చిన్న పాత్రలతో రామాయణం - గుహుడు
రామాయణంలో చిన్న పాత్రలు
గుహుడు - నేస్తమా దైవమా
నెమ్మదిగా గంగా నదిలో కదిలిపోతున్న నావను చూస్తూ దణ్ణం పెడుతూ అలాగే ఉండిపోయిన నిషాద రాజుని అతని భార్య "మన దగ్గరి బంధువులు మనను వదిలి వెళ్లిపోతున్నారని అనిపించడం లేదూ ?" అన్నది. గుహుడు భార్యని దగ్గరగా పొదువుకుని అన్నాడు "నా మనసులో మాటే నువ్వూ అన్నావు". .
"రెండు పక్షాలు గడిచే సరికి ఇలా అనిపించడం రెండో సారి, ఇంతకూ ముందు ఇలా జరిగిన గుర్తు లేదు." అన్నది అతని భార్య కళ్లనీళ్లు తుడుచుకుంటూ.
"నిజమే ! నాకైతే రాముడు వెళ్లిపోతుంటే నా ప్రాణమే వెళ్ళిపోతున్నదా ?అనిపించింది " భారంగా అన్నాడు గుహుడు.
"ఆ రామయ్య తండ్రి తమ్ముడు కదా ఈయన ? ఆయన పది మీద నాలుగేళ్లు అడవులలోకి వెళ్లిపోతుంటే ఆయన వెనకాలే పడిపోతున్నాడేమిటి ఈయన ? చాలా బెంగ అనుకుంటా అన్నయ్య మీద !'
"నా కన్నా మనుషులని చదవడం నీకు బాగా తెలుసును నీలా ! ఎంతైనా ఆడవాళ్లు ఆలోచనలో మా కన్నా చక్కంగా ఆలోచిస్తారు " అన్నాడు గుహుడు మెచ్చుకోలుగా ఆమె వైపు చూస్తూ .
"నేనైతే భరతుణ్ణి మొహం మీద అడిగేసాను, రామయ్యని నీకు అడ్డుగా ఉన్నాడని, ఆయన అడ్డంకి లేకుండా చేసుకుని రాజ్యాన్ని ఎదురు లేకుండా పాలించాలని అనుకోవడంలేదు కదా అని" అన్నాడు గుహుడు సిగ్గుగా .
"ఆయనకు కోపం వచ్చిందా ?" అడిగింది నీల కుతూహలంగా
"లేదు నీలా ! నేను ఎంత రాజునైనా నిషాదుణ్ణని ఆయనకి ఎరుకే కదా ! ఏమీ కోపం పెట్టుకోలేదు . ఆయనని బ్రతిమాలి మళ్ళీ అయోధ్యకి తీసుకుని వెళ్లి రాజుని చెయ్యడానికే వెళ్తున్నానని ఎంతో ప్రశాంతంగా చెప్పాడు. ఎంతైనా ఆ మారాజు దశరథుడి కొడుకు అనిపించుకున్నాడు ఆయన " అన్నాడు గుహుడు గొంతులో గాద్గదికని నొక్కిపెట్టి.
"ఇంతకీ రామయ్య నీకింత నేస్తుడెలాగయ్యాడు ? ఆయన ఎక్కడో కోసల రాజ్యం కదా ? నువ్వెప్పుడూ ఆయన గురించి చెప్పను కూడా లేదు" అన్నదే కానీ ఆమె గొంతులో ఎత్తిపొడుపు గుహుడికి అవగతం కాకపోలేదు.
"మా అయ్య ఈ రాజ్యమేలినపుడు రామయ్య గారి తండ్రి దశరధులవారు వేటకి వచ్చినపుడు ఆయన దానికి కావలసిన ఏర్పాట్లు మా అయ్యే చేసేవాడు. రామయ్య, ఆయన వెంట లక్ష్మన్న విశ్వామిత్రుడి వెంట వెళ్తున్నపుడు ఆ సంగతి తెలిసి వాళ్ళని చూడడానికి వెళ్ళాను . అప్పటికి మా అయ్య వెళ్ళిపోయి, నేను రాజ్యానికి అప్పుడే వచ్చాను. గంగ ఒడ్డునే రాత్రి వాళ్ళు నిద్ర చేస్తే నేను స్వయంగా రాత్రంతా కాపలా కాశాను. మళ్ళీ బయలుదేరేటప్పుడు రామయ్య ఏమన్నాడో తెలుసా నీలా ? మళ్ళీ కలుద్దాం అని . అలా అన్నపుడు ఆయన మోహంలో చిరునవ్వు మరచిపోలేను."
"అలా ఒక్కసారే కలిసారా ? అయినా ఎన్నాళ్ళో నేస్తులన్నట్లే అనిపించింది ఆయనను, నిన్ను చూస్తే "
"అయన నేస్తమా నాకు నీలా ? ఆయన భగవంతుడే !" మళ్ళా గొంతులో జీర.
"ఆయన రాజులు కదా ? నేను నిషాదుణ్ణి కదా ? అదేమీ చూసుకోలేదు ఆయన , ఆ నవ్వు చూసి కాళ్ళకి మొక్కుదామని అనుకుని ఆ సంగతే మర్చిపోయి ఆయననే చూస్తూ ఉండిపోయాను. అది గ్రహించాడేమో ఆయన. గట్టిగా బిగియారా, మనసారా ఎదకి హత్తుకున్నాడు. " కారిపోయే కన్నీళ్ళని ఆపుకోవడానికి ప్రయత్నం కూడా చెయ్యలేదు గుహుడు.
"మంచి మంచి ఆహారపదార్ధాలు, మధురపదార్ధాలు ఇస్తానని అంటే ఆయన 'నేను కందమూలాలు తినాలని మా నాన్నగారి ఆదేశం మిత్రమా ! నాకు ఈ మధుర పదార్ధాలు వద్దు. అదిగో చూశావా ? నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చిన రధాన్ని లాగిన నాలుగు గుర్రాలు ! వాటిని మా నాన్నగారు నాతొ సమానంగా ప్రేమించేవారు. నాకు ఏ మాత్రం అలసట లేకుండా ఎంతో దూరం తీసుకుని వచ్చాయవి . చాలా అలసిపోయాయవి.. అదుగో మా మంత్రి సుమంత్రుడు. మమ్మల్ని జాగ్రత్తగా తీసుకుని వెళ్ళమంటే రధసారధియై మమ్మల్ని తీసుకుని వచ్చిన తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు సుమంత్రుడు. ఆయనకు, ఆ అశ్వాలకు అలసట తీరే విధాన వారికి ఆకలి తీర్చమన్నాడాయన. " ఈ సారి పొర్లి వస్తున్న ఏడుపుని ఆపుకునే ప్రయత్నం కూడా చెయ్యలేదు గుహుడు.
"నన్ను రెండే ఆయన అడిగింది. ఒకటి మర్రిపాలు కావాలని, రెండోది నన్ను మర్నాడు తనను, సీతమ్మని , లక్ష్మన్నని గంగను దాటించమని అడిగాడు. మనని దాటించే ఆయన నన్ను దాటించమని అడిగాడు నీలా ! ఆయన నన్ను నేస్తుడనుకుంటున్నాడేమో ! నేను ఆయనకి నేస్తుడనేమిటి ? అయన దేవుడే నీలా !" అంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్న గుహుణ్ణి పొదువుకుని తాను కూడా కన్నీరు కార్చింది నీల.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి