మరపురాని వ్యక్తులు మధురమైన జ్ఞాపకాలు

 

నన్ను ఐదో యేడు వచ్చేదాకా బళ్ళో వెయ్యలేదు. మా మామ్మ ముద్దు కొంత, ఆ రోజుల్లో కేజీలు లేవు ఇది రెండో కారణం !
అంతగా గుర్తులేని ఆ రోజుల్లో నుంచి మరచిపోలేని వ్యక్తి సత్యవతి.

అప్పట్లో ఏమేం ఆటలాడే వాడినో గుర్తులేదు కానీ ఉదయం పదయ్యే సరికి ఓ కంచు గ్లాసు వేసుకుని తయారయేవాడిని. నీలంరంగు చీర కట్టుకుని పదీ పదిన్నర మధ్య వచ్చేదామె. నెత్తిమీద నల్లని ముంతల సెట్టు ! ఆమె కనిపించగానే "అమ్మా ! గొల్లొచ్చిందీ !" అని గావుకేక పెట్టేవాణ్ణి. ముంతలు దింపుకుని మొట్టమొదలు నా కంచు గ్లాసులో అరచెయ్యి నిండుగా పెరుగు బిళ్ళ వేసేది. అవును ! చేత్తోనే !

ఆదివారాలు, శెలవు రోజుల్లో మా అక్కలూ తయారయే వారు. ఆమెయే సత్యవతి. మాకు ఆస్థాన గొల్ల. నాకు పది పన్నెండు యేళ్ళు వచ్చేదాకా పెరుగు పోసేది. పుల్లగా ఉన్నా మాకెంతో నచ్చేదా పెరుగు.

మా ఇంటి ఎదురుగా బొగ్గుల అడితి లో సుబ్బమ్మ పాలు పోసేది. తోడు పెట్టడం అదీ మా మామ్మకి అలవాటు లేదు. మా అమ్మ పాడి ఉన్న ఇంట్లో నుంచి వచ్చినా మామ్మకి ఎదురు చెప్పలేదు.
వేసవిలో మా అమ్మమ్మ గారి ఊరు వెళ్ళినపుడు కమ్మటి తోడు పెట్టిన గడ్డపెరుగు లొట్టలేసుకుంటూ తిన్నా, విజయవాడ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పుల్లటి పెరుగే ఇష్టంగా తినేవాళ్ళం.

తను నన్ను "మల్లిబాబూ !" అని నోరారా పిలిచేది. బళ్ళో వేశాక ఆదివారాలే కనిపించేది. పొద్దున్నే పోరంకిలో సిటీ బస్సు ఎక్కి తనూ, వాళ్ళ చెల్లెలు 'సరస్పతి' వచ్చే వాళ్ళు. సరస్వతి వేరే ఇళ్ళకి వెళ్తే సత్యవతి మా ఇంటికొచ్చేది. కాసేపు మామ్మతోటీ‌, అమ్మతోటీ లోకాభిరామాయణం చెప్పుకుని మళ్ళీ ముంతల దొంతర తలకెత్తుకునేది.

తరువాత రోజుల్లో విజయ డెయిరీ వచ్చి వాళ్ళ పాలు తీసుకోవడం, మామ్మ స్వర్గస్తురాలయ్యాక ఇంట్లోనే పాలు తోడు పెట్టడం, గొల్ల కూడా వయసు మీద పడడంతో పెరుగు అమ్మకం మానెయ్యడం ఇవన్నీ ఇంచుమించు ఒకేసారి జరిగాయి. కానీ తరచు మా నాన్నగారి దగ్గర మందుల కోసం వచ్చినపుడు ఇంట్లోకి వచ్చి పలకరించి వెళ్తూ ఉండేది.

నేను ఇంటర్ చదువుతున్నపుడు అనుకుంటా నాకు కాలేజీ సెలవు రోజున వచ్చింది. దూరం నుంచి చూసి గుర్తు పట్టి, గబగబా లోపలకి వెళ్ళి "అమ్మా ! మన గొల్ల పేరేమిటీ?" అనడిగా ! అప్పటి దాకా మాకందరికీ గొల్లే !

తను ఇంట్లోకొచ్చాక "మల్లిబాబూ ! చాలా రోజులైంది చూసి. బాగా చదువుతుండావా ?" అంది "ఆ ! బాగనే చదువుతున్నా. నువ్వెలాగున్నావు సత్యవతీ ?" అన్నా ! ఓ క్షణం వింతగా చూసి పకపకా నవ్వింది. " ఏమిటి మల్లిబాబూ ? పెద్దాడివై పోయావే ! గొల్లా అని పిలవరాదూ ? మర్యాద చేస్తుండావా ?" అంది.
మొహమాటంగా నవ్వాను.

ఆ తర్వాత నాకు మెడిసిన్ లో సీటు రావడం, కాకినాడ వెళ్ళడం. మళ్ళీ నేను తిరిగి వచ్చేసరికి తను బందరు దగ్గర వాళ్ళ స్వగ్రామం వెళ్ళిపోయింది. తిరిగి కనిపించనే లేదు.

కానీ తన స్వచ్ఛమైన మనసూ, నవ్వూ మరిచిపోదామన్నా మరుపు రాదు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఒక పౌర్ణమి కథ

అక్కరకొచ్చిన_అనుభవం

నేనున్నా నీకు రక్షణ @