బ్రతుకున బ్రతుకై @
బ్రతుకున బ్రతుకై
సోఫాలో కూర్చున్న ఆమె, తన కాళ్ళ దగ్గర నేల మీద కూర్చుని ఒడిలో తల పెట్టుకుని, తన్మయత్వంతో భర్త చెప్తున్న మాటలు వింటోంది . " లలితా ! ఒక వాక్యం జీవితాన్ని మలుపు తిప్పుతుందని ఇదివరకు ఎవరైనా అంటే నవ్వేసే వాడినేమో ! ఇప్పుడు మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను".
*******
అమ్మా ! బయటినుంచి ఏమైనా కావాలా ఇంట్లోకి ?" కేకేశాడు అనంత్ షూస్ లేసులు కట్టుకుంటూ. "పాలు రెండు పాకెట్లు పట్టుకుని రా. ఇంకేమీ వద్దు. అన్నట్లు ఇవాళ లాయరుగారు రమ్మన్నారు.గుర్తుందిగా ?"
"గుర్తుందిలే !" కొంచెం విసుగ్గా అన్నాడు. కానీ తల్లిని మనసులోనే తిట్టుకున్నాడు .
బయటకి వచ్చి స్కూటర్ స్టార్ట్ చేస్తూ తనని కూడా తిట్టుకున్నాడు.
అనంత్ భార్యని పుట్టింట్లో ఒదిలేసి మూడేళ్ళైంది. తల్లి తండ్రులు చేసిన పెళ్ళే ! ఏడేళ్ళ తరువాత గర్భిణి వచ్చి ఆడ పిల్ల పుట్టింది . అది కూడా ఎన్నో హార్మోన్ మందులు వాడాక. ఆ హార్మోన్ ల వలన లలితకి బాగా ఒళ్లు వచ్చేసింది. పుట్టిన ఆడపిల్ల చిదిమి దీపం పెట్టినట్లు ఉండేది . అనంత్ కి ఎంతో ముద్దుగా ఉండేది.
కానీ విధి వశాత్తు పిల్ల పుట్టిన రెండో నెలలో అనంత్ తండ్రి హఠాత్తుగా నిద్రలోనే ప్రాణం వదిలాడు. లలితకు సిజేరియన్ అవడం వలన రాలేక పోయింది. అనంత్ అన్నయ్య అపర కర్మలు జరిపాడు.
పిల్ల పుట్టిన వెంటనే భర్త పోయాడనో లేక లావైపోయిన కోడలిని చూసి వైమనస్యం కలిగిందో అనంత్ తల్లి లలితమ్మ కొడుక్కి ఆ మాటా ఈ మాటా చెప్పి మనసు విరిగి పోయేలా చేసింది. మొదట్లో అనంత్ తండ్రి పోయిన దుఃఖం లో ఉన్న తల్లిని గట్టిగా మందలించలేక పోయాడు. ఆ తర్వాత నెమ్మదిగా అతనికి కూడా తల్లి బోధలు తలకెక్కాయి.
నెమ్మదిగా ఆరోగ్యం పేరు చెప్పి ఒక ఆరు నెలలు, తనకు క్యాంపులున్నాయని ఇంకొక నాలుగు నెలలు భార్యని తీసుకు రాకుండా తాత్సారం చేసి నెమ్మదిగా ఫోను చెయ్యడం కూడా మానేసాడు. ముందర సర్దుకు పోయినా ఆమెకి అనుమానం మొదలై చివరికి తండ్రిని సంప్రదించి ఆయనకు విషయం వివరించి భర్త దగ్గరకు పంపింది.
కానీ దురదృష్టవశాత్తు భర్త కాంపు వెళ్లడంతో అత్తగారే ముసుగులో గుద్దులాట లేకుండా కరాఖండిగా చెప్పేసింది - మనవరాలు పుట్టిన వెంటనే తాతను పొట్టన పెట్టుకుందనీ, అందు వలన తమకు ఆమెను మళ్ళీ ఇంటికి తెచ్చుకోవడం సుతరామూ ఇష్టం లేదని చెప్పేసింది. విడాకులకు నోటీసు వస్తుందని కూడా అనేసింది నిర్ఘాంతపోయిన ఆ బడిపంతులు వియ్యంకుడు గుడ్ల నీళ్లు కుక్కుకుని తిరుగు ప్రయాణమయ్యాడు.
కొడుకు వచ్చేసరికి ఈ విషయం గొప్పగా చెప్పేసిందావిడ. కొడుకు కూడా నిర్ఘాంత పోయాడు. ఆ రాత్రి తల్లీ కొడుకులకు తీవ్ర వాగ్యుద్ధం జరిగి వారం రోజులు మాట్లాడుకోలేదు. అనంతుకి భార్య అంటే ప్రేమ లేకపోలేదు. ఆమె ఊబకాయం తప్పితే అతనికి ఆమెను కాదనుకోవడానికి కారణాలు ఏమీ లేవు
***********
మెల్లమెల్లగా ఆవిడ కొడుకుని కన్నీటితోటి, సాధింపు తోటి, నెమ్మది మీద విడాకులకు లాయర్ ని సంప్రదించేందుకు ఒప్పించ గలిగింది. ఆ రోజు లాయర్ తోటి మాట్లాడడానికి మళ్ళీ ఏమి సాకు చెబుతాడోనని జాగ్రత్త పడి గుర్తు చేసింది అందుకే !
************
జాగింగుకి పార్కుకి వెళ్లిన అనంతు రెండు రౌండ్లు పూర్తి చేసి అలవాటు కొద్దీ ఐదు నిముషాల పాటు బెంచి మీద చారగిలబడి కూర్చుని టవల్ తో మొహం తుడుచుకుంటూ చుట్టూ చూశాడు . కొద్దీ దూరం నుంచి ఒక నడి వయసు జంట ఆ బెంచ్ వైపే వస్తున్నారు. వారిని గత కొద్దిరోజులుగా చూస్తున్న అనంత్ కి వారిని చూసే సరికి కొంత ఉత్సుకత కలిగింది. ఆవిడ ఎటో చూస్తూ నడుస్తోంది. భర్త జాగ్రత్తగా ఆమెను చెయ్యి వదలకుండా పక్కనే నడుస్తున్నాడు. ఒక్కోసారి ఆవిడ బలవంతంగా చెయ్యి విడిపించుకుని వేరే వెళ్లిపోవాలని చూసినా గట్టిగా పట్టుకుని ఆమెను తాను ఉన్న బెంచ్ వైపే రావడం చూసి అనంత్ బెంచ్ ఒక చివరికి జరిగాడు వాళ్లకి చోటివ్వడానికా అన్నట్లు.
ఒక నిముషం ఆలోచించి ఆ భర్త ఆమెను ఆ బెంచి మీద కూర్చుని ఆమెను కూర్చోబెట్టి, మంచి నీళ్ల సీసా ఇచ్చి టవల్ తో మొహం తుడిచాడు.
"ఎందుకూ ? అనడిగిందావిడ వింతగా మొహం పెట్టి. " దాహం వేసిఉందిగా తాగు అన్నాడాయన.
"నువ్వెవరు ? " అనడిగిందావిడ.
చిరునవ్వు తోటి " కృష్ణని గుర్తు లేదా ?" అనడిగాడు.
"మరి నేనెవరు?" అడిగిందావిడ.
"నువ్వు రాధవి ! అన్నాడు ఆయన ఇంకా విశాలంగా నవ్వుతూ.
ఆవిడ కూడా నవ్వేసి "నువ్వు నాకేమౌతావు ? మనమెందుకిక్కడికి వచ్చాము?" అనడిగింది.
"చల్లగా హాయిగా ఉంది కదా ! సరదాగా వాకింగ్ కి వచ్చాము " అన్నాడు ఆయన.
'ఓహో !" అందావిడ. ఇంకేమీ రెట్టించకుండా.
తమతో తెచ్చుకున్న మొబైల్ లో పండిట్ హరిప్రసాద్ చౌరాసియా వేణు గానం పెట్టి. హెడ్ ఫోన్ ఆమెకు తగిలించాడాయన. ఆ సంగీతమే వింటూ ఆమె ప్రశాంతంగా కళ్ళు మూసుకుంది.
అనంత్ ఆయనతో మాటలు కలిపాడు. " ఆవిడ మీ భార్యేనా ? మీరు నాకేమౌతారు అన్నారేమిటి ?" అన్నాడు.
ఆయన అంతే ప్రసన్నంగా " ఆవిడ నా భార్యే ! సందేహం వద్దు. ఆవిడకి జ్ఞాపక శక్తి లేదు అంతే !" అన్నాడు.
నిర్హాంత పోయిన అనంత్ "ఎన్నాళ్ళనుంచి ? ఏమైనా జబ్బా ? లేక తలకి ఏమైనా దెబ్బ తగిలిందా ?" అని అడిగాడు.
"అవేమీ కావు. ఆపరేషన్ తర్వాత కాంప్లికేషన్ వలన అలా మార్పు వచ్చింది" అన్నాడాయన.
మెల్ల మెల్లగా వివరాలు చెప్పుకొచ్చాడాయన
వారికి చాలా ఏళ్ల క్రితం లేకలేక కవల పిల్లలు పుట్టారు. సిజేరియన్ అవుతుందని ఆసుపత్రిలో చేర్చారు. తీరా ఆపరేషన్ కి పావుగంట ముందు మెంబ్రేన్ రప్చర్ అయి ఉమ్మనీరుపోయి లోపల బిడ్డల గుండెలు మందగించడంతో స్పైనల్ కి బదులు జనరల్ అనస్తేషియా ఇచ్చి ఆపరేషన్ చేశారు. ఇద్దరూ ఆడపిల్లలు. చక్కగా ఉన్నారు కానీ బొడ్డుతాాడు ఇద్దరి మెడలకి చుట్టుకోవడం వలన వారిని రివైవ్ చేసే హడావుడిలో అనస్థటిస్టు ఆపరేషన్ పూర్తి అయి పోతున్నది కదా అని అక్కడ నుంచి పిల్లల దగ్గరకు వెళ్ళి వారి మీద దృష్టి పెట్టి ఉండడడం వలన తల్లికి పెట్టిన ఆక్సిజన్ సిలిండర్ ఖాళీ అయిపోయిందన్నది గమనించ లేదు. సర్జన్ " డాక్టర్ గారోయ్ ! సయనోసిస్ వచ్చింది. ఆక్సిజన్ అయిపోయిందేమో !" అని గావు కేక పెట్టేసరికి పిల్లల్ని వదిలేసి ఆపరేషన్ టేబుల్ దగ్గరకి పరుగున వచ్చి స్పేర్ సిలిండర్ ఓపెన్ చేసాడు. మళ్ళీ రక్తం నీలం రంగు లోనుంచి ఎరుపు రంగు లోకి వచ్చాక సర్జన్ కూడా "హమ్మయ్య" అనుకుని కుట్లు వేసేసి ఆపరేషన్ పూర్తి చేసేసింది కానీ ఏదో కీడు శంకిస్తుండగా పేషేంట్ పూర్తిగా స్పృహలోకి వచ్చేదాకా అక్కడే ఉంటానన్నది. ఆ ఉండడం దాదాపు పన్నెండు గంటలు అక్కడే ఉన్నదావిడ. కారణం: రాధ స్పృహలోకి రానే లేదు. ఎమర్జెన్సీగా న్యూరాలజిస్టు, ఇంకొక సీనియర్ అనెస్టెటిస్ట్ ను పిలిపించారావిడ. మొత్తం మీద దాదాపు పన్నెండు గంటల దీర్ఘ పోరాటానంతరం రాధ కళ్ళు తెరిచింది. కానీ ఆమె మెదడు జ్ఞాపక శక్తిని కోల్పోయింది.
********
అనంత్ కదిలిపోయాడు ఆ వివరాలు విని.
"ఇది జరిగి ఎన్నాళ్ళయిందండీ ?" జీరపోయిన గొంతుతో అడిగాడు.
"సరిగ్గా మొన్న ఫస్టు తారీకుకి ఇరవై ఆరు సంవత్సరాలు." అన్నాడాయన.
"మరి ఇన్నాళ్లూ ? మీ కూతుళ్లు ? ... " పూర్తి చేయలేక పోయాడు.
"మా కూతుళ్లు ఇద్దరూ పెద్ద వాళ్లై పెళ్లిళ్లు కూడా అయ్యాయి. ఇద్దరూ కెనడా లో ఉన్నారు. భర్తలిద్దరూ కూడా విచిత్రంగా కెనడాలోనే ఉంటారు కాకపొతే కవలలు కాదు" అని పకపకా నవ్వాడాయన.
"మరి మీ శ్రీమతి ? ఆవిడ ఏమీ కోలుకోలేదా?"
"కొంత నయము. కానీ కొంతే జ్ఞాపకం ఉన్నది, తన చిన్నప్పటి విషయాలు ఏవైనా కొంచెం కొంచెం జ్ఞాపకం వస్తూ ఉంటాయి." నవ్వాపి చెప్పాడాయన.
"మిమ్మల్ని ?" అన్న అనంతుకి ఆయన నిట్టూర్చి "నేనెవరో ఆమెకి గుర్తు లేదు" అన్నాడు.
"మరి ఆవిడని చూసుకోవడం ? మీ అత్తవారేమైనా ?"
"మా అత్తామామాలిద్దరూ ఈ సంఘటన జరిగిన ఏడాదికి కారు ఆక్సిడెంట్ లో పోయారు. నాకు బావమరుదులు, మరదలు ఎవరూ లేరు" అన్నాడు క్లుప్తంగా.
"ఆవిడ ఆలనా పాలనా ?"
"అన్నీ నేనే ! మా అమ్మాయిలిద్దరూ కొంచెం పెద్ద అయ్యాక వాళ్ళూ సహాయం చేసేవారు" కళ్ళు మెరుస్తూండగా చెప్పాడాయన.
"మరి వాళ్ళని గుర్తు పడతారా ? "
"చిత్రంగా వాళ్ళని గుర్తు పడుతుంది. వాళ్ళు ఏమి చెప్తే అది చేస్తుంది. వాళ్లకి పేర్లు తానే పెట్టింది. చిన్ని, బన్నీ" అని మళ్ళీ నవ్వాడాయన.
"పెళ్లిళ్లు ? "
"నేనే చేసాను. పెళ్లి పీటల మీద నా పక్కన కూర్చుని ఎలా చెప్తే అలాగే చేసింది మా బంగారం ! పెళ్లి అయ్యాక పిల్లలు విడవలేక ఏడుస్తోంటే చాలా సముదాయించింది చిత్రంగా !"" అన్నాడు కంఠం రుద్ధమవుతుండగా.
"మీరు మరి ఆ డాక్టర్ మీద, ఆస్పత్రి మీద కేస్ వెయ్య లేదా ?"
"నాయనా ! ఆ డాక్టర్ నిద్రాహారాలు లేకుండా పన్నెండు గంటలు పోరాడింది. ఆస్పత్రి స్టాఫ్ కూడా ఏంతో సాయం చేశారు. కేసు వేయాలన్న ఆలోచన కూడా రాలేదు."
"మరి ఆ మత్తు మందు డాక్టర్ ?"
"ఆయన పిల్లలను రివైవ్ చెయ్యకపోతే వారు నాకు దక్కేవారు కాదు. ఆ తర్వాత నా భార్యకు సమయానికి ఆక్సిజెన్ పెట్టడంతో పాటు గబగబా అనేక రకాల మందులిచ్చి తనని నాకు దక్కేలా చేసాడు."
"అయినా !...."
"నాయనా ! నేనూ డాక్టర్ నే. మెడిసిన్ అయిపోయి మా నాన్నగారు హఠాత్తుగా పోవడం వలన మా నాన్నగారి ఫార్మ్స్యూటికల్ బిజినెస్ చూడాల్సి వచ్చి వ్యాపారం వైపు వచ్చేసాను. డాక్టర్ల సాధక బాధకాలు బాగానే తెలుసు !"
నిరుత్తరుడయ్యాడు అనంత్
"ఇంక మేము బయల్దేరుతాము. నీ పేరేమిటో తెలియదు నాకు" అన్నాడాయన.
"నా పేరు అనంత నారాయణ. కె పీ ఎం జీ లో ఆడిటర్ గా పని చేస్తున్నాను" అన్నాడు.
"మంచిది నాయనా . ఆల్ ది బెస్ట్ !" అని భార్యను లేపబోతున్న ఆయనను మొహమాటంగా " మిమ్మల్ని ఒక్క మాట అడగ వచ్చా ?" అన్నాడు అనంత్.
"తప్పకుండా అడగండి" అన్నాడాయన.
"మీకు ఎప్పుడూ విడాకులు తీసుకోవాలన్న ఆలోచన రాలేదా ?" అన్నాడు అనంత్.
కొంచెం వింతగా చూసి అడిగాడాయన." విడాకులా ? ఎందుకూ ?"
"అంటే ! అంటే !....." నీళ్లు నములుతూ అడిగాడు అనంత్ "ఆవిడకు మీరు ఎవరో పాతికేళ్లుగా గుర్తు లేదు కదా ? "
'తను నాకు భార్య అన్నది నాకు గుర్తు ఉంది కదా "! క్లుప్తంగా అని భార్యను చేయి పట్టుకుని ఆప్యాయంగా లేపాడాయన
అప్రతిభుడై పోయాడు అనంత్ .
*********
ఇంటికొచ్చిన అనంత్ తల్లితో "అమ్మా ! ఇవాళ సాయంత్రం బయల్దేరి వెళ్తున్నాను, రేపు లలితని, పాపని తీసుకొస్తున్నాను" అని దృఢంగా చెప్పి గిరుక్కున తిరిగి వెళ్లిపోతున్న కొడుకు వైపు నోరు వెళ్ళబెట్టి చూస్తూ ఉండిపోయింది అతని తల్లి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి