బావ మరదళ్ళు @
బావ మరదళ్ళు
అతనికి అక్కడ అందరూ పరిచయమైన ముఖాలే ! కానీ అతనికేసి చూసే వారంతా ఎవరో కొత్త వాడిని చూసినట్లు, కొందరు గుర్తు పట్టనట్లు, కొందరు మొహమాటపు నవ్వుతో అవసరమైన దాని కన్నా ఎక్కువ హడావుడిగా దాటుకుంటూ వెళ్ళిపోవడం అతడు గమనిస్తూనే ఉన్నాడు.
పక్కనే చెల్లెలి కేసి చూసి "ఇక్కడ ఒద్దు కానీ అదుగో ఆ కనిపించే కోవెలకి వెళ్దాం" అని జవాబు కోసం చూడకుండా పెద్ద పెద్ద అంగాలు వేసుకుంటూ నడవడం మొదలుపెట్టాడు.
"అన్నయ్యా ! నెమ్మదీ !" అంటూ దాదాపు పరిగెడుతున్నట్లే అతనిని అందుకోవటానికి ప్రయత్నిస్తోంది సుభద్ర.
కోవెలలోకి వెళ్ళాక కాళ్ళు కడుక్కుని అమ్మ వారి దర్శనం చేసుకుని కొద్దిగా అవతలకి వెళ్లి వచ్చేవారిని గమనించసాగారు వారిద్దరూ.
"ఇప్పుడు తను వస్తుందా ? నీకెలా తెలుసూ ? ఎంత మేనత్త కూతురైనా మనం చూసి చాలా రోజులయింది. ఎలా గుర్తు పడతావు ? పెద్దన్నయ్య మరీనూ ! మనం ఎంత మేనత్త మేనమామ బిడ్డలమైనా పెళ్ళి ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పను కూడా చెప్పలేదు కదా రాధ అత్త ! వెళ్ళండి అని తరిమినంత పని చేశాడు. చెప్పరా చిన్నన్నాయ్ ! నీకు చేసుకోవాలని ఐతే ఉంది కదూ ? నాకు తెలుసులే !" అంటూ చెవి మెలేసింది కాళ్ళ మునివేళ్ళ మీద నుంచుని.
"అదుగో తను వచ్చినట్లుంది. అల్లరి చెయ్యకు. మా తల్లివి కాదూ !!"
"అర్ధమైందిలే ! తనని చేసుకోవాలని ఉంది కదూ ! దొంగ దొరికాడు !" అంది అన్నతో గుసగుసగా.
"ఉష్ !"
స్నేహితురాళ్ళు కొందరు, దగ్గరి బంధువులు కొందరు ఆ అమాయితో వచ్చినట్లు ఉంది. మరీ వేళాకోళాలు లేవు, అలా అని మరీ అదుపులో పెట్టే చూపులు కూడా లేవు. ఆమెని చూసి మైమరచి పోయాడతను. చిన్నపుడు చూసినప్పటి అందం ద్విగుణీకృతం, అంతకన్నా ఇంక ఎక్కువే అయింది అనుకున్శాడు. అర్చన చేస్తుండగా యదాలాపంగా అతని వైపు చూసిన ఆమె చకితురాలైంది. గుర్తు పట్టేసిందన్నది అతనికి అవగతమైంది. కొంత దూరంలో ఉండడం వలన, ప్రక్కన ఒక పెద్దావిడ అడ్డం రావడం వలన ఆమె కపోలాలు అరుణిమ దాల్చడం అతనికి కనిపించలేదు.
తన గుండె చప్పుడు తనకే వినిపించిందా అన్నట్లు కంగారు పడిందామె. మేనమామ కొడుకు గురించి వింటూనే ఉంది. అతను సాధించిన కార్యాలు విని పులకించి పోయేది. ఆజానుబాహుడైన అతని అందం ఆమె చూసినప్పటి కన్న అనేక రెట్లు ఎక్కువగా ఉండేసరికి ఆమె ఈ లోకమే మరచిపోయింది.
చుట్టూ ఎందరో ఉండే సరికి పరిగెత్తిపోయి అతనిని హత్తుకుని తన ప్రేమ వ్యక్తం చేయలేక పోయింది.
