అమ్మ మనసు @
అమ్మ మనసు
ఐ సి యు లోనుంచి బయటికొచ్చి గౌను, మాస్కు విప్పుతున్న కాంచన కేసి ప్రశార్ధకం గా చూసాడు గౌరీశంకర్.
నిర్లిప్తంగా ఉన్న ఆమె ముఖం చూసి మనస్సు కలుక్కుమంది. "ఎట్లా ఉన్నదంటావు ?" అని అడిగాడు.
"గుర్తు పట్టలేదు. కళ్ళు అప్పుడప్పుడు తెరిచి చూస్తోంది. నన్ను చూసి కూడా ముఖం లో ఏమీ మార్పు లేదు."
'పిలిచి చూశావా " అని అడిగాడు ఆశగా.
"లేదు" అని క్లుప్తంగా అని. "నేను వెయిట్ చేస్తాను" అని వెళ్ళిపోయింది కాంచన.
కళ్ళలో నీళ్లు గిర్రున తిరిగాయి అతనికి. గౌను, మాస్కు ధరించి లోపలకి వెళ్ళాడు.
*******
చిన్నతనం నుంచి అంటే జ్ఞానం వచ్చినప్పటి నుంచి తల్లి అంటే మొదలు కొంత భయము, తరువాత కొంత కోపము, చివరికి వైముఖ్యం కాంచనలో పాతుకుపోయింది.
ఒక్కతే కూతురు అని తల్లి తనను ముద్దు చేసిన గుర్తు లేదు కాంచనకి. తండ్రి దగ్గరే చనువు ఎక్కువ.
పదో క్లాసు వరకూ ఇంట్లోనే ఉంది చదివినా తల్లి మీద ఉక్రోషం తో ఇంటరు, ఇంజనీరింగ్ హాస్టల్ లో ఉండి చదువుకుంది. తండ్రితోనే ఎక్కువ ఫోన్లో మాట్లాడేది. తల్లితో పొడి పొడిగా ఎదో నాలుగు మాటలు. అంతే !
ఫైనల్ ఇయర్లో క్లాసు మేట్ ని ఇష్టపడి పెళ్లి చేసుకుంటానని ఇంట్లో చెప్పినపుడు ముందు ఒప్పుకున్నట్లే ఉండి నెల రోజుల తరువాత ఒద్దు అని ఆ సంబంధం ససేమిరా వల్లకాదంది తల్లి.
తరువాత కాంపస్ సెలక్షన్ లో ఒచ్చిన ఉద్యోగంలో చేరంగానే బలవంతంగా పెళ్లి చేసేసింది.
ఆ తరువాత ఒక సంవత్సరం తరువాత గర్భిణీ రావడం, భర్త ఆరో నెల రాగానే ఉద్యోగం మానిపించేయడం జరిగిపోయి అదంతా తల్లే చేయించిందని పురుడు అత్తవారింటే పోసుకుని, కొడుకు పుట్టాక పుట్టింటి గడప తొక్కడం మానేసింది
తల్లికి సెరిబ్రల్ స్ట్రోక్ వచ్చి ఇంటెన్సివ్ కేర్ లో ఉందని తండ్రి కన్నీళ్లతో బ్రతిమాలితే భర్త కూడా మందలించి పంపడంతో తప్పక బయలుదేరింది.
*****
తల్లిని గుర్తు పట్టలేదు కాంచన. బెడ్ నంబర్ చూసుకుని నిర్ధారించుకుని దగ్గరకు వెళ్ళి "అమ్మా !" అని పిలిచింది.
ఆ పిలుపు మెదడు లోతుల్లో ఎక్కడో తట్టినట్లై కళ్ళు కొద్దిగా తెరిచింది కానీ ఆ గాజు వంటి నయనాలలో గుర్తు పట్టిన దాఖలాలు కనిపించ లేదు. ఇంక మాట్లాడేటందుకు ఇష్టం లేక కాసేపు ఈ సీ జీ మానిటర్ వైపు నిస్తేజంగా చూసి, నర్సు కేసి తిరిగి తల పంకించి బయటకు వచ్చింది.
*******
బయట వెయిటింగ్ హాలు లో తండ్రి ప్రక్కనే కూర్చుని "నీ ఆరోగ్యం ఎలా ఉంది నాన్నా?" అని అడిగింది.
గబుక్కున కళ్ళ నీళ్ళు నిండగా "నాకేమమ్మా ! బాగానే ఉన్నాను. నా ఆరోగ్యం కొంచెం అమ్మకి బదలాయిస్తే ఆ దేవుడికి ఋణపడి ఉంటాను" అంటూ ఉండగానే ఏడుపు వచ్చేసి తండ్రి వెక్కి వెక్కి ఏడవడం చూసి కాంచన మ్రాన్పడి పోయింది. ఎప్పుడూ తండ్రి కంట నీరు చూడక పోవడం వల్ల ఆమె కూడా కదలి పోయింది.
"నాన్నా ! ఊరుకో ! ధైర్యంగా ఉండే నువ్వే ఇలా అయిపోతే ఎలా ? ట్రీట్మెంట్ చేయించడం చేయిస్తున్నావు కానీ ఆయుష్షు పోయడం నీ చేతిలో లేదు కదా ?" అంది.
"ఏమైనా తగ్గే అవకాశం ఉందంటావా తల్లీ? " అని ఆశగా అడుగుతున్ప తండ్రికి ఏ సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయింది కాంచన.
"నీకు అమ్మ మీద వైమనస్యం ఉన్నదని గమనించాను. అమ్మని అడిగినా దాటవేసేది కానీ ఎప్పుడూ ఎందుకు అన్నది చెప్పలేదు. అమ్మకు తగ్గుతుంది అని కూడా చెప్పడానికి ఇష్టం లేనంత విముఖత ఎందుకమ్మా ?" జీరపోయిన గొంతుతో అడిగిన తండ్రి తో ఏమి సమాధానం చెప్పాలో తెలియక తడబడుతూ ఉండగా రక్షించడానికా అన్నట్లు మేనత్త వచ్చింది.
"గౌరీ ! నువ్వూ అమ్మాయి ఇంటికి వెళ్లి భోజనం చేసి కొంచెం రెస్ట్ తీసుకుని రండిరా . మీరొచ్చే దాకా నేను ఉంటాను"
"హమ్మయ్య!" అని లోపలే అనుకుని లేచి బయల్దేరబోయింది.
తండ్రి మాత్రం వెంటనే లేవలేదు. "అక్కా ! నేను వచ్చేదాకా ఉంటుందంటావా ?"
"అవేం మాటలురా ? మహాలక్ష్మి బంగారు తల్లి ! కాంచన కూడా వచ్చింది కదా! తేరుకుంటుంది చూడు " అన్నదే కానీ ఆ గొంతు నిరాశగానే అనిపించింది కాంచనకి.
****
కార్లో గౌరీశంకర్ అడిగాడు. "నేనిందాక అడిగినదానికి జవాబు చెప్పలేదు తల్లీ !"
ఒక్క నిముషం ఆలోచనలు కూడగట్టుకుంది కాంచన.
"నాకు బుద్ధెరిగాక నేను అడిగినవి కానీ నాకు ఇష్టమైనవి కానీ ఏమీ చెయ్యలేదు, చెయ్యనివ్వలేదు ఇంక నాకు ఇష్టం ఎలా ఉంటుంది నాన్నా ?"
ఒక్క నిముషం గుండెని పిండినట్లు అనిపించింది గౌరీ శంకర్ కి.
"అమ్మలూ ! నీకు తెలియదురా ! నీ కోసం ఎన్ని ఒదులుకుందో ! ఎన్ని త్యాగాలు చేసిందో !"
విరక్తిగా నవ్వింది కాంచన "త్యాగం ! అంత పెద్ద పదాలెందుకులే నాన్నా ? నన్ను కన్విన్స్ చేయడానికా ఈ మాటలు చెప్తున్నావు ?"
"నిజం చెప్తున్నానమ్మా ! నువ్వు నమ్మినా నమ్మక పోయినా !"
"ఒద్దులే నాన్నా ! అంత శ్రమ పడద్దు ! చిన్నప్పటి నుంచి నేను ఏమి తినాలి దగ్గరనుంచి ఏమి బట్టలు వేసుకోవాలి, ఏ స్కూలుకి వెళ్ళాలి, ఏమి ఆటలు ఆడాలి, ఎవరితో స్నేహం చెయ్యాలి అన్నీ అమ్మే నిర్ణయించేది. నాకు ఆలోచనలు, ఇష్టాలు పంచుకోవడానికి, గిల్లి కజ్జాలకి కూడా తమ్ముళ్ళో చెల్లాయిలో ఎవరూ లేరు. చిన్నపుడు అమ్మ మీద ఇష్టంతోనో భయం తోనో తాను చెప్పినట్లే చేసేదాన్ని. ఇంటర్ లో నాకిష్టమైన కాలేజ్ లో నాకిష్టమైన గ్రూపు కాకుండా ఉమెన్స్ కాలేజ్ లో బై పి సి కాకుండా ఎం పి సి లో చేర్చింది. ఇంజనీరింగ్ కాలేజ్ లో కూడా నాకు నచ్చే ఎలెక్ట్రికల్ కాకుండా కంప్యూటర్స్ గ్రూప్ తీసుకొమ్మని బలవంతం చేసింది. ఫైనల్ ఇయర్ లో నాకు నచ్చిన నవీన్ ని ముందు సరే అని తర్వాత వొద్దని ఆ పెళ్లి చెడగొట్టేసింది. నాకు ఉద్యోగం ఒక్కటీ నేను ఏమంటానో అన్న భయంతో ఒప్పుకుంది. లేకపోతె ఆ ఉద్యోగం కూడా చేసే దాన్ని కాదు. అమ్మ ఏం చెప్పిందో కానీ విష్ణు కడుపున పడ్డాక ఆయన ఉద్యోగం మానెయ్యమని హఠం చేశారు. ఇంక అమ్మ చేసిన త్యాగం ఏమిటి నాన్నా ?" కాంచన కంఠం రాను రానూ రుద్ధమైపోయింది
ఇంతలో ఇల్లొచ్చేసింది.
****
భోజనం అయిందనిపించి ఒక అరగంట నడుం వాలుస్తానని మంచం మీద చేరాడు గౌరీశంకర్. పక్కనే వాలుకుర్చీ వేసుకుని కూర్చుంది కాంచన.
"అమ్మలూ ! నీకు తెలిసే ఉంటుంది మా పెళ్లి అయ్యాక పదమూడేళ్ళకి నువ్వు పుట్టావు. ఆ లోపు అమ్మ అన్ని వైపులా ఎన్నో మాటలు భరించింది. అన్ని టెస్టులూ ఇద్దరమూ చేయించుకున్నాము. ఏ ప్రాబ్లమూ లేదన్నారు. చివరికి నిన్ను కన్న రోజున ఎంత మురిసిపోయిందో ! గులాబీ మొగ్గలాగ ముద్దొచ్చే నిన్ను ఎన్ని ముద్దులాడేదో. హాస్పిటల్ నుంచి ఇంటికొచ్చిన రోజున నన్నేమడిగిందో తెలుసా ? మళ్ళీ గర్భిణీ వచ్చి ఇంకొక బిడ్డ పుడితే నిన్ను చూసుకోవడం కుదరదని, అంత లేటుగా గర్భిణీ రావడం మంచిది కాదనీ అందుకని ఆపరేషన్ చేయించుకుంటానని బ్రతిమాలింది.నేనూ తన ఆరోగ్య రీత్యా ఒప్పుకున్నాను."
"నీకు తెలియని విషయం ఇంకొకటి చెప్పనా తల్లీ ? నువ్వు కడుపున పడక ముందు అమ్మ డెప్యూటీ తహసీల్దార్ రాంక్ లో ఉద్యోగం చేసింది ఇంకొక తొమ్మిది నెలలలో తహసీల్దార్ గా ప్రమోషన్ వచ్చేది. వేరే ఆలోచన కూడా లేకుండా రాజీనామా చేసింది."
నిర్ఘాంతపోయింది కాంచన.
"నువ్వు పుట్టాక నీ కోసం ఒదులుకున్నవి చెప్పనా అమ్మా ? త్యాగం అన్న మాట వాడనులే !
అన్నిటి కన్న ముందు నిద్ర ఒదులుకుందమ్మా ! తాను నిద్రకి ఆగగలిగేది కాదు. నీకు పసితనం నుంచి నిద్ర తక్కువ. ఏడిచే దానివి కాదు కానీ అలా చూస్తూనో కాళ్ళూ చేతులూ ఆడిస్తూనో ఉండేదానివి. నీకు ఏ క్షణంలో ఏమి కావాల్సి వస్తుందో అని ఎప్పుడూ మెలకువగా ఉండేది. నువ్వు నిద్ర పోయిన రెండు మూడు గంటలే తాను కూడా నిద్ర పోయేది. నువ్వు కొద్దిగా కదలాగానే లేచిపోయేది. నువ్వు హాస్టల్ కి వెళ్లాకే కంటి నిండా నిద్ర పోయింది. "
అప్రతిభురాలైపోయింది కాంచన.
"సిగ్గు వదిలేసిందమ్మా ! ఎవరైనా పబ్లిక్ గా పిల్లలకి పాలు ఇస్తుంటే నచ్ఛేది కాదు తనకి. నువ్వు పుట్టాక ఎప్పుడూ నీకు పాలు ఇవ్వడానికి బిడియపడలేదు."
"స్నేహితులని వదిలేసిందమ్మా ! తనకి మామూలు స్నేహితురాళ్ళు, ప్రాణ స్నేహితురాళ్ళు చాలా మందే ఉండేవారు. ఎప్పుడో వాళ్ళు రావడమో లేకపోతే ఫోన్ చెయ్యడమో తప్పితే తను ఫ్రెండ్స్ ని కాంటాక్ట్ చేసింది వేళ్ళ మీద లెక్క పెట్ట వచ్చు అమ్మా !"
"చిన్నప్పటి నుంచీ నీకు ఏవి యిష్టమో చాలా కీన్ గా గమనించేది. నీ స్నేహితులతో ఎవరు నీ వేవ్ లెంగ్త్ లో ఉంటారో ఇట్టే పట్టుకునేది.అందుకే కొందరు పిల్లలని దూరం గా అట్టేపెట్టేది. నీకు ఇష్టమైన సబ్జక్ట్స్ కూడా తను బాగా గుర్తు పెట్టుకునేది. బై పి లో నిన్ను ఎందుకు చేరనివ్వ లేదో తెలుసా ? నీకు జంతువులంటే ప్రాణం. వాటిని డిసెక్ట్ చేయడం నీకు ఇష్టం ఉండదని ఎం పి సి లో చేరిపించింది . నీకు కంప్యూటర్స్ లో ఆసక్తి గమనించి ప్రోత్సహించేది. నువ్వు అమ్మకి వ్యతిరేకంగా ఉండే దానివి కాబట్టి ఎలెక్ట్రికల్స్ లో చేరతానని హఠం చేసావు. అవునా అమ్మా ?"
కళ్ళ నీళ్లతో తల ఊపింది కాంచన.
"నవీన్ ని పెళ్లి చేసుకుంటానని అన్నపుడు ముందర అతన్ని చూసి అమ్మ కూడా ఇష్టపడింది. కానీ నీ సుఖం కోసమే తపించే అమ్మ అతని గురించి ఎంక్వయిరీ చేయించింది. అతనికి తాగుడు జూదం లాంటి దురలవాట్లే కాక ఇంకొక అమ్మాయితో అఫైర్ ఉందని తెలిసి ససేమిరా అతనితో పెళ్లి వల్ల కాదంది ."
కాంచనకి తన పెళ్లి అయిన తరువాత నవీన్ పెళ్లి చేసుకుని ఆ తరువాత ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్న సంగతి జ్ఞాపకం వచ్చింది. మనసు కలుక్కుమంది.
"నీకు తన మీద అయిష్టం పెరిగిపోతున్నా నీ సుఖమే తను కోరుకుంది. నీకు గర్భిణీ వచ్చాక అల్లుడితో చెప్పి ఉద్యోగం మాన్పించింది నిజం కాదమ్మా ! అల్లుడే నీ ఆరోగ్య రీత్యా మానిపించాడు. నీకు ఇంకా పిల్లలు ఉండాలి అనీ, నీకు ఎవరూ తమ్ముళ్లు, చెల్లెళ్ళు లేని విషయం చెప్పి, మీరు ఇంకా చిన్న వాళ్ళే కాబట్టి విష్ణు తో ఆపవద్దని అల్లుడి దగ్గర మాట తీసుకుందమ్మా !"
కాంచన కళ్ళ వెంట ధారాళంగా కన్నీళ్లు కారిపోతున్నాయి. గబుక్కున గది బయటికి వెళ్ళిపోయి భర్తకి ఫోన్ చేసింది. " విష్ణుని తీసుకుని వెంటనే రండి. కంగారేమీ లేదు". అని.
****
మూడు నెలల తరువాత
తల్లిని నెమ్మదిగా నడిపించుకుంటూ దేముడి గదిలోకి తీసుకొచ్చింది కాంచన. అమ్మమ్మ చెయ్యి పట్టుకుని తప్పటడుగులు వేస్తూ విష్ణు కూడా వచ్చాడు.
దేవుడికి భక్తిగా దణ్ణం పెట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకొచ్చి కూర్చోపెడుతుండగా ఫోన్ మోగింది.
"మేము బాగానే ఉన్నాము, మీరెలా ఉన్నారు ? అత్తయ్య గారు బాగానే ఉన్నారా ? బి పి మాత్రలు రెగ్యులర్ గా ఇస్తున్నారా ?" అడుగుతున్న కాంచనని ఆపి "అత్తయ్య గారికి ఎలా ఉంది ? " అని అడిగాడు భర్త.
" చాలా తేరుకుందండీ. ఇవాళే దేవుడి గదిలోకి వచ్చింది. భోజనం కూడా డైనింగ్ టేబుల్ దగ్గర. నడవడం ఇంకా కొంచెం కుంటుతున్నట్లు ఉంటోంది, మూతి వంకర పోవడం తగ్గడానికి ఇంకా టైం పడుతుందని డాక్టర్ చెప్పారు. మామూలుగా మాటలు రావడానికి కూడా టైం పడుతుందిట విష్ణు తో మాత్రం వాడి భాషలోనే మాట్లాడుతోంది" అంటూ విరగబడి నవ్వింది కాంచన.
"ఏమండీ ! ఇంకొక రెండు నెలలు ఉండనా అమ్మ దగ్గర ? ఐ వాంట్ టూ మేక్ అప్ ఫర్ ది లాస్ట్ టైమ్ ! ప్లీస్ !' అంది గోముగా.
సమాధానం ఏమిటని అడగలేదు కానీ అమిత సంతోషంతో ఉప్పొంగి పోయాడు గౌరీశంకర్.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి