గురుదేవోభవ @

 గురుదేవోభవ

బస్ స్టాండ్ లో బెంచీ మీద రాని బస్ కోసం ఎదురు చూస్తూ నీరసంగా కనిపిస్తున్ప అచ్యుతరావు పంతులుగార్ని ఎవరూ పెద్ద  పట్టించుకోక పోయినా ఒక జత కళ్ళు నిశితంగా పరిశీలిస్తున్నాయి. కొంచెం గడ్డం మాసి, పీక్కు పోయి కనిపిస్తున్న ముఖం ఎక్కడో చూసినట్టు అనిపిస్తోంది కానీ చప్పున గుర్తు రాలేదు. అప్రయత్నంగా ఆయన మెడ వెనక రుద్దుకుండడం చూడగానే గుర్తు వచ్చింది.  ఆయన జిల్లా పరిషత్ హైస్కూలు హెడ్ మాస్టర్ అని. కాశి నాయుడు గారి ముఖంలో చిరునవ్వు వచ్చింది. 


వెంటనే ఆయన దగ్గరకు వెళ్ళి చేతులు జోడించి "నమస్తే పంతులు గారూ ! నన్ను గుర్తు పట్టారా?" అనడిగాడు.

కొద్ది సేపు నిశితంగా చూశాక ఆయన "నాయుడు గారూ! చాలా రోజుల తర్వాత ! కులాసాయేనా  ? ఇక్కడ ఉన్నారు ? ఆమదాలవలస కాదూ మీరుండేది  ?" అనడిగాడు.

"భలే జ్ఞాపకం మీకు మాష్టారూ  ! ఇప్పుడు ఇక్కడకి షిఫ్ట్ అయిపోయాము. ఇవాళ తెల్లవారుఝామున మీ శిష్యురాలి పెళ్ళి అయింది ఇక్కడ.   ఆడాళ్ళ వేడుకలు జరుగుతున్నాయి.  మా తోడల్లుడిని బస్ ఎక్కించి వెళ్దామనుకుంటుండగా మీరు కనిపించారు. రండి ! బస్ స్టాండ్ దగ్గరే మంటపం. ఆశీర్వదించి భోజనం చేసి వెళ్దురు."

"బస్సు వెళ్లి పోతుందేమోనండీ. మళ్ళీ ఒక రెండు మూడు గంటల వరకు బస్సు దొరకదు" అన్నారాయన మొహమాటంగా.

"ఆ బస్సు కే వెళ్దురు. నేను బస్సు ఎక్కిస్తాను మాష్టారూ  ! రండి !" అని బలవంతం చేసి తీసుకెళ్ళిపోయాడు కాశి నాయుడు.

*****   ******    *******

"పంతులు గారు" అని గౌరవంగా పిలుచుకునే అచ్యుతరావు గారు జిల్లా పరిషత్ హైస్కూలు హెడ్ మాస్టర్ చేసినపుడు ఆ స్కూల్ ప్రభ వెలిగి పోతూండేది. ఆయన జమీందారు వంశం నుంచి వచ్చినా పిల్లలన్నా, చదువు చెప్పడమన్నా మైమరచి పోయేవాడు. ఆయనకు చాలా ఆలస్యంగా పిల్లలు పుట్టడం కారణం అయి ఉండవచ్చు.  స్కూలులో చాలా క్రమశిక్షణ అమలు చేసినా, ఇంట్లో ట్యూషన్ పిల్లలకి చాలా ఓర్పుతో, లాలనగా సబ్జెక్టులు వివరించేవాడు. ఆయన అన్ని సబ్జెక్టులు చెప్పగలిగినా లెక్కలు, ఇంగ్లీషు ఆయనకు చాలా ఇష్టమైన సబ్జెక్టులు. రెన్ అండ్ మార్టిన్ గ్రామర్ ఇయన చెప్తే తిరుగు ఉండేది కాదు. ఆయన దగ్గర లెక్కలు చదివిన పిల్లలు చాలామంది పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారు. 
అలా అని ఆయన ఫీజేమీ ముక్కు పిండి వసూలు చేసేవాడు కాదు.  పైగా అందరినీ ట్యూషన్ లో పెట్టుకునేవాడు కాదు. స్కూలు లో వెనకబడి ఉన్నవారిని పరిశీలించి, సాన బడితే రాణిస్తారని అనిపిస్తేనే తీసుకొనేవారు.  ఎంతో మంది బ్రతిమాలినా, ఫీజుకి ఆశ పెట్టినా ఆయన పంధా మార్చుకోలేదు.  ఆయన శిష్యులకి ఆయనంటే చెప్పలేనంత గౌరవం.

 రిటైర్ అవడానికి ముందు ఏడాది స్కూలు డబ్బులు స్వంతానికి వాడుకున్నాడని ఆరోపణలు వచ్చి సస్పెండ్ అయి పెన్షన్, ప్రావిడెంట్ ఫండ్ ఆపేశారు. ఆ తర్వాత ఆయన కుటుంబంతో వేరే ఊరు వెళ్ళిపోయారు.
క్రమంగా ఆ ఊరు వారు, సహోద్యోగులు, విద్యార్థులు కూడా ఆయనను మర్చిపోయారు.  స్కూలు ప్రాభవం కూడా తగ్గిపోయింది.

*****      *****      ******

కాశి నాయుడు గారి మదిలో ఈ విషయాలన్నీ గిర్రున తిరిగాయి. ఆయన మీద ఆరోపణలు అబద్ధం అనీ తెలుసు.  అప్పటి జిల్లా పరిషత్ చైర్మన్ ఖుద్దూస్ కక్ష కట్టి చేయించాడని తెలిసిన కొంతమందిలో నాయుడు గారూ ఉన్నారు. అప్పట్లో ఖుద్దూస్ కు ఉన్న పలుకుబడి, ప్రభుత్వం లో అతని పరపతికి వెరచి మౌనంగా ఉండిపోయాడు.  ఇన్నాళ్ళకి కనిపించిన పంతులుగార్ని వదల దలుకోలేదు కాశి నాయుడు.
కారణం ఆయన కూతురు కనకలక్ష్మి . పదో క్లాసు చదువుతూండగా ఖుద్దూస్ కొడుకుతో చనువుగా ఉండడం చూసి నాయుడు గారిని కూతురు గురించి హెచ్చరించడమే కాక ఖుద్దూస్ కొడుకుని నలుగురి ముందూ చీవాట్లు పెట్టారు.
దానితో ఖుద్దూస్ మండిపోయి తను చేయగలిగింది చేశాడు. స్కూలు నిధులతో ఆయన కొన్న లైబ్రరీ పుస్తకాలు, పిల్లలకు రేడియో, పబ్లిక్ అడ్రస్ సిస్టం  వాటి ఇన్ వాయిస్ లూ, రసీదులూ నకిలీవని ఆరోపణలు చేసి సస్పెండ్ చేసేశాడు ఖుద్దూస్. 
ఆ పెన్షన్ కోసం ఆయన పడ్డ పాట్లు ఎవరికీ తెలియదు. ఆయన స్వస్థలం లక్కందిడ్డి.  అక్కడ గుట్టుగా సంసారం గడుపుతూ శ్రీకాకుళం జిల్లా పరిషత్ ఆఫీసు చుట్టూ రాని పెన్షన్ కోసం తిరుగుతూ ఉండేవాడు. 

***       ****        *****

"మాష్టారూ  ! వంటలైపోయాయి. మీరు వేడిగా భోజనం చేసెయ్యండి. ప్రొద్దుట ఏమీ తినలేదులా కనిపిస్తున్నారు. నేను అక్కడ మండపంలో ఏమైనా కావాలేమో కనుక్కుని పది నిముషాల్లో వస్తాను ." అని క్యాటరింగ్ వాళ్ళకి పురమాయించి అరిటాకు వేయించి కూర్చోబెట్టి వెళ్లాడు నాయుడు.  సాక్షాత్తూ నాయుడు పురమాయించడంతోటి ప్రత్యేకమైన శ్రద్ధతో వడ్డించారు వారు.  తల వంచుకుని మౌనంగా భోజనం చేస్తూ చివరికి పెరుగన్నం తింటుండగా  ఎవరో వెక్కుతున్న శబ్దం చెవుల బడడంతో తల ఎత్తి చూశారాయన.  దాదాపు పది పదిహేను మంది యువతీయువకులు ఎదురుగా చేతులు జోడించి కనబడ్డారు. అందులో ఇద్దరు యువతులు చీర కొంగు నోటికి అడ్డం పెట్టుకుని శబ్దం పైకి రాకుండా రోదిస్తున్నారు. ఆయన తమను చూడగానే దగ్గరగా వచ్చి ఐదారుగురు మోకాళ్ళ మీద కూర్చుని "మాష్టారూ! కులాసాయేనా నండీ ? చాలా రోజులైంది. " అని ఆప్యాయంగా అడిగారు.  నెమ్మదిగా అందరినీ గుర్తు పట్టి పలకరించారాయన. అంతమంది శిష్యులను చూసేసరికి ఆయనకు ఆనందం, ఆశ్చర్యం ముప్పిరిగొన్నాయి. "మీరంతా ఇక్కడ...?
"కనక లక్ష్మి పెళ్ళి కదా మాష్టారూ  ? మంటపంలో నాయుడు గారు చెప్తే అందరం పరుగున వచ్చేశామండీ "
"మాష్టారూ  ! ఇలా అయిపోయారేమిటండీ ? అమ్మ గారు ఎలా ఉన్నారు  ?" అని అంతకు ముందు ఏడుస్తున్న ఇద్దరిలో ఒక యువతి ఇంకా వెక్కుతూనే అడిగింది.
టూకీగా తన పెన్షన్ సంగతులు చెప్పారాయన.
"నాగేష్ ! నువ్వు జిల్లా పరిషత్ లో తెలిసినవారు ఉంటారు కదా  ! ఈ పని చేయలేవా ?" అని అడిగింది ఒక యువతి .
"ఆ పని నాకు వదిలెయండి మాష్టారూ  ! మీ పెన్షన్ వగైరాలు వచ్చేసినట్లే అనుకోండి " అన్నాడు నాగేష్.

"మాష్టారూ ! ఇచ్ఛాపురం లో మా మామగారు జూనియర్ కాలేజి నడుపుతున్నారు.  ఇంగ్లీషు కి మీరు లెక్చరర్ గా రావాలి. నేను ఆ కాలేజీ కి కరెస్పాండెంట్ ని" అన్నాడు చంద్రరావు అనే ఇంకొక స్టూడెంట్. 
"వాణి ఏం చేస్తోంది మాష్టారూ?  టెన్త్ అయిపోయి ఉండాలి కదా ? ఇచ్ఛాపురం తీసుకుని వచ్చెయ్యండి. మన కాలేజీలోనే చేరుద్దాం " అని కూడా అన్నాడతను.

అనుకోకుండా వచ్చిన ఈ ప్రేమకి ఉక్కిరిబిక్కిరి అయన కళ్ళు చెమర్చాయి.
"మాష్టారూ  ! మీ కంట తడి మేము చూడలేము. మాకందరికీ చదువు బిక్ష పెట్టిన వారు మీరు. మేమందరమూ మీ ఇంట్లో పరీక్ష టైమ్ లో భోజనాలు కూడా చేసి చదువుకున్నాము.  ఆ ఋణం కొంతైనా తీర్చుకోనివ్వండి." అన్నాడు విశ్వనాధ్ అనే మరొక శిష్యుడు.  అందరూ అవునన్నట్లు తలూపారు.

****      ****       *****

కనక లక్ష్మినీ, భర్తను తృప్తి గా దీవించి నాయుడు గారు తనకీ, భార్య కు పెట్టిన బట్టలు భద్రంగా పొదవుకుని శిష్యులందరూ బస్ స్టాండ్ లో వీడ్కోలు చెప్పగా బస్ ఎక్కిన అచ్యుతరావు పంతులుగారికి పక్కనే బయల్దేరిన ఇంకొక బస్సులో నుంచి "మాష్టారూ, మాస్టారూ !" అని కేక విని కిటికీలోనించి తల బయట పెట్టి చూస్తే హైదరాబాద్ వెళ్ళే బస్ లో నుంచి రెండు చేతులు జోడించి కనబడ్డాయి. మనిషి మాత్రం కనబడలేదు.  చాలా దూరం వెళ్ళేదాకా ఆ చేతులు అలాగే జోడించి ఉంచాడు  ఆ గుర్తు పట్టడానికి తెలియని శిష్యుడు.
ఈ సారి కన్నీరు రాలేదు ఆయనకు.  చెప్పలేనంత ఆనందం కలిగింది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఒక పౌర్ణమి కథ

అక్కరకొచ్చిన_అనుభవం

నేనున్నా నీకు రక్షణ @