నిరాశా ఆశేనా ..@
నిరాశా ఆశేనా ..
అర్ధరాత్రి బాగా ఒళ్లు నెప్పులతో హఠాత్తుగా మెలకువ వచ్చేసరికి హరీష్ కి ముందు ఎక్కడ ఉన్నాడో అర్ధం కాలేదు. తర్వాత మెల్లగా గుర్తు వచ్చింది. రాత్రి బాగా అలిసిపోయేసరికి వాతావరణం కూడా బాగా వేడిగా ఉండి ఏసీ లో దిండు వేసుకుని క్రిందనే పడుకుని ఇష్టమైన జేసుదాసు పాటలు వింటూండగా నిద్ర వచ్చేసింది.
వాచీ చూసుకున్నాడు. ఒంటిగంట దాటింది. బాగా దాహం వేసి ఫ్రిజ్ లో చల్లటి నీళ్లు గడగడా త్రాగేశాడు. అప్పుడు తెలిసింది. ఎప్పుడూ రుచిగా అనిపించే నీళ్ళు చల్లదనం తప్ప రుచి తెలియలేదని. హఠాత్తుగా వెన్నులోనుంచి చలి వేసింది. జ్వరం వల్లనో భయం వల్లనో తెలియలేదు. ఒళ్లంతా విరగ్గొట్టినట్లు నెప్పులు.
అప్పుడు గుర్తొచ్చింది. చలికి కారణం మసిలిపోయే జ్వరమే కాదు. తన పరిస్థితి కూడా అని. రెండు రోజుల క్రితమే 48 గంటల కోవిద్ డ్యూటీ చేసొచ్చాడు హరీష్. చదివినది ఎమ్ డీ సైకియాట్రీ,, చేసేది ఉస్మానియా హాస్పిటల్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ అయినా కోవిద్ డ్యూటీ తప్పలేదు.
అంత జ్వరంలోనూ మెదడు చురుగ్గా పనిచేసి తను అన్ని జాగ్రత్తలూ తీసుకున్నాడో లేదో విశ్లేషించుకున్నాడు. గుర్తున్నంతవరకూ ఎక్కడా అజాగ్రత్త పడలేదు. నేరుగా ఐ సీ యూ లో డ్యూటీ పడకపోయినా, గ్రే ఏరియా డ్యూటీ కూడా ప్రమాదమే. ఎవడు పాజిటివ్ ఎవడు నెగిటివ్ అన్నది చెప్పలేము. ఐ సీ యూ లో అందరూ పాజిటివే కాబట్టి అతి జాగ్రత్తగా ఉంటారు అంతా. గ్రే ఏరియా లో అజాగ్రత్తగా ఉండక పోయినా క్షణ కాలంలో ప్రమాదం చెప్పకుండా ముంచుకొచ్చెయ్యచ్చు.
తన తల్లి వరంగల్ లో మేనమామ ఇంటికి వెళ్ళి లాక్ డౌన్ లో అక్కడే రెండు నెలలు ఉండిపోయి, ఇంకో మూడు నాలుగు రోజులలో వచ్చేస్తోంది. తండ్రి బీ పీ, షుగర్ పేషెంట్. ఆయనకి వేరే ప్రత్యేకంగా గది కేటాయించారు. ఆయనకి అన్నీ చూసుకునేందుకు పెట్టిన ఆయా వారం రోజుల క్రితం ఆమె ఉన్న ఇంటి దగ్గర కొరోనా కేసులు దావడంతో రావడానికి కుదరక కొంచెం తండ్రికి అన్నీ అమర్చడం తనే చూస్తున్నాడు. రెండు రోజుల కోవిద్ డ్యూటీ టైము లో పక్క ఇంటి రాఘవలక్ష్మి గారు చూసుకున్నారు. వంటావిడ ఆ కాలనీలోనే నాలుగు వీధులవతల ఉండడం వలన ఆ విషయంలో కంగారు పడాల్సిన అవసరం లేక పోయింది.
భార్య లత ఎనిమిదో నెల గర్భిణి. సికింద్రాబాద్ లో పుట్టింట ఉన్నది. లత గుర్తు వచ్చేసరికి మళ్ళీ చలి అనిపించింది. డ్యూటీ నుంచి వచ్చాక శుభ్రంగా స్నానం చేసి తండ్రి కి అన్నీ అమర్చి పెట్టి డాక్టర్ ఆన్ కోవిద్ డ్యూటీ లేబుల్ బండీకి పెట్టేసి మామగారి ఇంటికివెళ్ళి ఓ గంట గడిపి వచ్చాడు. ఆ గంటలోను ఎవరూ లేని సమయంలో ఐదు నిమిషాలు తమకంతో భార్యని ముద్దాడాడు.
ఇవన్నీ గుర్తొచ్చేటప్పటికి నెమ్మది నెమ్మదిగా గుబులు రావడం మొదలెట్టింది. తనకి వచ్చిన జ్వరం కొరోనా యేనా అని ఆలోచించాడు. జ్వరం, చలితో పాటు కొద్దిగా జలుబు, దగ్గు, ముక్కు దిబ్బడతో పాటు వాసన తెలియలేదు. ఒళ్లు నెప్పులు విపరీతంగా ఉన్నాయి. అనుమానం కొంచెం బలపడింది. ముందు తన కిట్ లో ఉన్న డోలో మాత్ర వేసేసుకున్నాడు. జలుబుకి వేరే మాత్రలు ఏమీ కనిపించలేదు.
తల్లిని విడియో కాల్ లో చూసినా ఎప్పుడు వస్తుందో అని తహతహలాడి పోతున్నాడు. తండ్రి ఆరోగ్యం తలుచుకుంటే గుండె బరువెక్కి పోయింది. ఒక వేళ కొరోనాయే అయితే ఐసొలేషన్ లో పెడితే ? అన్న ఆలోచన వచ్చి గుండె వేగం పెరిగి పోయింది. తను హాస్పిటల్ లో ఉండగా తండ్రి కి జరగరానిది జరిగితే? తనొక్కడే కొడుకు, అనాధ ప్రేత సంస్కారం చేయిస్తారా ?
ఒక్కసారి తల విదిలించుకుని ఆలోచించాడు. ఛీ ! సైకియాట్రిస్టునయ్యీ ఈ తిక్క ఆలోచన ఏంటీ ? అని సమాధానపరచుకున్నాడు. భార్య జ్ఞాపకం వచ్చింది. మళ్ళీ కళ్ళ నీరు తిరిగింది. మనసారా తిట్టుకున్నాడు. బుద్ధి గడ్డి తినింది. కోవిద్ డ్యూటీ చేసొచ్చి ముద్దు పెట్టుకోవడం ఏమిటీ అని బుర్ర బాదుకున్నాడు.
పుట్టబోయే బిడ్డ జ్ఞాపకం వచ్చింది. వెక్కి వెక్కి ఏడుపు వచ్చేసింది. ఇద్దరూ ఎన్ని కలలు కన్నారో ! ఏం పేరు పెడదాం దగ్గర నుంచి ఏం చదివించాలి వరకూ ! చూడకుండానే తనకి ప్రాణం మీదకి వచ్చేస్తే ?
అలా ఆలోచిస్తూ ఈజీ చైర్ లో కూర్చుని ఏడుపు ఆపుకోవడానికి ప్రయత్నిస్తుండగా నిద్ర పట్టేసింది. సెల్ ఫోన్ అలారం మోగేదాకా మెలకువ రాలేదు. తుళ్ళిపడి లేచేసరికి ఒళ్లంతా చెమటలు పట్టి జ్వరం జారినట్లు తెలిసింది.
గబగబా లేచి పళ్ళు తోమేసుకుని ఫ్రిజ్ లో పాల ప్యాకెట్ తీసి ఫిల్టర్ కాఫీ చేసుకుని తండ్రి కి కూడా ఇచ్చి తీరికగా కూర్చుని తాగుతూంటే మొబైల్ మోగింది 'హరివరాసనం....' అంటూ !
తీరా చూస్తే తనతో 48 గంటలు డ్యూటీ చేసిన డెర్మటాలజీ పీజీ స్టూడెంట్. "సార్ ! ప్రొద్దుటే డిస్ట్రబ్ చేశానా ?" అన్నాడు ఎక్జైటింగ్ గా ! "ఏం ఫర్వాలేదు! చెప్పు అవినాష్ ! ఎలా ఉంది ! ఫస్ట్ టైమ్ డ్యూటీ కదా నీకు ! ఏంటి విశేషాలు ?" అన్నాడు.
"మీ థ్రోట్ స్వాబ్ రిపోర్ట్ చూసుకున్నారా సార్ ! నాకు నెగిటివ్ వచ్చింది. రెండు రోజులనుంచి టెన్షన్ అనుకోండి ! ఈ పూట సుష్టుగా టిఫిన్ లాగించేసి మధ్యాహ్నం దాకా నిద్ర పోవాలి. అన్నీ పీడకలలే ఈ రెండు రోజులూనూ !"
నోరు తడారిపోయింది హరీష్ కి. డ్యూటీ దిగే ముందు కొరోనా టెస్టు చేశారు హాస్పిటల్ లో. తను లత దగ్గరకు వెళ్ళాలన్న ఉత్సాహంలో ఆ విషయమే మర్చిపోయాడు.
వణుకుతున్న వేళ్ళతో మెసేజ్ ఐకాన్ మీద నొక్కాడు. అనుకున్నట్లుగానే హాస్పిటల్ నుంచి మెసేజ్ వచ్చింది.
గుండె దడదడలాడుతుండగా మెసేజ్ ఓపెన్ చేశాడు. "యాహూ ! నెగిటివ్!" అని దాదాపు అరిచేశాడు.
తండ్రి "ఏమైంది హరీ ?" అని కేకేశాడు. "ఏం లేదు నాన్నా ! ఎవరో వాట్సాప్ లో జోక్ పంపించారులే"అన్నాడు. మరో సారి మెసేజ్ చూసి సరైనదే అని నిర్ధారించుకుని నిస్త్రాణగా కుర్చీలో కూలబడ్డాడు హరీష్.
రాత్రి జ్వరం నీరసం అంతా చుట్టబెట్టేసినట్లు అనిపించింది. ఓ అరగంట తర్వాత తేరుకుని ఈల వేసుకుంటూ బాత్ రూమ్ లో దూరాడు. "అమ్మ రెండు రోజులలో వచ్చేస్తోంది. ఇల్లంతా సద్దేసి నీట్ గా పెట్టాలి, కూరలు తెచ్చుకోవాలి, నాన్నగారి మందులు తేవాలి. ఎలాగూ రెండు వారాలు హోమ్ క్వారెంటైన్ కాబట్టి సైకియాట్రీ వెబినార్ లు ఎటెండ్ అవచ్చు. అన్నిటి కన్నా లతని చూసి రావాలి. తనకి ఈ గుడ్ న్యూస్ చెప్పాలి. ఇంతకీ జ్వరం వచ్చింది అని చెబ్దామా వద్దా" అని ఆలోచించి వద్దులే అని డిసైడ్ చేసుకున్నాడు.
పుట్టబోయే బిడ్డకు కొత్త డ్రెస్ ఏ రంగు కొనాలో తెలియలేదు. పింకా లేక బ్లూ నా ? ఆడ పిల్లో లేక మగ పిల్లాడో తెలిస్తే బాగుండేదిగా ! అని తన మీద తనే చిరాకు పడిపోయాడు హరీష్.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి