బాధ్యత@
బాధ్యత
ఆలస్యమైందన్న తొందరలో ఉన్నాడేమో, డాక్టర్ శంభు ప్రసాద్ వెయిటింగ్ హాల్లో ఉన్న ఇద్దరు పేషెంట్లలో పెద్ద వయసు తాతగారిని చాంబర్ లోకి రమ్మని పిలిచాడు. తాతగారిని తోసుకుంటూ రెండో పేషెంటు దూసుకొచ్చాడు.
"నేను ముందొచ్చాను. నిన్న రాత్రి ఫోన్ కూడా చేశాను. 10 గంటలకల్లా రమ్మన్నారు. గుర్తు లేదా?" అని ధుమధుమలాడుతూ అడిగాడు.
"సారీ ! నేను సరిగా చూసుకోలేదు. ఒక్క పది నిముషాలు వెయిట్ చేస్తారా ? పెద్దాయనని చూసేసి ఆ తర్వాత మిమ్మల్ని చూస్తాను".
"నాకు అర్జంటు పనులున్నాయండీ. ఐనా మీరు టైం కచ్చితంగా పాటిస్తారని తెలిసి వచ్చాను. అరగంట లేట్ చేశారు." అదే ధుమధుమలతో.
"సారీ అండీ. ఇంట్లో చిన్న సెరిమనీ ఉండి లేట్ అయింది"
"సెరిమనీలు కాస్త ముందు మొదలెట్టుకోవాలండీ, పేషెంట్ల ప్రాణాలతో పని కదా?" అన్నాడు ఇంకొంచెం వేడిగా.
"సరే ఇప్పుడు మీ ప్రాబ్లమ్ చెప్పండి, ఈ డిస్కషన్ తేలేది కాదు" అదే అనునయ స్వరంతో అన్నాడు డాక్టర్.
"నాకు మూడు నెలల నుంచీ జుట్టు రాలడం ఎక్కువైంది. ప్రాబ్లమేమిటో చెప్తారని వచ్చాను..... " .....
ఈ లోపు ఆ పెద్దాయన నిశ్శబ్దంగా బయటకి వెయిటింగ్ హాల్లోకి నడిచాడు.
ఒక పావుగంట తర్వాత ఆయన కొద్దిగా ప్రసన్న వదనంతో బయటకి వెళ్ళిపోయాడు.
"రండి స్వామీ !" అని డాక్టర్ పిలిచాక లోపలికెళ్ళాడాయన.
"క్షమించండి. మీరు కొద్దిగా వేచి ఉండాల్సి వచ్చింది." అన్నాడు డాక్టర్.
"నా పేరు పేరి సోమయాజులు. మీ ఇంట్లో ఇవాళ పెద్దలెవరిదైనా తిథి ఉన్నదా ?" అడిగాడు ఆయన.
"అవునండీ ! మా తల్లి గారిది. మీకెలా తెలిసింది ?"
"ఇందాక సెరిమనీ అన్నారు. మీ తల మీద తెల్లటి అక్షతలు ఉన్నాయి. హిరణ్యం పెట్టినట్లున్నారు?"
"అవునండీ. నా భార్యకి క్రితం వారమే ఆపరేషన్ అయింది. అందుకని తప్పలేదు. క్లుప్తంగా ముగించాల్సి వచ్చింది."
"అయి ఉండచ్చు. కానీ అమ్మగారిది యధావిధిగా కాకపోయినా ఏ ఉత్తరాది మఠంలోనో చేసి ఉండచ్చు కదా ?" కొంచెం భృకుటి ముడిచి ప్రశ్నించాడాయన.
"మా అమ్మగారు అంటే కన్నతల్లి కాదండీ. మా నాన్నగారి మొదటి భార్యది. ఆవిడ నిస్సంతుగా పురిటిలో పోయారు. మా అన్నగారి మీద కర్తృత్వం వేసి మా నాన్నగారు, ఆయన తదనంతరం మా అన్నగారు కార్యక్రమం చేసేవారు. మా అన్నగారు కూడా పోయిన తర్వాత నేను చేస్తున్నాను" అని అదే ప్రసన్న వదనంతో చెప్తున్న డాక్టర్ ని చూస్తూ అప్రయత్నంగా చేతులు రెండూ ఎత్తి "చిరంజీవ!" అని ఆశీర్వదించాడు పేరి సోమయాజులు గారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి