మీరే నా ప్రాణం @


 మీరే నా ప్రాణం 

పడక గదిలో డబుల్ కాట్ మీద దిండ్లు రెండు వేసుకుని వెనకకి ఆనుకుని లా బుక్ ఒళ్ళో పెట్టుకుని దీక్షగా చదువుతున్నాడు గంగాధర్. ఓ పక్కన మరికొన్ని పుస్తకాలు ఉన్నాయి. రెండో పక్కన భార్య సర్వద పడుకుని ఉన్నది. ఎప్పుడూలాగనే ఒక పక్కకి ఒత్తిగిలి భర్త పొట్ట చుట్టూ చెయ్యి వేసి ఆదమరచి నిద్రపోతున్నది. అది అలవాటైన గంగాధర్ మరునాటి వాదించవలసిన కేసుకి సంబంధించిన పాయింట్లు చిన్న పుస్తకంలో నోట్ చేసుకుంటున్నాడు. ట్రాన్సిస్టర్ లో పాత తెలుగు పాటలు మంద్ర స్థాయిలో వినిపిస్తున్నాయి. ఎంత మ్యూజిక్ సిస్టంలు, స్మార్ట్ ఫోన్ లు ఉన్నా అతనికి రాత్రి పూట రేడియోలో మధుర గీతాలు, ఛాయా గీత్ ఇవి వినడమే ఇష్టం.

మంచి పాయింట్ ఒకటి దొరికి నోట్ చేసుకుంటుండగా ఘంటసాల గానం అతని ధ్యాసను తనవైపు అయస్కాంతం లాగా లాక్కుంది. "మనసున మనసై బ్రతుకున బ్రతుకై". అతనికి ఒకప్పుడు ఎంతో ఇష్టమైన పాట ! బీ ఎల్ చదివే రోజుల్లో ఆ పాట అంటే పిచ్చి గంగాధర్ కి. తన మానసిక స్థితికి దగ్గరగా ఉన్నదని తనకి ఒక గాఢమైన నమ్మకం. ఏ పని చేస్తున్నా ఆ పాటే పెదవుల మీద ఆడుతూ ఉండేది.

ఉండడానికి స్నేహితులు ఉన్నా ఎందుకో తనని పట్టించుకోవటంలేదని అపోహ లాంటిది అతనిని బాధిస్తూ ఉండేది. అందుకనే ఆ పాట ఇంకా దగ్గరైంది. ఇంటి దగ్గర తల్లి తండ్రులు పెద్ద వయసు వారు. వాళ్ళ ప్రేమకి ఏమీ లోటు ఉండేది కాదు. అయినా ఆ వయసులో ఇంకా ఏదో తనని పట్టించుకునే వారు కావాలని ఆరాటపడేవాడు.

తనకి ఆడ స్నేహితులు ఉన్నా వారిలో ఎవరూ తన వేవ్ లెంగ్త్ లో లేరని తేల్చేసుకున్నాడు. తన దగ్గరి స్నేహితులు ఆడ క్లాస్ మేట్స్ తో సరదాగా మాట్లాడుతూ ఉంటే కుళ్ళుకునేవాడు.

లా కంప్లీట్ చేసుకుని తండ్రి దగ్గరే జూనియర్ గా మొదలు పెట్టి నాలుగు అయిదు ఏళ్లలోనే తన ప్రతిభతో సొంతంగా చిన్న చిన్న కేసులు సమర్ధవంతంగా వాదించడంతో తండ్రి నిశ్చింతగా పెద్ద కేసులు కూడా అతనికి అప్పజెప్పే స్థాయికి వచ్చాడు.

ఒకసారి ఒక ఆస్తి తగాదాలో మధ్యవర్తిగా ఉన్న వ్యక్తి భార్య ఇతని సలహా కోసం వచ్చినప్పుడు మొదటి సారి ఆవిడతో వచ్చిన లక్ష్మీ సర్వద అతనిని ఆకర్షించింది. ఆమె ఆ వచ్చిన ఆవిడ మేనకోడలు. తల్లిదండ్రులు చిన్నప్పుడే పోవడంతో మేనత్త దగ్గర పెరిగింది. మామయ్య హఠాత్తుగా ఆక్సిడెంట్ లో పోవడం వలన ఆయన మంచితనంతో హామీగా ఉన్న ఒకరిద్దరు స్నేహితులు దివాళా తీయడంతో ఆ అప్పులిచ్చిన వాళ్ళు ఆవిడ వెంట పడ్డారు. ఆ విషయం లో గంగాధర్ సలహా కోసం ఆవిడ వచ్చినప్పుడు ఆవిడతో 18 ఏళ్ల సర్వద కూడా వచ్చింది. మొదటిలోనే ఎందుకో ఆమె ఆకర్షణలో పడిపోయాడు గంగాధర్.

ఏతావాతా తల్లిదండ్రులు కూడా ఒప్పుకోవడంతో నామకః పెళ్లిచూపులు కానిచ్చి తాంబూలాలు పుచ్చుకున్నారు. పెళ్ళిచూపులలో గంగాధర్ తండ్రి కొంచెం గంభీరంగాను, కొంచెం చిర్నవ్వు మేళవించి అడిగారు "అమ్మాయ్ ! మా వాడు సిగరెట్లు తాగుతాడు నీకు అభ్యంతరమా ?" అని. ఆమె మరింత తల దించేసుకుని అడ్డంగా ఊపింది. ఆయనే మళ్ళీ "మా వాడికి అలాంటి అలవాట్లు లేవమ్మా ! సరదాకి అడిగాను" అన్నారు.

సర్వదకి తల్లిదండ్రులు లేరన్న విషయము, కన్యాదానం చెయ్యడానికి మేనత్త భర్తతో కూర్చునే అవకాశం లేదన్న విషయము గంగాధర్ కి కానీ అతని తల్లిదండ్రులకి కానీ అడ్డుగా అనిపించలేదు. ఉన్నంతలో మేనత్త వివాహం బాగానే జరిపించింది.

పెళ్ళైన తర్వాత సర్వద ఎంతో చక్కగా అత్తమామలతో కలిసిపోయింది తల్లి దండ్రులు వారి ప్రేమకు దూరమైపోయిన ఆమె తన ప్రేమ ఆప్యాయతలని వారి మీద, ఆడపడుచు కాత్యాయని మీద, ముఖ్యంగా భర్త మీద గుమ్మరించేది. కాత్యాయని తనకన్నా చిన్నది అవడంతో ఎంతో ముద్దు చేసేది. మొదట్లో కాత్యాయని ఆడబిడ్డ అధికారం చెలాయించినా, సర్వద ప్రేమలో తడిసి ముద్దైపోయి తన బెట్టు మర్చిపోయింది.
ముఖ్యంగా గంగాధర్ ఆమె పిచ్చి ప్రేమ మైకంలో పడిపోయి ప్రాక్తీసుని నిర్లక్ష్యం చెయ్యడం వరకూ వెళ్ళింది. తండ్రి కొంచెం కరకుగానూ తల్లి సున్నితంగానూ అతనిని హెచ్చరించడంతో మళ్ళీ గాడిన పడ్డాడు. సర్వద మాత్రం భర్తకు ఎప్పుడూ ఎదురు చెప్పలేదు. పైగా అత్తమామల దగ్గర ఆడపడుచు దగ్గర భర్తను వెనకేసుకొని వచ్చేది.

ఇద్దరు పిల్లలు పుట్టాక అత్తామామాలిద్దరూ కొద్దీ నెలలలో ఒకరి తరువాత ఒకరు గతించడంతో ఆమె కన్నీరు మున్నీరుగా విలపించింది కానీ పెద్దరికం వహించి ఒంటి చేత్తో ఇంటినంతటినీ మేనేజ్ చేసింది. ఆడపడుచుకి మంచి సంబంధం చూసి వివాహం చేశారు దంపతులిద్దరూ. అత్తవారింటికి వెళ్ళేటప్పుడు కాత్యాయని వదినను వాటేసుకుని ఏడ్చినప్పుడు ఆమె దుఃఖానికి చలించిపోయి కాత్యాయని ఆడపడుచు కూడా ఏడ్చేసింది.

పిల్లలు పెద్దయ్యే వరకూ ఆలనా పాలనా భర్త చూసుకోనవసరం లేకుండా తనే నిర్వహించింది. పిల్లలు ఎప్పుడైనా భర్త కి ఎదురు చెప్తే సహించేది కాదు. భర్త తప్పు ఉన్నా కూడా ! ఏకాంతంలో ఉన్నపుడు భర్త ను బతిమాలో బామాలో పిల్లలు అలా ఎందుకు ఎదిరించారో చెప్పి సమర్ధించేది.

"అప్పుడే ఎందుకు చెప్పలేదు?" అని భర్త అడిగితే "మీరంటే నాకు ప్రాణం. మన పిల్లలైనా మిమ్మల్ని ఏమైనా అంటే నేను తట్టుకోలేను" అనేది.

ఆమె ప్రేమకి ఒక్కొక్కసారి అతను విసుక్కునేవాడు కూడా. అమె తన తీరు మార్చుకోలేదు. ఒక సారి అతని స్నేహితునికి ధన సాయం చేసి ఆ స్నేహితుడు తర్వాత ముఖం చాటేసినపుడు తెగ బాధ పడితే ఆమె ఎంతో ధైర్యం చెప్పింది తప్ప ఏ విమర్శ చెయ్యలేదు. "మీరు చేసింది రైటు" అని కితాబు ఇచ్చింది.

అతనికి ఏ కొద్ది నలత చేసినా ఆమె బెంబేలెత్తిపోయేది. కన్నీళ్లు, డాక్టర్ కు ఫోన్ కాల్సు, మందులు శ్రద్ధగా ఇవ్వడం, ఆహారం డాక్టర్ చెప్పినట్లు ఇవ్వడం అన్నీ ఆమే చూసుకునేది.

"నిన్ను నిన్నుగా ప్రేమించుటకు
నీ కోసమే కన్నీరు నించుటకు
నేనున్నానని నిండుగ పలికే"

అన్న చరణం వచ్చినప్పుడు గంగాధర్ తను ఎంత అదృష్టవంతుడనో అని పులకించి పోయాడు. ఇంతకాలం తనకా పాట గుర్తు కూడా రావాల్సిన అవసరం రాకుండా చేసిన సర్వదను ఇంకాస్త దగ్గరకు పొదువుకుని మృదువుగా నుదురు చుంబించాడు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఒక పౌర్ణమి కథ

అక్కరకొచ్చిన_అనుభవం

నేనున్నా నీకు రక్షణ @