మరుగైపోయిన వ్యక్తులు - మరపురాని జ్జాపకాలు 2

 

నా చిన్నప్పుడు నేను రోజూ చూసి, ఇప్పటికీ మదిలో గాఢమైన ముద్ర వేసిన, మరీ గాఢంగా ముద్ర వెయ్యకపోయినా చప్పున గుర్తు వచ్చే వ్యక్తుల గురించి నా జ్జాపకాలు ఇవి. అందరికీ ఇటువంటి వారు ఉండే ఉంటారు.

మొట్టమొదటి గా గుర్తొచ్చేది సోమయ్య. మా గవర్నర్ పేటకి పోస్ట్ మాన్ ! ఉదయం 10:30- 11:00 గంటలకి "పోస్ట్!" అనే కేక మా ఇంట్లో వారందరికీ చెవుల్లో మోగుతునే ఉంటుంది. ఖాకీ డ్రెస్, టోపీ పెట్టుకుని ఎడమ చేతిలో బొత్తిగా ఉన్న ఉత్తరాలతో‌, భుజానికి తగిలించిన సంచీలో ప్యాకెట్లు, రిజిస్టర్ పోస్టులు వేసుకుని వచ్చేవాడు. ఎండాకాలంలో లేట్ గా వస్తే కాస్సేపు ముందు వసారాలో బల్లమీద కూర్చుని మేమిచ్చిన కుండలో నీళ్లు త్రాగి సేదతీరి మళ్ళీ బయల్దేరేవాడు.
మా అందరితోటీ సరదాగా కబుర్లు చెప్పేవాడు. నాకు కొద్దిగా జ్ఞానం వచ్చే సరికి మా ఇద్దరు అక్కల పెళ్ళిళ్ళు అయ్యాయి. వాళ్ళు ఉన్నపుడు, స్పెషల్ గా వాళ్ళని పక్కకి పిలిచి ఉత్తరాలు వాళ్ళ చేతిలో పెట్టేవాడు. లేదా వస్తూనే " ఇవాళేం లేవు చిన్నమ్మా ! " అని పెదవి విరిచేవాడు.
మా ఇంటి వ్యక్తిలాగే ఉండే వాడు. మా ఇంట్లో పెళ్ళిళ్ళ వంటి కార్యాలకి తప్పకుండా పిలుపు అందుకునేవాడు, పాల్గొనే వాడు కూడా.
నన్నైతే చిన్న డాక్టర్ గారేం చేస్తున్నారూ అంటూ పలకరించే వాడు. (మా నాన్నగారు డాక్టర్ అయేసరికి నేను కూడా డాక్టరే అవాలని వీళ్ళే నిర్ణయించేశారు !)
రిటైర్ అయ్యాక వాళ్ళ స్వంత ఊరు బందరు వెళ్ళపోయాడు. విజయవాడ వచ్చినపుడు మా నాన్నగారికి కనబడకుండా వెళ్ళేవాడు కాదు. ట్రీట్మెంట్ ఏదైనా ఉంటే నాన్నగారి దగ్గరే.
నేను మెడిసిన్ పూర్తి చేసుకుని వచ్చాక సోమయ్య స్వర్గస్తుడైనాడని తెలిసింది. ఎవరో దగ్గరి చుట్టం పోయినట్లు అనిపించింది.
అతని భార్య వెంకమ్మ కూడా చాల రోజులు నా దగ్గరకు ఆరోగ్యం విషయంలో చూపించుకోవడానికి బందరు నుంచి వచ్చేది. ఆవిడ కూడా ఈ మధ్యనే కాలం చేసింది.
మన జీవితాలతో పెనవేసుకుని పోయిన వ్యక్తులలో ముఖ్యులు పోస్ట్ మెన్. ఇప్పుడు ఎప్పుడో కానీ కనిపించడం లేదు.
ప్చ్ ప్చ్ !!
😢😢😢😢😢

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఒక పౌర్ణమి కథ

అక్కరకొచ్చిన_అనుభవం

నేనున్నా నీకు రక్షణ @