బాల పూజ @
బాల పూజ
దేవుడి గదిలోనుంచి ఆగకుండా గంట వినబడుతోంటే ఉలిక్కి పడి లేచింది సంతోషి. అత్తగారు చాలా త్వరగా నిద్ర లేచి స్నానం చేసి జపం చేసుకుంటారు. పూజ చివరిలో తప్ప గంట మ్రోగించరు.
ఏమైందా అని మంచం దిగబోతుంటే పక్కన చిన్నారి కౌముది కనిపించక కంగారు పడింది. "ఏమండీ ! పాపాయి మీ పక్కన ఉందా ?" అని భర్తను కుదిపి అడిగింది. బద్ధకంగా " నీ దగ్గరే పడుకుందిగా రాత్రి!" అన్నాడే కానీ గబుక్కున లేచి కూర్చున్నాడు తేజ.
ఇద్దరూ లేచి పూజగది దగ్గరకు వెళ్తుండగా గంటతో పాటు కౌముది పాటకూడా వినిపించే సరికి హమ్మయ్య అనుకున్నారు. మామూలుగా కౌముదికి మామ్మ దగ్గర నిద్ర పోవడం అలవాటు. సంతోషి దగ్గర కన్నా మామ్మ దగ్గరే ఎక్కువ గడుపుతుంది. రాత్రి తండ్రి వారం రోజుల కాంప్ తర్వాత రావడంతో నాన్న దగ్గరే చేరి కబుర్లు చెప్తూ నిద్ర పోయింది.
పూజా గదిలోకి వెళ్ళిన తేజ, సంతోషి అక్కడ జరిగేది చూసి మంత్రముగ్ధులయినట్లు ఆగిపోయారు. మామ్మని కుర్చీ లో కూర్చోబెట్టి కాళ్లు రెండూ రెండు పళ్ళాలలో పెట్టింది. ఆవిడ మీద పూలరేకులు జల్లినట్లుంది, తలనిండా అవే. కొంచెం ముందుకు వెళ్ళిన ఇద్దరూ నవ్వాపుకోలేక పోయారు. మొహం నిండా పసుపు రాసి ఉంది. కుంకుమ తో బొట్లు పెట్టినట్లు ఉంది, మొహమంతా చుక్కలు చుక్కలుగా ఎర్రగా కుంకుమ !
మామ్మ చుట్టూ చప్పట్లు కొడుతూ పాట పాడుతూ తిరుగుతోంది. వచ్చీరాని భాషతో తప్పులతో పాడుతున్నా మొహం చేటంత చేసుకుని పరమానందంతో మనుమరాలినే చూస్తోంది మామ్మ.
పాట అయిపోయాక పళ్ళెం లో నీళ్ళు మామ్మ మీద జల్లేసి తన మీద కూడా జల్లుకుంది. అప్పుడు చూసింది తల్లి దండ్రులని. ఎక్కడ లేని సిగ్గు ముంచుకొచ్చి తల్లి కుచ్చిళ్ళలో దూరిపోయింది కౌముది.
ప్రశ్నార్థకంగా చూస్తున్న కొడుకుతో "నిన్న పక్కింటి ఉమా పిన్ని గారు దీనికి బాల పూజ చేశారు. అక్కడ నుంచి వచ్చినప్పటినుంచి 'బామ్మ పూజ' చేస్తానని గొడవ. నిద్రలో మర్చిపోతుందేమో అనుకున్నాను. తెల్లారగట్టే నాతో పాటు లేచిపోయి, నీళ్ళు పోసుకుని అప్పటినుంచి నన్ను జపం కూడా చేసుకోనీయకుండా ఇదీ దాని పూజ" మురిపెంగా మనవరాలిని చూస్తూ అన్నది బామ్మ.
"ఒరే బాబూ ! ఎంతో పుణ్యం చేసుకున్పాంరా ! ఆ బాల పూజ అంతా గుర్తు పెట్టుకుని దానికి చేతనైన విధంగా అన్ని ఉపచారాలు చేసిందిరా !" అని కళ్ళ నీళ్ళు కారుతుండగా మనుమరాలిని దగ్గరగా తీసుకుని పొదువుకుంది బామ్మ.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి