ఆఫ్ లైన్ @

ఆఫ్ లైన్ 

 లాయర్ కాంతారావు దగ్గరకు స్నేహితుడు వెంకీ మొహం వేలాడేసుకొచ్చాడు. 

"ఏంవాయ్ మై డియర్ వెంకటేశం ! అలా ఉన్నావేంటీ. వెంకు మొహం పెంకులాగ ఉంటే బాగులేదువాయ్ !" హాస్యమాడబోయాడు.
చర్రున వచ్చిన చిరాకుని ప్రయత్నం మీద అణిచాడు వెంకీ. అవసరం అటువంటిది !
"మా ఆవిడ నీ దగ్గరకు వస్తుందట. విడాకులు కావాలని గొడవెడుతోంది."
సాధూ మెహర్ లాగ గబుక్కున ముఖకవళికలు మారిపోయాయి కాంతారావుకి.
ఆదుర్దాగా "ఏంటి ? ఎందుకు ? ఎప్పట్నుంచి ?" అన్నాడు. 
"ఓ ఆర్నెల్ల నుంచి నలుగుతోంది. స్మార్ట్ ఫోన్ లో నేను ఫేస్ బుక్ లో అకౌంట్ తెరిచినప్పటి నుంచి.  నిన్న వార్ డిక్లేర్ అయింది", ఏడుపు ఒక్కటే తక్కువ వెంకీకి.
"తనని పట్టించుకోవడం లేదు అని మా మాంగారికి ఫోను కూడా  కొట్టింది " గొంతులో రాపిడి పెరిగింది.
"అర్రర్రే ! కంగారొద్దు. స్థిమితంగా అన్నీ వివరంగా చెప్పు"
ఓ అరగంట తర్వాత కొంచెం నవ్వు ముఖంతో రిలాక్స్డ్ గా ఇంటి దారి పట్టాడు వెంకీ.


ఒక నెల రోజుల తర్వాత బార్ కి ఆహ్వానించి చక్కని ఫుడ్ కూడా పెట్టించి రెండు పెగ్గుల తర్వాత స్నేహితుడికి ధన్యవాదాలు చెప్పాడు వెంకీ. "ఒక వారం రోజులు ఫేస్ బుక్ కి దూరంగా ఉండి, మా మ్యారేజ్ డేకి తనకి స్మార్ట్ ఫోన్ కొనిచ్చానురా. తనకీ ఫేస్ బుక్ అకౌంట్ తెరిచి ఇచ్చా. ఒక్క రెండు వారాలయ్యే సరికి ఇంట్లో ప్రశాంతతే ప్రశాంతత  !!" ఆనందంతో దాదాపు కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు వెంకీ.
"వండ్రఫుల్  ! కొన్ని రోజులైనాక ఆన్ లైన్ లో కరెంట్ బిల్లులు వగైరా కట్టడం నేర్పించెయ్. ఆ తర్వాత నీకు ఎంత వెసులుబాటుగా ఉంటుందో చూస్కో !"
హుషారుగా "వాఖే!" అన్నాడు వెంకీ !


మూణ్ణెల్ల తర్వాత ఇంకా హుషారుగా కనిపించిన వెంకీ అడగకుండానే  "బ్యాంక్ విషయాలు కూడా నేర్పించానురా ! ఆన్లైన్ ట్రేడింగ్ కూడా నేర్చుకుంటానంటోంది" అని చెప్పాడు.
"హోల్డాన్ ! వెంకీ  ! దూకుడొద్దు. జాగర్తవాయ్" అన్నాడు కాంతారావు ఎడమ కన్ను అదురుతుండగా.
"ఏమ్ ఫర్లా ! మా ఆవిడ చాలా బాధ్యతగా చేస్తుందన్న నమ్మకం నాకుంది బాస్" అంటూ "గాల్లో తేలినట్లుందే" అని కూనిరాగాలు తీస్తూ ఎగిరిపోయాడు వెంకీ. 


ఆరు నెలల తర్వాత ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఎర్ర లైట్ దగ్గర ఆగిన కాంతారావు కారు అద్దం మీద ఎవడో ముష్టి వాడు టక టక కొడితే ముఖం చిట్లించి "ఫో ! ఫో !" అని విదిలించాడు.
ఆ ముష్టి వాడు తలుపు తీసి గబుక్కున పక్కన సీట్ లో కూర్చుని "పోనియ్యరా ! నీతో చాలా చెప్పాలి" అన్నాడు ఏడుపు గొంతు తో. 
"వెంకీ  ! " ఆ తర్వాత గొంతు పెగల్లేదు కాంతారావుకి.
తన పనిని వాయిదా వేసుకుని వెంకీ కోసమే కేటాయించాడు కాంతారావు. 
"నిలువునా మునిగానురా. ట్రేడింగ్ వదిలేసి ఆన్లైన్ షాపింగ్ కి అలవాటు పడింది మా ఆవిడ. పైగా క్రెడిట్ కార్డ్ మీద వాయిదా పద్ధతిలో  ! నా జీతం రోజు వారి ఖర్చులకి సరిపోతుంది, ఈ ఎమ్ ఐ లకి ముష్టెత్తాల్సి వస్తోందిరా" ఈసారి నిజంగానే ఏడిచేస్తున్న వెంకీ వైపు నిర్ఘాంతపోయి వెర్రి చూపులతో చూశాడు కాంతారావు  !!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఒక పౌర్ణమి కథ

అక్కరకొచ్చిన_అనుభవం

నేనున్నా నీకు రక్షణ @