ఋణం @
జ్యేష్ట మాసం రోహిణీ కార్తె రాత్రి మొదటి ఝాము చివరికి వస్తోంది. వేడిగాలి తగ్గి కొంచెం చల్లని గాలి వీయడం మొదలు పెడుతోంది. బహుళ పక్షం కావడంతో చంద్రోదయం ఇంకా కాలేదు.
ఆ చిట్టడవి మధ్యలో మఱ్ఱి చెట్టు మొదట్లో పుట్టలోనుంచి బయటకొచ్చిన మిన్నాగు పాదాల చప్పుడేమిటా అని చుట్టూ పరికించి చూసింది.
ఇద్దరు యువకులు ఆ దారి వెంట వెళ్తూ కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇందాక ఆ దారిన వెళ్ళిన వారే అని గ్రహించింది నాగు. కానీ ఈ సారి వారి వెంట ఒక గోవు కూడా నడుస్తోంది.
బుస కొడదామా అని ఆలోచిస్తూ ముందు నడుస్తున్న యువకుడిని చూసి ఆగిపోయిందా నాగు. నల్లగా ఉన్నా ఆ యుపకుడినుంచి వచ్చే కాంతికి ఆ యువకులిద్దరూ దీపం లేకపోయినా సులువుగా నడుస్తున్నారు. సరిగంచు పంచె కట్టి, ఉత్తరీయం నడుముకు చుట్టుకుని అందులో పిల్లనగ్రోవి జోపి తలకి పాగ చుట్టి నెమలి ఈక పెట్టాడతడు.
ఆ వెనక నడుస్తున్న వాడు బ్రాహ్మణ కుర్రాడని తెలిసిపోతూనే ఉంది. పచ్చని పసిమి, గోష్పాదమంత శిఖ, జంధ్యం పోగు ఇంకా బ్రహ్మచారే !
ఇవేమీ చూడలేదా నాగు. ముందు నడుస్తున్న యువకుడినే ఆరాధనగా, భక్తితో చూస్తూ పడగ ముడిచేసి నమస్కారమా అన్నట్లు తలను నేలకు తాటించింది.
"కన్నయ్యా ! ఈ వేడికి దప్పికౌతోంది , నిస్త్రాణగా ఉంది, కాసేపు విశ్రమించాలి", అన్నాడతడు. "గురువుగారు నిరీక్షిస్తున్నారు కదా సుదామా ! వారికి త్వరగా ఈ కామేశ్వరి ఆచూకి చెప్తే ఆయన ఆరాటం తగ్గుతుంది " అన్నాడు కన్నయ్య.
"ఒక్క గడియ, అంతే ! కొంచెం నోట నీరు పడితే ప్రాణము లేచొస్తుంది" అన్న లోగొంతులో వినపడ్డ మాటకు కన్నయ్య నొచ్చుకున్నాడు. "అయ్యో! మిత్రమా. గమనించనే లేదు. నీరు పట్టుకుని వస్తాను. ఇక్కడ కూర్చో".
రెండు నిముషాలలో తామర దొన్నెతో నీరు పట్టుకొచ్చి "నా చేతి నీరు ! ఫర్వాలేదా ? బాపనయ్యా !" అని పరిహాసమాడాడు కన్నయ్య.
మొదటి దోసిలి గబగబా త్రాగేశాక "మన మధ్య ఆ తారతమ్యం ఇంతకు ముందు ఎప్పుడైనా చూశావా నల్ల గొల్ల పిల్లడా !" పరిహాసమూ, అచ్చెరువూ కలగలిపి అడిగాడు సుదాముడు నొచ్చుకూంటూ.
రెండో దోసిలి నీరు పట్టాక, "నీరసంలో నీ పరిహాసపు పలుకులు ఉన్నాయో, బజ్జున్నాయో తెలుసుకోవడానికి అడిగానయ్యా ! చెలికాడా !" అని బుగ్గ మీద చిన్నగా చేతివ్రేళ్ళు తాటించాడు గోప కిషోరుడు.
"ఇంకొక దోసెడు నీరు ఇవ్వవా ?" అన్న సుదాముడిని చిరునవ్వుతో చూస్తూ "వద్దులే మిత్రమా ! దాహం తీరే ఉంటుందిలే ! అంతకన్నా ఎక్కువ నువ్వు అడగకూడదు, నేనివ్వ కూడదు" అంటున్న మిత్రుడి మోము చూస్తూ స్వప్నంలో మాట్లాడినట్లు "అవును కదూ ! కృష్ణా " అన్నాడు సుదాముడు.
ఆ ఋణం తనకు తెలియకుండానే చాలా సంవత్సరాల తరువాత తీర్చుకున్నాడు సుదాముడు.
భగవంతుడు భక్తుడి కోర్కెలు తీర్చడానికి ఎంతో దయతో తనే ముందుగా భక్తుడికి సేవ చేస్తాడు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి