నాదైన శైలిలో సంక్షిప్త రామాయణం
🙏🙏🙏🙏
జగమున రాముడె చూడగా యొక్కడు
చూడ సాటి లేరు వేరు నెవరు
నిజము మృదువుగ బల్కు నీతిమంతుడు యతడు
మానవుడిగ జనియించు మాధవుఁడెగా
కొడుకన్న ఈతడే కొడుకు నిక్కముగాను
కౌశికు వెంటను జనెను తండ్రి జెప్ప
అన్నయన్న యితడు అన్న అన్నన్న !
అస్త్ర విద్యలెల్ల అనుజు కిచ్చె
శిష్యుడన్న యితడు శిష్యుడే శిష్యుడు
అతివ తాటకిని గురువాజ్ఞను దునిమె
భగవంతుడనుకొన్న భగవంతుడే నితడు
గౌతమ పత్నిని గారవించె
వీరుడన్న నితఁడు వీరుడు శూరుడు
హరుని విల్లు నిట్టె విరచి వేసె
పుత్రుడన్న నితఁడు పుత్రుడు సత్యము
తండ్రి ఆజ్ఞ మేర తాళి గట్టె
పెద్ద వారి యెడల పెళుసు కాడితడు
పరశురాముని పట్ల ప్రేమ జూపె
పతి యన్న రాముడు పతిదేవుడేను
మైథిలికెంతను మహనీయుడయ్యె
కొమారుడన్న నితఁడు కొమరుడెర నిజముగా
తండ్రి యానమేర వనము జనియె
కౌసల్య సతి కితడు బాలుడు బాలుడే
అడవికేగ యామె వెంటబడెను
ప్రభువన్న నీతడు ప్రభువేగ చూడగ
గుహుని యాదరించి గుండె జేర్చె
అగ్రజుడిగ తాను భరతు నాదరించి
పాదుకలొసగి పంపె ప్రభుత కొరకు
ధీరుడన్న నితఁడు ధీరుడు ధీరుడే
విరాధు వధియించి విక్రమించె
అణకువ గలవాడు అత్యంత భక్తితో
అగస్త్య మునివర్యు ఆతిధి యయ్యె
జన్యువంటి వాడు జటాయు గాంచియు
జనకుని గనినట్లు జవమునొందె
పంచవటిని జేరి పర్ణశాల యందు
పుడమిపట్టి జేరి పరిఢవిల్లె
పతిని జేరి పులకతో పైడి జింకను కోర
సీత ముద్దు తీర్చ సిద్ధ పడియె
మాయావి మారీచు మాయను ఛేదించి
వధియించెనాతని యమ్ము వేసి
సీతను గాంచక పర్ణశాలయందు
కృంగిపోయెనతడు కృద్ధుడయ్యె
అస్తమించునట్టి అనురు సుతుని గాంచి
ఆవురంచు యేడ్చె అంకమును జేర్చి
శబరి యిచ్చినట్టి మధుర ఫలములను గొని
సశరీర ముక్తి గని సంతసించె
వాయు సుతుని కాంచి వాలి కధను విని
సుగ్రీవు దరి జేరి సఖుడు నయ్యె
వాలిని వధియించు వాగ్దానమ్మును
నెరవేర్చె సోదరుల కయ్యమందు
వైదేహి వెదుకగా వైనముగ పావనికి
అంగుళీయకమిచ్చి ఆశీర్వదించె
స్వామియనగ నితడు స్వామియే పావనికి
సీత జాడ తెలియ సంతసించె
ఏమివ్వగలనని హనుమకు రాఘవుడు
ఆలింగనమునిచ్చె అచ్చెరువు నంద
సీత జాడ తెలిసి సంద్రమేగి యతడు
వారధి నిర్మించె వానరుల తోడ
రావణానుజుడొచ్చి రక్షణ కోరగా
అభిషేకమొనరించె లంకా పురికిని
అని యందు వేగమున అంతమొందించేను
లంకేశు సుతులను కుంభకర్ణుని కూడ
ఇంద్రజిత్తుని జంపె సౌమిత్రి యప్పుడు
రావణు శక్తియును సగము చేసె
వైరియన్న నితడు వైరియే యంతటను
అస్త్రముల బారి పడి యలసి యున్న
పౌలస్త్యు గని తానుపొమ్మనెను యింటికి
విశ్రాంతి నొంది మరి మరలిరమ్మనె యనికి
అతి భీకరమ్మౌ అస్త్ర శస్త్త్రముల తోడ
రామ రావణ రణము రాత్రి పవలు
యనక సాగెను సురలు యచ్చెరువు నొంద
వీరి రణము యెంత వీరిదే సాటియన
బ్రహ్మ యస్త్రము తోడ బ్రహ్మ పౌత్రుని గూల్చి
లోక కంటకము బాపె లోకేశ్వరుడును
సీత యనఘత్వంబు సర్వులును తెలియగా
అనలమ్ము జేరంగ యానతిచ్చె
అగ్ని దేవుడంత అవనిజను దెచ్చె
మచ్చలేనిదంచు విన్నవించె
వైదేహి, లక్ష్మణ వానరాదుల తోడ
పురుషోత్తముడు నెక్కె పుష్పకమును
సాకేతమును జేరి సంతోషముల తోడ
భరతుని తల్లులను కలిసె వారందరును
సీతతో శ్రీరామ పట్టాభిషేకము
కనుల పండువగ జరిగె కాంతులీన
భాగ్యమనిన యెంతొ భాగ్యము వారిదే
అయోధ్యవాసుల యదృష్టమేమో
రాజుగ పొందిరి రాముని వారును
రాజులకు రాజుగద రఘు పుంగవుడు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి