తల్లి ప్రేమ @
తల్లి దుఃఖం
"అమ్మా ! స్నానం చేసి వస్తాను . వడ్డించెయ్యి. ఆకలి వేస్తోంది " అంటూ తల్లి గదిలోకి వెళ్లిన శ్రావణ్ తల్లిని చూసి అవాక్కై ఉండిపోయాడు. తల్లి మంచం మీద కూర్చుని కన్నీరు కారుస్తోంది. ఆమె పక్కన చిన్న నవలిక మంచం మీద ఉన్నది. వెంటనే దానిని గుర్తు పట్టాడు. తాను వ్రాసిన నవలికే ! "తల్లి, సవతి తల్లి" తనకి చాలా గొప్ప పేరు తెచ్చిన నవల. అనేక మంది తనకి అభిమానులను చేసిన నవల. పెద్ద పుస్తకమేమీ కాదు, కానీ అందులోని కదా వస్తువు ఎంతోమందిని కదిలించి వేసింది.
అందులో కదా నాయకుడు చిన్న తనంలోనే తల్లిని కోల్పోయి సవతి తల్లి పెంపకంలో పెరిగాడు. ఒక సవతి తమ్ముడు, చెల్లెలు కూడా ఉన్నారు. సవతి తల్లి అతనిని అనేక బాధలు పెట్టినా ఓర్చుకుంటూ మంచి చదువులు చదివి, మరణించిన తండ్రి బాధ్యత తన భుజాల మీద వేసుకుని తమ్ముడిని, చెల్లెలిని చదివించి పెళ్లిళ్లు చేసి అందరి చేతా భేష్ అనిపించుకుంటాడు. కానీ సవతి తల్లి మారదు . చివరికి ఆయువు తీరిపోయి మరణించేటప్పుడు కూడా సవతి కొడుకు మొహం చూడడానికి ఇష్ట పడదు. తమ్ముడు చెల్లాయి మాత్రం అన్నను అమితంగా ప్రేమిస్తారు. తమ్ముడు కళ్ళ లో నీళ్లతో అంతిమ సంస్కారం తననే చెయ్యమంటే మృదువుగా తమ్ముడికి కన్నతల్లికి అతడే సంస్కారం చెయ్యాలని బోధ చేస్తాడు.
తల్లి కంట నీరు చూసి శ్రావణ్ కదలిపోయాడు . "అమ్మా ! నవల నీకు నచ్చిందా ? చాలామంది ఎంతో కదలిపోయామని చెప్పారమ్మా !"
"నాయనా ! నవల బాగుంది కానీ అందరు సవతి తల్లులూ అలా ఉంటారని నీ ఉద్దేశ్యమా తండ్రీ ?"
"చాలా మంది అంతేనమ్మా !" అని అన్నాడు తన గొప్ప నవలని తలుచుకుంటూ
తల్లి చీర కొంగు నోట్లో కుక్కుకుని రోదించడం మొదలుపెట్టింది.
"అమ్మా ! అమ్మా ! ఏమిటమ్మా ? ఎందుకు ఆ దుఃఖం ? నాకు చెప్పవా అమ్మా ? నవల గురించి కాదని అర్ధమైంది. ఏమిటో చెప్పమ్మా !" అన్నాడు తాను కూడా కన్నీరు కారుస్తూ తల్లి కాళ్ళ దగ్గర కూలబడ్డాడు.
"శ్రావణ్ ! నేను నీకు సవతి తల్లినే కదా ? నేనూ అలాంటి దానినే అని నువ్వు నమ్ముతున్నావా ?"
నిర్ఘాంత పోయాడు శ్రావణ్ !
తెలివిలోకి వచ్చాడు.
"అమ్మా ! నువ్వు సవతి తల్లివి అని నాన్న గారు నిన్ను వివాహం చేసుకుని ఇంటికి తీసుకుని వచ్చిన రెండవ రోజే మర్చిపోయానమ్మా ! నీ ప్రేమ, ఆప్యాయత చూసి నువ్వు మా అమ్మవే అని నమ్మేసాను అమ్మా ! ఇప్పుడు కూడా నువ్వు గుర్తు చేస్తేనే నువ్వు సవతి తల్లివని గుర్తు వచ్చిందమ్మా ! నవల వ్రాసేటప్పుడు కూడా ఆ విషయం గుర్తు రాలేదమ్మా ! నిన్ను బాధ పెట్టానమ్మా ! నన్ను క్షమించమ్మా !" అని తల్లి కాళ్ళని చుట్టేసి వెక్కి వెక్కి ఏడుస్తున్న కొడుకుని గుండెకి హత్తుకుని "నాన్నా ! నువ్వే నన్ను క్షమించు తండ్రీ ! నీ ప్రేమని అనుమానించాను. నువ్వు నేను కన్న కొడుకువే నాన్నా !" అని కన్నీరు కార్చింది ఆ తల్లి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి