చిన్న పాత్రలతో రామాయణం. -. నిషాదుడు
నిషాదుని విషాద గాధ
అంబలి త్రాగి గుడిసె బయటికి వచ్చాను. ఇంకా పొట్ట నకనకలాడుతూనే ఉంది. నిన్నటికి నిన్న, మొన్న గౌరికి తోడుగా ఇంట్లోనే ఉండే సరికి వేటకి వెళ్ళనే లేదు. మరేంటీ చెయ్యడం ? రెండో సారి గర్భిణి అయినా డోకులు తప్పలేదు. మొదటి సారి కన్నా ఎక్కువగానే అవుతున్నాయి.
గౌరి, పిల్లాడు అంటే ప్రాణం నాకు. వాళ్ళకి ముల్లు గుచ్చుకున్నా నా ప్రాణం జిలార్చుకు పోతుంది. అందుకనే తినడానికి ఏమీ లేకపోయినా గౌరితోనే ఉండిపోయాను. పెద్దాడు ఏడేళ్ల వాడే అయినా ఎలా పట్టుకొచ్చాడో చెవుల పిల్లిని పట్టుకొచ్చాడు. దానిని వండిపెట్టింది గౌరి ఓపిక చేసుకుని.
అప్పటికీ తను లబలబలాడుతునే ఉన్నాడు పక్క మీదనించి లేవద్దూ అని. వింటేనా? నిన్న సూరీడు రెండు బారలు పైకొచ్చే జాముకి డోకులు సద్దుకున్నాయి. నీరసం తప్ప ఇంకేమీ లేకపోయేసరికి ఇవాళ వేటకి బయల్దేరక తప్పలేదు.
"గౌరీ ! నీకు ఏమిటి ఇష్టం ? ఏమి తినాలని ఉంది ? పట్టుకొస్తాను" అని ప్రేమగా అడిగాను.
నీరసంగానే "కొంచి పిట్ట దొరికితే పట్రా ! ఓపిక తొరగా వస్తుంది" అన్నది.
బయల్దేరిన గడియ లోపే ఒక చిన్న దుప్పిని కొట్టాను. అక్కడే ఒక చెట్టువి కొమ్మలు విరిచి ఆ కూన మీద కప్పి మళ్ళీ బయలుదేరాను. ఒక అడివి పంది కనబడింది కానీ తప్పించుకుని పారిపోయింది. దానిని తరుముతూ అడివిలోకి దూరంగా వెళ్ళిపోయాను. ఎక్కువ దూరం వెళ్ళకూడదు అనుకుని కూడా పందిని చూసేసరికి మర్చిపోయాను.
రెండు కుందేళ్ళని కొట్టాను కానీ కొంచి పిట్ట దొరకనే లేదు. చివరికి నది ఒడ్డుకి చేరుకున్నాను అక్కడ చెట్లు బాగా ఉండి చాలా పిట్టలు ఉన్నాయి. ఎక్కువ శ్రమ లేకుండానే రెండు కొంచి పిట్టలు కనిపించాయి. ఆడా మగా పిట్టలు అని తెలిసిపోతున్నది . జతకట్టడానికి చేరాయి.
ఎంతోసేపు ఆటలు అయినా తర్వాత పెంటి పిట్ట ఒక పెద్ద కొమ్మ మీద చేరింది. పోతు దాని మీద వాలింది. ఇంతకన్నా మంచి సమయం దొరకదని అమ్ము వేసేసాను. పోతుకి సూటిగా తగిలి గిలగిలా తన్నుకుంటూ నేల మీద పడిపోయింది. అప్పుడు జరిగిందా సంఘటన. నేను అనుకోలేదు అలా జరుగుతుందని !
రెక్కలు టపటపలాడిస్తూ ఎగిరిపోతుందనుకున్న పెంటి అక్కడే దీనంగా అరుస్తూ పోతు పిట్ట చుట్టూ తిరగడం మొదలుపెట్టింది. నాకేమి చెయ్యాలో తోచలేదు. కొంచెం సేపయ్యాక దగ్గరకు వెళ్లి ప్రాణం పోయిన పోతు పిట్టని బుట్టలో వేసుకుంటుండగా ఎవరో కోపంగా, వేరే నాకర్ధం కాని భాషలో మాట్లాడడం వినిపించింది. చూద్దును కదా ఇద్దరు మునులనుకుంటా కొద్ది దూరం లో నుంచుని కనిపించారు. నదిలో స్నానం చెయ్యడానికి వచ్చినట్లు తెలుస్తూనే ఉంది.
అందులో కొద్దిగా పెద్దాయన ఆ భాషలో మాట్లాడినట్లు అనిపించింది. ఆయన వేరే ఏమీ మాట్లాడకుండా ఎదో ఆలోచనలో పడిపోయాడు. ఆ చిన్నాయనని అప్పుడప్పుడు నది దగ్గరే చూసినట్లు గుర్తు. నా కేసి జాలిగా చూశాడాయన.
నేను వచ్చిన పనైపోయింది గదా అనుకుని బుట్టలో పిట్టని తీసుకుని నా దారిన బయల్దేరాను. మధ్య దారిలో కొమ్మలు తప్పించి దుప్పి కూనని బయటకి తీసి భుజం మీద వేసుకుని గుడిసె చేరుకున్నాను.
అప్పటికి కొంచెం ఓపిక వచ్చిన నా ఆడది కొంచి పిట్టని వండింది. ముగ్గురమూ లొట్టలేసుకుంటూ తిన్నాము.
ఎక్కడ తేడా వచ్చిందో కానీ మర్నాడు గౌరికి మళ్ళీ డోకులు మొదలయ్యాయి. దానితోపాటు పెద్దాడికి కూడా ఒళ్ళు మసిలి పోయే జ్వరం, డోకులు. కంగారు పడి పక్కతోపులో మంత్రసానిని తీసుకొద్దామని బయల్దేరాను. వేరే పని ఉండడం వలన ఆ యమ్మ బయలుదేరడానికి ఆలస్యం అయింది. ఆ లోపలే నాకూ తలతిరగడం మొదలయ్యి డోకొచ్చేలాగా అనిపించింది. ఎలాగో అలాగే మంత్రసానిని ఇంటికి తీసుకొచ్చే సరికి డోకులు అయిపోయి కళ్ళు తిరిగిపోయాయి .
ఆ పడిపోవడం వారం రోజుల తర్వాత మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచి చూద్దును కదా గౌరీ అమ్మా, అయ్యా కనిపించారు. ఇద్దరూ ఏడుస్తున్నారు. నన్ను చూసి మా అత్త ఇంకా ఏడుపు పెంచింది. మా మామ చెప్పినదేమిటంటే మా గౌరికి రెండోసారి డోకులు మొదలైన రాత్రికి బాగా వాతం కమ్మేసి చచ్చిపోయింది. మా బుడ్డాడు కూడా ఆ తర్వాత రోజు వాడి అమ్మని వెతుక్కుంటూ వెళ్ళిపోయాడట.
నేను కూడా పోయేవాడిని అన్నాడు మామ. కానీ ఎందుకో బయట పడ్డాను. ఆ మంత్రసాని కంగారుపడి పక్క గూడెం లో అత్తమామలకు కబురు చేసిందట
నాకూ చచ్చిపోదామనిపించింది. కానీ ఎందుకో అంత నీరసంలోనూ ఆ పెద్ద ముని కోపంగా అన్న మాటలకి మా రోగాలకి లంకె ఉన్నదేమో అని
నీరసంగా ఉన్నా రెండు రోజుల తర్వాత నది దగ్గరకి బయల్దేరాను. అత్త లబలబలాడుతూనే ఉంది. నేను లెక్క చెయ్యలేదు. గౌరి పోయాక నాకూ ఎందుకు బతికుండడం ? అనిపించింది. కానీ ఆ పెద్దాయన అసలు ఏమన్నాడో తెలుసుకుని తీరాలి. అందుకని విల్లమ్ములు లేకుండానే బయల్దేరాను.
నా రాత బాగుంది నేను నది దగ్గరకి వెళ్లేసరికి ఆ చిన్నాయన నదిలోనుంచి బయటికి వస్తున్నాడు. దణ్ణం పెట్టి కొంచెం ఎడంగా నుంచున్నాను. ఆయన నన్ను గుర్తుపట్టి ఏమిటి విశేషం ? అని అడిగాడు. అంతా చెప్పాను. ఆయన వింటూ విచారపడినట్లు అనిపించింది.
"సామీ ! ఆ రోజున ఆ పెద్ద ముని కోపంగా ఏమన్నాడు ? నా ఆలీ పిల్లల కోసం వేటాడతాను కాబట్టి పిట్టని కొట్టాను. ఆ పిట్టని ఇదివరకు చాలా సార్లు తిన్నాము అందరం. ఎప్పుడూ ఇలా జరగలేదు. ఆయన తిట్టు వలననే నా ఆడది, బుడ్డాడు చచ్చిపోయారని అనిపిస్తోంది . అసలు ఆయన ఏమని అన్నారు ? నాకు అర్ధం కాలేదు " అన్నాను.
"నువ్వు ఆ రోజున జతకడుతున్న అందమైన పిట్టలని కొట్టావు. మగ పిట్టని ఆడ పిట్ట నుంచి విడతీసావు అందుకనే నువ్వు ఎక్కువ రోజులు బ్రతకవు అని ఆయన అన్నారు" అన్నాడు ఆ చిన్న ముని.
వలవలా ఏడుపు వచ్చేసింది. "అయ్యో ! ఆ రోజు అంత ఆలోచించలేదు సామీ ! నా ఆడది మనసు పడి అడిగిందని కొట్టాను. అందుకే అనుకుంటా నా నుంచి నా ఆడదాన్ని తీసుకుపోయాడు దేవుడు !" అన్నాను.
"చూడు నాయనా ! ఆయన వాల్మీకి. నేను ఆయన శిష్యుడిని నన్ను భరద్వాజుడు అంటారు. ఆయన ఆ రోజు కోపంగా అన్నారు అన్నావే , అది శ్లోకం అన్న పేరుతొ యుగయుగాలు ఉండిపోతుంది అని బ్రహ్మ దేవుడు చెప్పాడు మా గురువు గారికి.
అది శ్రీరాముడి కధ కింద రాసున్నారాయన. ఎంత బాగున్నదో ఆ కధ . ఆ కధ చదివేవారంతా మొట్ట మొదట నీతోటే మొదలు పెడతారు మా నిషాద అన్న ఆ శ్లోకం లో నిషాద అంటే నువ్వే అందువలన రామాయణం ఉన్నంత కాలం నువ్వు కూడా బ్రతికి ఉంటావు" అన్నాడా చిన్న ముని.
"చాలు సామీ చాలు ! అలాగ నా పేరు అందరూ తలుచుకుంటారంటే నేను చచ్చిపోయినా లెక్క చెయ్యను సామీ ! ఇంక నా ఆడదానిదగ్గరకు వెళ్ళిపోతాను" అన్నానే కానీ పొర్లిపొర్లి ఏడుపు వస్తూనే ఉన్నది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి