త్రిశంకు స్వర్గం @
త్రిశంకు స్వర్గం
ఐదింటికి అలారం మోగగానే లేచి భార్య మాధవిని లేపి బ్రష్ చేసుకోవడానికి అన్నీ అమర్చి, ఫ్రిజ్ లో పాల ప్యాకెట్ నీళ్ళ బకెట్లో వేసి తనుకూడా బ్రష్ చేసేసుకున్నాడు గంగాధర్. ఆరింటికల్లా అపార్ట్మెంట్ బ్లాక్ కి మునిసిపల్ నీరు వదుల్తారు. ఆ లోపు కాఫీ తాగేసి, పక్క వీధిలో పాల బూత్ కి వెళ్లి పాలు పట్రావాలి.
ఆరున్నరకి పనిమనిషి గౌరమ్మ వస్తుంది. ఆ లోపు గుమ్మం ముందు ముగ్గు వేసేసి తలుపు తీసి అట్టేపెట్టాలి. మాధవికి గుండె ప్రాబ్లం కి ఆపరేషన్ చేయాల్సి వచ్చిన తరువాత అన్ని పనులూ గంగాధర్ తను చేస్తున్నాడు.
అబ్బాయి, అమ్మాయి పెళ్లిళ్ళు అయిపోయి ఒకళ్ళు మహారాష్ట్ర లోనూ ఒకళ్ళు అస్సాం లోనూ లాక్ డౌన్ లో ఇరుక్కు పోయారు.
కాఫీ పెట్టి మాధవితో కూర్చుని త్రాగుతూ టీవీ పెట్టాడు. అన్ని ఛానల్స్ కొరోనా గురించే. వలస కార్మికులు, పోలీసులు, డాక్టర్లు, వీళ్ళు పడే కష్టాలు వివరిస్తున్నారు. కాఫీ త్రాగేసి పాలకోసం బయలుదేరాడు గంగాధర్. తన పరిస్థితి తలచుకుని తనే జాలి పడ్డాడు.
నలభై సంవత్సరాలుగా ఎమ్ బీ బీ ఎస్ డాక్టర్ గా ప్రాక్టీసు చేసి మంచి పేరే సంపాదించుకున్నాడు కానీ కష్టపడి వెనకేసుకున్న డబ్బు అనారోగ్యాల చికిత్సలకే అయిపోతున్నాయి.
అమ్మాయి అల్లుడు అస్సాంలో బాగానే ఉంటున్నారు. మహారాష్ట్ర లో కొడుకు ఈ మధ్యే మంచి కంపెనీకి మారి భార్య, చంటి బిడ్డతో అప్పుడప్పుడే సెటిల్ అవుతున్నాడు.
అరవై ఐదు వయస్సు వచ్చేసరికి ఆస్పత్రికి వెళ్ళి ప్రాక్టీసు చేసుకుందామంటే మిత్రులు వద్దని సలహా ఇచ్చారు. కొరోనా అరవై ఏళ్ళు దాటిన వారికి ఎక్కువ ట్రబుల్ ఇస్తున్నదని అనేసరికి మాధవి కూడా వెళ్ళద్దని హఠం చేసింది. పిల్లలూ ఫోన్లో మాట్లాడిన ప్రతిసారీ హాస్పిటల్ తెరవవద్దని గట్టిగా చెబ్తూనే ఉన్నారు.
గంగాధర్ కూడా తన ఆరోగ్య రీత్యా ముందు లాక్ డౌన్ ఎంజాయ్ చేసినా, తర్వాత సేవ్ చేసుకున్న డబ్బులు మెల్లగా కరిగి పోవడంతో మళ్ళీ హాస్పిటల్ కి వెళ్దామని నిర్ణయించుకున్నాడు.
తన దగ్గర పని చేస్తున్న నర్సుకి, ఆయాకి, మందుల షాప్ కుర్రాడికి జీతం యధావిధిగా ఇచ్చేసేవాడు. వారు వద్దు వద్దు అంటూనే తీసుకునే వారు. మరి వారికి కూడా జరుగుబాటు ఉండాలి కదా ?
హాస్పిటల్ తండ్రి ఇచ్చిన బిల్డింగ్ లో. అద్దె అయితే కట్టక్కరలేదు. ఆ బిల్డింగ్ లో అద్దెకున్న నలుగురు షాపు వాళ్ళు కూడా లాక్ డౌన్ లో తెరవక పోయేసరికి , గవర్నమెంట్ కూడా అద్దె అడగవద్దని అనేసరికి వాటి మీద ఆశ వదిలేసుకున్నాడు.
కరెంటు మినిమమ్ బిల్ కడుతూనే ఉన్నాడు. ఆస్తి పన్ను, టెలిఫోన్ బిల్లూ కడుతూనే ఉన్నాడు. వాటిమీద రాయితీ ఏదీ ప్రభుత్వం ప్రకటించలేదు.
విరక్తిగా నవ్వుకున్నాడు గంగాధర్. పెద్ద స్పెషలిస్ట్ లు సొమ్ము ఖర్చు పెట్టైనా జాగ్రత్తలు తీసుకుని హాస్పిటల్స్ నడిపేస్తున్నారు. ఆర్ ఎమ్ పీ లు ఇళ్ళకి వెళ్ళి ట్రీట్ చేస్తున్నారు.
బయట కూడా క్లాసు 3, క్లాసు 4 ఉద్యోగులు పనికి వెళ్ళి కొంతమంది, పని చెయ్యకుండానే కొంతమంది జీతాలు పుచ్చుకుంటూనే ఉన్నారు. తనవంటి సాధారణ ప్రొఫెషనల్స్ అందునా అరవై దాటినవారు అన్నివైపుల నష్టపోతున్నారు అని నిట్టూర్చాడు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి