చిన్న పాత్రలతో రామాయణం -. శతానందుడు

 కళ్యాణం కమనీయం


రాజ ప్రాసాదం లో అడుగిడిన రాజపురోహితుడు శతానందుల వారికి జనక రాజర్షి ఎదురేగి శిరసు వంచి అభివాదం చేసాడు. రెండు చేతులూ ఎత్తి స్వస్తివాచకాలు పలికారు శతానందుల వారు.

"స్వామీ ! ఈ రోజు ఎదో తెలియని ఆనందం, ఉత్సాహం వెల్లి విరుస్తున్నది నాలో ! పదే పదే కుడి కన్ను, కుడి భుజమూ అదురుతున్నవి. నా చిరకాల వాంఛ నెరవేరుతుందని అనిపిస్తున్నది !"

చిరునవ్వుతో "శుభం భూయాత్ !" అని పలికారు రాజ పురోహితుడు.

"మహా రాజా ! నేను వచ్చే మార్గంలో కూడా జనులలో ఉత్సాహం గమనించాను ! బయట ప్రకృతి కూడా చల్లని తల్లి వలె ప్రజలను సేదతీరుస్తున్నది." అన్నాడాయన.

"సభకి వెళదాము రండి" అని దారి తీశారు జనకుల వారు.

*********

విశాలమైన ప్రాంగణంలో సభ మొదలైన కొద్ది సేపటికే దౌవారికుడు ప్రవేశించి మహారాజుకి అభివాదం చేసి "జయము జయము మహారాజా ! మహా తేజస్వి, యశోధనుడు, విశ్వామిత్ర బ్రహ్మర్షి ఏతెంచినారు. వారివెంట ఇద్దరు రాజకుమారులు కూడా ఉన్నారు. మహారాజుల అనుమతి అయితే ప్రవేశపెట్టగలను" అన్నాడు.

"అత్యానందం కలిగించే బ్రహ్మర్షి రాక తెలిసి కూడా వారిని ప్రతీక్షింప జేయ తగునా ? నేనే అక్కడకి వచ్చి స్వయంగా తోడ్కొని వస్తాను." అని శతానందుడు వెంట రాగా శీఘ్రంగా రాజద్వారం వద్దకు వెళ్లి ప్రవర చెప్పుకుని విశ్వామిత్రునికి అభివాదం సలిపి చేతులు పట్టుకొని రాజసభలోకి తీసుకుని వచ్చి సముచితాసనం మీద ఆశీనుడిని చేసి యధావిధిగా అర్ఘ్య, పాద్య సత్కారాలు చేసి పక్కనే చేతులొగ్గి నిలబడ్డారు రాజర్షి.

అమితమైన సంతోషం తో ఆశీః పూర్వక స్వస్తివాచకాలు పల్కి విశ్వామిత్రుడు జనకుని రాజసింహాసనం మీద ఆశీనుడు కమ్మని సైగ చేశాడు.

జనకుడు "బ్రహ్మర్షీ ! ఈ అత్యంత తేజోవంతులైన నవ యువకులు ఇద్దరినీ చూడగా నా మనస్సు హర్షప్లావితమౌతున్నది. అశ్వనీ దేవతా సదృశ రూపులు వీరు ఎవరు ? మీ వెంట పాదచారులై వచ్చిన వీరిని గురించి తెలిసికొన ఉత్సుకత కలుగుతున్నది".

"రాజర్షీ ! వీరు ఇద్దరూ సూర్య వంశ రాజకుమారులు, నా అభ్యర్ధన మేరకు యాగసంరక్షణకు నా ఆశ్రమానికి వచ్చి, మారీచుడిని పారద్రోలి సుబాహుడిని పీచమడచి నా యాగము నిర్విఘ్నంగా సుసంపన్నం చేసిన వీరాధివీరులు. కోసలాధీశుడు దశరధుని బిడ్డలు. రామ లక్ష్మణ నామధేయులు."

శతానందుని హృదయం ఒక్క నిముషం ఉప్పొంగిపోయింది. "బ్రహ్మర్షీ ! దశరధ నందనులా ? రామ నామధేయుడా ? మీ ఆశ్రమం నుంచి మిథిలా నగర మార్గ మధ్యంలో మా జనకుని ఆశ్రమం సందర్శించి ఉంటారు. నా జనని ...?" అని ఆ తర్వాత మాట రాక ఉద్విగ్నతతో విశ్వామిత్రుని ప్రత్యుత్తరం కోసం ముకుళిత హస్తాలతో ఉండిపోయాడు.

"అవును గౌతమ నందనా ! మీ మాతృ మూర్తి శాపవిమోచనము పొంది రేణుకా దేవి జమదగ్ని మహర్షిని కలిసిన చందమున నీ తండ్రిగారిని చేరినదయ్యా ! నీ జననీ జనకులు రామునికి యధోచిత సత్కారములు సలిపినారు. అనంతరము రామచంద్రుడు వారికి ప్రశాంత చిత్తుడై అభివాదం సల్పినాడు" అని విశ్వామిత్రుడు చిరునవ్వుతో బదులిచ్చాడు.

రోమరోమమున పులకితుడైన శతానందుడు "ఓ నరశ్రేష్టుడా ! రామచంద్రా ! జితేంద్రియుడు, విశ్వామిత్ర బ్రహ్మర్షి వెంట మిథిలా నగరానికి మీ ఆగమనం జనక రాజర్షికీ, మాకందరికీ కూడా అత్యంత ఆనందదాయకం. విశ్వామిత్రుడు సామాన్యుని వలె తలచవద్దు ! ఆయన క్షత్రియుడై పుట్టి అరిషడ్వార్గాలను ప్రయత్నపూర్వకంగా జయించి తీవ్ర తపో ప్రభావం తో బ్రహ్మర్షిత్వాన్ని అందుకుని మీ వంశ గురువులు వసిష్ఠ బ్రహ్మర్షి చేత మన్ననలొందిన మహనీయుడు" అని విశ్వామిత్రుని వృత్తాంతాన్ని విపులంగా రామ లక్ష్మణులకు వివరించాడు. రామలక్ష్మణులు, వారితో పాటు జనకుడు కూడా అత్యంత శ్రద్ధాసక్తులతో ఆ గాధ విని సంతుష్టులైనారు.

జనకుడు పరిపరి విధాలుగా విశ్వామిత్రుని ప్రస్తుతించి "మహానుభావా ! తమ రాకతో మా రాజ్యము పావనమైనది. నా జన్మ ధన్యమైనది. ప్రస్తుతము సూర్యాస్తమయ వేళయగుచున్నది. తమరికి, ఈ కుమారులకు సంధ్యావందనాదులకు సమయము ! తమ అనుజ్ఞ అయినచో నేనునూ సంధ్యావందన నిమిత్తము అరిగెదను. తమరు ముగ్గురూ రేపు ఉదయము ఏతెంచి మమ్ములను ధన్యుల గావించుడు" అన్నాడు.

"అలాగే మహారాజా ! రేపు ఉదయమున కలిసెదము గాక !" అన్నాడు విశ్వామిత్రుడు.

********

ఉదయం అనుష్టానం అనంతరం విశ్వామిత్రుడు, రామలక్ష్మణులను స్వయంగా తోడ్కొని రాజసభకు విచ్చేశాడు జనకుడు.

సముచిత ఆసనాలు అలంకరించిన తరువాత ఎంతో వినయంతో జనకుడు విశ్వామిత్రుణ్ణి "మహానుభావా ! ఏమి మీ ఆనతి?" అని అడిగాడు.

"మహారాజా ! మీరు వంశానుగతంగా పూజించే శివ ధనుస్సును చూడవలెనని, ఈ రాజకుమారులు చాలా ఉత్సాహపడుతున్నారు. దానిని రప్పించిన నా కోరిక, వీరి ముచ్చట తీర్చినవారు అవుతారు." అన్నాడు విశ్వామిత్రుడు.

"అవశ్యం మునివర్యా !" అని మంత్రులకు ఆ మేరకు ఆదేశాలు ఇచ్చాడు జనకుడు.

ఆ మాహేశ్వర చాపం అరుదెంచే లోపు ఆ విల్లు యొక్క చరిత్రను వారికి జనకుడు వివరించాడు. విదేహ రాజులలో చక్రవర్తి నిమికి ఆరవ తరం వాడైన దేవరాతునికి దేవతలు ఆ మాహేశ్వర చాపాన్ని భద్రపరచమని అతి ప్రీతితో ఒసగినారు. దక్ష యజ్ఞం సమయంలో ప్రళయకాల రుద్రుడై మహేశ్వరుడు ఆ చాపంతో తనకు హవిర్భాగములు ఇవ్వని యాగమునకు వచ్చిన కారణంగా దేవతలను దునుమాడుతానని పలికాడు. దేవతలు తమను కాపాడమని పరిదేవనము సలుపగా భక్త సులభుడు శాంతించి ఆ విల్లును దేవతలకు ఇచ్చివేశాడు. దానిని దేవరాతునికి దేవతలు ప్రీతితో ఒసగినారు.

ఇంకా జనకుడు వారితో పూర్వము యజ్ఞము నిమిత్తము భూమిని దున్నుచుండగా నాగేటి చాలున లభించిన సర్వ లక్షణ సంపన్నురాలైన బాలికను అయోనిజను కన్న కూతురి వలెనే పెంచి సీత అను పేరుతొ అల్లారు ముద్దుగా పెంచుకున్నాననీ, ఆమె యుక్తవయస్కురాలైన తరువాత అనేకమంది ఆమెను వరించ వచ్చిన కారణంగా ఆ శివ ధనుస్సును ఎత్తి ఎక్కుపెట్టి శరమును సంధించగలిగిన వారికి ఆమెను వీర్యశుల్కగా ఇచ్చెదనని నిర్ణయించుకున్నానని చెప్పాడు.

దాశరధి ఆ విల్లును ఎత్తగలిగినచో సీతమ్మను అత్యంత సంతోషముగా భార్యగా ఒసగెదననీ పలికాడు.

ఈ మాటలు జరుగుతుండగా ఐదు వేలమంది బలిష్ఠులైన వీరులు అత్యంత ప్రయాసమున ఆ విల్లును భద్రపరచిన చక్రాల పేటికను లాక్కుని వచ్చినారు.
అంత విశ్వామిత్రుడు రామునితో "రామా ! ఈ విల్లును చూడుము. నీకిది అలివి అవడం కష్టము కాదు" అన్నాడు.

"తమ ఆజ్ఞ గురువర్యా !" అని రామచంద్రుడు ఆ వింటి మధ్యభాగమును పట్టి అవలీలగా ఎత్తి, వింటినారిని సంధించి ఆకర్ణాంతము లాగినాడు. ఆ విల్లు పెళ్లున విరిగిపోయినది.

పిడుగుపాటు జరిగి పర్వతములు బ్రద్దలైన చందాన భూమి కంపించినది . ఆ మహాధ్వనికి విశ్వామిత్రుడు, జనక మహారాజు, రామ లక్ష్మణులు కాక మిగిలిన అందరూ ఇంచుక కాలము మూర్చిల్లినారు.

అందరూ తెప్పరిల్లిన అనంతరము జనకుడు పరమానందముతో "మునివర్యా ! ఇట్లు జరుగునని నేను ఊహించనూ లేదు. ఇది అత్యద్భుతము. నా కుమార్తెను పరమ వీరాగ్రేసరునికి ఇచ్చెదనన్న నా ప్రతిజ్ఞ నెరవేరినది. మీ అనుమతితో శీఘ్రమే దశరధ చక్రవర్తికి వర్తమానము చేసి ఇచ్చటకు వచ్చుటకు వేడెదను."అని పలికినాడు.

విశ్వామిత్రుడు సంతోషంగా "అట్లాగేను" అన్నాడు.

*********

వాయువేగముతో పోగల అశ్వములమీద మంత్రులు అయోధ్యకు చేరుకొని దశరధునికి జరిగిన విశేషములను వివరించి సీతారాముల పరిణయమునకు జనక మహారాజునకు అనుమతి కోరినాడనీ, శీఘ్రమే సపరివార సమేతముగా మిథిలా నగరానికి విచ్చేయమని వేడుకొంటున్నాడనీ తెలిపారు. పరమానంద భరితుడైన దశరధుడు వెంటనే బయలుదేరి నాల్గవ రోజుకల్లా విదేహ రాజధానికి చేరుకున్నాడు.

అంగరంగ వైభోగంగా సీతను రామునకు, రెండవ కుమార్తె ఊర్మిళను లక్ష్మణునకు, జనకుని తమ్ముడు కుశధ్వజుని కుమార్తెలైన మాండవిని భరతునికి, శృతకీర్తిని శత్రుఘ్నునికి ఇచ్చి తన జన్మ సఫలమైనదని జనకుడు పరమానందభరితుడైనాడు.

వసిష్ఠుడితో కలిసి వివాహ ప్రక్రియ కి ఆధ్వర్యము వహించిన శతానందుల వారి ఆనందానికి మేర లేదు. మనస్సులోనే "రామా ! ఇంతవరకు నీవు రాముడవు. ఈ రోజునుంచి లక్ష్మీ స్వరూపిణి సీతాసహితుడవై శ్రీరాముడవైనావు స్వామీ !" అని పదే పదే అనుకుంటున్నాడు. విశ్వామిత్రుడు అంతకు ముందు రహస్యంగా వివరించిన విషయాన్ని గుర్తుకి తెచ్చుకున్నాడు.

"గౌతమ నందనా ! రాముని వలన కావలసిన మహత్కార్యం ఇంకా ముందు ఉన్నది. అంతవరకూ రాముడు విష్ణ్వంశ అన్న విషయం బయలుపరచవద్దు !" అని కోరాడాయన.

మీన, కచ్ఛప, వరాహ, వామన, పరశురామ అవతారములలో జరగని శ్రీ మహా విష్ణువు వివాహం జరగడం అదీ తన ఆధ్వర్యంలో జరగడం వలన ఆయన మనసు ఉప్పొంగిపోతున్నది. మాటిమాటికీ కనులలో ఆనంద భాష్పాలు ఊరిపోతున్నవి.

ఆ పారవశ్యంలో తన పాదాలను అంటి నమస్కారం చేస్తున్న సీతారాముల స్పర్శ తగిలిన తర్వాత కానీ ఆయన ఈ లోకంలోకి రాలేదు. లోకవందితులైన లక్ష్మీ నారాయణులు బ్రహ్మస్థానంలో ఉన్న తన పాదాలకు ప్రణమిల్లుతున్నారు ! "ఇంతకన్నా ధన్యత నా జన్మకు వేరే ఏమున్నది పరమాత్మా !" అని హృదయంలోనే తలచి బయటకు మనఃపూర్వకముగా ఆశీర్వదించాడు శతానంద మహర్షి.




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఒక పౌర్ణమి కథ

అక్కరకొచ్చిన_అనుభవం

నేనున్నా నీకు రక్షణ @