జీవిత భాగస్వామి @

 జీవిత భాగస్వామి 

సుందర రావు గారు ఉదయం ఏడు గంటల అయ్యేసరికి చక్కగా స్నానం చేసి కొత్త పంచె, లాల్చీ జరీ కండువా వేసుకుని చేతి కర్రతో హుందాగా వీధి వెంబడి నడుస్తూ ఉంటే అటూ ఇటూ ఇళ్లలో జనం చూసి ఆశ్చర్యపోతున్నారు. ఆయన చాలా రోజులుగా అంత పొద్దున్నే ఇల్లు కదలడం ఎవరూ చూసిన గుర్తు లేదు.

అలా వెళ్లడం, వెళ్లడం ఆ పల్లెటూరు కి ఈశాన్యం మూలన ఉన్న చెరువు పక్కనే ఉన్న రామాలయం లోకి వెళ్ళారు . వెళ్లే ముందు బయట పూల దుకాణం లో చెప్పులు పెట్టేసి, కొబ్బరికాయ, పూలు, పళ్ళు తీసుకుని "డబ్బులు వెళ్ళేటప్పుడు ఇస్తాలే సూరప్పా” అని లోపలికెళ్ళాడు. సూరప్ప బుగ్గన చెయ్యేసుకుంది.
ప్రదక్షిణ పూర్తి చేసుకుని వచ్చి, పూజారికి పళ్ళూ వగైరాలు ఇచ్చి, "సుదర్శనా ! ఇవాళ తెలుసుగా ? మా పెళ్లి రోజు, ఆవిడ పుట్టిన రోజు కూడా , తన పేరున సహస్రం చేసి, దీర్ఘ సుమంగళిగా దేవుణ్ణి వేడుకుంటూ పూజ చెయ్యి నాయనా !"
నోరు తెరుచుకుని చూస్తున్న సుదర్శనాచార్యులు తడబడుతూ “సరే సరే స్వామీ !" అని హడావుడిగా గర్భగుడిలోకి వెళ్లి అర్చన మొదలెట్టాడు.
సంకల్పం, ఆవాహనాది తతంగం పూర్తి చేసేసి సహస్ర నామాలు యాంత్రికంగా చదువుతూనే ఉన్నాడు కానీ తండ్రి మాధవాచార్యులు తొందరగా వచ్చేస్తే బాగుండు ని రామునికి దండం పెట్టుకుంటూనే ఉన్నాడు.
సహస్రం పూర్తి అయిన తర్వాత నైవేద్యం పెట్టేసి హారతి వెలిగిస్తూ ఉండగా మాధవాచార్యులు వచ్చారు. ముందుగా తండ్రికీ ఆ తర్వాత సుందరరావు కీ పాదుకలిచ్చి, తీర్థం ఇచ్చాడు.
అక్షతలు వేస్తూ సుందర రావు గారి భార్య పార్వతమ్మ పేరు చెప్పి సకల ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు, దీర్ఘ సుమంగళీభవ అని ఆశీర్వదించాడు. మాధవాచార్యులు భృకుటి ముడి పడింది కానీ ఆయన ఏమీ మాట్లాడలేదు. 
ఆ తర్వాత మండపం బయటికొచ్చి అటూ ఇటూ చూసారు మాధవాచార్యులు. ఒక కొసాకి మండపం చివర స్తంభానికి ఆనుకుని శూన్యంలోకి చూస్తున్న సుందర రావు కనిపించాడు. మెల్లగా అటు నడిచాడు. దగ్గరవుతున్న కొద్దీ ఆయన చెక్కిళ్ళ మీద ధారగా కారుతున్న కన్నీరు స్పష్టంగా కనిపించింది.
"సుందరా ? ఏమిరా ఇది ? ఇంత బేలవైనావేమిటి ?ఎనిమిది నెలలుగా ఇల్లు కదలలేదు, ఇవాళ  ఉదయమే కొత్త బట్టలు వేసుకుని బయల్దేరావని మీ మరదలు చెప్తే త్వరగా అనుష్టానం ముగించుకుని వచ్చాను.  నువ్వు ఇంకా ఊరడిల్లాలిరా ! పండంటి కాపురం, ముత్యాల వంటి పిల్లలు, డెబ్బై ఏళ్ల  కాపురం ఎవరికి దక్కుతుందిరా ఆ అదృష్టం ? మా చెల్లాయి సుమంగళిగా వెళ్ళిపోయింది. కంట నీరు వద్దురా ! ఇవాళ ఆమె పుట్టిన రోజు, నీ పెళ్లి రోజు కూడానూ !"
"అది ఎలా మరచిపోతాను మాదవా !  ఏది మరచిపోయినా, అది మరువను కదా !  అందుకే ప్రతి ఏడాది లాగానే ఇవాళ కూడా ఆమె తోనే  వచ్చాననే ఊహ ! అర్చన కూడా తన పేరు మీద చేయించాను. తీరా చేసి కొబ్బరి చిప్ప ముక్కలు చేసి పెడదామంటే తను కనిపించలేదు !" అని వెక్కి వెక్కి ఏడుస్తున్న తన నలభై ఐదేళ్ల ప్రాణ స్నేహితుణ్ణి చూసి తను కూడా కన్నీరు కారుస్తూ ఆయన చేతిని తన చేతిలోకి తీసుకున్నారు మాధవాచార్యులు గారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఒక పౌర్ణమి కథ

అక్కరకొచ్చిన_అనుభవం

నేనున్నా నీకు రక్షణ @