఉన్నప్పుడు నిద్రకి వాడే మాత్రలతో మొదలయ్యింది. కొన్నాళ్ళకి అర్జున్ కి అనుమానం వచ్చి మాత్రలు దాచెయ్యడం మొదలు పెట్టాడు.ఒకటి రెండు సార్లు తెలిసిన మెడికల్ షాపులో తీసుకున్నాను. కొన్నాళ్ళకి షాపతను కూడా "డ్రగ్ ఇన్స్పెక్టర్ ప్రిస్క్రిప్షన్ అడుగుతున్నాడ"ని ఇవ్వడం మానేశాడు. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే ఈవినింగ్ వాక్ కి రెగ్యులర్ గా కలిసే ఒక అమ్మాయి మందుల కన్నా బాగా పని చేస్తాయి అని వేరే మాత్రలు, పొడులు ఇచ్చేది. పొడి ముక్కు పొడిలా పీల్చాలి అని చెప్పింది. డబ్బులు బాగానే తీసుకునేది. అవి తీసుకుంటే ఎంతో హాయిగా ఉండేది. ఈ మధ్య ఆ అమ్మాయి కనిపించడం లేదు. నాకు ఆ మాత్రలు, పౌడర్లు లేక పిచ్చెక్కిపోయింది. నిన్న అందుకనే కళ్ళుతిరిగి పడిపోయాననుకుంటా ! పిల్లలు ఉదయం చెప్పారు. నిన్ను సీతాలు పిలవడం మంచి పని చేసింది. నువ్వు తప్ప ఇంకెవరున్నారు ?" అని మరొక్క సారి భోరుమంది రాధిక.
"ఇంతకీ కారణమేమిటో చెప్పనే లేదు. అర్జునే కదూ ?" అన్న మాటలకి దెబ్బ తిన్న లేడిలా చూసింది రాధిక.
"పిచ్చి మొద్దూ ! నిన్న నువు గాఢంగా నిద్ర పోయాక నీ వస్తువులు, డెయిరీ వంటివి వెతికితే అర్జున్ ఫ్లైట్ టికెట్లు జిరాక్స్ లు కనిపించాయి. దాని మీద నీ పేరు ఉందనేగా నీకు అనుమానం ? నీ పేరుతో ఎవరినో విదేశాలు తీసుకెళ్ళి ఎంజాయ్ చేస్తున్నాడనేగా నీ అనుమానం, దుఃఖం ?"
మళ్ళీ తుళ్ళి పడింది రాధిక. కళ్ళు మళ్ళీ చెలమలైనాయి.
"నీకు త్వరగా పెళ్ళి అయ్యేసరికి లోకజ్ఞానం రాలేదే రాధీ ! ఇప్పుడు ఫ్లైట్లలో పేరు చెప్పి ఎక్కెయ్యడమే అనుకుంటున్నావా ? ఆధార్ లేక పోతే పాన్ కార్డ్ కంపల్సరీ. నేను నిన్న రాత్రి రాధిక పేరు పక్కన పాన్ కార్డు నోట్ చేసుకుని ఇంటికి వెళ్ళే ముందు మా తమ్ముడు శ్యామ్ తెలుసుగా ? ఇన్కమ్ టాక్స్ అసిస్టెంట్ కమిషనర్ ! వాడికి ఇచ్చాను. నేను ఇంటికి వెళ్ళేసరికి అన్ని వివరాలు ఇచ్చాడు, ఆ నెంబర్ ఆవిడ వివరాలన్నీ ఇచ్చాడు. ఆవిడ రాధికా జోషి. అర్జున్ కంపెనీలో నే ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్. అర్జున్ కొలీగ్. నీకెప్పుడూ పరిచయం చెయ్యలేదా ?"
పాలిపోయిన ముఖంతో " ఆవిడ తెలుసు. అర్జున్ చెప్పాడు. మిసెస్ జోషీ అని చెప్పాడు. జోషీ గారిని కూడా పరిచయం చేశారు. ముచ్చటైన జంట, కవల పిల్లలు కూడా ! ముద్దొస్తూ ఉంటారు. అంకుల్ ! ఆంటీ అని కలిసిపోయారు. పైగా ఆవిడ పెద్దావిడ ! ఆ తర్వాత ఆవిడ పేరు కూడా రాధిక అని తర్వాత అర్జున్ చెప్పాడు కానీ నేను పెద్ద పట్టించుకోలేదు." అంటూ చేతుల్లో మొహం దాచుకుని వెక్కివెక్కి ఏడ్చింది. "ఈ మాటే అర్జున్ ని అడిగి ఉంటే ? నేను ఆయనకి నా ముఖం ఎలా చూపించగలిగే దానిని ? కీర్తీ ! నీ ఋణం ఎలా తీర్చుకోనే ?" అని మళ్ళీ బరస్ట్ అయింది రాధిక.
ఇది మన మధ్యే ఉంటుంది. బుద్ధిగా ప్రతివారం మా శ్రీ రామ్ ఫ్రెండ్ ఉన్నారుగా ! డాక్టర్ విక్రమ్, ఆ డాక్టర్ దగ్గరకి వెళ్దాం ! డీ అడిక్షన్ ట్రీట్మెంట్ తీసుకో. ఇదే నాకు నువు తీర్చుకునే ఋణం" అని గాఢంగా ఆమెని హత్తుకుంది కీర్తన !
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి