మౌన మంత్రం @

మౌన మంత్రం


ఆఫీసు నుంచి త్వరగా వచ్చేసిన శంభుప్రసాద్ కాళ్ళు కడుక్కుంటూ భార్యని అడిగాడు "బలరామయ్య గారికి ఎలా ఉంది . మళ్ళీ జ్వరమేమైనా వచ్చిందా ?"

"ఇవాళ కొంచం పర్వాలేదు. అంతగా జ్వరం లేదు, కానీ అసలు ఆకలి లేదని ఏమీ తినలేదు" అంది సుమిత్ర విచారంగా .

"డాక్టర్ గారు రేపు వస్తారు ఊళ్లోకి, ఏమైనా రక్త పరీక్షలు చేయించమంటారేమో"

"ఆయనకీ త్వరగా తగ్గిపోతే బాగుండు. అలా పడుకుని ఉంటే బెంగగా ఉంది" అంది సుమిత్ర.

బలరామయ్య గారు గుంటూరు జిల్లా రేపల్లె దగ్గర ఒక కుగ్రామం నుంచి వచ్చి శ్రీశైలం వచ్చి కరివెన వారి సత్రంలో వారం రోజుల తర్వాత రూము ఖాళీ చెయ్యాలని, అది సత్రం నిబంధన అనీ మేనేజరు శంభుప్రసాద్ చెప్పడం తో తాను శ్రీశైలం వదలి వెళ్లదలుచుకోలేదనీ తన శేష జీవితం మల్లికార్జున స్వామి దగ్గరే గడపదల్చుకున్నానని చెప్పడంతో ఆయన మీద అప్పటికే మంచి గౌరవం పెంచుకున్న శంభుప్రసాద్ తమ ఇంట్లో చిన్న రూము ఖాళీగా ఉన్నదనీ. అభ్యంతరం లేకపోతే ఉండవచ్చుననీ ఆహ్వానించాడు.

అప్పటినుంచి వారి ఇంట్లోనే ఉంటున్న బలరామయ్య గారు తన కుటుంబ విశేషాలు తనకన్నా చాలా చిన్నవాడైన శంభుప్రసాద్ తో పంచుకున్నాడు. .
వారసత్వంగా వచ్చిన పదెకరాల సుక్షేత్రమైన పొలాన్ని ఆయన, ఆయన తమ్ముడు పార్ధసారధి ఉమ్మడిగా వ్యవసాయం చేస్తూ ఒకరికొకరు చేదోడు వాదోడుగా, ఇద్దరి భార్యలూ అన్యోన్యంగా ఉంటూ ఆ పల్లెటూళ్ళో అందరూ "బలరామయ్య గారు, తమ్ముడు పార్ధసారధి గారు నిజంగానే బలరామ కృష్ణులు" అని అబ్బురంగా చెప్పుకునే రీతిలో ఉండే వారు.

బలరామయ్య గారి ఒక్కగానొక్క కొడుకు మహారాష్ట్ర లోనావాలాలో పవర్ ప్లాంట్ లో ఇంజినీర్ గా చేసున్నాడు. ప్రేమ వివాహం చేసుకుని ఏడాదికో రెండేళ్లకో వచ్చి చూసి పోతూ ఉంటాడు. బలరామయ్య గారికి అది పెద్ద బెంగ ఉండేది కాదు. భార్యని "పొన్నెలేవే ! వాడి బ్రతుకు వాడు బ్రతుకుతున్నాడు. నీకు నేను, నాకు నువ్వు. మనకి సారధి, ఇందిర ఉన్నారుగా !" అని ఓదార్చే వాడు.

పొలంలో పాలేళ్ళు ఇద్దరి మధ్య తగాదా చిలికి చిలికి గాలి వానై, తుఫానై అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టింది. ఊరిలో పచ్చగా ఉంటె ఓర్వలేని వాళ్ళు వారిద్దరి మధ్య తగాదాని మరింత పెంచారు. తోడికోడళ్ళిద్దరూ బ్రతిమాలి, బతిమాలి కన్నీళ్లు పెట్టుకుని సయోధ్య చేద్దామని చేసిన ప్రయత్నాలేమీ ఫలించనంత ఎక్కువగా అన్నదమ్ములిద్దరూ బిగుసుకునిపోయారు. ఒకరోజున పొద్దున్నే పొలానికి బయల్దేరిన బలరామయ్యవదిలేసింది గారు తమ్ముడు ఎదురయ్యాడని ఆ రోజు పొలానికి వెళ్లనని భీష్మించుకుని కూర్చున్నాడు. దానికి తోడు విడదీసుకున్న పొలంలో తన వాటాలో ఉన్న మంచి జత జోడెద్దులు ఎక్కడికో కట్లు తెంచుకుని పారిపోవడం ఆ టైముకి తమ్ముడు పొలంలోనే ఉన్నా, వాటిని ఆపే ప్రయత్నం చెయ్యలేదని తెలిసి అగ్నిహోత్రుడైపోయాడు. ఇంక జీవితంలో వాడితో మాట్లాడానని శపధం చేసాడు.

దరిమిలా ఉమ్మడిగా ఉంటున్న మండువా ఇంట్లో గోడ వెలిసి ఇంకా వారి మధ్య దూరం పెంచింది. ఆ గోడు ఇంటి బయట ప్రహరీ గోడ వరకూ పెరిగింది. తోడికోడళ్లు గుడ్ల నీళ్లు కుక్కుకుని మౌనంగా రోదించారు.

ఇది జరిగిన రెండు నెలలకి ఆయన భార్య సుభద్ర నిద్రలోనే ఆఖరి ఊపిరి తీసుకుంది. ఊరంతా కదలి వచ్చి ఓదార్చారు. ఇందిర మొదలు నరికిన చెట్టులా కూలిపోయింది. సారధి ఓదార్చడానికి వచ్చినా అన్నగారి మోహంలో అయిష్టాన్నీ, ద్వేషాన్నీ పసిగట్టి మాట్లాడలేక పోయాడు. ఒకరిద్దరు "సారధి వచ్చాడు చూడండి" అన్నా కన్నెత్తైనా అటు చూడలేదు.

భార్య పోయిన నాలుగు నెలలకి ఆయన తన వాటా పొలాన్ని కొడుకు వ్రాసి రిజిస్టర్ చేసి ఊళ్ళో ఎవరికీ చెప్పకుండా రైలెక్కి కర్నూల్ వెళ్లి అక్కడ నుంచి శ్రీశైలం చేరుకున్నారు.

అక్కడకి చేరుకున్నాక ఆయన రెండు సంవత్సరాలు ఏ బాధా లేకుండా గడిపాడు. ఆ తర్వాత తరచుగా జ్వరం రావడం గమనించి శంభుప్రసాద్, ఆయన భార్య సుమిత్ర గచ్ఛాకు పుచ్ఛాకు వాద్యం చేసి తగ్గక పోవడంతో సత్రంలో యాత్రకు ప్రతి సంవత్సరం వచ్చే డాక్టర్ గారిని ఒక్క సారి ఆయనను చూడమని అడిగాడు శంభుప్రసాద్. ఆయన విపులంగా పరీక్షించి ఆయనకు బీ పీ,

దానితోపాటు మూత్రపిండాల సమస్య ఉన్నదనీ కర్నూల్ మెడికల్ కాలేజీ లో తనకు తెలిసిన కార్డియాలజిస్ట్ ఉన్నాడని ఉత్తరం వ్రాసి పంపిచ్చాడు.

పరీక్షలలో ఆయనకు కిడ్నీ కి సంబంధించిన ట్యూమర్ ఉన్నదనీ అందువలననే రక్తపోటు కూడా పెరిగిందని తెలిసింది. ఇంక బలరామయ్య గారు శంభుప్రసాద్ ను ఏమీ మాట్లాడనివ్వకుండా శ్రీశైలం పోదామని మంకు పట్టు పట్టి వెనక్కి వచ్చేసాడు.

ఇంటికి వచ్చేసాక శంభుప్రసాద్ భయపడుతూనే బంధువులకి కబురు చేస్తానని అన్నాడు. బలరామయ్య గారు. :వద్దు శంభూ ! మా అబ్బాయికి మాత్రం చెప్పు. అదీ చివరి రోజుల్లో " అని బలవంతంగా ఒట్టు వేయించుకున్నాడు.

ఆ తర్వాత ఆయన ఆరోగ్యం త్త్వరత్వరగా క్షీణించింది.

ఒకరోజు ఆయన శంభుప్రసాద్ ని పిలిచి ఒక కాగితం ముక్క చేతిలో పెట్టి, ఆ కాగితంలో ఉన్నమనిషిని రమ్మనమని కబురు చేయమని చెప్పారు. అది తమ్ముడు పార్ధసారధి అడ్రసు, ఫోను నంబరు.

పార్ధసారధి ఫోన్ అందుకోగానే భార్యని సంప్రదించాడు. బావగారు శ్రీశైలంలో ఉన్నారని తెలిసి సంబరపడి భర్తను వెంటనే వెళ్ళమని త్వరపెట్టింది.


అన్నగారిని మంచంలో చూసిన సారధి నిర్ఘాంతపోయాడు. కన్నీళ్లతో పక్కన కురుకుర్చీలో కూర్చుని ఎముకలగూడులాగా ఉన్న ఆయన దగ్గరగా జరుపుకుని "అన్నయ్యా !" అని పిలిచాడు ఆత్మీయంగా. ఆ మాట ఎక్కడో తగిలి ఆయనకు కొద్దిగా స్పృహ వచ్చింది. అతి కష్టం మీద కళ్ళు చికిలించి తమ్ముడి ముఖాన్ని గుర్తు పట్టి చేతులు కొద్దిగాఎత్తారాయన. అన్నగారి కౌగిలిలో ఒదిగి పోయాడు సారధి.

ఆయన పెదవులు కదులుతున్నాయి. మాటైతే బయటకు రాలేదు .

ఆయన నోటికి దగ్గరగా చెవులు పెట్టి వింటుండగా ఆయన పలికిన చివరి మాట

"ఆ గోడ తీయించేయి నాన్నా !"

బ్రాతృ సమస్తాః సుఖినోభవంతు !!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఒక పౌర్ణమి కథ

అక్కరకొచ్చిన_అనుభవం

నేనున్నా నీకు రక్షణ @