నిష్కృతి @

నిష్కృతి 

 రాత్రి  భోజనాలు అయిపోయిన తర్వాత త్రివిక్రమరావు గారూ, దుర్గా కబుర్లు చెప్పుకుంటూ ఉండగా అనుకోకుండా వచ్చిందా ప్రస్తావన.  


"కోడలు వచ్చాక ఎలా ఉంది దుర్గా?  కొంచెం విశ్రాంతి దొరుకుతోందా ? లేక రెస్టు అరెస్టైందా ?" కొంచెం హాస్యం రంగరించి అడిగాడు.

"చాలా వెసులుబాటు గా ఉంటోందండీ. ఇంట్లో పిల్ల లాగనే కలిసిపోయింది.  బీ టెక్ చదివినా ఆ టెక్కు ఏమీ లేదు. కానీ హైదరాబాదులో చక్కటి క్వార్టర్స్, మంచి పేరొచ్చే ఉద్యోగం ! ట్రాన్స్ఫర్ ఎందుకు కోరుకున్నాడో  మన ఆనందు ? ఆశ్చర్యం ఏమిటంటే కోడలు ఏమైనా మొహం ముడుచుకుంటుందేమో అనుకున్నాను.  ఆ ఛాయలేమీ కనిపించలేదు . కానీ....."

"కానీ ఏమిటీ ? ఏమైనా ప్రాబ్లమా?"

"అహఁ! ప్రాబ్లం అని కాదు కానీ నా పరిస్థితి తనకి చెప్పారు కదా ?"

"మొదటి రోజే చెప్పాను.  ఏమి ? ఏమైంది ?"

*****        *****         ******

దుర్గకు ఒక్కడే కొడుకు.  చక్కగా చదువుకున్నాడు. కానీ కానుపు చివరిలో కష్టమై ఫోర్సెప్స్ డెలివరీ అవడం వలన కాంప్లికేషన్స్ వచ్చి రక్తహీనత, బలహీనత వలన దాదాపు ఏడాది పాటు మంచం మీద ఉండిపోయారావిడ. దానితో కొంచెం ఊబకాయమూ మధుమేహమూ వచ్చి ఖాయిలా పడిపోయారు. అల్పాచమానం బట్టలలోనే అయిపోతుంది. ఆవిడా, ఆయనా ఎంతో గుంభనగా ఎవరికీ తెలియకుండా శ్రమ అనుకోకుండా కొడుకుని పెంచారు. ఇంకొక బిడ్డ కూడా వద్దనుకున్నారు. ఆనంద్ చదువుకుంటూనే తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉండేవాడు. పెళ్ళి చేశాక కోడలికి సంగతి చెప్పాలని దంపతులు ముందే అనుకున్నారు.


****        ****      *****


"వేరే ఏమీ కాదు. చాలా కలుపుగోలుగా ఉంటుంది కానీ నాకు బాత్ రూమ్ దగ్గర ఆసరాకి వచ్చినపుడు, యూరిన్ ఎప్పుడైనా నేలమీద పడి తుడవవలసి వచ్చినపుడు కొంచెం తేడాగా అనిపిస్తుంది ముఖంలో  పెదాలు బిగ బడుతుంది. ఎందుకొచ్చిందిరా ! భగవంతుడా ! అనుకుంటోందేమో అనిపిస్తుంది "

"నిజమా ? ఏమైనా మాట తూలేదా ? "

"అబ్బే ! అదేం లేదు.  అసలేమీ మాట్లాడదు ఆ టైమ్ లో"

"చూద్దాం.  తొందర పడి ఒక నిర్ణయం వద్దు " అన్నాడే కానీ ఆయనకూ కొంచెం అనుమానం అనిపించింది. 


మరునాడే ఉదయం ఆ పరిస్థితే వచ్చింది. కాంచన మోకాళ్ళ మీద కూర్చుని నేల మీద మూత్రం మరకలు జాగ్రత్తగా తుడుస్తోంది మౌనంగా. 

మంచం మీద నుంచి దుర్గ అడిగింది "కాంచనా ! ఈ పని నీ మీద పడింది ఏమనుకోకమ్మా".

"లేదత్తయ్యా ! నేనేం అనుకోను" రుద్ధంగా వినిపించింది కాంచన కంఠం. 

లేచి కూర్చుంది దుర్గ.
"ఏమైందమ్మా ? ఏడుస్తున్నావా ?"
లేదన్నట్లు అడ్డంగా తల ఆడించింది కాంచన.

పాదాల మీద నీటి తుంపరలు పడేసరికి కాంచన భుజం పట్టుకుని గడ్డం కింద రెండో చెయ్యి వేసి ఎత్తింది.
బుగ్గల మీద కన్నీరు జారుతున్నది.

"ఏమైంది కాంచనా ! పోనీలే ఈ పని నువ్వు చేయద్దు అమ్మా!"

గభాలున ఆవిడ నడుము చుట్టూ చేతులు చుట్టేసి ఒళ్ళో తల పెట్టుకుని బరస్ట్ అయిపోయింది కాంచన.

"ఒద్దత్తయ్యా ! ఈ పని నేనే చేస్తాను !"

"మరెందుకు కన్నీరు?"

"మా అమ్మ గుర్తొచ్చింది అత్తయ్యా " వెక్కుతూ అంది కాంచన. 

"నాకర్ధం కాలేదు.  ఏమైంది చెప్పమ్మా !" లాలనగా అడిగింది దుర్గ.

కాంచన చెప్పిన వివరాలు వినేసరికి ఆవిడకీ కంట నీరు తిరిగింది.

****       ********       *****

కాంచన అమ్మ గారికి అబ్బాయి పుట్టాక చాలామంది పిల్లలు దక్కక ఎన్నో మందులు తీసుకుని అనేక జాగ్రత్తలు పాటించిన తర్వాత కాంచన పుట్టింది. అల్లారు ముద్దుగా పెంచారు. కానీ అనేక కాన్పుల వలన గర్భసంచీ జారి ఆవిడకు మూత్ర విసర్జన మీద అదుపు లేక పోయింది.  

కాంచనకు ఊహ తెలిసేసరికి అన్నయ్యకు పెళ్ళి అయి వదిన వచ్చేసింది.  ఆమె పెద్ద ఉమ్మడి  కుటుంబం నుంచి రావడం వలన అత్తగారికి చాలా జాగ్రత్తగా సేవలు చేసేది. ఆమె సులువుగా చేసే సేవలకి కాంచనకి ఆశ్చర్యంగా ఉండేది. కొంచెం ఈర్ష్యగా కూడా ఉండేది. ప్రతి పనికీ "అమ్మాయ్! లక్ష్మీ " అని ఆ అమ్మాయి మీద ఆధార పడే అమ్మను చూసి విసుక్కునేది.

 ఎప్పుడైనా లక్ష్మి ఊరెడితే ఆ పనులు కాంచన మీద పడేవి. ఇంక తల్లికి చుక్కలు చూపించేది కాంచన.  మళ్ళీ కోడలు ఎప్పుడు వస్తుందా అని ఆశగా ఎదురు చూసేదావిడ. దానితో ఇంకా మండిపోయేది కాంచనకి.
 
అందుకే ఊళ్ళో ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నా వేరే ఊళ్లో హాస్టల్లో చేరి మరీ బీ టెక్ చదివింది. ఆఖరి ఏడాది లో ఆవిడ కాలం చేశారు. 

బీ టెక్ అయిపోయి ఇంటికి వచ్చేసిన కాంచనకి ఇల్లు బావురుమంటున్నట్లు తోచింది.  తండ్రితో నెమ్మదిగా సాన్నిహిత్యం పెరిగి ఖాళీగా ఉన్నపుడు తల్లి గురించి ఆయన చెప్పే కబుర్లు వినగా వినగా తల్లిని తనెంత హింసకు గురి చేసిందో అర్ధమై కాంచనకి దుఃఖం వచ్చేది. రెండవ బిడ్డ కోసం అదీ ఆడపిల్ల కోసం ఎంత తపించేదో ఆయన చెప్తూంటే చెవులు రిక్కించి వినేది. నడక వచ్చేవరకూ ఎత్తుకుని దింపకుండా తిరిగేదని తెలిసి రాత్రి పూట గుబులు గుబులుగా ఏడ్చేది. 

తల్లి లేని పిల్ల అని తెలిసినా ఏ మాత్రం సందేహించకుండా కాంచనని చేసుకుంటామని దుర్గ చెప్పినపుడు నమ్మలేక పోయినా గట్టి నిర్ణయం తీసుకుంది. 

ఆ నిర్ణయం అత్తగారికి చెప్తూ వెక్కుతుంటే దుర్గ కోడల్ని గాఢంగా హత్తుకుని ఏడ్చేసింది. 


పెళ్ళి అయిన మర్నాడే భర్తకు తను తల్లి పట్ల ప్రవర్తన గురించి చెప్పి సాధ్యమైనంత త్వరగా హైదరాబాద్ నుంచి తమ ఊరికి మారిపోదామని, కావాలంటే భర్త హైదరాబాద్ నుంచి మారకపోవడం సాధ్యం కాకపోతే తను అత్తగారి దగ్గర ఉంటాననీ అందుకు ఒప్పుకోవాలనీ కాళ్ళ మీద పడి వేడుకుందనీ తర్వాత రోజు ఆనంద్ వివరంగా చెప్తే మరోమారు ఏడ్చేసింది దుర్గ. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఒక పౌర్ణమి కథ

అక్కరకొచ్చిన_అనుభవం

నేనున్నా నీకు రక్షణ @