అక్కడ అతను ఆమె తన వైపు విసరిన చూపులను బట్టి అవి చిన్నపుడు ఆడుకున్న కాలపు స్నేహమా ? లేక ప్రేమా ? అన్నది అంచనా వెయ్యలేక పోయాడు.
***
అన్నా చెల్లెళ్ళు కూడబలుక్కుని వారంతా వెళ్ళిపోయాక కొంచెం సేపు ఆగి మేనత్త గారింటికి బయల్దేరారు.
అక్కడ ఊహించినట్టుగానే కోలాహలంగా ఉంది. వీరిని చూసి మేనత్త రాధ సంబరపడింది కానీ భర్తకి జడిసి ఆగింది. వారిని చూసి ఆమె భర్త మాత్రం నిలదీశాడు
"మీకు నేను కబురు చెయ్యలేదు. ఎందుకొచ్చారు ?" అన్నాడు కోపంగా.
అతని గొంతు విని ఇంటిల్లిపాదీ, వచ్చిన అతిధులంతా నివ్వెరపోయారు.
"నాకు వరసైన నీ కూతురును మాకు మాటైనా చెప్పకుండా పెళ్ళి ఎలా చేస్తావో అడగడానికి వచ్చాను. ఇది మర్యాదగా లేదని నువ్వైనా చెప్పలేకపోయావా అత్తా ?"
"నా కూతురు నా ఇష్టం" అని క్లుప్తంగా హుంకరించాడు మామ.
"మరి నీ కూతురి ఇష్టం కనుక్కున్నావా మామా ?"
ఈ మాట అని, వచ్చిన అతిధులతో అన్నాడు అతను.
"మీకు తెలుసు కదా నేనెవరో ? ఈ ఇల్లాలికి మేనల్లుడిని, కాబోయే అల్లుడిని. మా అత్తకి మా పెళ్ళి ఇష్టమే. కానీ మా మామగారికి కొన్ని రాజకీయ కారణాల వలన వేరే సంబంధం చేయాలని చూస్తున్నారు. మీ అందరి ఎదురుగా మర్యాదగా అడుగుతున్నాను. మామా ! నీ కూతురికి నేనంటే ఇష్టమే అన్నట్లైతే ఆ మాట ఆమె అందరి ఎదురుగా చెప్తే నీకు ఒప్పుదలేనా?"
"అందరి ఎదురుగా చెబుతున్నాను, నా కూతురికి ఇష్టమైతే నేను అడ్డం చెప్పను. నీకు కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తాను."
తల్లి వైపు చూసి ఆమె భావం అర్ధం చేసుకుని నెమ్మదిగా అందరి ముందుకు వచ్చి బావ ముఖంలోకి చూసి ఒక్కసారి సిగ్గు ముంచుకు రాగా తల దించుకుని అతని అరచేతిని తన అరచేతితో బంధించి అతని ఎడమవైపు నుంచున్నది.
"సాటివారైన మీ అందరి ముందు చెప్తున్నాను. నా మరదలు అంటే నాకు చెప్పలేనంత ఇష్టం. ఈమెను నా ప్రాణంతో సమానంగా చూసుకుంటాను. ఈమె తన ఇష్టాన్ని మీ ముందే వ్యక్తపరిచింది. ఎవరికైనా అభ్యంతరం ఉంటే మా అన్నయ్య, మా అమ్మ మీద ఆన ! చెప్తున్నాను. నాతో యుద్ధానికి సిద్ధపడండి. వీరవిహార పోరులో గెలిచి నా మిత్రవిందను ద్వారకకు తీసుకుని వెళ్ళి మా బలరామ దేవులది, మా తల్లి దండ్రులు దేవకీ వసుదేవుల ఆశీర్వచనాలు పొందుతాను. ఏమంటావు సుభద్రా ?" అన్నాడు చెల్లెలితో శ్రీకృష్ణుడు.
కుడివైపు చేరి అన్నగారి రెండవ చేతిని తన చేతిలోకి తీసుకుంది గర్వంగా సుభద్ర.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి