బంధులబ్ధి @

 బంధులబ్ధి 

స్వరూప, సుప్రియ, సుప్రియ తమ్ముడు షణ్ముఖ బస్ దిగి చుట్టూ చూశారు. ముదినేపల్లి బస్ స్టేషన్ లో జనాలు పెద్దగా లేరు కానీ అలాగని పూర్తిగా ఖాళీగా కూడా లేదు. బయటికి వచ్చి పుట్ల చెరువు కి ఆటో మాట్లాడుకుని ఎక్కేశారు.

ఆటో అతను వీళ్ళ వాలకం గమనించి "శర్మ గారి ఇంట్లో పెళ్ళికా పాపలూ !" అనడీగాడు.
అవును మీకెలా తెలిసిందీ? అనడిగింది స్వరూప.
ఈ టయం లో ఆ ఊరికి వెళ్ళే వారు ఆరింట పెళ్ళికే వస్తున్నారండీ ! నేను ఆయన ఇంటి పక్కనే లెండి ఉండేది. అన్నాడతడు.
ఈ పాటికి పెళ్ళికూతురిని చేసేసి ఉంటారే ! మన మీద ఫైరవుతుందో ఏమిటో !
వారిద్దరూ భయపడ్డట్టే శ్రీ విద్య వీళ్ళని చూస్తూనే చిరుకోపంతో మొహం తిప్పుకుంది.
"నిన్నరాత్రి వస్తారనుకుంటే ఇప్పుడా రావడం ? తలంబ్రాల వేళకి రావలసింది" అన్నది బుంగమూతి పెడుతూ.
"ఏం చెయ్యమంటావే ? కాకినాడ నుంచి వస్తున్నామా ? గుడివాడలో మా మేనత్త ఇంటికి వెళ్ళకపోతే మా నాన్న పేకవారబ్బాయితో పెళ్లి చేస్తానన్నారు !" అన్నది స్వరూప.

"మీ మేనత్త గారి ఇంటి పేరు పేరివారు కదా ?" అన్నది శ్రీవిద్య కొంటెగా !

"హమ్మయ్య ! కోపం తగ్గిందా తల్లీ ? జగజ్జననీ ! మా మేనత్త కొడుకుని చేసుకోవచ్చు కానీ వరహీనమే ! పదేళ్ళు వార !" అన్నది స్వరూప పకపకా నవ్వుతూ.
సుప్రియ, శ్రీవిద్య ఆమె నవ్వుతో శృతి కలిపారు.

*********

శ్రీవిద్య, స్వరూప, సుప్రియ ఇంటర్, బీకాం గుడివాడ లో ఏఎన్నార్ కాలేజీ లో కలిసి చదువుకున్నారు.ముగ్గురి పేర్లు ఎస్ తో మొదలవడంతోటి, వరుస నెంబర్లు, దానితోటి ఒకే బెంచి అవడంతో ముగ్గురి అభిరుచులు కలవడంతో ప్రాణ స్నేహితులు అయిపోయారు.
స్వరూప నాన్నగారు గుడివాడలో బ్యాంకు ఆఫీసర్. వీళ్ళు గుడివాడలో చదినన్నాళ్ళూ ట్రాన్స్ఫర్ అవలేదు. అందుకని ఎప్పుడైనా అవసరం పడ్డప్పుడు స్వరూప ఇంట్లో ఉండిపోవడానికి శ్రీవిద్య తల్లిదండ్రులు అభ్యంతరం పెట్టేవారు కాదు. సుప్రియ స్వంత ఊరు గుడివాడే ఐనా బీకాం చివరి ఏడాదిలో వివాహం అయి చదువు పూర్తి కాగానే భర్త దగ్గరకి హైదరాబాద్ వెళ్ళిపోయింది. మళ్ళీ శ్రీవిద్య పెళ్ళి అని భర్తను ఒప్పించి తమ్ముడిని వెంటపెట్టుకుని వచ్చింది.

ఒక సారి మీ ఉడ్ బి ని చూసొస్తామే అన్నారు ఒక అరగంట నాన్ స్టాప్ కబుర్లు అయ్యాక.

విడిది ఇంట స్నాతకం జరుగుతోంది. సుప్రియ, స్వరూప అక్కడికి వెళ్ళేసరికి పెళ్ళికొడుకు కాశీయాత్ర కి బయలుదేరుతున్నాడు. అతని వెంట పురోహితుడితో పాటు శ్రీవిద్య తమ్ముడు, ఇంకొక ఇద్దరు ధృఢకాయులు కూడా ఉన్నారు. వాళ్ళ మీసకట్టు, వాలకం చూస్తే ఆర్మీ వాళ్ళు అని తెలిసిపోతుంది, ఉత్తర భారత దేశం వారని కూడా తెలిసిపోతోంది. వీళ్ళకి శ్రీవిద్య అన్న ఆర్మీ లో ఉన్నాడని తెలుసు కానీ అతను ఇంజనీర్ అనీ, ఆర్మీ లో టెక్నికల్ సపోర్ట్ లో ఉంటాడని చెప్తూ ఉండేది. అతనిని వాళ్ళెపుడూ చూడలేదు.

దూరంనుంచే వాళ్ళు కాశీయాత్ర వేడుకని చిరునవ్వుతో గమనిస్తున్నారు. శ్రీవిద్య తమ్ముడు ఆ సైనికులకి తనకి వచ్చిన హిందీలో వాళ్ళకి ఆ తతంగాన్ని వివరిస్తున్నాడు. వాళ్ళు ఎంతో శ్రద్ధగా అబ్బురంగా వింటున్నారు.

గడ్డం కింద బెల్లం పెట్టి "బావగారూ ! మీరు కాశీ ప్రయాణం మానుకుని మా అక్కయ్యని వివాహం చేసుకోండి" అని చెప్తుంటే వాళ్ళు కూడా విశాలంగా నవ్వుతూ ‌"జీజాజీ ! ఆప్ బెనారస్ మత్ జాయియే ! హమారీ బహన్ సే షాదీ కరే" అంటుంటే పెళ్ళికొడుకు ముసిముసిగా నవ్వుతూ వెనుతిరిగేసరికి వాళ్ళిద్దరూ "జీజాజీ బెనారస్ నహీ జాతే ! బహుత్ ఖుష్ కీ బాత్ హై" అని పెళ్ళికొడుకుని భుజాల మీద ఎక్కించుకుని విడిది ఇంట్లోకి పరుగులు పెట్టారు.

********

మళ్ళీ పెళ్లి ఇంటికి వెళ్లిన స్నేహితురాళ్ళు శ్రీవిద్యతో కబుర్లు కొనసాగించారు.

"పెళ్ళికొడుకు ఎలా ఉన్నాడే ?" కుతూహలంగా అడిగింది శ్రీ విద్య

"పెళ్ళికొడుకు కేమే పండులాగా ఉన్నాడు." అని, "అవునూ మీ తమ్ముడి వెంట ఇద్దరు సైనిక బాడీ గార్థులెవరే ? కామెడీ కారెక్టర్లు !" అన్నది స్వరూప.

కొంచెం మలినమైన మొహం తో "మా అన్నయ్య యాజి ఆర్మీ లో ఉన్నాడని తెలుసు కదా ? అన్నయ్య కొలీగ్స్ అట" అన్నది.

"మీ అన్నయ్య ఏడీ ?" అన్నారు స్నేహితురాళ్ళు ముక్త కంఠంతో . "ట్రెయిన్ రిజర్వేషన్ మధ్యాహ్నం బండికట . మధ్యాహ్నం విజయవాడ లో దిగి బస్ పట్టుకునే టాక్సీ లోనో వస్తాడట" అన్నది రుద్ధమైన కంఠంతో. "ముహూర్తం టైం కైనా వస్తాడో లేదో మూడేళ్లయింది చూసి" అన్నది ఇంకా గొంతులో జీర ఎక్కువవగా !

సుప్రియ "ఫరవాలేదు వచ్చేస్తాడులే ఒక్కగానొక్క చెల్లెలివి కదా" అని ఓదార్చింది

"ఏడవకు శుభకార్యం జరుగుతున్న ఇంట కన్నీరు పెట్టకూడదు" అన్నది.

కళ్ళు తుడుచుకుని "సరేలే ! మధ్యాహ్నం భోజనం టైం అయ్యింది. విడిదికి వెళ్లి భోజనాలు చేసెయ్యండి. నాకు ఇక్కడికి కారేజ్ పంపుతారులే" అన్నది శ్రీవిద్య చిరునవ్వుతో .

******
భోజనాలు ముగించుకుని వచ్చి మళ్ళీ పెళ్లికూతురు దగ్గర చేరారు స్వరూప, సుప్రియ.

"ఎలాగున్నాయే వంటకాలు ? తినగలిగారా ?" అడిగింది శ్రీవిద్య.

"అద్భుతంగా ఉన్నదే భోజనం ! మీరు చేయించినవా ? మగపెళ్ళివారివా ?"

"మగ పెళ్ళివారివే ! వెంట ఇద్దరు పాక శాస్త్ర నిపుణులు వచ్చారు. వడ్డనలు మా వాళ్ళవే కానీ ప్రిపరేషన్ వాళ్ళవే" అన్నది శ్రీ విద్య. "రాత్రి మా వాళ్ళ ప్రతాపం చూద్దురు గాని" అని కూడా అన్నది.

"ఇంకా ఏమిటి భోజనాల విశేషాలు. మీ సైనికులు అక్కడే ఉన్నారా ? ఏమంటున్నారు ? భోజనాలు చేశారా వాళ్ళు కూడా ?" అనడిగింది.

"కష్టం మీద చేశారే ! అర్రే ! వాళ్ళు వడ్డన చేస్తామంటారు. హడావుడి హడావుడి చేశారనుకో. కొంచెం సేపు వడ్డన చేసిన తర్వాత మీ నాన్న గారు బ్రతిమాలి, వాళ్ళనీ బలవంతంగా భోజనానికి కూర్చోబెట్టారు. వాళ్ళు వడ్డన చేసినంత సేపూ పెళ్ళికొడుకు, ఆయన తల్లి దండ్రుల దగ్గరే ఉన్నారు. కొసరి కొసరి వడ్డించారనుకో. బావ గారు మొహమాట పడిపోయారు" అన్నది సుప్రియ చిరునవ్వుతో .

"అప్పుడే వరస కలిపేసావా ?" అన్నది శ్రీవిద్య

"నేనేమిటీ ? వాళ్లిద్దరూ కూడా జీజాజీ జీజాజీ అని బావగారినీ, మాజీ, అంకుల్ జీ అని బావగారి అమ్మగారిని నాన్నగారితోటీ వరస కలిపేశారు. మీ తమ్ముడు సుబ్రహ్మణ్యం ఉన్నాడు కదా ! ఆతను దుబాసీ గా వ్యవహరించాడు" అన్నది సుప్రియ.

వాడినట్లున్న శ్రీవిద్య మొహం చూసి "ఏమైందే ?" అనడిగింది స్వరూప.

"అన్నయ్య రైలు ఆరున్నర గంటలు లేటుట !" అన్నది శ్రీవిద్య వెక్కుతూ.

స్నేహితురాళ్ళు ముఖాలు కూడా మ్లానమయ్యాయి. శ్రీవిద్య దుఃఖం ఎప్పుడూ వాళ్ళు చూడలేదు.

"అయినా ముహూర్తం టైముకి రైలేమిటే ? ఆర్మీ వాళ్ళే ఇలా చేస్తే ఎలా ?" అన్నది సుప్రియ.

"ఎంత ఎమర్జెన్సీ కోటా కోసం ప్రయత్నం చేసినా దొరకలేదుట! నాయక్ భయ్యా చెప్పాడు." అన్నది శ్రీవిద్య ఇంకా వెక్కుతూనే.

ప్రశ్నార్ధకంగా చూస్తున్న స్వరూపతో "అదే అన్నయ్య ఫ్రెండు కిషన్ నాయక్ ! మహారాష్ట్ట్రియన్ !" అన్నది సుప్రియ.

"సరే ! మొహం కడుక్కో ! ఏం చేస్తాం ? కొంతైనా మేకప్ చేస్తాడేమో ఆ రైలు చూద్దాం. కొద్దిగా రెస్టు తీసుకో" రాత్రి ముహూర్తం నిద్ర ఉండదు." అన్నది స్వరూప.

"రాత్రి ముహూర్తం అయ్యాక స్థాళీపాకం, సదస్యం కూడా చేసేసుకుని తెల్లవారుజామున అప్పగింతలు, బస్ లో బయల్దేరి వెళ్ళిపోవడమే. రేపు దాటితే గృహప్రవేశానికి మంచి ముహూర్తం లేదట. పైవారం మూఢమి వచ్చేస్తోందిట" నిర్వేదంగా అన్నది శ్రీవిద్య.


రాత్రి ఎదురు సన్నాహాలు, పానకం బిందెలు ఇవ్వడం లో కూడా కిషన్ నాయక్, అతని సహచరుడు అమిత్ పండిట్ ఉత్సాహంగా పాల్గొని వాళ్ళ వంతు సందడి చేశారు. కానీ ఎక్కడా హద్దు మీరలేదు. మగపెళ్ళివారంతా చక్కగా ఎంజాయ్ చేశారు.


********

ముహూర్తం దగ్గర పడుతున్నా శ్రీవిద్య చూపులు మండపం ద్వారం వైపే మాటిమాటికీ మరలడం ‌స్నేహితురాళ్ళు గమనిస్తూనే ఉన్నారు. ఏమీ చెయ్యలేని పరిస్థితి. ఎక్కడా యాజి వస్తున్న సూచనలు కనిపించడం లేదు. ఇంకొక విషయం గమనించింది స్వరూపయే. సుప్రియ ను రహస్యంగా గిల్లి చూపించింది. కిషన్, అమిత్ అప్పుడప్పుడు ఫోన్ లో మాట్లాడుతూ కనిపించారు కానీ యాజి కోసం ఆదుర్దా పడుతున్నట్లు కనిపించలేదు. పెళ్ళి మంటపంలో మాత్రం శ్రీవిద్య తమ్ముడు సుబ్రహ్మణ్యం తో కలయతిరుగుతూ అందరికీ అన్ని మర్యాదలు జరుగుతున్నాయో లేదో వినయంగా కనుక్కుంటున్నారు.

సూత్రధారణ సమయానికి మాత్రం పెళ్ళి పీటల దగ్గరకు వచ్చేసి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ అక్షతలు జల్లారు. కిషన్ నాయక్ ముందు సుబ్రహ్మణ్యం తో ఆ అక్షతలు ఎందుకని ? తినడానికా ? అని అడుగుతుంటే వీళ్ళు నవ్వాపుకోలేక పోయారు.

తలంబ్రాల కార్యక్రమం లో వరుడి స్నేహితులు అతనిని ఉత్సాహ పరుస్తూంటే, శ్రీవిద్య చుట్టాలు, స్నేహితురాళ్ళతో సమానంగా వాళ్ళిద్దరూ శ్రీవిద్య ను వేగంగా తలంబ్రాలు పొయ్యమని అల్లరి చెయ్యడం అందరూ ముసిముసి నవ్వులలలో ముంచెత్తింది.

కట్నాలు, ఆశీర్వచనాలు అయిపోయాక స్వరూప, సుప్రియ అలిసిపోయి అక్కడ బల్లలు చూసుకుని నడుములు వాల్చారు. వెంటనే నిద్ర పట్టేసింది ఇద్దరికీ.

గబుక్కున స్వరూపకి మెలకువ వచ్చి లేచేసరికి మూడు గంటలవుతోంది. కొద్దిమంది దగ్గరి వారు తప్ప మిగిలిన చుట్ట బంధువులూ, పిల్లలూ ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ మూడంకె వేసేసి నిద్దర్లు పోతున్నారు.

శ్రీవిద్య తల్లిదండ్రులు, అత్త మామలు, ఇంకొక ఇద్దరు ముగ్గురు మాత్రం మెలకువగా ఉండి పనులు చూసుకుంటున్నారు. స్వరూప సుప్రియని తట్టి లేపి "అప్పగింతలు టైమవుతోందే ! మనమేమైనా సాయం చెయ్యగలమేమో చూద్దాం" అనేసరికి సుప్రియ కూడా మెలకువ తెచ్చుకున్నాక ఇద్దరూ శ్రీవిద్య దగ్గర చేరారు.

అప్పటికి నాగవల్లి, స్థాళీపాకం, సదస్యం కూడా అయిపోయినట్లున్నాయి. శ్రీవిద్య ఒక్కర్తే కూర్చొని ఉంది. బ్రహ్మముడిని అప్పగింతల కోసం పురోహితుడు తాత్కాలికంగా విప్పినట్లున్నాడు, శ్రీవిద్య భర్త అక్కడ లేడు.‌
కిషన్, అమిత్ లతో కొద్ది దూరం లో ఏమో మాట్లాడుతూ కనిపించాడు. వీళ్ళిద్దరూ శ్రీవిద్య దగ్గర చేరి గుసగుసగా "ఏమంటారే మీ శ్రీవారు ?" అనడిగారు పరిహాసంగా.

చటుక్కున బరస్ట్ అయిపోయింది శ్రీవిద్య. "ఇప్పుడు వెళ్తే మళ్ళీ మిమ్మల్ని, అమ్మా నాన్నని, ముఖ్యంగా యాజీ అన్నయ్యని ఎప్పుడు చూస్తానే? అన్నయ్య రానేలేదు తీరాజేసి" అని వెక్కిళ్లు పెడుతుంటే స్వరూప, సుప్రియ గిల్టీగా ఒకరి ముఖం ఒకరు చూసుకుని "సారీనే ! నిద్ర ఆపుకోలేక పోయాం. నీ పక్కన ఉండాల్సింది" అని బ్రతిమాలుతుంటే జీవం లేని నవ్వొకటి నవ్వింది శ్రీవిద్య.

అవాక్కయ్యారు స్నేహితురాళ్ళు.

"పోనీ తమ్ముడున్నాడు కదా అనుకుంటే వాడూ విజయవాడ లాంగ్ టర్మ్ ఎంసెట్ కోచింగ్ కి వెళ్తున్నాడు. అమ్మా, నాన్న గారు ఇద్దరే ఉంటారు. ఇన్నాళ్లూ నా పెళ్లి హడావుడిలో బయట పడలేదు కానీ నాకు వారిలో బెంగ స్పష్టంగా తెలుస్తోంది" అన్నది ఇంకా వెక్కుతూనే .

పురోహితుడు "అమ్మా ! రావాలండీ ! టైం దాటిపోతే దుర్ముహూర్తం వచ్చేస్తుంది. ప్రయాణం చెయ్యాలి కూడానూ !" అన్నాడు.

గబగబా కళ్లు తుడిచేసుకుని సుప్రియ ఇచ్చిన టిష్యూ పేపర్ తో మొహం ఒక్క సారి తుడిచుకుని లేచింది శ్రీవిద్య.

అప్పటికే తల్లి దండ్రులు అప్పగింతల బట్టలు, పెద్ద పళ్లెంలో పాలు వేరొక పళ్లెం లో నీరు పోసి పీటల మీద కూర్చున్నారు. ఎదురుగా పీటల మీద వరుడి తల్లి దండ్రులు కూర్చున్నారు.
"అయ్యా ! పెళ్లికుమారుడు, పెళ్లి కుమార్తె రావలె " అన్నారు పురోహితుడు.

శ్రీవిద్య స్నేహితురాళ్ళు చేయి పట్టుకుని తీసుకుని రాగా వెళ్లి తల వంచుకుని పీట మీద కూర్చున్నది. కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. తండ్రి గంభీరంగా ఉండాలని ప్రయత్నిస్తున్నాడు కానీ విఫలమౌతున్నాడు. తల్లి కూడా నిశ్శబ్దంగా కంట నీరు కారుస్తున్నది.

వరుడు హరి కృష్ణ పీట మీద కూర్చుని తల్లిదండ్రులతోను, పురోహితుడితోను లోగొంతుకలో ఏదో మాట్లాడాడు. పురోహితుడు "అబ్బే ! తల్లి దండ్రులు అప్పగిస్తే చాలు వేరెవ్వరూ అవసరం లేదు" అన్నాడు. కానీ హరికృష్ణ మళ్ళీ ఏదో చెప్పి ఆయనను ఒప్పించాడు. తల్లిదండ్రులు మాత్రం ఏమీ అభ్యంతరం లేవనెత్తలేదు.

పెళ్ళికొడుకు ఒక్కగానొక్క కుమారుడు కాబట్టి వేరే ఎవరూ వారి పక్క అప్పగించుకునేందుకు లేరు.

పక్కన శ్రీవిద్య మేనత్త చిన్న గొంతుతో " పుట్టింటి సీతమ్మ అత్తింటి కెళ్తుంటె మంచి మాటలు చెప్పు భూదేవి తల్లీ !" అంటూ పాడుతుండగా మేళగాళ్ళు కూడా సందర్భోచితంగా "పోయిరా మా తల్లి మెట్టినింటికిని" అని శ్రావ్యంగా వాయిస్తుంటే శ్రీవిద్య తల్లిదండ్రులు కళ్ల నీరు ఆపుకునే ప్రయత్నం కూడా చెయ్యకుండా శ్రీవిద్య చేతులను వారి రెండు చేతులతోను పట్టుకుని పాలలో మొదటిగానూ, ఆ తరువాత నీటిలోను ముంచి ముందు హరి కృష్ణ చేతులలోనూ, ఆ తరువాత అతని తల్లి దండ్రుల చేతులలోనూ అప్పగించారు.

ఆ తరువాత కిషన్, అమిత్ వచ్చి పక్కనే కూర్చుని వాళ్ళు కూడా శ్రీవిద్య చేతులు పట్టుకుని పాలలోను, నీళ్లలోనూ ముంచి హరికి, అతని తల్లిదండ్రులకు అప్పగించి చేతులు జోడించి హిందీ లోనే "మామ గారూ అత్త గారూ, బావ గారూ మా చిన్నారి చెల్లెల్ని మీ చేతిలో పెడుతున్నాము. పాల ముంచినా నీట ముంచినా మీరే తనకి. మా చెల్లెలు మంచి పిల్ల, ఒద్దికైనది. మిమ్మల్ని చక్కగా చూసుకుంటున్నాదన్న ధైర్యం మాకు ఉన్నది ఏవైనా తప్పులు చేస్తే మీ కూతురిలాగే లాలనగా చెప్పమని వేడుకుంటున్నాము" అన్నారు.

"ఇవి యాజి ప్రత్యేకంగా పంపించిన బట్టలు" అని రెడీ మేడ్ త్రీ పీస్ సూట్ హరికృష్ణకి, అతని తల్లిదండ్రులకి దర్జా అయిన పట్టుబట్టలు అందజేశారు. వేరే పాకెట్ లో "ఇది మా ఇద్దరివే కాదు, మా రెజిమెంట్ లో అందరి బహుమతి బెహెన్ !" అని ముత్యాల హారం మూడు పేటలది, దానికి మ్యాచింగ్ చెవి దుద్దులు, ఉంగరం శ్రీవిద్య కు ఇచ్చారు.

శ్రీవిద్య వారి కంట జాలువారుతున్న కన్నీటిని చూసి నివ్వెరపోయింది. హరికృష్ణ కూడా గిర్రున తిరుగుతున్న కన్నీటిని ఆపుకునే ప్రయత్నం చెయ్య లేదు.

వింతగా చూస్తున్న తల్లిదండ్రులతో హరికృష్ణ వారి హిందీని తర్జుమా చేసి వివరించి ఇలా చెప్పాడు : " నా పెద్ద బావ మరిది యాజి ఆర్మీ లోఉన్న సంగతి తెలుసు కదా ! వీరిద్దరూ యాజి రాలేకపోవడం వలన అతని మాటగా మనకు ప్రత్యేకంగా అప్పగించారు. వారు ముగ్గురికీ ఎంత గాఢమైన స్నేహం అంటే వీరిద్దరూ చెల్లెలి లాగానే శ్రీవిద్యను భావిస్తున్నారు."

ఏమీ అర్ధం కాక భర్త చేతులు పట్టుకుని "అన్నయ్యకి ఏమైంది ? మీకు ఈ విషయాలు ఎప్పుడు తెలిసాయి ? మా అన్నయ్య రైలు లేటైందని చెప్పారు. అసలు సంగతి చెప్పండి " అని వెక్కిళ్ల మధ్య అడిగింది.

"మీ అన్నయ్య ఆర్మీ లో కంప్యూటర్ విభాగంలో చేస్తున్నాడు కదా ! దానిని డిఫెన్స్ సైబర్ ఏజెన్సీ అంటారు. ఆ విభాగంలో ఆర్మీ వారి కి అనుబంధంగా వీరి డివిజన్ పని చేస్తోంది. యాజికీ, ఆర్మీ లో కల్నల్ కర్తార్ సింగ్ కీ మంచి స్నేహం ఉన్నది. కర్తార్ సింగ్ లాండ్ మైన్ కూంబింగ్ డ్యూటీలో ఉండగా లోతుగా ఉన్న లాండ్ మైన్ పేలి తీవ్రమైన గాయాలై మృత్యువు అంచుల్లోకి వెళ్ళాడు. కిడ్నీలు రెండూ దెబ్బ తిన్నాయి. ఎవరైనా కిడ్నీ డొనేట్ చేస్తే బ్రతుకుతాడు. అదృష్టవశాత్తూ యాజి బ్లడ్ గ్రూపు, టిష్యూ మాచింగ్ కూడా ఒకరికొకరు సరి పోవడంతో యాజి మరొక ఆలోచన లేకుండా డొనేట్ చెయ్యడానికి ముందుకి వచ్చాడు.
చెల్లాయి పెళ్ళి అని కూడా చూడకుండా తన ప్రాణస్నేహితులైన అమిత్, కిషన్ లను తన బదులుగా వెళ్ళమని కోరి తన డివిజన్ హెడ్ ని రిక్వెస్ట్ చేస్తే మారుమాట లేకుండా వీరికి ఎమర్జెన్సీ సెలవు మంజూరు చేసి, ఫ్లైట్ లో విజయవాడ వరకూ ప్రయాణం ఏర్పాటు చేసి పంపారు. "

"మరి...... మరి .....అన్నయ్యకెలా ఉంది ?" నిర్ఘాంతపోయిన శ్రీవిద్య భర్త వైపు, అన్నయ్యల వైపు చూస్తూ రుద్ధమైన గొంతుకతో అడిగింది.

"ఓ ఠీక్ హై ఛోటీ బహన్ ! అభీ హోష్ మే ఆనే కా వక్త్ హై !"
(బాగున్నాడు చెల్లాయ్ ! ఈ పాటికి మత్తునుంచి తేరుకుని ఉంటాడు) అంటుండగానే అమిత్ జేబులో సెల్ ఫోన్ మోగింది. ఉలిక్కిపడిన అమిత్ చిరునవ్వుతో "మాకు ఆర్మీ లో సెల్ ఫోన్లు అలవ్ చెయ్యరు. ఈ సారికి స్పెషల్ కేస్ కింద పర్మిషన్ ఇచ్చారు" అని సెల్ లో మాట్లాడడం మొదలు పెట్టాడు. పోను పోను అతని ముఖంలో ఆనందం చూసిన శ్రీవిద్య ముఖం లో చిరునవ్వు వచ్చింది. ఒక నిము‌షం మాట్లాడి అమిత్ విడియో మోడ్ కి మార్చి శ్రీవిద్య, హరి కృష్ణ లకి ఇచ్చాడు.

మంచం మీద నీరసంగా కనిపించినా ఆనందం పట్టలేక యాజి కళ్ళ నీరు తిరుగుతుండగా "సిరితల్లీ ! ఎలాగున్నావురా ? పెళ్ళి బాగా జరిగిందా ? బావగారూ ! నమస్తే ! నేను రాలేక పోయినందుకు వేరేగా అనుకోవద్దు. అమిత్, కిషన్ మీకు స్వంత బావమరుదులు గానే భావించండి. పదిహేను రోజులలో నేను ప్రయాణం చేయొచ్చని అన్నారు. మిమ్మల్ని, సిరిని తప్పకుండా కలుస్తాను" అన్నాడు.

"పూర్తిగా కోలుకున్నాక బయల్దేరు యాజీ ! మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు శ్రీవిద్య ని ఇక్కడ దింపుతాను. అసలు మేమిద్దరమే ఢిల్లీ కంటోన్మెంట్ హాస్పిటల్ కి వచ్చేయమా ?" అనడిగాడు హరికృష్ణ కొంచెం ఆదుర్దాగా.

"అక్కర్లేదు బావగారూ ! నేను వస్తాను. మీరిద్దరూ నేను రానందుకు అన్యధా భావించ వద్దు" అంటుండగానే "అన్నయ్యా ! అలా అనొద్దు. నువ్వు చేసిన పనికి అత్యంత గర్వంగా అనిపిస్తోంది" అని నవ్వు, కన్నీళ్ళ మధ్య ఫోన్ లో నవ్వుతూ కనిపిస్తున్న యాజికి సెల్యూట్ చేసింది శ్రీవిద్య !!

ఆ తరువాత అమిత్, కిషన్ లవైపు తిరిగి ముఖం వెలిగిపోతుండగా "అన్నయ్యలూ, ఇవాళ నా స్వంత అన్నయ్య రాలేకపోయినా దేవుడు ఇద్దరు అన్నయ్యలను పంపించాడు" అంటూ నిస్సంకోచంగా ఇద్దరినీ కౌగిలించుకుని ఏడ్చేసింది.

స్వరూప, సుప్రియ కూడా వారిద్దరినీ ఆరాధనగా చూస్తూ కళ్ళు వర్షిస్తుండగా సెల్యూట్ చేశారు.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఒక పౌర్ణమి కథ

అక్కరకొచ్చిన_అనుభవం

నేనున్నా నీకు రక్షణ @