ఆ కాలం అమ్మాయి @


ఆ కాలం అమ్మాయి  

రోజూ అలవాటు ప్రకారం పార్క్ వాకింగ్ ట్రాక్ లో రెండవ రౌండ్ పూర్తి చేసి తను రోజూ కూర్చునే బెంచి మీద కూర్చున్న శంకరనారాయణ గారికి ఆ బెంచీ మీద కనిపించింది ఆ పాప.


 ఇదివరలో రెండు మూడు సార్లు చూశాడు కానీ పెద్దగా పట్టించుకోలేదు.  ఈ సారి తనకు అలవాటైన బెంచీ మీద కూర్చొని ఉండేసరికి కొంచెం కుతూహలంగా గమనించాడు. స్కూలు డ్రెస్సు వేసుకుని ఉంది. ప్రక్కనే బ్యాగ్ ఉన్నది. క్యారేజీ, మంచినీళ్ళ బాటిల్ కనిపించలేదు.  ఎనిమిదో క్లాసు లేక తొమ్మిదో క్లాసు చదువుతూ ఉండి ఉండాలని అంచనా వేశాడాయన. నిస్తేజంగా ఎటో చూస్తున్న ఆ అమ్మాయిని చూస్తే జాలి వేసింది ఆయనకి.
 ‎
ఒక్క ఐదు నిముషాలు ఆగి మెల్లగా మాటలు కలిపాడు. త్వరలోనే మాటలు కలిసిపోయి స్నేహితులలాగ మాట్లాడుకున్నారు ఇద్దరూ. ఆ పార్కు దగ్గరలో ఉన్న కార్పొరేట్ స్కూల్ లో తొమ్మిదవ తరగతి చదువుతున్నది ఆ పాప. పేరు వందన. ఆ రోజు స్పెషల్ క్లాసులు లేక పోవడం వలన ముందుగా వదిలేశారు లేక పోతే రాత్రి ఎనిమిదిన్నర, తొమ్మిదింటికి కానీ వదలరుట.

"ఇంటికెళ్తే ఎవరూ ఉండరు, నాన్నగారు షాప్ నుంచి రారు, మమ్మీ స్నేహితురాళ్ళ ఇళ్లకు వెళ్ళడమో, ఛాటింగ్ చెయ్యమో చేస్తూ ఉంటుంది. ముందరే ఇంటికి వెళ్తే విసుక్కుంటుంది. 'స్కూలు వాళ్లకి బోలెడంత డబ్బు పోస్తున్నాం. టైముకి ముందే మా మీదకి తోలేస్తారేంటి' అంటుంది తాతగారూ " .

 ఏదో చల్లని తెమ్మెర గుండెను తాకినట్టయింది ఆయనకు. "ఇంట్లో ఇంకెవరూ ఉండరా అమ్మా! మామ్మ గారు, తాత గారు, అక్కలు, తమ్ముళ్ళు ఎవరూ ?" 

"లేరు తాతగారూ  ! మా మామ్మ గారు తాతగారు వేరే పల్లెటూరిలో ఉంటారు. నాకు అన్నతమ్ములూ, అక్కచెల్లెళ్ళూ లేరు".  

ఒక్క నిమిషం ఆగి "అందుకనే స్కూలు అయిపోయినా ఇంటికి వెళ్ళ బుద్ధి కాదు. ఇల్లంతా ఖాళీగా అనిపిస్తుంది ".

గుండెలో సూదులు గుచ్చుతున్నట్లు అనిపించింది. 
"మరి స్నేహితురాళ్ళు ఎవరూ లేరా ? కబుర్లు చెప్పుకోవడానికో, ఆడుకోవడానికో ?" 

"నా క్లాసు మేట్లంతా క్లాసులు లేకపోతే వాట్సాప్ ఫేస్ బుక్ లో బిజీగా ఉంటారు, ఆటలకి రారు".

"మరి నువ్వు? నీకు మొబైల్ లేదా ? "

"లేకేం తాతగారూ  ! నాకెందుకో అది ఇష్టం ఉండదు.  ఎదురుగా కబుర్లు చెప్పుకోవడమే ఇష్టం.  మీకు తెలుసా ? నేను సంవత్సరం అంతా ఎదురు చూసేది వేసవి సెలవలు మూడు వారాల కోసం. మా మామ్మ గారి ఊరెళ్ళిపోతాను. తాతగారు, మామ్మ తో బోలెడు కబుర్లు, వైకుంఠపాళీ, దాడి, తాతగారి తో చదరంగం, క్విజ్ లూ, బోలెడు పుస్తకాలు, అక్కడ పిల్లలతో అచ్చంగాయలు, దాగుడు మూతలు, చెట్లకి వేసిన ఉయ్యాల ఊగడం చాలా కాలక్షేపం " కళ్ళు మెరుస్తూండగా తన్మయత్వంతో చెప్పింది.  

"నాకు ఇష్టమైన పరికిణీ ఓణీలు వేసుకుంటాను, మామ్మ పూల జడ వేస్తుంది. గోరింటాకు పెడుతుంది. పాపిడి బిళ్లా, లోలాకులు, చెంపస్వరాలు పెడుతుంది.  నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు నిద్ర లేవచ్చు. రాత్రి మాత్రం మామ్మ, తాతగారి కధలు వింటూ త్వరగానే నిద్ర పోతాను" ప్రవాహంలా సాగిపోతున్న ఆ కబుర్లని ఆపడం ఇష్టం లేక మిగిలిపోయిన రెండు రౌండ్లు వాకింగ్ మర్నాటికి వాయిదా వేసుకున్నాడు. 

తన భార్యను 'గ్రానీ', తనను 'గ్రాన్ పా' అని పిలిచే మనవడు, మనవరాలు గుర్తొచ్చి చిన్నగా నిట్టూర్చాడు.  

"తాతగారూ  ! నేను వెళ్ళొస్తాను.  బాగా చీకటి పడిపోయింది.  ఎప్పుడైనా ఇక్కడే కలవచ్చా మిమ్మల్ని  ? మా తాతగారు జ్ఞాపకం వస్తారు మిమ్మల్ని చూస్తే. అందుకే మిమ్మల్ని తాతగారూ అని పిలిచాను. ఏమీ అనుకోరుగా ? " అని కొంచెం మొహమాటంగా సంజాయిషీ ఇస్తున్న  వందనని అప్రయత్నంగా దగ్గరగా తీసుకుని నుదురు చుంబించారు శంకరనారాయణ గారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఒక పౌర్ణమి కథ

అక్కరకొచ్చిన_అనుభవం

నేనున్నా నీకు రక్షణ @