E నోము @

 

E నోము 


అమ్మోయ్ ! అంటూ చాలా హడావుడి పడిపోతూ వచ్చింది స్వర్ణ. 

మా వెంకటరమణకి కొంచెం దడ. “ ఏమిటే ఆ గావు కేకలూ” అంటూ ఓ  నిముషం డైనింగ్ టేబుల్ కుర్చీని పట్టుకుని అలా నిలబడిపోయింది.

“ఎప్పుడూ మొబైల్ ని పట్టుకుని వేళాడుతుంటావు అని మొత్తుకుంటావు కదా ! ఇవాళ చూడు అందులోనే అందమైన అందలం దొరికిందోచ్!” 

“నీ అనుప్రాసలు మాని అసలేమైందో చెప్పు” ఇంకా కొంచెం వణుకుతున్న గొంతుతోనే గదమాయించాననుకుంటూ విఫలమైంది రమణ.

“శ్రావణ మాసం ఈ ఏడాది చివరిది కదా. వాయనాలు ఇరవై అయిదు మందికి ఇవ్వాలని కంగారు పడుతున్నావు కదా! దానికి కొత్తగా ఓ యాప్ వచ్చేసింది   తెల్సా ?” 

కంప్యూటర్ పరిజ్ఞానం అంతగా లేని రమణ “యాపా ? యాపిలా ? దానికీ శ్రావణ మాసం నోములకీ ఏమిటే లింకూ ?” అని బుగ్గలు నొక్కుకుంది.

“యాపిల్ కాదమ్మా ! యాప్ ! అంటే ఆ యాప్ ఉపయోగించుకుని ఇంట్లోనించి కదలకుండానే వాయనాలు ఇచ్చేయ్యచ్చు, అది కూడా పేరంటాలు మన ఇంటికి  రావక్కర్లేకుండానే!” అన్ని ఒకసారి గిర్రున నించున్న చోటే ఒక్క సారి తిరిగింది స్వర్ణ .   

“శ్రావణమాసం నోములు పట్టిన ఆడపిల్లలకి ఇదొక వరమే అమ్మా ! ఇది మన చేతిలో ఉంటే చాలు బోలెడు టైము ఆదా, శ్రమ ఆదా “

“ఎలగెలగా?” 

“ఈ యాప్ లొ రిజిస్టర్ చేసుకున్నావనుకో, నోముల విషయం లొ ఏమేం చెయ్యాలో అదే చెప్తుంది. పూజకి ఏమేమి వస్తువులు కావాలో చెప్పడమే కాదు, శాస్త్ర ప్రకారం పూజ ఎలా చెయ్యాలో కూడా చూపిస్తుంది. ఆ తర్వాత మన ఫ్రెండ్స్ లిస్టులోనించి వాయనాలు ఇవ్వవలసిన వాళ్ళ పేర్లు అందులో పేస్టు చేసామనుకో టైం మనం చెప్తే ఆ లోపల అందరికీ మెయిళ్లు పంపేస్తుంది. ఈ – పిలుపులన్న మాట !ఆఫ్ కోర్స్ వాళ్ళూ ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలనుకో!”

“ఓర్నాయనో ! అంతేనా ఇంకేమన్నా చేస్తుందా?” నోరెళ్ళబెట్టింది రమణ.

“ఇంకా చాలా చాలా చేస్తుందే అమ్మా !” చాలా ఎక్జైటింగ్ గా అంది స్వర్ణ .

“ఆ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళతో అపాయింట్మెంట్ అదే ఫిక్స్ చేసేసి ఒక వరసలో వాళ్లకి టైము స్లాటులు ఇచ్చేస్తుంది. ఆ టైముకి మనం లాప్ టాప్ ముందో, టాబ్ ముందో కూర్కున్టే చాలు, వాళ్ళు విడియో చాట్ లోకి రాంగానే ఇస్తినమ్మా వాయనం పుచ్చుకొంటి వాయనం అనడమే ! అలా అనగానే ఒక లింకు యాక్టివేట్ అయి వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉండే ఫుడ్ చెయిన్ స్టోర్ కి వాళ్ళ అడ్రస్ అప్ లోడ్ అవుతుంది. వాళ్ళు మనం ముందుగా సెలెక్ట్ చేసుకున్న అయిటములు పాక్ చేసేసి హోమ్ డెలివరీ ఇస్తారు.”  

స్వర్ణ హుషారు చూడగా చూడగా మా రమణకి కూడా హుషారు వచ్చేసింది.

“మీ నాన్న గారి కంప్యూటర్లొ చేసెయ్యచ్చేమిటే ?” అనడిగింది.

“అబ్బే ! కుదరదమ్మా, దానిని టేబుల్ మీదనించి కదపలేము కదా !” అంది స్వర్ణ .

“టేబుల్ మీదనుంచి కదపడమెందుకే ? అక్కడే చేసుకోవచ్చుగా ఇవ్వన్నీ?” మా రమణ డౌటనుమానం.

"ఈ యాప్ ఉపయోగించి పూజ కూడా చేసుకోవచ్చు అమ్మా ! అందుకని ఓ పీటకి పసుపురాసి, బొట్లు పెట్టి లాప్ టాప్ కానీ టాబ్ కానీ దాని మీద పెట్టి, యాప్ ఓపెన్ చేసి వాళ్ళు చెప్పిన విధంగా చెయ్యచ్చు కలశం, మామిడి ఆకులు పెట్టుకుని, లేకపోతే వర్చ్యువల్ మంగళ గౌరిని వాళ్ళే యాప్ లో ఇస్తారు ఉపయోగించుకోవచ్చు.

అందుకనీ నాన్నగారి డెస్క్ టాప్ వాడ్డం కుదరదు."

"సరే ! ఆ తరువాత? "

"ఆ తర్వాత పూజా విధానం అంతా రికార్డ్ అయి ఉంటుంది. షోడశోపచార పూజ, అధాంగ పూజ, అష్టోత్తర శతనామ పూజ లేకపోతే ఓపిక ఉంటే గనక సహస్రం కూడా అందులోనే ఎంబెడ్ చేశాడు.
పూజ అంతా అయిపోయాక నైవేద్యం పెట్టడమే ! మంత్రపుష్పం అదే చెప్తుంది. ఆత్మ ప్రదక్షిణ, సాష్టాంగ నమస్కారాలు మనం చేసుకోవాలి."

"నైవేద్యం అదే పెట్టెయ్యదా ?"

"అది పెట్టేటట్లయితే మనం తినడం ఎలాగు ? అందుకని అది నిజంగానే నివేదన చెయ్యాలి. కానీ అందులోనూ మనకి వెసులుబాటు ఉంది. యాప్ రిజిస్టర్ చేసుకున్నవాళ్ళకి ప్రముఖ హోటళ్ళనుంచి వంటకాలు హోమ్ డెలివరీ ఇస్తారు కన్సెషన్ మీద."

"దీనికంతా బోలెడు ఖర్చు పెట్టాలిగా ?"

"పెద్ద ఖర్చేమీ ఉండదు. వాళ్ళకి అడ్వర్టైజింగ్ మీద బోలెడు డబ్బులొస్తాయి. అందుకని మనం ఖర్చు పెట్టే దానికన్నా తక్కువ అవుతుంది."

"ఇక పోతే పూజ అయిపోయిన తర్వాత బుట్ట వాయనం ! " స్వర్ణ.

"అది కూడా యాప్ ద్వారా ఇచ్చెయ్యచ్చా ?"

"అది నీకే గదమ్మా ఇచ్చేది ! దానికి మళ్ళీ యాప్ వాడడమెందుకూ ?"

"సర్లే" నిరుత్సాహంగా అంది రమణ. పాపం తనకి మొదటిసారి ఆన్ లైన్ లో వాయనం తీసుకోవాలని ఆరాటంగా ఉండి ఉండాలి.

******

మంగళవారం ఈ - పూజ, ఈ - భోజనం, ఈ -  వాయనాలు దిగ్విజయంగా పూర్తయ్యాయి. బోనస్ ఏమిటంటే ఆ యాప్ వాడు మొదట రిజిస్టర్ చేసుకున్న పది మందికి రాత్రి కూడా భోజనం హోమ్ డెలివరీ ఇస్తానని అన్నాడు. అందులో స్వర్ణ కూడా ఉండడం వలన రాత్రికీ వంట చేసుకోవాల్సిన శ్రమ తప్పింది తల్లీ కూతుళ్ళకి. 

తొమ్మిదింటికల్లా హోటల్ వాడు చక్కగా పార్సిల్ పంపేశాడు. హుషారుగా ప్లేట్లు, మంచినీళ్ళు  పెట్టేసి పార్సెళ్ళు తెరిచి చూసిన స్వర్ణ ముక్కు చిట్లించి "కెవ్" అంది. 

చూడకపోయినా రమణా, నేనూ కూడా "కెవ్" మన్నాం వాసన భరించలేక.

పరిగెత్తుకుంటూ అవతల గదిలోకి పరుగెట్టి హోటల్ వాడికి ఫోన్ చేశాను. నా నంబర్ చూడంగానే గుర్తు పట్టాడనుకుంటా హోటల్ వాడు "ఎక్స్ట్రీమ్లీ సారీ సార్ ! ఇంకొకళ్ళకి వెళ్ళాల్సిన ప్యాక్ పొరపాటున మీకొచ్చేసింది !" అన్నాడు.

"నీచుడా ! నికృష్టుడా ! త్రాష్టుడా ! నీ హోటల్ మీద ఆహార శాఖ వాళ్ళు దాడి చెయ్యా ! నీ స్టోర్ రూములన్నీ పందికొక్కులతో నిండిపోవ ! చక్కగా వ్రతం చేసుకుంటే మాంసమూ చేపలూ పంపుతావురా డిన్నరుకీ" అంటూ కేకలు పెడుతున్న నన్ను 
"ఏవండీ ఏవండీ ! పీడకలేమైనా వచ్చిందా ? లేవండీ !" అంటూ నిద్ర లేపేసింది మా రమణ !!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఒక పౌర్ణమి కథ

అక్కరకొచ్చిన_అనుభవం

నేనున్నా నీకు రక్షణ @