నాన్నకు ............ తో@

 నాన్నకు ............ తో


కారు కనుమరుగైపోయేదాకా చెయ్యి ఊపుతూ గేటు దగ్గర .నిలబడిన గోప కృష్ణ చేయి కిందకి దింపి కన్నీటితో మసకబారిన చూపుతో నెమ్మదిగా తడబడుతూ ఇంట్లోకి వచ్చి బెడ్ రూమ్ లోకి వెళ్ళి భారంగా మంచం మీద కూర్చున్నాడు. ఎత్తుగా ఏదో తొడకి తగిల్తే కళ్ళు తుడుచుకుని చూశాడు. ఆల్బమ్ లు ! 

వైజయంతి వెళ్తూ చెప్పినది జ్ఞాపకం వచ్చింది : "నాన్నా ! పెళ్ళి, వ్రతం, కాపురానికి ఏర్పాట్లలో చాలా అలిసిపోయావు. ఇప్పుడు తగుదునమ్మా అని ఎయిర్పోర్టు కి రావక్కర్లేదు ! అక్కడ సెక్యూరిటీ చెక్ అయ్యేదాకా వెయిట్ చెయ్యడం, మళ్ళీ ఇంత దూరం తిరుగు ప్రయాణం వద్దు. నువ్వు రెస్ట్ తీసుకో ! అమ్మ ఎలాగూ వస్తోంది. నీకు తోచకపోతే పెళ్ళి ఆల్బంలు మంచం మీద పెట్టాను. చూస్తూ కూర్చో. లేకపోతే శుభ్రంగా నిద్రపో ! అప్పుడప్పుడూ ఫోన్ చేస్తానులే !"

చిన్నగా నిట్టూర్చాడు కృష్ణ. ఎంత ముద్దుగా పెంచాడు జయంతిని ! తండ్రీ కూతుళ్ళలా కాకుండా స్నేహితులలాగ ఉండేవారు. పెళ్ళి వరకూ కూడా ఇద్దరిదీ ఒకే మాట ! పెళ్ళి కూడా ఇద్దరూ కూర్చుని ఏర్పాట్లు సంప్రదించుకునే వాళ్ళు. వరుడు కూడా జయంతి ఇష్టపడ్డ సీనియర్ ఫ్యాకల్టీ స్నేహితుడు- తను ఏ మాత్రం అభ్యంతరం చెప్పలేదు. పరిచయం చేసిన పావుగంటలోనే జయంతి సెలక్షన్ అద్భుతం అని తెలుసుకుని మురిసిపోయాడు. 

కానీ పెళ్ళి అయినప్పటినుంచి జయంతిలో మార్పు తన మనసుకు తెలుస్తోంది. చీటికి మాటికి విసుక్కుంటూ తన మాటను తీసిపారేయడం, ఏమొచ్చినా తల్లినే సంప్రదించడం, వీటితో కొంచెం వైరాగ్యం తలకెక్కడం మొదలుపెట్టింది. అవునూ ! భర్త వచ్చేసరికి అలాగే అనిపిస్తుందిలే అని సరిపెట్టుకున్నా, కొంచెం మనసు చురుక్కుమనేది.

నెమ్మదిగా ఒక్కొక్క ఆల్బమూ తీసి అన్ని ఫోటోలూ పరీక్షగా చూడడం మొదలు పెట్టాడు. చివరి ఆల్బమ్ తన పెళ్ళి ఆల్బం. అప్పటి ఫొటోలు చూస్తూంటే ముఖంలో చిరునవ్వు, తన్మయత్వం వచ్చాయి. అప్పటి తీపి జ్ఞాపకాలు మనసుని చిరుజల్లులా సేదతీర్చాయి. చివరి పేజీలో పాత కవర్ ఒకటి కనబడింది. కుతూహలంగా తెరిచి చూస్తే భార్య వాణి ఫోటో. పెళ్ళి కాకముందు ముగ్గురు స్నేహితురాళ్ళతో తీయించుకున్న ఫోటో అది. 

కొంచెం గిల్టీగా అనిపించింది. వాణి ఆ ఫోటోలో హాయిగా అందంగా నవ్వుతూ ఉంది. కానీ కళ్ళ జోడు పెట్టుకుని ఉన్నది. పెళ్ళి అయిన రెండు నెలలకి అత్తగారి ఇంట్లో అనుకోకుండా కనిపించింది ఆ ఫోటో. పెళ్ళి చూపులలోనూ, పెళ్ళిలో కూడా వాణి కళ్ళ జోడు పెట్టుకోగా చూడలేదు. ఆ రాత్రి వాణిని నిలదీశాడు. "నీకు కళ్ళ జోడు ఉన్నదని చెప్పలేదే ?" అని. అంతవరకూ భర్త ముద్దు ముచ్చట్లు, అనురాగంలో తడిసి ముద్దైపోయిన వాణి ఆ నిలదీతకి బిక్కచచ్చిపోయింది. 

"అది సైటు కళ్ళ జోడు కాదు, తలనెప్పి కోసం కొంత కాలం పెట్టుకున్నాను" అంది. నిజానికి వాణిది కళ్ళ జోడు ఉన్నా, లేకున్నా చూడచక్కని అందం. . 

"నాకు పిచ్చి సంజాయిషీలొద్దు. మా కజిను కంటి డాక్టర్. తలనెప్పి రావడమే సైటు వలన వస్తుంది. పెళ్ళికి ముందు కళ్ళ జోడు దాచి చేశారు మీవాళ్ళు" అని మూడు రోజులు మూతి ముడుచుకుని కూర్చున్నాడు. 

వాణి ఎలా బ్రతిమాలాలో అర్ధం కాక గుడ్ల నీళ్ళు కుక్కుకుంది. నెమ్మదిగా కృష్ణ సమాధానపర్చుకుని ఆ మాట ఈ మాట చెప్పి వాణి బెదురు పోగొట్టాడు. తనకు చెప్పకుండా దాచి చేశారన్న అహంభావం తప్ప కృష్ణకి కళ్ళజోడు అభ్యంతరం ఏమీ లేదు. 

పైగా ఆ ఫోటో చెప్పకుండా అత్తారింట్లోనుంచి ఎత్తుకొచ్చేసి పదిలంగా దాచుకుని వాణి లేనపుడు ఆ ఫోటో చూస్తూ గడిపేవాడు. 

ఆ ఒక్క సంఘటన తప్ప వారి మధ్య పొరపొచ్చాలు ఎప్పుడూ రాలేదు. వాణి లేకపోతే పిచ్చెక్కినట్లుండేది కృష్ణకి.
ముందు చంద్రశేఖర్ తర్వాత వైజయంతి - ముత్యాల వంటి పిల్లలు. చీకూ చింత లేకుండా గడిపారు.

***** ******* *******

కారు ఎక్కిన తర్వాత అప్పటి వరకూ గలగల మాట్లాడిన జయంతి ఒక్కసారి నిశ్శబ్దం అయిపోయింది. వాణి ముందు కంగారు పడ్డా సమాధానపడింది. పెళ్ళై మగనితో కాపురానికి వెళ్ళి పోతున్నపుడు అన్యమనస్కంగా ఉండడం సహజమే అనుకుంది. 

ఎయిర్ పోర్ట్ లో కూడా లగేజి చెక్ ఇన్ అప్పుడు, బోర్డింగ్ పాస్ లు తీసుకున్నప్పుడు మొహంలో అభావమే కనిపించినా, జయంతిలో ఏదో అలజడిని వాణి పట్టుకోగలిగింది. 

సెక్యూరిటీ చెక్ కి వెళ్ళాల్సొచ్చిన టైముకి తల్లిని పెనవేసుకుని ఏడిచేసింది జయంతి. "అమ్మలూ ! ఏడవకురా ! ఫోన్ చేస్తూ ఉంటాము కదా ! బెంగ పడకమ్మా !" అంది వాణి కూడా ఏడుస్తూనే. 
"అమ్మా ! నాన్నని జాగ్రత్తగా చూసుకుంటావు కదూ ? " అంది జయంతి వెక్కుతూ.

***** ******** *******

కృష్ణ ఆల్బంలు పక్కన పెట్టి అలసటగా కళ్ళు మూసి వెక్కి వాలాడు. ఎంతసేపు అలా ఉన్నాడో తెలియదు. నుదుటి మీద సున్నితంగా వాణి పెదవులు తగిలేసరికి కళ్ళు తెరిచాడు. "కన్నయ్యా  ! నిద్ర వచ్చిందా ?" అన్న వాణి పిలుపుకి పులకించిపోయాడు. ఇద్దరే ఉన్నపుడు పిలిచే పిలుపు !

ఎన్ని రోజులైంది అనుకున్నాడు. "వంటావిడ వెళ్ళిపోయారా ?" అనడిగాడు.

"వెళ్ళి పోయారు. నేను ఎయిర్పోర్టు నుంచి వచ్చాక ఆవిడకి డబ్బులు బాలెన్స్ ఇచ్చేశాను. రేపు మళ్ళీ పదింటికి వస్తారు" 
"బుగ్గల మీద చారికలేమిటి ? ఏడిచావా ? డాక్టర్ కంట నీరు పెట్టకూడదన్నారు గుర్తులేదా కన్నా ? జయంతి అన్న మాటలు పట్టించుకోకు ! రేపో ఎల్లుండో అదే ఫోన్ చేస్తుందిలే ! "

"జయ మాటలకి నాకు బాధేమిటి వాణీ ? అది ఎందుకు నామీద అకస్మాత్తుగా కోపం చూపించిందేమిటో నేను గ్రహించలేనా ? నాకు రెటీనా ప్రాబ్లం వచ్చి గ్లాకోమా కూడా వచ్చి చూపు తగ్గినప్పటినుంచి ప్రాణంలో ప్రాణంగా సేవలు చేసి డ్రాప్స్ వేసీ, మందులు ఇచ్చీ, చెక్ అప్ కి రెగ్యులర్ గా తీసుకెళ్లే నా చిట్టి తల్లి సడెన్ గా ఇలా మారిపోతే నేను నమ్ముతాననుకుంటున్నావా ? ఎక్కడ నేను తన మీద బెంగ పెట్టుకుని ఏడిచి ఇంకా చూపు చెడగొట్టుకుంటానో అని డ్రామాలు ఆడింది ! దాని మనసు నాకు తెలియదా ?"

అప్పటి వరకూ ఉగ్గబట్టుకున్న వాణి ఇంక ఆపుకోలేక "ఇప్పుడే టాయిలెట్ కెళ్తా" అని బాత్రూమ్ లో తలుపులు బిడాయించుకుని వెక్కి వెక్కి ఏడ్చేసింది. 

జయంతి ఎయిర్పోర్టులో అన్నమాటలు చెవులలో మార్మోగాయి. "అమ్మా ! నాన్న ఏడవకూడదని లేనిపోని కోపం ప్రదర్శించాను. నాన్న నా డ్రామా నమ్ముతారని నమ్మకం లేదు. నాన్నకి నువ్వే అన్నీ చూసుకోవాలి. మందుల దగ్గర నుంచి లాలన దాకా ! చూస్తావు కదా అమ్మా ! నాకు మాట ఇవ్వవా అమ్మా !" అని చిన్నపిల్లలా ప్రాధేయపడిన జయంతి వెక్కిళ్ళే మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చాయి వాణికి. 

నాన్నలని లాలించే పిల్లలకి ప్రేమతో అంకితం

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఒక పౌర్ణమి కథ

అక్కరకొచ్చిన_అనుభవం

నేనున్నా నీకు రక్షణ @