కరోనా కళ్యాణం @
కరోనా కళ్యాణం
రంగమణి గారు, సుదర్శనాచార్యులు గారు ఆటో దిగి కళ్యాణ మండపం కాంప్లెక్స్ లోకి నడిచారు. కొంచెం బెరుకుగా మూడు కళ్యాణ మండపాలు ఉండడం చూసి “వీటిలో ఏదంటావు రంగా ? మనకి పంపిన కార్డులో ఉన్నదని జ్ఞాపకం. నువ్వేమో సమయానికి కార్డు మర్చిపోయావు” అని చిరుకోపాన్ని ప్రదర్శించారు సుదర్శనాచార్యులు గారు. “మీరే టైమయిపోతొంది అని ప్రాణాలు తోడేశారు” అని బదులిచ్చింది ఆవిడ.
“నేను కనుక్కుని వస్తానుండండి మీకన్నీ మొహమాటమే” అని ఆయన మారు పలికేలోపు ఒక కళ్యాణ మండపం కేసి వెళ్లిపోయిందావిడ.
మాధవరావు వాళ్లకి చిన్నప్పటి నుంచీ పరిచయస్తులు, పొరుగున చాలాకాలం ఉండి వెళ్ళిపోయిన మాధవరావు గారు వీళ్ళకి ముందర ఉత్తరం రాసి, తర్వాత కార్డు పంపించి తన ఒక్కగానొక్క కూతురి వివాహం జరుగుతున్నదనీ వాళ్ళ ఊళ్ళోనే జరుగుతున్నది కాబట్టి తప్పకుండా రమ్మని మరీ మరీ కోరేసరికి మామూలుగా ఇల్లు కదలని వీరిద్దరూ తయారై బయల్దేరారు. కార్డు కూడా అందుకనే వెంట తీసుకుని వెళ్లాలని గుర్తు లేదు వారిద్దరికీ.
ఫలానా చోట కళ్యాణ మండపం అని గుర్తున్నది కానీ ఏ నా ? బీ నా ? సి నా ? అన్నది ఇద్దరికీ గుర్తు లేదు. చప్పున ఆయనకి ఒకరి పేరు పవన్ అని జ్ఞాపకం వచ్చింది. ముఖం వేలాడేసుకుని వచ్చిన భార్యని ప్రశ్నార్ధకంగా చూశారాయన. “ఎవరూ తెలిసిన ముఖాలు లేరండీ ! ఈ కరోనా గోలలో మాస్కులొకటి మన ప్రాణానికి. మామూలుగానే గుర్తుపట్టడం ఎలాగా అని బెంగ పెట్టుకున్నాను. మాస్కు తీయమని ఎలా అడగను. మాధవ రావు గారి పెళ్లి ఎక్కడా ? అని అడిగితే ఇక్కడెక్కడా కాదన్నారే !” అందావిడ.
“నీ ముఖం లాగ ఉంది , మాధవ రావు పెళ్లి ఏమిటే ? మాధవరావు గారి అమ్మాయి పెళ్లి అని అడగాల్సింది” అని “పోనీలే ! పెళ్లి కొడుకు పేరు నాకు జ్ఞాపకం ఉందిలే ! ఇదిగో ఈ మండపమే ! బయట పెద్ద అక్షరాలతో పవన్ వెడ్స్ రాధ అని ఉంది” అని అటువైపు దారి తీశాడాయన. హమ్మయ్య ! ఇప్పటికైనా ఈయన బుర్ర పని చేస్తోందని సంతోషించి ఆయనను అనుసరించింది రంగమణి గారు.
వీరి పెద్దరికపు వాలకం, చేతిలో పెద్ద గిఫ్ట్ పాకెట్ చూసి ముందర టేబుల్ దగ్గర పిల్లలు “నమస్తే అండీ !’ అని పన్నీరు జల్లి, గులాబీలు చేతికిచ్చి మర్యాదగా లోపలకి దారి చూపించారు. “ముహూర్తం దగ్గర పడుతొంది. అక్షంతలు వేసేసి పక్క హాల్ లోకి వెళ్ళండి సార్ !” భోజనాలు మొదలైపోయాయి” అని అంతకంటే మర్యాదగా ఒక యువకుడు వారికి చిన్న సలహా పారేసాడు.
ఒక ఐదు నిముషాలు వెనకాల కుర్చీలలో కూర్చుని హాలంతా కలయ చూచారు ఆ దంపతులు. వారికి మాధవరావు తప్పితే ఎవరూ తెలియదు పైగా అందరూ మాస్కులు వేసుకునే సరికి వీరికి ఇంకా బెంగ పట్టుకుంది. ఐదు నిముషాల తర్వాత లేచి వేదిక వైపు కదిలారు.
అక్కడ ఒక చిన్న లైనులో ఆశీర్వదించడానికి తయారైన జంటలు ఉన్నారు. వీళ్ళకి వారెవరూ తెలియక పోవడం, వీళ్ళని వారెవరూ గుర్తు పట్టలేకపోవడంతో కొంచెం ముందు వెనకలాడడంతో వీరిని ముందుకి పంపించారు వారు వయసుకి గౌరవం ఇచ్చి. ఇంకోరెండు జంటలు వీరి ముందు వున్నారు. “పెళ్లి కూతురు తండ్రి కనిపించలేదే ?” అనడిగారు సుదర్శనాచార్యులు ముందాయనతో చనువుగా.
“ఇందాక ఇక్కడే చూశానండీ. కట్నాల బట్టల కోసం రూములోకి వెళ్లినట్లున్నారు” అన్నాడు ముందున్న యువకుడు వీళ్ళ వంతు వచ్చేసరికి. జంటని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి అక్షతలు వేసి బహుమతి అందజేసి “మేము మీ నాన్నగారికి స్నేహితులమమ్మా ! బంధుత్వం లేకపోయినా దగ్గరి వాళ్ళం “ అని “దీర్ఘ సుమంగళీ భవ !” అని మళ్ళీ ఆశీర్వదించారాయన
వధువు ఆనందంగా వారి కాళ్ళకి నమస్కరించి “భోజనాలు చేసెయ్యండి బాబాయి గారూ, పిన్నిగారూ” అని వారికి బట్టల పాకెట్ ఇచ్చింది పెళ్లి కూతురు. వెనకాల పెళ్లి కొడుకు స్నేహితులు వచ్చి ఫోటోల హడావుడి పెట్టేసరికి వీరు మండపం నుంచి దిగిపోయి డైనింగ్ హాల్ కేసి కదిలారు.
భోజనం రుచికరంగా ఉన్నా ఉక్కగా ఉండేసరికి గబగబా తినేసి గాలి కోసం బయటికొచ్చి, మాధవరావుని నెమ్మదిగా వెతుకుదాంలే అనుకుంటుండగా అటువైపు నుంచి హడావుడిగా వెళ్తున్న ఆసామి వీళ్ళని అనుమానంగా చూస్తూ ముందుకి వెళ్లి మళ్ళీ వెనక్కి వచ్చి “సుదర్శనా ?” అని అనుమానంగా పలకరించాడు. “అవునూ ! మీరు ?” అనడిగేసరికి ఆయన మాస్కు తీసి బిగియారా కావులించేసుకున్నాడు. “మాధవా ! నువ్వేనా ? లోపల వెతుకుతున్నాము మేమింకా !” అంటూ తాను కూడా కావిలించుకున్నారు సుదర్శనాచార్యులు.
చిరునవ్వుతో వీరిద్దరినీ చూస్తున్న రంగమణి . “బాగున్నారా అన్నయ్యా ? వదిన ఎట్లా ఉన్నది ?” అన్నది.
“హబ్బ ! ఎన్ని రోజులైపోయిందమ్మా మిమ్మల్ని చూసి ! రండి రండి ! ఆవిడని ఒక్క సారే చూసినట్లున్నారు మీరు.! పరిచయం చేస్తాను" అని మండపం వైపు కదిలాడు మాధవ రావు.
పిచ్చాపాటి మాట్లాడుతూ నడుస్తున్న సుదర్శనాచార్యులు “అటు వైపు వెళ్తున్నావేమిటి మాధవా ! ఇది కదా మండపం ?” అన్నారు.
“లేదు ! ఇదీ మండపం ! మీకు పంపిన కార్డులో వివరంగా ఉంది కదా మినీ కళ్యాణ మండపం అనీ ?” అన్నాడు మాధవ రావు.
వీరిద్దరూ తెల్లబోయి ముఖాలు చూసుకున్నారు. “మేము ఆ మండపం అనుకున్నాము. పెళ్ళికొడుకు పేరు కూడా చూసుకుని వెళ్ళాము. పవన్ అని వ్రాసిన మండపం అది కదా ?” అన్నారు సుదర్శనాచార్యులు. మాధవ రావు ఆ వెల్ కం బోర్డు కేసి చూసి ఒక్క నిముషం తర్వాత పకపకా నవ్వడం మొదలెట్టాడు.
“సుదర్శనా ! మా అమ్మాయి పావని అని మర్చిపోయావా ? ఆ మండపంలో జరిగిన పెళ్ళిలో వరుడి పేరు పవన్. మా అమ్మాయి పావని” అని తాము పెట్టిన బోర్డు కేసి చూసాడు. ముఖం పాలిపోయిందతనికి. ‘రాధాకృష్ణ వెడ్స్ పవన్’ అని ఉంది
“సారీ సుదర్శనా ! పావని లో చివరి ఐ బల్బులు వెలగలేదు నేను కూడా ఇప్పుడే చూసాను , ఇంగ్లీషులో పేరు ఉండేసరికి జరిగిన తప్పు !”
“మరి అక్కడ ఆ పెళ్ళికి వెళ్ళొచ్చాము, అక్షతలు వేసాము, భోజనం కూడా చేసాము, బట్టలు కూడా పెట్టారు మాధవా !” అన్నారు సుదర్శనాచార్యులు గిల్టీగా
“ఏమీ ఫర్వా లేదు మా అమ్మాయిని కూడా ఆశీర్వదించుదురు గాని రండి !” అన్నాడు మాధవ రావు.
“అది కాదు. మంచి గిఫ్టు కూడా కొన్నాము. వెయ్యి రూపాయిలు గోవిందా !” అంటున్న సుదర్శనాచార్యుల గారినీ రంగమణినీ చేతులు పట్టుకుని తమ కళ్యాణ మండపం కేసి తీసుకెళ్తూ దారంతా నవ్వుతూనే ఉన్నాడు మాధవ రావు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి