నందిని పెళ్ళి @

 నందిని పెళ్ళి 

రాత్రి ఊర్నించి వచ్చి భోంచేసి నిద్ర పోయేసరికి లేట్ అవడం వలన రామ్ మోహన్ లేచేసరికి ఏడు అయిపోయింది.  ఇంట్లో ఏదో ఆందోళన, హడావుడి అంతర్లీనంగా తెలుస్తోంది.  గబగబా పళ్ళు తోమేసుకుని కాఫీ తాగేసి భార్యను పిలిచాడు.  "ఏమిటీ ఏదో తేడాగా ఉంది ఇంట్లో  ?" 

"ఏమిటి ఏమిటీ ? మీ ముద్దుల పట్టి, మీ తమ్ముడి కూతురు .." అంది కానీ పూర్తి చెయ్యకుండానే విసవిసా వెళ్ళి పోయింది విశాల.

గుండె గుబగుబలాడింది. నందిని చిన్నప్పటి నుంచి తన దగ్గరే బాగా అలవాటు. తను చేసిన ముద్దు వల్లే మొండితనం వచ్చిందని విశాల, మరదలు శ్రీలక్ష్మి గుసగుసగానూ ఒక్కోసారి వినబడేటట్లుగానూ చెవులు కొరుక్కునేవాళ్ళు. 

నందిని క అంటే క , కీ అంటే కీ జరిగిపోతుందని అందరికీ తెలిసిన విషయమే. 

అంతెందుకు ? మొన్నటికిమొన్న నందిని మూతి ముడుచుకుని కూర్చోవడం చూడలేక అప్పటికప్పుడు తీసుకుని వెళ్లి ఆర్ యస్ బ్రదర్స్ లో తనకి నచ్చిన గాఘ్రా చోళీ. కాసున్నర చెయినూ కొనేశాడు. 

అంతకు ముందో ! న్యూ ఇయర్ పార్టీ ఫ్రెండ్స్ తో డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటల దాకా అంటే ఇంట్లో అందరూ ససేమిరా అన్నా తీసుకెళ్లి  తను కూడా అక్కడ అర్ధరాత్రి దాకా ఉండి మరీ తీసుకొచ్చాడు.

తండ్రి కూడా "రాఁవుడూ ! మరీ అంత చనువిస్తే నెత్తినెక్కుతుంది" అని కూడా అనేశాడు.

ఇంతకీ నందిని ఎక్కడ ఉందా అని వెతికితే వంట గది పక్క గదిలో తలుపులు బిడాయించుకుంది. 

"నందూ ! తలుపు తియ్యీ ! నీకేం కావాలో చెప్పు." 

"నాకేం నువ్వు చెయ్యఖర్లా. నువ్వు అవతలకి వెళ్లూ !"

"నేను చెయ్యక్కర్లేదూ ? నేను చెయ్యకపోతే ఇంకెవరు చేస్తారే పిచ్చి పిల్లా!"

"ఇది నాన్న చెయ్యాలి , నువ్వు అవతలికి పో  !"

"అయ్యిందా ! నా నందు, నా నందు ! అనేవారు, మిమ్మల్ని కరివేపాకులాగ తీసి పడేసింది. " ఎప్పుడు వచ్చిందో విశాల పక్కనే సన్నాయి నొక్కు నొక్కింది.

"నువ్వు నోరు ముయ్యి ! అసలిది ఎలా మొదలైంది?"

"నిన్న రాత్రి మీ తమ్ముడి పెళ్ళి ఆల్బం బయట పడింది "

"ఐతే ?"

"ఐతే ఏమిటీ నా బొంద  ! ఆ ఫోటోలన్నీ చూసేసరికి పింజరాలెత్తిపోయింది మీ ముద్దుల పట్టి  !"

"సరిగా విషయం చెప్తావా లేదా ?" 

"ఏంటి చెప్పేది  ? అవి చూసినప్పట్నించి పేచీ. తనకీ పెళ్ళి చెయ్యాలిట. పొద్దుట నుంచి ఒకటే ఏడుపు"

ఒక్క నిముషం అవాక్కైపోయాడు రామ మోహన్. 
మరు నిముషంలో పగలబడి నవ్వేశాడు.

"నవ్వకండి. ఇది నవ్వే విషయమా ? చేసినంత ముద్దు చేశారు. అనుభవించండి."

"పోనీ పెళ్ళి చేసేద్దామే. చక్కగా అల్లుడొచ్చేస్తాడు !"

"నా బొంద చక్కన ! మీరు దాన్నీ, మీ తమ్ముడు అల్లుడినీ చంకనేసుకుని ఊరేగండి. బాల్య వివాహమని మనందర్నీ జైల్లో పడేసి ఇంత ముద్ద పడేస్తారు. నాకు, మీ మరదలికి వంట శ్రమ తగ్గుతుంది !" విసవిసా వెళ్ళిపోతున్న భార్యని చూస్తూ పకపకా నవ్వుతూనే ఉన్నాడు రామ్మోహన్ !!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఒక పౌర్ణమి కథ

అక్కరకొచ్చిన_అనుభవం

నేనున్నా నీకు రక్షణ @